Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అనుచిత ఆచారాలపై ఆగ్రహం

* ‘తలాక్‌’పై పిడికిలి బిగించిన ముస్లిం మహిళ
కేవలం నోటిమాటగా ఒకే దఫాలో మూడుసార్లు తలాక్‌ చెప్పి భార్యకు విడాకులిచ్చే పద్ధతిని పాకిస్థాన్‌తో సహా 22 ఇస్లామిక్‌ దేశాలు నిషేధించినా భారతదేశం మాత్రం ఈ మధ్యయుగ ఆచారాన్ని ఇంకా కొనసాగిస్తోంది. ఖురాన్‌కు విరుద్ధమైన ఈ మౌఖిక తలాక్‌ పద్ధతిని తక్షణం రద్దు చేయాలంటూ 50వేలమంది ముస్లిములు ఇటీవల ఓ ‘ఆన్‌లైన్‌ పిటిషన్‌’పై సంతకాలు చేశారు. ఈ ఉద్యమానికి సారథ్యం వహించిన భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌(బీఎంఎంఏ) సంస్థ 92శాతం ముస్లిం మహిళలు మౌఖిక, ఏకపక్ష తలాక్‌ ఆచారాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపింది. ఈ పద్ధతి రద్దుకు చట్టం చేయాలని కోరుతూ జాతీయ మహిళా సంఘానికి లేఖ రాసింది. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన ఈ రోజుల్లో ఈ-మెయిల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, స్కైప్‌, ఎస్‌ఎంఎస్‌, స్పీడ్‌పోస్టుల ద్వారా విడాకులిచ్చేసే ధోరణి పెరిగిపోవడం ముస్లిం మహిళలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ అమానుష ఆచారంతోపాటు బహుభార్యత్వాన్నీ నిషేధించాలని కేంద్రప్రభుత్వ ఉన్నత స్థాయీసంఘం సిఫార్సు చేసినా, చట్టపరంగా ఇంతవరకు ముందడుగు పడలేదు.

ఫిర్యాదుల వెల్లువ
సామాజిక శాస్త్రంలో స్నాతకోత్తర(పీజీ) పట్టభద్రురాలు, ఇద్దరు బిడ్డల తల్లి అయిన షయారా బానోతో 15 ఏళ్లు కాపురం చేశాక ఆమె భర్త విడాకులిచ్చేశాడు. మూడుసార్లు తలాక్‌ అని రాసిన కాగితాన్ని పోస్టు చేసి తెగతెంపులు చేసుకున్నాడు. ఈ ఏకపక్ష తలాక్‌ పద్ధతితోపాటు నికా హలాలా, బహుభార్యత్వ ఆచారాలనూ నిషేధించాలంటూ షయారా బానో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ ఆచారాలను అనుమతిస్తున్న ముస్లిం పర్సనల్‌ లా (షరియత్‌) అన్వయ చట్టం(1937)లోని రెండో సెక్షన్‌ రాజ్యాంగబద్ధతను ఆమె సవాలు చేశారు. షయారా లాంటి అభాగినులు మరెందరో ఉన్నారు. జైపూర్‌ వనిత జహనారా (40)తో 15ఏళ్లు కాపురం చేశాక భర్త ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. ముగ్గురు పిల్లలను తనతోనే ఉంచుకున్నాడు. ‘నా పేరిట కొంత ఆస్తి ఉంది. దాని మీద కన్నేసిన భర్త ఇప్పటికీ విడాకులు ఇవ్వకుండా సతాయిస్తున్నాడు’ అని ఆమె బీఎంఎంఏకి తెలిపింది. 2011 జనగణన ప్రకారం దేశ జనాభాలో ముస్లిముల సంఖ్య 17.40కోట్లు. వీరిలో అత్యధికులు విద్య, సామాజిక, ఆర్థికపరంగా వెనకబడి దారిద్య్రంలో మగ్గుతున్నారు. పురుషాధిక్య-పితృస్వామ్య సమాజంలో ముస్లిం మహిళలు వైవాహికంగా తీవ్ర దురన్యాయానికి గురవుతున్నారు. విడాకులపై ఖురాన్‌ నియమాలకు భారతీయ ముస్లిం మతపెద్దలు వక్రభాష్యం చెబుతున్నారని మహిళలతో పాటు ముస్లిం మేధావులూ ఉద్ఘాటిస్తున్నారు.
