Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

స్వేచ్ఛను హరిస్తున్న ‘రాజద్రోహం’

* నల్ల చట్టానికి నూటయాభై ఏళ్లు

‘ప్రజల స్వేచ్ఛను హరించే భారతీయ శిక్షాస్మృతిలోని రాజకీయ సెక్షన్లకు రారాజు లాంటిది ఈ 124(ఎ)’- తన మీద ‘రాజద్రోహం’ కేసును మోపి విచారించినప్పుడు న్యాయస్థానంలో మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్య ఇది. స్వాతంత్య్రోద్యమాన్ని నీరుగార్చడానికే వలస పాలకులు ఈ నిబంధనను ఐపీసీలో చేర్చారు. దీని ప్రకారం భారత ప్రభుత్వం మీద ఏ రకంగా అవిశ్వాసాన్ని ప్రకటించినా; ద్వేషం, ధిక్కార భావాలను పురిగొల్పినా యావజ్జీవ శిక్షకు అర్హులవుతారు. ‘విశ్వాసాన్ని చట్టం ద్వారా సృష్టించలేం, నియంత్రించలేం. ఓ వ్యక్తి పట్ల కానీ, వ్యవస్థ పట్ల కానీ ఎవరికైనా అవిశ్వాసం ఉంటే, హింసను ప్రోత్సహించనంత వరకు తన భావనలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చు. కానీ, ఈ నిబంధన మాత్రం అవిశ్వాసాన్ని వ్యక్తీకరించడాన్నే నేరంగా చూస్తోంది’ అంటూ ఆనాడు ఆంగ్లేయ న్యాయమూర్తికి నిరసన తెలిపారు జాతిపిత. ‘రాజద్రోహం’ అంటే ఏంటో నిర్వచించి, దాన్ని నేరంగా పరిగణిస్తూ మొదటిసారిగా 1837లో థామస్‌ మెకాలే ఓ చట్టాన్ని రూపొందించాడు. 1860లో ఐపీసీని అమల్లోకి తెచ్చినప్పుడు దీన్ని ఎందుకో పక్కనపెట్టేశారు. ఆ తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణచివేయడానికి 1870లో ఐపీసీని సవరించడం ద్వారా ‘124(ఎ)’ని సర్‌ జేమ్స్‌ స్టీఫెన్సన్‌ ఉనికిలోకి తెచ్చాడు. వలస ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తూ వ్యాసం రాసినందుకు 1891లో అప్పటి ‘బంగోబాసి’ పత్రిక సంపాదకులు జోగేంద్ర చంద్రబోసు మీద తొలిసారి ‘రాజద్రోహం’ కేసును మోపారు. ఆ తర్వాత జాతీయవాద పత్రికా సంపాదకుల మీద ఆంగ్లేయ పాలకులు విరివిగా ఈ కేసులు పెట్టారు. ‘కేసరి’, ‘యంగ్‌ ఇండియా’ పత్రికల్లో విమర్శా వ్యాసాలు రాసినందుకు బాలగంగాధర తిలక్‌, గాంధీలను ఇదే నిబంధన కింద అరెస్టు చేశారు. ఆ క్రమంలో జాతీయోద్యమ నాయకులందరూ ఈ నల్ల నిబంధనను వ్యతిరేకించారు. స్వాతంత్య్రానంతర భారత్‌లో దీన్ని కచ్చితంగా తొలగించాలని కోరుకున్నారు. కానీ, అది జరగలేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దీనిమీద బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ నిబంధన చాలా అభ్యంతకరమైంది, గర్హనీయమైంది. దీన్ని మనం ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది’ అని 1951లో ఆయన వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలు, సృజనశీలురు, పాత్రికేయులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు, విద్యార్థుల మీద తరచుగా రాజద్రోహం కేసులు నమోదవుతున్నాయి.

