Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

వలస కూలీలకు రక్షణేది?

* కార్మిక చట్టాలపై సమీక్ష అవసరం

కరోనా విలయ తాండవంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటనవల్ల వలస కార్మికులు తాముండే నగరాలు, పట్టణాలు వదిలిపెట్టి సొంతూళ్లకు పయనమయ్యారు. భారత ఆర్థిక వ్యవస్థలోని అసంఘటిత రంగంలో వలస కూలీలదే కీలక పాత్ర. మనదేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, రాష్ట్రం పరిధిలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే కూలీల సంఖ్య తొమ్మిది కోట్లకు పైగానే ఉంటుంది. ‘అసంఘటిత రంగానికి సంబంధించిన గణాంకాలకమిటీ’ 2012నాటి అధ్యయనం ప్రకారం మొత్తం శ్రామిక శక్తిలో వీరిసంఖ్య భారీగానే ఉంటుందని, స్థూల జాతీయ ఉత్పత్తి (జీఎన్‌పీ)లో వాటా 50 శాతందాకా ఉంటుందని పేర్కొంది. ఆ శ్రామికులు భారీసంఖ్యలో ఉన్నప్పటికీ చట్టపరమైన రక్షణలు మాత్రం లేవు. అసంఘటిత రంగానికి సంబంధించిన చట్టాలు- కార్మికుల సామాజిక భద్రత, పని పరిస్థితులు వంటి అంశాలనే పర్యవేక్షిస్తాయి తప్పించి, ఉపాధి కోల్పోయి నగరాలను వదిలి వెళ్లేవారి కష్టాలను పట్టించుకోవనేది సుస్పష్టం.

ఏళ్ల తరబడి అభద్రత
‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌)’ 2017-18నాటి నివేదిక ప్రకారం, వ్యవసాయేతర రంగంలో 71.1 శాతం శ్రామికులకు ఉపాధిపై ఎలాంటి భరోసా లేదు. 54.2 శాతానికి వేతనంతో కూడిన సెలవు సౌకర్యం కల్పించడంలేదు. 49.6 శాతానికి సామాజిక భద్రత ప్రయోజనాలు లేవు. ‘అసంఘటిత రంగంలో ఉద్యోగిత పరిస్థితి’ 2015నాటి నివేదిక ప్రకారం, వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో పనిచేసేవారిలో 82 శాతం ఉపాధిపై భరోసా లేని పరిస్థితి ఉండగా, 77.3 శాతం వేతనంతో కూడిన సెలవు సౌకర్యం పొందడం లేదని, 69 శాతం ఎలాంటి సామాజిక భద్రత ప్రయోజనాలకూ అర్హులు కారని తేలింది. ఇలా చట్టపరమైన రక్షణలు లేకపోవడంవల్ల వలస శ్రామికులు తమను తాము రక్షించుకోలేకపోతున్నారు. అత్యవసరంగా సరిదిద్దాల్సిన సమస్య ఇది. పారిశ్రామిక వివాదాలపై విచారణ, పరిష్కారాల కోసం ‘భారత పారిశ్రామిక వివాదాల చట్టం 1947’ను తీసుకొచ్చారు. ఈ చట్టం కేవలం సంఘటిత రంగానికే వర్తిస్తుంది. దీనిద్వారా తాత్కాలిక కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమాన్ని ఆశించలేం. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా నెలకొంటున్న పరిస్థితుల్లో కార్మికులకు ఎలాంటి నిబంధనలు వర్తింపజేయాలనే అంశాలూ ఈ చట్టంలో లేవు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత రూపొందించిన ఈ చట్టం ప్రస్తుతకాలంలో అసంఘటిత రంగంలోని శ్రామికుల సామాజిక భద్రత అవసరాల్ని, ఇతర సంక్షేమ అంశాలను పర్యవేక్షించడంలో విఫలమైంది. ఇక- 1948 నాటి కనీస వేతనాల చట్టాన్ని తీసుకుంటే, దేశంలో చాలా ప్రాంతాల్లో దీన్ని సక్రమంగా అమలు జరగడం లేదని 2018-19 నాటి ఆర్థిక సర్వే స్పష్టీకరిస్తోంది. వేతనాలు పొందే శ్రామికులందరూ ఈ చట్టం పరిధిలోకి రావడం లేదు. ఇటీవలి కాలంలో శ్రామికుల పరిరక్షణకు తీసుకురావాలని భావిస్తున్న చట్టాల్లో ‘అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టం 2008’ కూడా ఒకటి. అయితే, దీనికింద కేవలం అయిదు నుంచి ఆరు శాతం మంది మాత్రమే నమోదయ్యారు. ఈ కారణంగానే విధాన రూపకర్తలు పథకాల ఆధారంగా అందించే సంక్షేమంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.

