Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

చెట్టే మన పట్టుగొమ్మ!

* వన వారోత్సవాల సందర్భంగా...
భూతాపం నేడు మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ముఖ్యంగా, 1950 నుంచి భూతాపం పెరుగుతూనే ఉంది. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువుపెరగడమే ఇందుకు ప్రధాన కారణం. 1950 ముందువరకు వాతావరణంలో ఈ విషపు వాయువు కేవలం తొమ్మిది శాతం మేర పెరిగితే, తరవాతి కాలంలో క్రమంగా 40 శాతానికి పైగా పెరుగుతూ వచ్చింది. 1970 తరవాతి కాలంలో కార్చిచ్చులు, అడవుల నరికివేత, బొగ్గు వినియోగం, వాహనాల వాడకం వల్ల పెరుగుదల మరీ ఎక్కువైంది. సహజంగా చెట్లు, సముద్రాలు పీల్చుకొనే స్థాయికన్నా అతి వేగంగా వాతావరణంలో కార్బన్‌ వాయువులు విడుదలవుతున్నాయి. పారిశ్రామిక విప్లవానికి ముందు గాలిలో ఉన్న బొగ్గుపులుసు వాయువు 260 పీపీఎంలు. ఇప్పుడు అది 370 పీపీఎంలకు చేరింది. ఈ శతాబ్దాంతానికి అది 500 పీపీఎంలకు చేరుతుందని అంచనా. ప్రపంచపు భూ విస్తీర్ణంలో నగరాలు కేవలం మూడు శాతమే ఆక్రమిస్తున్నాయి. కానీ, ప్రపంచపు జనాభాలో సగంమందికి పైగా నగరాల్లోనే జీవిస్తున్నారు. అందువల్ల 70 శాతం కాలుష్యకారక వాయువులు నగరాల్లోనే విడుదలవుతున్నాయి.

