Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

జీవాలతో సహజీవనం

* కొత్తరుచి: కృత్రిమ మాంసోత్పత్తి

ప్రపంచం నలుమూలలకూ విస్తరించి ఎకాయెకి 17లక్షలకు ఎగబాకిన కోవిడ్‌-19 కేసులు... లక్షకు పైబడిన మరణాలు... దేశదేశాల్ని అతలాకుతలం చేస్తున్న ఈ మహోత్పాతానికి మూలస్థానం ఏదంటే, వుహాన్‌ నగరమని చిన్నపిల్లలు సైతం చెబుతారిప్పుడు. చైనాలో హుబే ప్రావిన్స్‌లోని ఆ ప్రాంతం- నాలుగైదు నెలల వరకు రకరకాల అడవి జంతువులూ పక్షుల మాంస విక్రయాలకు పెట్టింది పేరు. అక్కడినుంచే మహమ్మారి కరోనా వైరస్‌ ‘దండయాత్ర’ మొదలైందంటున్నవారు, వ్యాప్తి చెందిన క్రమంపైనా బలమైన వాదనలు వినిపిస్తున్నారు. తొలుత గబ్బిలాలనుంచి పాంగోలిన్‌(అలుగు)లకు, వాటి ద్వారా మనుషులకు ఆ వైరస్‌ సోకిందన్నది విస్తృతంగా ప్రచారంలో ఉన్న కథనం. ప్రస్తుతం కోవిడ్‌-19 ఒక్కటే కాదు... గతంలో సార్స్‌, బర్డ్‌ ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ, ఎబోలా, హెచ్‌ఐవీ తదితరాలూ వన్యప్రాణి జాతులనుంచే మనుషులకు వ్యాపించాయన్న విశ్లేషణలున్నాయి. కరోనా విజృంభణ నిశ్చేష్టపరచిన దరిమిలా, మొన్న ఫిబ్రవరిలో అడవి జంతువుల మాంసం విక్రయాలు, వినియోగాలపై చైనా కొన్ని ఆంక్షలు విధించింది. ఆ క్రమంలో తాజాగా అక్కడి వ్యవసాయ మంత్రిత్వశాఖ విడుదల చేసిన విధాన ముసాయిదా సంచలనం సృష్టిస్తోంది. కుక్కల్ని పెంపుడు జంతువులుగా పరిగణించాలంటున్న నూతన విధానం, వాటి మాంసం భుజించడాన్ని పకడ్బందీగా నిషేధిస్తామంటోంది. హ్యూమన్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ ©(హెచ్‌ఎస్‌ఐ) లెక్కల ప్రకారం- చైనాలో ఏటా మాంస వినియోగం నిమిత్తం రెండు కోట్లదాకా కుక్కల్ని చంపుతున్నారు. ఆ వరసలోనే ప్రతి సంవత్సరం నలభై లక్షల వరకు పిల్లుల్ని అక్కడ ఆరగిస్తున్నట్లు యానిమల్స్‌ ఏసియా సంస్థ చెబుతోంది. కుక్కలు, పిల్లులతోపాటు ఇతర రకాల పెంపుడు జంతువుల మాంసాన్ని భుజించడాన్ని హాంకాంగ్‌, తైవాన్‌ వంటివి గతంలోనే నిషేధించాయి. కరోనా ఉదంతం తరవాత చైనా తీరులోనూ మార్పు కనిపిస్తోంది. కుక్కల్నే కాదు- లేళ్లు, నక్కల వంటి వివిధ అడవి జంతువుల్నీ నిషేధిత జాబితాలో చేర్చిన చైనా... ఆహారపుటలవాట్లు సవరించుకోవడం ద్వారా ఇన్నేళ్ల పొరపాట్లను సరిదిద్దుకోవాలని తలపోస్తోంది.