దేశద్రోహం కాదు...
సెక్షన్‌ 124(ఎ) కింద చేసే నేరారోపణలను ‘దేశద్రోహం కేసులు’గా పిలుస్తూ- జాతి వ్యతిరేకుల మీద చర్యలు తీసుకోవడంలో తప్పేముందని చాలామంది వాదిస్తుంటారు. నిజానికి ‘దేశద్రోహం’ అనే భావనే ఈ నిబంధనలో లేదు. రాజద్రోహం, దేశద్రోహం పదాలు సమానార్థకాలు కావు. వీటిని ఒకే అర్థంలో వాడటం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకులందరూ దేశద్రోహులేనన్న భావనను పాలకులు, అధికారులు ప్రోది చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం, పనితీరు ఆధారంగా పాలకులను మార్చుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాథమిక సూత్రాలు. కానీ, 124(ఎ)లోని ప్రభుత్వం పట్ల అవిశ్వాసం, అవిధేయత లాంటి పదాలు ఈ సూత్రాలను అపహాస్యం చేస్తున్నాయి. ప్రభుత్వ విధానాల్లోని లోటుపాట్లను ఎత్తిచూపితే చాలు ‘దేశద్రోహం’ కిందే జమకడుతున్నారు. కూడంకుళం అణువిద్యుత్తు కేంద్రానికి వ్యతిరేకంగా 2012-13లో గళమెత్తిన తమిళుల్లో దాదాపు తొమ్మిది వేల మందిపై 124(ఎ) కింద కేసులు మోపారు. జార్ఘండ్‌లోనూ 2018లో తమ భూమి హక్కులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడంతో స్థానిక ఆదివాసీలు పథల్‌గఢీ ఉద్యమాన్ని ప్రారంభించారు. వారి సమస్యను పరిష్కరించకుండా పాలకులు ‘రాజద్రోహం’ ఆయుధాన్ని ప్రయోగించారు. కుంతీ జిల్లాకు చెందిన పదివేల మంది గిరిజనులను ఈ నిబంధన కింద నిందితులను చేసేశారు. ఆ తరవాత అధికారంలోకి వచ్చిన తొలిరోజే హేమంత్‌ సొరెన్‌ ప్రభుత్వం ఈ కేసులను ఉపసంహరించింది. ‘చట్టాల్ని రూపొందించుకుంది సమాజంలో భద్రతాభావాన్ని కలిగించడం కోసమే కానీ, పౌరగళాలను అణచివేయడానికి కాదు. రాజద్రోహం కేసు అనేది చాలా తీవ్రమైన నేరారోపణ. గిరిజనుల మీద ఆ కేసులు ఎందుకు పెట్టారో వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించాం’ అన్న సొరెన్‌- గతంలో జరిగిన తప్పులను పునరావృతం కానివ్వబోమని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా సమాజంలో అశాంతిని రేపడానికి ప్రయత్నించడం, హింసకు పురికొల్పడం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకోవడంలాంటి సందర్భాల్లోనే రాజద్రోహం నిబంధన వర్తిస్తుందని కేదార్‌నాథ్‌ సింగ్‌ వర్సెస్‌ బిహార్‌ ప్రభుత్వం కేసులో (1962) సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరి మీదైనా రాజద్రోహ నేరారోపణ చేసేటప్పుడు ఎవరైనా సరే, ఈ తీర్పునకు కట్టుబడి ఉండాలని సెప్టెంబరు 2016లో స్పష్టంచేసింది. ‘ఆవేశంలో, బాధలో రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా మాట్లాడినా ఆ వ్యాఖ్యలు రాజద్రోహం కిందకు రావు’ అని జాతీయ న్యాయ కమిషన్‌ కూడా చెప్పింది. కానీ, సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేశారని, నినాదాలు ఇచ్చారని చాలారాష్ట్రాల్లో విద్యార్థులు, నిరసనకారుల మీద రాజద్రోహం కేసులు పెడుతున్నారు. దిల్లీ నుంచి అసోం వరకు, రాజస్థాన్‌ నుంచి కర్ణాటక వరకు ఈ కేసుల పర్వం నిరాటంకంగా సాగిపోతోంది. ‘అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రాజద్రోహం నిబంధన వర్తిస్తుంది. వాస్తవానికి ఇది వేధింపులకు పనిముట్టుగా మారిపోతోంది. చాలాకేసుల్లో అధికారులు ఏమాత్రం ఆలోచించకుండా ఈ నిబంధన కింద కేసులు పెట్టేస్తున్నారు. అందుకే అవి న్యాయస్థానాల్లో నిలబడటం లేదు’ అంటారు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్డే. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం 2014-2018 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 232 రాజద్రోహం కేసుల్లో 463 మంది అరెస్టయ్యారు. 2016-18 మధ్య నాలుగు కేసుల్లో ఏడుగురి మీద మాత్రమే నేరం రుజువైంది. 124(ఎ) కింద నమోదవుతున్న వాటిలో 80 శాతం కేసుల్లో ఛార్జిషీట్‌ కూడా నమోదు కావట్లేదు. ఈ కేసులను ఎదుర్కొంటున్న వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారు. వారి పాస్‌పోర్టులను జప్తు చేస్తారు.