బహుళ ప్రయోజనాలు
ప్రపంచంలో వాతావరణాన్ని ఎక్కువగా కలుషితం చేస్తున్న మొదటి అయిదు దేశాలు- చైనా, అమెరికా, భారత్‌, రష్యా, జపాన్‌! ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతి నాలుగు మరణాల్లో ఒకదానికి కారణం పర్యావరణ కాలుష్యంవల్ల ఏర్పడిన ఆరోగ్య సమస్యలే. ఏటా కాలుష్యం కారణంగా ప్రపంచ దేశాల్లో 55 లక్షలమంది మరణిస్తున్నారు. వాటిలో సగానికి పైగా మరణాలు చైనా(16 లక్షలు), భారత్‌(14 లక్షలు)లలోనే సంభవిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం వాతావరణంలో కాలుష్య కారకాలు చదరపు మీటరుకు 0.025 మిల్లీ గ్రాములకు మించి ఉండరాదు. భారత్‌లోని చాలా నగరాల్లో అందుకు 10 రెట్లు అధికంగా, అంటే 0.25 మిల్లీ గ్రాములకు మించి గాలిలో కాలుష్య కారకాలున్నాయి. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం కలిగి ఉన్న మొదటి 20 నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయి. వాటిలో దిల్లీది మొదటి స్థానం. పట్నా(2), గ్వాలియర్‌(3), రాయ్‌పూర్‌(4), అహ్మదాబాద్‌(9), లఖ్‌నవు(10), ఫిరోజ్‌బాద్‌(11), కాన్పూర్‌(13), అమృత్‌సర్‌(14), లూధియానా(15), అలహాబాద్‌(18), ఆగ్రా(19), ఖన్నా(20) తరవాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలోని పటాన్‌చెరువు 122వ స్థానం, హైదరాబాద్‌ 246వ స్థానం, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ 194వ స్థానం, విశాఖ 284వ స్థానంలో ఉన్నాయి. కాలుష్యం భారత్‌లో ఎంత తీవ్రస్థాయిలో ఉందో, మనం నిత్యం పీలుస్తున్న గాలి ఎంత హానికరమైనదో దీన్నిబట్టి తేలికగా అర్థం చేసుకోవచ్చు.
భూతాపానికి ప్రధానకారణమైన బొగ్గుపులుసు వాయువులను కట్టడి చేయడానికి ప్రకృతి మనకు ప్రసాదించిన వరమే- చెట్టు. నిరంతరం కిరణజన్య సంయోగ ప్రక్రియ ద్వారా వాతావరణంలోని కర్బన ఉద్గారాలను పీల్చుకొని, ప్రాణవాయువును అది విడుదల చేస్తుంది. ప్రతి చెట్టు ఏడాదికి మూడువేల కిలోల ప్రాణవాయువును అందిస్తుంది. సుమారుగా 400 లీటర్ల నీటిని రోజూ ఆవిరి రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తుంది. చల్లని నీడనిస్తుంది. పళ్లు, ఫలాలనందిస్తుంది. చల్లగాలితో మేఘాల్ని ఆకర్షించి, సకాలంలో వర్షాలు పడటానికి దోహదపడుతుంది.
భారత్‌లో 2050నాటికి ఏటా 2.78 లక్షలకోట్ల ఘనమీటర్ల నీరు అవసరమవుతుంది. చెట్లు లేకుండా వర్షాలు పడవు. కాబట్టి, అంత నీటి అవసరానికి తగినవిధంగా పచ్చదనం పెరగాలి. వానలకు నేల సారం కొట్టుకుపోకుండా చెట్లు కాపాడతాయి. ఒక్కో చెట్టు సంవత్సరంలో పాతిక కిలోల సారవంతమైన నేలను గాలివానలకు కొట్టుకుపోకుండా కాపాడుతుంది. చెట్లు సరిగా లేకపోతే, భూసారం వర్షాలకు కొట్టుకుపోయి, పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆహారోత్పత్తి మీదా దాని దుష్ప్రభావం పడుతుంది. భారత్‌లో ఆహారోత్పత్తి గిరాకీ 2025నాటికి 2,720 లక్షల టన్నులకు, 2050నాటికి 3,740 లక్షల టన్నులకు పెరుగుతుంది. కాబట్టి, నీరు సకాలంలో అందకపోతే అసలు వ్యవసాయమే ప్రశ్నార్థకమవుతుంది. భూసారం సరిగ్గా లేకపోవడంవల్ల అవసరానికి మించి ఎరువు వాడాల్సి వస్తుంది. ఆ రసాయనాలవల్ల భూ పర్యావరణానికి తీవ్రస్థాయిలో ముప్పు ఏర్పడుతుంది. దానివల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయి. ఇలాంటి ముప్పులను ఎదుర్కోవడానికి చెట్ల పెంపకం తప్పనిసరి. బహుళ ప్రయోజనకారి అయిన చెట్టు వూపిరినే తీయాలనుకోవడమంటే మనిషి తనకు తానే వూపిరి తీసుకున్నట్లే. అందుకే చెట్టును మనం కాపాడితే, అది మనల్ని కాపాడుతుంది!
భూ పర్యావరణ సమతుల్యానికి భూవిస్తీర్ణంలో పచ్చదనం 33.33శాతం ఉండాలి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అది 30శాతంగా ఉంది. భారత్‌లో ఉండాల్సిన దానికన్నా ఇంచుమించు 10శాతం తక్కువగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర ప్రాంతంలో 2002-03లో ఇది 23.20 శాతం. 2012-13 నాటికి 20.62శాతానికి తగ్గింది. అదే, తెలంగాణ ప్రాంతంలో 2002-03లో 25.46 శాతమున్న పచ్చదనం 2012-13 నాటికి 20.96 శాతానికి పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1,500 కోట్ల చెట్లను నరుకుతున్నారు. అంటే, ప్రతి మనిషి రెండు చెట్లు నరుకుతున్నాడన్నమాట. చెట్టును నరకడం తేలికైన పని. కానీ, అలాంటి చెట్టును మళ్ళీ పెంచడం సులువైన పనికాదు. అందుకు మనిషి జీవితకాలం కూడా సరిపోదు. ప్రపంచంలో మనిషి:చెట్టు నిష్పత్తి 1:422గా ఉంది. కెనడాలో ఈ నిష్పత్తి అత్యధికంగా 1:8,953. రష్యాలో ఈ నిష్పత్తి 1:4,856, బ్రెజిల్‌లో 1:1,494, అమెరికాలో 1:699. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనాలో ఈ నిష్పత్తి 1:130. భారత్‌లో అది 1:28 మాత్రమే. ఈ వ్యత్యాసం వాతావరణంలో అసమతుల్యానికి దారితీసి, భూతాపం పెరగడానికి ప్రధాన కారణమవుతోంది. దీనివల్ల సహజ రుతుకాల చక్రాలు మారి, వర్షాలు సరిగ్గా కురవక కరవు కాటకాలు ఏర్పడుతున్నాయి.
భూతాపం ఇదే రీతిలో పెరిగితే 2100నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు నాలుగు సెల్సియస్‌ డిగ్రీల వరకు పెరగవచ్చునని అంచనా. ఉష్ణోగ్రతలు అధికమైతే హిమానీనదాలు అతివేగంగా కరిగి, సముద్రమట్టాలు రెండు నుంచి నాలుగు అడుగుల వరకు పైకెగసి, తీర ప్రాంతాలు మునిగిపోతాయి. కనీవిని ఎరగని రీతిలో చర్మ వ్యాధులు, శ్వాసకోశ, హృదయకోశ వ్యాధులు, క్యాన్సరు వంటి భయంకరమైన రోగాలు ప్రబలుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుంది. పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సు సందర్భంగా భూతాపాన్ని రెండు సెల్సియస్‌ డిగ్రీలకన్నా తక్కువకు పరిమితం చేయాలని సుమారు 150 దేశాలు అంగీకారానికి రావడానికి కారణమిదే.