ఇస్లామ్‌కు ముందునాటి అరబ్‌ సమాజంలో విడాకులకు అనాగరిక పద్ధతి అవలంబించేవారు. ‘ఆ రోజుల్లో అరబ్‌ పురుషులు చీటికిమాటికి తలాక్‌ చెబుతూ తరవాత దాన్ని ఉపసంహరిస్తూ భార్యలను అష్టకష్టాలు పెట్టేవారు. ఖురాన్‌ దీన్ని నిషేధిస్తూ తలాక్‌ను రెండుసార్లు మాత్రమే చెప్పవచ్చునని నిర్దేశించింది. భార్యాభర్తల మధ్య ఇక రాజీకి ఆస్కారమే లేదని తేలితేనే మూడోసారి తలాక్‌ చెప్పాలని ఉద్ఘాటించింది. ‘ఏడో శతాబ్దికి పూర్వంనాటి ఈ దురాచారాన్ని ముస్లిములు ఇప్పటికీ ఎందుకు అనుసరించాలి?’ అని జాతీయ మైనారిటీల సంఘ మాజీ అధ్యక్షుడు తాహిర్‌ మహమూద్‌ ప్రశ్నించారు. ఇస్లామ్‌కు ముందునాటి అరబ్‌ సమాజంలో పురుషులు ఈసడింపుగా భార్య మీద చెప్పు విసరి తలాక్‌ చెప్పేవారు. మూడుసార్లు తలాక్‌ చెప్పి విడాకులిచ్చే పద్ధతి ఒమయ్యద్‌ ఖలీఫాల హయాములో ఇస్లామిక్‌ న్యాయస్మృతిలో ప్రవేశించిందని జస్టిస్‌ అమీర్‌ అలీ వివరించారు. ఖురాన్‌కు విరుద్ధమైన విడాకుల పద్ధతిని నేడు అనేక ముస్లిం దేశాలు నిషేధించినా, అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు మాత్రం దాన్నే పట్టుకు వేలాడుతోందని అజాజ్‌ అష్రఫ్‌ అనే పాత్రికేయుడు నిరసించారు. తలాక్‌ త్రయాన్ని నిషేధించాలని ఇప్పటికి శతాబ్దకాలంగా భారతీయ ముస్లిం విజ్ఞులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవబందీ ఇస్లాం శాఖ సైద్ధాంతికుడు అష్రఫ్‌ అలీ తన్వీ (1863-1943) వ్యాఖ్యానాన్ని డాక్టర్‌ తాహిర్‌ మహమూద్‌ ఉటంకించారు. ‘పురుషుడు తన భార్యకు తొలిసారి తలాక్‌ చెబుతాడు. తరవాత మనసు మార్చుకుని యథాప్రకారం ఆమెతో కాపురం చేస్తాడు. కొన్నేళ్ల తరవాత మళ్ళీ విభేదాలు వచ్చి రెండోసారి తలాక్‌ చెబుతాడు. మరోసారి మనసు మార్చుకుని సహజీవనం చేస్తాడు. కానీ, ఆ తరవాత ఏ కారణం చేతనైనా అతడు మూడోసారి తలాక్‌ చెబితే ఇక దాన్ని ఉపసంహరించే వీలు ఉండదు’. విడాకులకు ఖురాన్‌ ఇంత సుదీర్ఘ వ్యవధి ఇచ్చినా, ఒకే దఫాలో తలాక్‌, తలాక్‌, తలాక్‌ అని మూడుసార్లు ఉచ్చరించి విడాకులు చెప్పే దురాచారం భారత్‌లో పాతుకుపోయింది. చాలామంది భర్తలు తాగిన మైకంలో తలాక్‌ చెప్పిన ఉదంతాలూ కొల్లలు. ఇలా అప్పటికప్పుడు విడాకులివ్వడాన్ని ఖురాన్‌ సమ్మతించదని, కనీసం 90రోజుల పాటు భార్యాభర్తల మధ్య సామరస్యానికి కృషి చేసి విఫలమైన తరవాతనే లాంఛనంగా విడాకులు అమలులోకి వస్తాయని బీఎంఎంఏ వివరించింది. విడాకుల బారిన పడిన ముస్లిం స్త్రీలకు న్యాయహక్కులు కాని, మనోవర్తి కాని లభించడం లేదు.