వినియోగాన్ని కట్టడి చేయగలమా?
చైనా ‘పశ్చాత్తాప ప్రకటనకు’ ముందే ‘గ్రీన్‌ పీస్‌’ సంస్థ ఇదే అంశంపై తనదైన బాణీలో స్పందించింది. పెచ్చుమీరుతున్న కర్బన ఉద్గారాలు పర్యావరణాన్ని కుళ్లబొడుస్తున్న తీరును గర్హించిన ఆ సంస్థ, నిర్దిష్ట ప్రతిపాదనతో ముందుకొచ్చింది. 2030 సంవత్సరం నాటికి విశ్వవ్యాప్తంగా 70శాతం మేర మాంసాహార వినియోగం తగ్గితే, ప్రకృతి సమతూకానికి ఆ చర్య విశేషంగా దోహదపడగలదని ‘గ్రీన్‌ పీస్‌’ అభిప్రాయపడుతోంది. దేశదేశాల్లో మాంసం వాడకానికి సంబంధించిన లెక్కలు వెలికి తీస్తే- ఆస్ట్రేలియా, అమెరికా, అర్జెంటీనా, ఇజ్రాయెల్‌, బ్రెజిల్‌ తొలి వరసలో నిలుస్తాయి. ఆ క్రమంలో చైనాది పదహారో స్థానం, ఇండియాది 42. మాంసాహార వాడకంలో మిగతా ప్రపంచం విస్తుపోయేలా రెండింతలు భుజిస్తూ ఐరోపా ‘ప్రత్యేకత’ చాటుకుంటోంది. ఎంత తింటున్నారన్న దానికన్నా ఏమేమి తింటున్నారన్నది దేశం పుట్టి ముంచగలదని అనుభవపూర్వకంగా బోధపడిన చైనా నేడు దిద్దుబాటు చర్యలు చేపట్టినా- అక్కడ పుట్టిన చిచ్చు ప్రపంచ దేశాల్ని దహించివేస్తోంది. ఏ కొన్నో కాదు- మానవాళి భద్రతను కాంక్షించే నాగరిక దేశాలన్నీ కరోనా విశృంఖలత్వంనుంచి గుణపాఠాలు నేర్వాల్సి ఉంది. సాధారణంగా ఎక్కువ దేశాల్లో కుందేలు, గినియా పంది, బాతు, టర్కీ, చేప, గొర్రె, మేక, పంది, కోడి, బాతు మాంసాల్ని అధికంగా వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. లెక్కించేందుకు వీల్లేనన్ని రకాలను వేటాడి గుటుక్కుమనిపించే జనసమూహాలెన్నో సరైన వివరాలు లేవు. ఈ పరిస్థితిలో ‘గ్రీన్‌ పీస్‌’ వంటి సంస్థలు అభిలషిస్తున్నట్లు మాంస వినియోగాన్ని మూడొంతుల దాకా కట్టడి చేయడమన్నది అసాధ్యమే కావచ్చు. భారత్‌కు సంబంధించి ఇక్కడ ఒక కీలకాంశాన్ని ప్రస్తావించాలి. ఏటా 10వేల కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తితో పౌల్ట్రీ రంగంపై ఇండియా తనదైన ముద్రవేస్తోంది. జంతు మాంస ఉత్పత్తిలో అగ్రస్థానం మనదే. గత పదేళ్లుగా దేశంలో వివిధ రకాల మాంసోత్పత్తి పెరుగుతూనే వస్తోంది. అయితేనేం- భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిర్దేశించిన ప్రమాణాల్ని ఎందరో మాంస విక్రేతలు, ఎన్నో సంస్థలు తుంగలో తొక్కడం అసంఖ్యాక వినియోగదారుల ఆరోగ్యానికి తీరని చెరుపు చేస్తున్నదన్న కథనాలు విస్తుగొలుపుతున్నాయి. మరోవైపు, పోషకాహార లోపాల పరంగా భ్రష్ట రికార్డు అంతర్జాతీయంగా భారతీయులకు తలవంపులు తెస్తోంది. మాంసాహారులకు నాణ్యత, రుచి, ఆరోగ్యాలకు ఢోకా లేకుండా; ఇటు పోషక లోపాలను అధిగమించేలా, అటు పర్యావరణానికీ ఉపశమనం కలిగించేలా- ఉమ్మడి పరిష్కారమేమీ లేదా? ఉంది. ప్రత్యామ్నాయ ప్రొటీన్‌ పరిశ్రమ లేదా వృక్షాధార మాంసాలే... ఎన్నో సమస్యలకు సరైన విరుగుడు!