ఇకనైనా గట్టి చర్యలు
భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాలుష్య కారకాలను ఏ విధంగా తగ్గించగలమన్న దానిమీద ప్రజల్లో శాస్త్రీయ అవగాహన కలిగించడానికి అటు ప్రభుత్వాలు, ఇటు స్వచ్ఛంద సంస్థలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ప్రసార సాధనాలు పరస్పర సహకారంతో అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ బదులు సౌరశక్తిని వినియోగించే వాహనాలను వాడాలి. థర్మల్‌ విద్యుత్తుకు బదులుగా పవన, సౌరశక్తి విద్యుదుత్పాదనకు ప్రాధాన్యం ఇవ్వాలి. శీతలీకరణాల వాడకం తగ్గించాలి. ఎల్‌ఈడీ బల్బుల వినియోగం పెంచాలి. వ్యర్థాలను ఇంధనం, ఎరువుల రూపంలోనికి మార్చే పునర్వినియోగ పద్ధతి అవలంబించాలి. రసాయనాలు లేని వ్యవసాయం చేయాలి. సాధ్యమైనంత వరకు కాగిత రహిత విధానాలను ప్రోత్సహించాలి. నడక, సైకిల్‌ వాడకం, ప్రజారవాణా బస్సుల వినియోగం పెరగాలి. ప్రస్తుత దేశజనాభా 133కోట్లు. ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్కనైనా నాటితే వృక్షసంపద ఆ మేరకు పెరుగుతుంది. ఇందుకు ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహకాలు అందించాలి. అప్పుడే భూటాన్‌ మాదిరిగా ‘కార్బన్‌ నెగటివ్‌’ దేశంగా భారత్‌ కూడా విశ్వసమాజం ముందు సగర్వంగా నిలబడుతుంది. ఇతర దేశాలకు ఆదర్శం అవుతుంది!.

- ఆచార్య నందిపాటి సుబ్బారావు (భూవిజ్ఞాన శాస్త్ర విభాగం, ఆంధ్ర విశ్వవిద్యాల‌యం)
Posted on 02-07-2016