Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సామాన్యుడికీ విమానయోగం

* కొత్త విధానం ప్రగతి సాధకం
అమెరికా జనాభా 32.33 కోట్లు... అక్కడ విమానాశ్రయాల సంఖ్య 15,079. భారత జనాభా 125కోట్లు... ఇక్కడ విమానాశ్రయాల సంఖ్య 449 మాత్రమే! అమెరికాసహా అనేక ఐరోపా దేశాల్లో 90శాతానికిపైగా విమానయానం చేస్తున్నారు. భారత జనాభాలో కేవలం మూడు శాతం మాత్రమే విమానాల్లో ప్రయాణించగలుగుతున్నారు. వైమానిక రంగంలో దేశం వెనకబాటుతనానికి ఇంతకుమించిన నిదర్శనలు అవసరం లేదు.సుమారు వందేళ్ల క్రితమే అమెరికా తీరైన వైమానిక విధానం రూపొందించుకొంది. భారత్‌లో స్వాతంత్య్రానంతరం దాదాపు ఏడు దశాబ్దాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా వైమానిక విధానం ప్రకటించింది. విమానయానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అందుకు అనుగుణంగా కార్యాచరణకు పూనుకోవడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

ఎన్నో అవరోధాలు
ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణం ఇప్పుడు విలాసంగా కాక కనీస అవసరంగా మారింది. వైమానిక రంగాన్ని అభివృద్ధి సాధకంగా అనేక దేశాలు ఉపయోగించుకుంటున్నాయి. బ్రెజిల్‌లో 4072, మెక్సికోలో 1819, కెనడాలో 1404, రష్యాలో 1213, అర్జెంటీనాలో 1141, కొలంబియాలో 900 విమానాశ్రయాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత గగనతలాన విమానాల రద్దీ సాంద్రత చాలా తక్కువ. దేశంలో ప్రస్తుతం విమానాల రద్దీ సాంద్రత (ఎయిర్‌ ట్రాఫిక్‌ డెన్సిటీ) 72. అది బ్రెజిల్‌లో 231, చైనాలో 282, శ్రీలంకలో 530, మలేసియాలో 1225, అమెరికాలో 2896గా ఉంది. అనేక దేశాల్లో వైమానిక రంగం ప్రజా రవాణాలో అంతర్భాగంగా మారినా, భారత్‌లో ఇంకా ఆ పరిస్థితి రాలేదు. నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ఎక్కడాలేనంతటి కఠిన నిబంధనలు భారత్‌లో ఉన్నాయి. విమానాలు నడిపేందుకు అనుమతులు లభించడం కనాకష్టం. విమానాశ్రయాల ఆధునికీకరణ, విస్తరణకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర సర్కార్లకు కేంద్రంనుంచి సహకారం అంతంతమాత్రంగానే ఉంది. వైమానిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలు సరళంగా లేవు. పన్నుల విధానంపైనా ప్రైవేటు కంపెనీల్లో వ్యతిరేకత ఉంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, విమానాశ్రయాల అభివృద్ధి సంస్థల మధ్య సమన్వయం లేదు. దేశంలోని ప్రస్తుత విమానాశ్రయాలు భవిష్యత్తు అవసరాలకు ఏమూలకూ సరిపోవని ప్రణాళిక సంఘం నాలుగేళ్ల క్రితం కేంద్రానికి నివేదించింది. కొత్తగా 180కి పైగా విమానాశ్రయాలు అవసరమని పేర్కొంది. అందుకు అనుగుణమైన కార్యాచరణ సూచించినా, యూపీఏ సర్కారు తగిన చొరవ కనబరచలేదు. ప్రస్తుతం దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు, కొచ్చిన్‌లలోని విమానాశ్రయాలే దేశంలోని 60శాతం ఎయిర్‌ ట్రాఫిక్‌ను నిర్వహిస్తున్నాయి. ప్రాంతీయ విమానాశ్రయాలకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. విమానాశ్రయాలకోసం పదో పంచవర్ష ప్రణాళికలో 67వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించాలని లక్ష్యం నిర్దేశించుకొన్నారు. రూ.22వేలకోట్లు మాత్రమే సమీకరించగలిగారు. దేశంలో గడచిన పదేళ్లలో కేవలం 23 కొత్త విమానాశ్రయాలను మాత్రమే నిర్మించగలిగారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు చాలాప్రాంతాలకు విమానాశ్రయాలు అందుబాటులో లేవు. పలు రాష్ట్రాల్లో పరిమిత సంఖ్యలోనే వీటి నిర్మాణం జరిగింది. విమానయాన ఛార్జీల విధానం లోపభూయిష్ఠంగా, గందరగోళంగా మారింది. రాష్ట్రాలు కొత్త విమానాశ్రయాల నిర్మాణాలను ప్రతిపాదించినా, వాటికి అనుమతులు లభించడం లేదు. అధ్యయనాల పేరిట చాలా కాలయాపన జరుగుతోంది.
వైమానిక రంగం దేశ అభివృద్ధికి ­తమిస్తోంది. ప్రయాణ సేవలతో పాటు వ్యాపార, పర్యటక రంగాలకు మేలు చేస్తోంది. కొన్ని సందర్భాల్లో రైల్వేలో మొదటి తరగతి ఛార్జీ, విమానఛార్జీ దాదాపు సమానంగా ఉండటం ప్రయాణికులను అటువైపు మొగ్గేలా చేస్తోంది. అంతర్‌రాష్ట్ర సర్వీసుల్లో ప్రయాణించేవారు సత్వరమే గమ్యం చేరేందుకు విమానాలను ఆశ్రయిస్తున్నారు. దేశంలో వైమానిక రంగాన్ని సామాన్యుడి చెంతకు తీసుకువెళ్ళాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం- తాజాగా జాతీయ పౌర విమానయాన విధానం తెచ్చింది. ఇప్పటివరకూ విమానాలు నడవని విమానాశ్రయాల నుంచి గంట దూరం ప్రయాణానికి గరిష్ఠ టికెట్‌ ధరను రూ.2,500గా నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టికెట్‌ ధర రూ.2,500కి మించకూడదని అంతకంటే తక్కువ ధరకే ఎవరైనా సేవలు అందించాలని నిర్దేశించింది. ఇప్పటివరకు విమానాలు నడపని విమానాశ్రయాలనుంచి కొత్త సర్వీసులు నిర్వహించేవారికి కేంద్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేయనుంది. మధ్యతరగతిని విపరీతంగా ఆకర్షించడంతోపాటు- దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ­తమిచ్చే విధానమిది. ‘హెలీ హబ్స్‌’ను ఏర్పాటుచేసి హెలికాప్టర్‌ ద్వారా అత్యవసర వైద్యసేవలు అందించేందుకు కేంద్రం పచ్చజెండా ­పడం గణనీయ పరిణామం. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. నిషేధిత, నియంత్రిత ప్రాంతాలను మినహాయించి అయిదువేల అడుగులలోపు ఎత్తున ఒకప్రాంతంనుంచి మరోప్రాంతానికి హెలికాప్టర్లు ‘ఏటీసీ’ ముందస్తు అనుమతి లేకుండానే ప్రయాణం చేసే వెలుసుబాటు ఉంటుంది. భారత్‌ను విమాన నిర్వహణ, మరమ్మతుల (ఎంఆర్‌ఓ) సేవలకు సంబంధించి ప్రపంచ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం గట్టి సంకల్పం బూనింది. ప్రస్తుతం మరమ్మతులకోసం 90శాతం విమానాలను విదేశాలకు పంపాల్సి వస్తోంది. ఇందుకోసం ఏటా అయిదువేల కోట్ల రూపాయలు దీనిపై వెచ్చిస్తున్నారు. దేశంలోనే అందుకు తగిన వసతులు కల్పిస్తే నిధుల ఆదాతోపాటు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. 2025నాటికి భారత పౌర విమానయాన రంగంలో 3.3లక్షల అదనపు ఉద్యోగులు అవసరమని కేంద్రం గుర్తించింది. నైపుణ్యశిక్షణ ద్వారా ఎక్కడికక్కడ నిపుణులను తీర్చిదిద్దే కృషిని కొనసాగిస్తే వైమానికరంగం యువతకు ఉపాధి కల్పతరువుగా మారుతుందనడంలో సందేహం లేదు.