‘అంతర రాష్ట్ర వలస కార్మికుల చట్టం, 1979’ ప్రకారం ఇతర రాష్ట్ర కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం తప్పనిసరి. కార్మికులు తమంతటతాము సొంతంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం లేకపోవడం సమస్యగా మారుతోంది. పలు రాష్ట్రాల్లో వలస కార్మికులకు సంబంధించి గణాంక సమాచారం అందుబాటులో లేదని, వారి కోసం ప్రత్యేకంగా బీమా పథకాన్ని తెచ్చే ప్రతిపాదన లేదని 2016 డిసెంబర్‌లో లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కార్మిక, పారిశ్రామిక చట్టాల వ్యవస్థలను ప్రక్షాళన చేసే యత్నాలతో కేంద్రం నాలుగు కార్మిక స్మృతుల్ని ప్రవేశపెట్టింది. వాటిలో ‘సామాజిక భద్రత, సంక్షేమం, 2018’ ముసాయిదా కార్మిక స్మృతి ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న పథకాలు, ప్రయోజనాల్ని ఏకతాటిపైకి తీసుకురావడం, దేశవ్యాప్తంగా ఈ తరహా ప్రయోజనాల్ని పొందేందుకు కార్మికులకున్న హక్కుల్ని గుర్తించడం జరుగుతుంది. అయితే, అందులో సంక్షేమం అనే పదాన్ని తొలగించడంతోపాటు, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన నిబంధనల్ని సైతం నీరుగార్చారు. దురదృష్టవశాత్తూ, తాజా ‘సామాజిక భద్రత బిల్లు, 2019’ సైతం వలస కార్మికులకు ప్రత్యేక రక్షణల్ని వర్తింపజేసే విషయంలో మౌనం దాల్చింది. గాయాలపాలయ్యే ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు, అసంఘటిత రంగం కార్మికులకు భవిష్య నిధి కల్పించడం వంటి అంశాలను రాష్ట్రాల విచక్షణకే వదిలేశారు.

స్థానికులతో సమానంగా...
అసంఘటిత రంగం కార్మికుల కోసం తీసుకొచ్చే సామాజిక భద్రత పథకాలు, చట్టాల పరిధిలో వలస కార్మికులనూ చేర్చాల్సి ఉంది. కార్మికులు వలస వెళ్లిన రాష్ట్రంలో స్థానిక కార్మికులతో సమానంగా చూడాలి. ఆ రాష్టంలోని సంక్షేమ, ఆరోగ్య సంరక్షణ తదితర ప్రయోజనాలూ దక్కాలి. వలస కార్మికుల్ని వేర్వేరు తరగతులు, విభాగాలుగా వర్గీకరించే బదులు ఒకే తరగతి ఉండాలి. పథకాల ఆధారిత సంక్షేమ నిబంధనల నుంచి చట్టపరమైన సంక్షేమ నిబంధనకు మారాలి. అప్పుడే కార్మికులకు సాధికారత దక్కుతుంది. మధ్య, చిన్న తరహా పరిశ్రమల్లో ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత దక్కేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సంరక్షణ, వృద్ధుల భద్రత, నిరుద్యోగ బీమా, కనీస వేతనం వంటి ప్రాథమిక అవసరాల్ని ప్రభుత్వం కల్పించాలి. వలస కార్మికులకు తాత్కాలిక నివాసాలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు, చిన్నారులకు విద్య, ప్రమాద బీమా వంటి సంక్షేమ ప్రయోజనాల్ని విస్తృత రీతిలో కల్పించిన కేరళను అనుసరించవచ్చు.

Posted on 16-04-2020