దుర్వినియోగమవుతున్న నిబంధన
ఎలాంటి నిరసనలైనా సరే, జాతీయభద్రతకు ప్రమాదకరమంటూ నిరసనకారులను అరెస్టు చేయడానికి ఈ నిబంధన అక్కరకొస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించినందుకు అసోంలో సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత హిరేన్‌ గొహైన్‌, సామాజిక ఉద్యమకారుడు అఖిల్‌ గొగొయ్‌, సీనియర్‌ పాత్రికేయులు మంజిత్‌ మహంతల మీద రాజద్రోహం కేసులు పెట్టారు. బీదర్‌ (కర్ణాటక)లోని షాహీన్‌ పాఠశాల పిల్లలు సీఏఏని వ్యతిరేకిస్తూ నాటకాన్ని ప్రదర్శించారని ఓ విద్యార్థిని తల్లి, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయిని మీద ఇదే నేరారోపణ చేశారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న చాలామంది మీద ఈ కేసులు నమోదయ్యాయి. జార్ఘండ్‌లో నమోదైన ఇలాంటి కేసుల గురించి ఆ రాష్ట్ర పోలీసు ఏడీజీ అనిల్‌ పాల్టా మాట్లాడుతూ ‘నలుగురి కన్నా ఎక్కువ మంది గుమికూడరాదన్న 144 సెక్షన్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే, సెక్షన్‌ 188 (క్రమశిక్షణారాహిత్యం) కింద కేసులు పెట్టొచ్చు. కానీ, రాజద్రోహం కేసులు పెట్టడం చట్టాన్ని తప్పుగా అన్వయించడమే’ అన్నారు. ‘సెక్షన్‌ 124(ఎ) దుర్వినియోగమవుతోంది. అధికారంలోని ఉన్నవారిని విమర్శిస్తే చాలు ఈ సెక్షన్‌ కింద కేసులు పెడుతున్నారు. ఈ నిబంధన గురించి పునరాలోచించాలి’ అని సూచించారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ గుప్తా. కేంద్ర హోంశాఖ సైతం 2012లోనే ఈ నిబంధన అమలు తీరును పరిశీలించి, తగిన సవరణలను సూచించాలని న్యాయశాఖను అభ్యర్థించింది. ఆమేరకు దేశంలోని క్రిమినల్‌ చట్టాలన్నింటినీ సమీక్షించి తగిన సూచనలు చేయాలని జాతీయ న్యాయ కమిషన్‌ను న్యాయశాఖ కోరింది. 2018లో న్యాయకమిషన్‌ తన సిఫార్సులను సమర్పిస్తూ- ఈ నిబంధన మీద పునరాలోచించడానికి, దీన్ని తొలగించడానికి సమయం ఆసన్నమైందని చెప్పింది. కానీ, పాలకులనుంచి ఎలాంటి స్పందనా లేదు. రాజద్రోహ భావనకు ప్రాణం పోసిన బ్రిటిష్‌ వారే తమ సొంత దేశంలో పదేళ్ల క్రితం ఈ నిబంధనను తొలగించారు. వలస పాలనాయుగపు అవశేషమైన ఈ నిబంధన మహాత్ముడు చెప్పినట్టు పౌరుల స్వేచ్ఛను అణచివేయడానికే రూపొందింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం లాంటివి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, అస్పష్టమైన 124(ఎ) నిబంధన ఉనికిలో ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థకు క్షేమం కాదు.

ప్రాథమిక హక్కుకు విఘాతం
ప్రజల ప్రాథమిక హక్కు అయిన భావప్రకటనా స్వేచ్ఛకు 124(ఎ) గొడ్డలిపెట్టుగా మారుతోంది. దేశంలో పేట్రేగిపోతున్న మూకదాడులను నిరసిస్తూ ప్రధానికి లేఖ రాసిన 49 మంది ప్రముఖుల మీద బిహార్‌లో రాజద్రోహం కేసు పెట్టారు. సర్వత్రా ఆందోళన వ్యక్తంకావడంతో ఆధారాల్లేవంటూ పోలీసులు తరవాత దాన్ని ఉపసంహరించారు. ‘పాకిస్థాన్‌ అంటే నరక కూపమేమీ కాదు’ అన్నందుకు కన్నడ రాజకీయ నాయకురాలు, నటి దివ్య స్పందన మీద ‘రాజద్రోహం’ కేసు పెట్టాలని ఓ న్యాయవాది ప్రైవేటు కేసు దాఖలు చేశారు. బహిరంగ వేదిక మీద ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అని నినదించినందుకు 19 ఏళ్ల పాత్రికేయ విద్యార్థిని అమూల్య లియోనాను ఇటీవల 124(ఎ) కింద బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ‘అదెలా రాజద్రోహం అవుతుంది? 124(ఎ) మాత్రమే కాదు, ఐపీసీలోని ఏ నిబంధన కిందా అది నేరం కాదు. పాకిస్థాన్‌ను భారత్‌ శత్రుదేశంగా ప్రకటించలేదు. రెండు దేశాల మధ్య అధికారిక దౌత్యసంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవేళ పాకిస్థాన్‌ను శత్రుదేశంగా ప్రకటించినా సరే, అలా నినదించడం నైతికంగా సబబు కాదేమో కానీ... చట్టప్రకారం రాజద్రోహం కాదు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రమాదంలో ఉంది’ అంటూ దీనిమీద సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.

- శైలేష్‌ నిమ్మగడ్డ
Posted on 30-03-2020