Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

వీళ్లే కరోనాలు!

ప్రచండ తుపాను వేగంతో ప్రపంచాన్ని చుట్టేసి మానవాళిని హడలెత్తిస్తున్న కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకునే కృషిలో భాగంగా దేశవ్యాప్త మూసివేత (లాక్‌డౌన్‌) ప్రకటిస్తూ- ప్రధాని మోదీ కీలకాంశం ఒకదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో ఎక్కడా నిత్యావసర వస్తువుల ఉత్పత్తి, సరఫరాలకు ఇబ్బందులు రాకూడదంటూ ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపిచ్చారు. అక్రమ నిల్వల్ని సహించేది లేదనీ స్పష్టీకరించారు. సరఫరాలకు విఘాతం వాటిల్లబోదన్న భరోసాను ప్రతిధ్వనిస్తూ- మూడు వారాలపాటు అన్ని రకాల నిత్యావసర సరకులు, అత్యవసర సేవలందించే దుకాణాలు తెరిచే ఉంటాయని కేంద్రం వివరణ జారీ చేసింది. కృత్రిమ కొరత సృష్టించి, వస్తువుల ధరలు పెంచే అక్రమార్కులకు ముకుతాడు వేస్తామని రాష్ట్ర స్థాయిలో పౌరసరఫరా మంత్రిత్వ శాఖలు హెచ్చరించినా- క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రభుత్వాలకు సవాలు విసరుతున్నాయి. మార్కెట్లలో కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతుండటంపై ఘాటుగా స్పందించిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం- నిత్యావసర వస్తువులు, పండ్ల రేట్ల నియంత్రణ ఆవశ్యకతను ఉద్బోధించింది. సొరకాయ, టొమాటోలు మొదలు పప్పులు, నూనెల వరకు అడ్డగోలుగా ధరలు పెంచి ఎడాపెడా లాభాలు దండుకునే తరుణమా ఇది? నిల్వలు బిగపట్టి కృత్రిమ కొరత సృష్టించి రేట్లకు రెక్కలు తొడిగే శక్తులపై ప్రభుత్వ యంత్రాంగం ఉక్కుపాదం మోపాల్సిందే. ఆంబులెన్సుల్ని ప్రజారవాణాకు ఉపయోగిస్తూ భారీ ఛార్జీలు దండుకుంటున్న బాగోతాలూ అక్కడక్కడా వెలుగుచూస్తున్నాయి. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా ఉత్పన్నమైన విపత్కర పరిస్థితుల్ని చేతనైనంతలో సొమ్ము చేసుకోజూసే ఎటువంటి పెడపోకడల్నీ ఉపేక్షించకూడదు.

నిజం చెప్పులు తొడుక్కునేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందని సామెత. విశ్వాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ విధ్వంసక పాత్రపై మరింత మసాలా జోడిస్తూ కొన్నాళ్లుగా రకరకాల కథనాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యాపింపజేస్తున్న వదంతుల బారినపడి దేశీయ పౌల్ట్రీరంగం కుదేలైపోవడం తెలిసిందే. చికెన్‌, మటన్‌, చేపలు... ఏవైనా 35-36 సెంటీగ్రేడ్‌ డిగ్రీల వద్ద ఉడికించి పక్వం చేసినట్లయితే అందులో వైరస్‌ జీవించి ఉండే అవకాశమే లేదని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ధ్రువీకరించేసరికే- తీరని నష్టం జరిగిపోయింది. వార్తాపత్రికల ద్వారా కరోనా వ్యాపించదని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నా- అసంబద్ధ వదంతులు ఇంకా ఆగలేదు. ఇటువంటి వదంతుల సృష్టికర్తలపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే లేఖలు రాసింది. వాస్తవంలో కరోనా విస్తృతి, చికిత్స, పాలూ కూరగాయల్లాంటి నిత్యావసరాల లభ్యత తదితరాలపై తలాతోకా లేని అసత్య కల్పనలను వండివార్చే ‘పరిశ్రమ’కు నేటికీ పగ్గాలు పడనే లేదు. ఫలానాది తింటే వ్యాధి సోకినా తగ్గిపోతుంది తరహా తప్పుడు ప్రచారాలు, వదంతులెన్నో సామాన్య ప్రజానీకాన్ని గందరగోళ పరుస్తున్నాయి. వికృతానందం కోసమో, వినోదం కోసమో పని కట్టుకుని అబద్ధాలు ప్రచారం చేసేవాళ్లను ఎక్కడున్నా వెతికి పట్టుకుని కఠినంగా దండించాలి. మరొకరెవరూ అటువంటి పెడ ధోరణులకు పాల్పడకుండా కొరడా ఝళిపించాలి. కనిపించని శత్రువుపై యావత్‌ దేశం ఏకోన్ముఖ లక్ష్యంతో సంఘటితంగా పోరాటం సాగించాల్సిన సంక్లిష్ట దశలో, ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించే ఎటువంటి కథనాన్ని అయినా క్షమార్హం కానిదిగా పరిగణించాలి. మూలస్థానమేమిటో కనుక్కొని, బాధ్యుల భరతం పట్టాలి!

