Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

వైరస్‌ విసిరిన సవాలు

ప్రపంచ క్రమమే మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. చైనాలోని ఉహాన్‌లో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ 210 దేశాలకు విస్తరించి, సుమారు లక్షన్నర మందిని బలిగొంది. దీని ఉద్ధృతి ఇప్పట్లో ఆగే సూచనలూ స్పష్టమవడం లేదు. వ్యాధి నివారణకు అక్కరకొచ్చే వ్యాక్సిన్‌ కానీ, వైరస్‌ సోకినవారికి అందించాల్సిన చికిత్సగానీ ఇప్పటివరకూ అందుబాటులోకి రాలేదు. అన్ని దేశాలూ ఈ సమస్యకు పరిష్కారాలు అన్వేషించేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి. సంపన్నతకు మారుపేరుగా నిలిచే జి-7 దేశాల్లోనే వైరస్‌ ముప్పు తీవ్రత అధికంగా ఉండటం ఆశ్చర్యపరచే అంశం. చైనాలో పుట్టిన వైరస్‌లు ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంత గందరగోళానికీ కారణమైన చైనా అందుకు సంబంధించి ఏ కొంచెం బాధ్యతనూ తీసుకోవడానికి నిరాకరించడంతోపాటు- ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)ను ఏదో ఒక రకంగా ప్రభావితం చేసి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కావిస్తున్న ప్రయత్నాలే ఆశ్చర్యపరుస్తున్నాయి.

అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన పెద్ద కంపెనీలన్నీ చైనాలోనే ఉత్పత్తి స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఇంతకాలం వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తించాయి. ఆ దేశాలు తమ పొరపాటు గుర్తించేలోపే కరోనా విరుచుకుపడింది. అన్ని దేశాలూ మాస్కుల నుంచి, ఔషధాల తయారీ వరకు సంబంధిత ముడి వనరులకోసం 90 శాతానికిపైగా చైనామీదే ఆధారపడుతున్నాయి. అందువల్లే చాలా దేశాలు చివరికి పారాసిటమాల్‌ మందుబిళ్లలనూ సమకూర్చుకోలేక అల్లాడుతున్నాయి. మహమ్మారి బారినపడిన దేశాలు లక్షల డాలర్ల విలువైన ఉపకరణాలకోసం చైనాకు ఆర్డర్లు పెట్టాయి. కానీ, అక్కడినుంచి వచ్చిపడుతున్న సరకు తీరుతెన్నులు చూసి అవి కళ్లు తేలేస్తున్నాయి. నాణ్యత కొరవడిన టెస్టింగ్‌ కిట్లు, చేతి తొడుగులు, ఇతర ఉపకరణాలను ఏం చేసుకోవాలో తెలియక బిక్కమొగమేస్తున్నాయి. ‘అమెరికాలో ఉపయోగిస్తున్న ముఖం తొడుగుల్లో అత్యధికం చైనా తయారు చేస్తున్నవే. ఈ పరిస్థితుల్లో చైనా ప్రతీకారానికి దిగి ప్రయాణ ఆంక్షలు విధించి, వైద్య ఉపకరణాల ఎగుమతిని నిలిపివేస్తే కరోనా ముట్టడిలో చిక్కి అమెరికా అల్లాడిపోవాల్సిందే. కాబట్టి, చైనాకు అమెరికా క్షమాపణ చెప్పాల్సి ఉంది. ప్రపంచ దేశాలూ చైనాపట్ల కృతజ్ఞతాభావంతో మెలగాలి’ చైనా అధికారిక వార్తా ఏజెన్సీ జిన్‌హువాలో మార్చి 4న ప్రచురితమైన వ్యాఖ్యలివి. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభం ఉరుముతోంది. పైపెచ్చు అన్ని దేశాలూ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయాయి. ప్రపంచ పంపిణీ వ్యవస్థలు గాడితప్పాయి. ఫ్యాక్టరీలు వరసగా మూతపడుతున్నాయి. నిరుద్యోగిత ప్రబలుతోంది. అమెరికాలో మార్చి నాటికే 2.2కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. నిత్యావసరాలకూ కటకట నెలకొంది. ‘ఓఈసీడీ’ దేశాల్లో 25నుంచి 30శాతం మేర ఉత్పత్తి రంగం కోసుకుపోయింది. ముడి చమురు ధరలు 70శాతం పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 157 కోట్ల మంది విద్యార్థులు, పరిశోధకుల చదువులు ఏదో స్థాయిలో అటకెక్కాయి. ఆతిథ్య, పర్యాటక, విమానయాన, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇవి అంత త్వరగా కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3 శాతం మేర కుంచించుకుపోనుందన్నది ఐఎంఎఫ్‌ అంచనా! 1930లనాటి మహా మాంద్యం తరవాత ప్రపంచ ఆర్థికం ఇంచుమించు ఆ స్థాయిలో దెబ్బతినడం ఇదే తొలిసారి.

ప్రపంచాన్ని కరోనా ఎక్కువ రోజులు అంటిపెట్టుకుని ఉంటే, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. కరోనా తరవాత ప్రజల జీవనశైలి, వ్యాపార నిర్వహణ తీరుతెన్నులు, మానవ సంబంధాలు ఊహించని విధంగా మారిపోతాయి. ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం పెరగడంతోపాటు ఇ-వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతుంది. దేశాలన్నీ చాలావరకు రక్షణాత్మక ఆర్థిక విధానాలవైపే మొగ్గుచూపవచ్ఛు అభివృద్ధి చెందుతున్న దేశాలనుంచి ఇప్పటికే పదివేల కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులు తరలిపోయినట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సంస్థ అంచనా. 2008 మాంద్యం నాటితో పోలిస్తే ఈ మొత్తం మూడింతలు అధికం. చైనాలో తాము నెలకొల్పిన తయారీ పరిశ్రమలను స్వదేశానికో లేదా వర్ధమాన ప్రపంచ దేశాలకో తరలించేందుకు జపాన్‌ ఇప్పటికే 220 కోట్ల డాలర్లను సిద్ధం చేసుకొంది. చైనా విద్యార్థులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలపట్ల కొన్ని దేశాల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైంది. ఇది మరింత పెరిగితే చైనాకు అన్ని విధాలా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ వ్యవస్థల ప్రాధాన్యం మరింత తగ్గవచ్ఛు మహమ్మారి బారినుంచి సత్వరం బయటపడిన తరవాత ఆర్థిక వ్యవస్థకు కొత్త జవసత్వాలు కల్పించే ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమాన్ని సమర్థంగా పట్టాలకెక్కించేందుకు అవకాశాలు పెరుగుతాయి. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు, భూ సంస్కరణలు, దేశీయ రవాణాను మరింత సులభతరం చేయడం వంటి చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థకు చురుకుపుట్టించేందుకు ముందుకు కదలాల్సి ఉంది. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు నిచ్చే దిశగా క్రియాశీలంగా వ్యవహరించడం ఇప్పుడు భారత ప్రభుత్వం ముందున్న కీలకమైన సవాళ్లు.

- విష్ణు ప్రకాశ్‌
(రచయిత- మాజీ రాయబారి, విదేశీ వ్యవహారాల విశ్లేషకులు)
Posted on 18-04-2020