ప్రత్యామ్నాయానికి పరిశోధనలు
ఘాటు మసాలాల మేళవింపుతో మైమరపించే రుచులకు అలవాటుపడి లొట్టలేసుకుంటూ మాంసాహారం భుజించే ఎందరికో తెలియకుండానే సమస్యలు సృష్టిస్తున్నవి యాంటీ బయాటిక్స్‌. మాంసోత్పత్తిని పెంపొందించే కృషిలో భాగంగా జంతుమాంస ఉత్పాదక సంస్థలు పెద్దయెత్తున యాంటీ బయాటిక్స్‌ వాడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థే ధ్రువీకరించింది. అలా వాడిన వాటి తాలూకు అవశేషాల కారణంగా యాంటీ బయాటిక్‌ నిరోధక బ్యాక్టీరియా ఇంతలంతలై హానికారకమవుతుందన్నది ఆందోళన కలిగించే అంశం. మాంసాహార ప్రియులకు ఆ దుస్థితిని తప్పిస్తూ రసాస్వాదనకు లోటు లేకుండా చేసే లక్ష్యంతో- విట్రో కణాల కల్చర్స్‌ ద్వారా కృత్రిమ పద్ధతుల్లో మాంసోత్పత్తికి పరిశోధనలు జరుగుతున్నాయి. జంతు కణాలను సంగ్రహించి అటువంటి లక్షణాలు కలిగిన కణజాలాన్ని సృష్టించి నిజమైన మాంసమే అనిపించేలా బయో రియాక్టర్లలో రూపొందించేదాన్ని ‘కల్చర్డ్‌ మీట్‌’గా వ్యవహరిస్తున్నారు. వాటికి కొలెస్టరాల్‌ బెడద ఉండదు, యాంటీ బయాటిక్స్‌ పీడా ఉండదు. పైపెచ్చు రుచికి ఢోకా ఉండదు. శాస్త్రీయ పద్ధతుల్లో, పరిశుభ్ర పరికరాల్లో ఉత్పత్తయ్యే కృత్రిమ మాంసోత్పాదనలు ఈ-కొలి, సాల్మొనెల్లా తదితరాల ప్రమాదం మచ్చుకైనా లేకుండా అందుబాటులోకి వస్తాయంటే- అంతకన్నానా? ఈ తరహా యత్నాలను పర్యావరణవేత్తలు గట్టిగా సమర్థిస్తుండగా, ఐక్యరాజ్య సమితి వంటివి అవార్డులూ రివార్డులతో ప్రోత్సహిస్తున్నాయి.

అనేక దేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు అమలుపరుస్తున్న లాక్‌డౌన్‌ కారణంగా జనసంచారం తగ్గి- నెమళ్లు, పావురాలు, కోతుల వంటివెన్నో బహిరంగ ప్రదేశాల్లో నిర్భీతిగా షికారు చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో అబ్బురపరుస్తున్నాయి. అభివృద్ధి పేరిట మనిషి తమను తరిమేసిన ఆవాసాలకు తిరిగి అవి చేరుకుంటున్న వైనం, ఏళ్ల తరబడి విశృంఖలంగా సాగిన విధ్వంసాన్ని కదలబారిన ప్రకృతి సమతూకం తాలూకు దుష్పరిణామాల్ని- మానవాళికి ఫ్రేముకట్టి చూపుతోంది. వన్యప్రాణుల్ని హింసించి వేటాడి పర్యావరణ విద్రోహులుగా ముద్రవేయించుకుని ఆరోగ్య సంక్షోభాన్ని కొనితెచ్చుకోవడమా... ప్రకృతిని ఛిద్రం చేయకుండా మెరుగైన ప్రత్యామ్నాయ ఆహార ప్రణాళికలను పట్టాలకు ఎక్కించడమా? ఇదీ, నేడు ప్రపంచ దేశాల ముందున్న ప్రశ్న. కరోనా మహోత్పాతంనుంచి గుణపాఠాలు నేర్చి ఆరోగ్యకరమైన స్థితిగతుల్లో మనుగడ కొనసాగించేందుకు మానవాళి ఎంచుకునే మార్గమే వారి భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

- సత్యమూర్తి
Posted on 12-04-2020