విశ్వవ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకినవారిలో లక్షమందికిపైగా కోలుకున్నారు. కరోనా వికటాట్టహాసం చేస్తున్న ఇటలీలో తొంభై ఏళ్ల వృద్ధురాలు స్వస్థత పొందారు. దేశంలోనూ కొన్ని డజన్ల మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రుల నుంచి ఇళ్లకు చేరారు. పోనుపోను పెరుగుతున్న కొత్త కేసులను అనునయంగా అక్కున చేర్చుకోవడంలో, రోగులకు స్వస్థత చేకూర్చడమే లక్ష్యంగా నిరంతరం సేవలందించడంలో వైద్యులు, నర్సులు, ఇతర సహాయ సిబ్బంది పాత్ర నిరుపమానమైనది. దేశ రాజధాని నగరం మొదలు వరంగల్‌లాంటి పట్టణాల వరకు వైద్య సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు, వైరస్‌ వ్యాప్తి కారకులన్న దుష్ప్రచారాన్ని గుడ్డిగా నమ్మి అద్దె ఇళ్లనుంచి వారిని వెలుపలికి వెళ్లగొడుతున్న ఘటనలు నిశ్చేష్టపరుస్తున్నాయి. డాక్టర్లు, నర్సుల పట్ల దురుసుగా ప్రవర్తించి వేధిస్తున్నవారిపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఆదేశించిననాడే, అదే అంశంపై ప్రధాన మంత్రి నిర్దేశమూ వెలుగు చూసింది. కరోనా వైరస్‌పై గెలిచి తీరాల్సిన యుద్ధంలో అవిశ్రాంతంగా సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని దైవానికి ప్రతిబింబాలుగా ప్రధాని అభివర్ణించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దేశం మునుపెన్నడెరుగని అత్యంత గడ్డు సవాలు ఎదుర్కొంటున్న దశలో కరోనా ధాటికి ఎదురొడ్డి ఏ రూపంలో సేవలందించే వారినైనా యావత్‌ జాతీ గౌరవించాలి, మద్దతుగా నిలవాలి. పరీక్షాఘట్టంలో విధ్యుక్త ధర్మాన్ని అణుమాత్రమైనా విస్మరించకుండా, వ్యక్తిగత భద్రతను సైతం పణం పెడుతున్న మానవతామూర్తులకు అవరోధాలు కల్పించేవాళ్లు కచ్చితంగా దండనార్హులు. ఇంతటి విపత్కర స్థితిలోనూ అక్రమార్జనకు కక్కుర్తి పడేవాళ్లు, సమాజానికి- కరోనా వైరస్‌కన్నా ప్రమాదకారులు!

Posted on 27-03-2020