తలాక్‌ త్రయం కన్నా దారుణమైనది- నికా హలాలా ఆచారం. ఇది కూడా ఖురాన్‌కు వక్రభాష్యం చెప్పడం ద్వారానే అమలులోకి వచ్చిందని ఇస్లామిక్‌ మేధావులు అంటున్నారు. ‘భర్త తన భార్యకు మూడోసారి తలాక్‌ చెబితే మళ్ళీ ఆమెతో కాపురం చేసే వీల్లేదు. కానీ, ఆమె వేరే వ్యక్తిని పెళ్లాడి, అతడి నుంచి విడాకులు పొందిన తరవాత మరోసారి మొదటి భర్తను చేరవచ్చు’నని ఖురాన్‌ నిర్దేశిస్తోంది. ఇస్లామిక్‌ న్యాయస్మృతి కింద న్యాయమూర్తులుగా వ్యవహరించే ఖాజీలు ఈ నికా హలాలా పద్ధతిని దుర్వినియోగం చేస్తున్నారని బీఎంఎంఏకు చెందిన నూర్జహాన్‌ సఫియా నియాజ్‌ విమర్శించారు. ‘ఖాజీలు విడాకులు పొందిన మహిళలకు కొంతకాలం తాత్కాలిక భర్తలుగా వ్యవహరించి ఆపై అసలు భర్తల వద్దకు చేరే వెసులుబాటు కల్పిస్తున్నారే తప్ప, మహిళల హక్కులను రక్షించడానికి వారు ప్రయత్నించడం లేదు’ అని ఆమె ఆరోపించారు.

కాలానుగుణ మార్పులు
ఇస్లామ్‌లో ఖుల్లా అనే ఆచారం కింద ముస్లిం స్త్రీలు కూడా భర్తకు విడాకులిచ్చే వీలున్నా, దానికి భర్త నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అదే ముస్లిం పురుషుడు తలాక్‌ చెప్పడానికి భార్య అనుమతి పొందనక్కర్లేదు. స్త్రీల పట్ల విచక్షణకు ఇంతకన్నా వేరే నిదర్శనం అక్కర్లేదు. ఇలాంటి దురన్యాయాలను సరిదిద్దడానికే బీఎంఎంఏ ఆన్‌లైన్‌ పిటిషన్‌ చేపట్టింది. ‘ముస్లిం స్త్రీలపట్ల విచక్షణ చట్టవిరుద్ధమని నిర్దేశిస్తూ ముస్లిం పర్సనల్‌ లాను సంస్కరించాలి. ముస్లిం మహిళలకు ఖురాన్‌ ద్వారా, రాజ్యాంగం ద్వారా దఖలుపడిన హక్కులను తప్పకుండా అమలు చేయాలి’ అని బీఎంఎంఏ పిటిషన్‌ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం ఏకరూప (ఉమ్మడి) పౌరస్మృతి (యూసీసీ)ని ప్రవేశపెట్టడానికే తలాక్‌ త్రయంపై రగడను ప్రోత్సహిస్తోందని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు మహిళా సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ పర్సనల్‌ లాలో ఎలాంటి జోక్యాన్ని బోర్డు సహించదని వారు స్పష్టంచేశారు. అలాంటి జోక్యాన్ని కోరుకుంటున్నవారు ఈ దేశ పౌరస్మృతికి అనుగుణంగా నడుచుకోవచ్చని, ప్రత్యేక వివాహాల చట్టం కింద పెళ్లాడవవచ్చని సూచించారు. మరోవైపు తమ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి మీద చర్చ జరగాలని ఆశిస్తున్నదే తప్ప, దాన్ని బలవంతంగా అందరిమీదా రుద్దే ఉద్దేశం తమకు లేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టీకరించారు. వాస్తవమేమంటే, పాకిస్థాన్‌ సహా అనేక ముస్లిం దేశాలు ఖురాన్‌ సూత్రాలను ఆధునిక కాలానికి అనుగుణంగా సంస్కరించాయి. తలాక్‌ దుర్వినియోగాన్ని నివారించడానికి కట్టుదిట్టమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. భారత్‌లోనూ ముస్లిం పర్సనల్‌ లాను సంస్కరించి క్రోడీకరించాల్సి ఉంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

- ఆర్య
Posted on 09-06-2016