తెలుగు రాష్ట్రాలకు మేలు
కొత్త విధానంవల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలకు మేలు కలుగుతుంది. తాజా విధానం ప్రాంతీయ విమానాశ్రయాలతోపాటు,అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాల అభివృద్ధికీ దోహదపడుతుంది.ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయి. భోగాపురంవద్ద అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం నడుంకట్టింది. కొత్త విధానంవల్ల కడప విమానాశ్రయం మనుగడలోకి వస్తుంది. ఒంగోలు, నెల్లూరు, తాడేపల్లి గూడెం, కర్నూలు, ఒంగోలు, బొబ్బిలిలో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదనలకు మోక్షం లభిస్తుంది. ఏపీ ప్రభుత్వం విమాన ఇంధనంపై పన్నును ఒక శాతానికి తగ్గించడంవల్ల ఆ రంగంలో వృద్ధిరేటు గణనీయంగా పెరిగింది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ప్రయాణికులకు అందుబాటులో ఉంది. నిజామ్‌కాలంలో నడిచిన వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రామగుండం విమానాశ్రయాలు ఇప్పుడు మూతపడ్డాయి. కొత్తగూడెం విమానాశ్రయంకోసం ఇటీవలే సర్వే పూర్తయింది. హైదరాబాద్‌ జనాభా విస్తృతి, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా అక్కడ మరో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. కేంద్ర తాజా నిర్ణయంవల్ల ఈ ఆరు ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాంతీయంగా ప్రతిపాదనలు వస్తే నల్గొండ, మహబూబ్‌నగర్‌లు సైతం కొత్త విమానాశ్రయాలకు అనుకూల ప్రాంతాలే. బేగంపేట విమానాశ్రయంలో విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. దానికి కేంద్రం అనుమతి లభించాల్సి ఉంది. తెలంగాణలో వైమానిక రంగం అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌ శివార్లలోని ఆదిభట్ల ప్రాంతంలో ‘ఏరోస్పేస్‌ సెజ్‌’, హెలికాప్టర్ల తయారీ కేంద్రం నడుస్తోంది. విమానయాన సాంకేతిక పరిజ్ఞానం, విమానాల నిర్వహణ, చోదన శిక్షణ కోర్సులు, పరిశోధనల నిర్వహణకు తెలంగాణ అనువైన ప్రాంతంగా మారుతోంది.

ఉజ్వల భవిష్యత్తు
వైమానిక రంగం అంటే కేవలం ప్రయాణికులు, విమానాలే కాదు. సరకు రవాణా, హెలికాప్టర్లు, విమాన విడి భాగాలు, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ వంటివన్నీ ఈ రంగం కిందకే వస్తాయి. భారత్‌లో వైమానిక రంగ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అపార అవకాశాలు ఉన్నాయి. సమతుల ఆర్థికాభివృద్ధి సాధనకు దేశవ్యాప్తంగా పెద్దయెత్తున విమానాశ్రయాల నిర్మాణంతోపాటు పౌర విమానయానం, అనుబంధ సేవల విస్తరణ తక్షణావసరాలు. చిన్న నగరాలు, పట్టణాల్లోసైతం విమానాశ్రయాల నిర్మాణం ద్వారా అత్యంత వేగవంతమైన ప్రయాణ సేవలు అందుబాటులోకి రావడంతో- అవి ఆర్థిక అభివృద్ధి కేంద్రాలుగా మారతాయి. విమానాశ్రయాల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాలి. నిర్వహణ, మరమ్మతు, పర్యవేక్షణ (ఎంఆరోవో) కేంద్రాలతోపాటు ‘హెలిపోర్టు’లను పెద్దసంఖ్యలో నిర్మించి, హెలికాప్టర్లను అందుబాటులోకి తేవాలి. ప్రకృతి విపత్తులు చోటుచేసుకున్నప్పుడు, రవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లోనూ భారీ ప్రమాదాలు జరిగితే పరిస్థితి అదుపు తప్పుతోంది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రులకు చేర్చేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. రహదారి మార్గంలో అంబులెన్సులు ఆ ప్రాంతానికి చేరుకుని, క్షతగాత్రులను అత్యవసర చికిత్సా కేంద్రాల(ఐసీయూ)కు తీసుకువెళ్లేందుకు చాలా సమయం పడుతోంది. ఇలాంటి సందర్భాల్లో హెలికాప్టర్లు సిద్ధంగా ఉంటే, విలువైన ప్రాణాలు కాపాడవచ్చు. దీంతోపాటు వైమానిక పర్యాటకంపైనా గట్టి శ్రద్ధపెట్టాలి. ప్రైవేటు పెట్టుబడులను ఇబ్బడిముబ్బడిగా ఆకర్షించి విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయాలి. విమానయాన విధానం అమలుకోసం జాతీయ స్థాయిలో ప్రధాని,రాష్ట్రాల స్థాయుల్లో ముఖ్యమంత్రుల అధ్యక్షతన పౌరవిమానయాన మండళ్లను ఏర్పాటు చేయాలి. మంత్రులతోపాటు అధికారులనూ అందులో సభ్యులుగా నియమించాలి. చిన్న విమానాశ్రయాల నిర్మాణాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. విమానాశ్రయ నిర్మాణానికి తగిన భూమిని ఎంపిక చేయడంతోపాటు, అవసరమైన అనుమతులనూ సత్వరం మంజూరు చేయించాలి. విమానయాన రంగంలోనూ అమెరికా, ఫ్రాన్స్‌ల స్థాయిలో ఎదిగేందుకు తగిన శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి. కావలసిందల్లా సరళీకృత విధానాలతో, గట్టి నిబద్ధతతో ఆ దిశగా ముందడుగులు వేయడమే!

.

- ఆకారపు మల్లేశం
Posted on 20-06-2016