Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పొంచి ఉన్న ఆహార కొరత

* పెరుగుతున్న నిత్యావసరాల ధరలు

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు విధిస్తున్న ఆంక్షల వల్ల ఎన్నో దేశాల్లో ఆహారకొరత విస్తరించే ప్రమాదముందని ‘ప్రపంచ వ్యవసాయ, ఆహార సంస్థ (ఎఫ్‌ఏఓ)’ హెచ్చరించింది. పోషకాహారలోపం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలూ పెరిగే ప్రమాదముంది. ఇప్పటికప్పుడు కొరత లేకున్నా దీర్ఘకాలంలో సమస్య తలెత్తే ముప్పు పొంచి ఉంది. పేదలు ఎక్కువగా ఉండి, కరోనాకు ముందు నుంచే ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఏర్పడనుంది. ఎన్నో దేశాలు ఇప్పటికే సరిహద్దులు మూసివేసి ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. మున్ముందు అవి ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల నివసించే పేదల అవసరాలు, ఆకలి తీర్చేందుకు కృషి చేయండంటూ ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పిలుపిచ్చారు. పేదల ఆకలి తీర్చేలా ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థను కాపాడుకోవడంతో పాటు ఆంక్షల ప్రభావం దానిపై పడకుండా చూడటం కూడా ఇప్పుడు ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు కత్తిమీద సాములా మారింది. ఆ దేశాలు ఇతర దేశాల నుంచి పాలు మొదలుకుని కూరగాయలు, ఆహారధాన్యాల వరకూ ఆహారోత్పత్తులు వస్తే తప్ప మనుగడ సాధించలేని పరిస్థితి ఉంది. ఎగుమతులపై ఆంక్షలు ఎక్కువైతే ఇలాంటి దేశాల్లో ప్రజలకు ఆహార కొరత ఏర్పడి, సంక్షోభం మరింత తీవ్రమవుతుందని అంచనా.

కరోనా మాటున ఆకలి కేకలు
కరోనా వ్యాప్తిని అరికట్టడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, అది నెలల తరబడి సాగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ఒకటి, రెండు నెలలు లాక్‌డౌన్‌ విధించగానే కరోనా వైరస్‌ ప్రపంచం నుంచి మాయమవుతుందని ప్రపంచ దేశాలూ భావించడం లేదు. దీనిపై దీర్ఘకాలిక యుద్ధం తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆహారోత్పత్తుల నిల్వలు, సరఫరాపై అనేక దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 53 దేశాల్లో, 11.30 కోట్ల మంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆ దేశాల్లో కరోనా కేసులు తీవ్రతరమైతే పరిస్థితి ఇంకా దుర్భరమవుతుందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత నెలాఖరునాటికే ఆఫ్రికా ఖండంలోని 41 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ‘చాలా దేశాల్లో కరోనా భయంతో ఆహార పదార్థాలు దొరకవేమోనని ఎక్కువ కొంటున్నారు. కానీ మా దేశంలో ధరలు మండిపోతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆహారోత్పత్తుల సరఫరా ఇబ్బందుల్లో పడింది’ అని ఘనా శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన ఆఫ్రికా దేశాల పరిస్థితిని చాటుతోంది.

భారత్‌లో నిత్యావసరాల ధరలు కరోనాకు ముందురోజులతో పోలిస్తే 20 నుంచి 30శాతం దాకా పెరిగాయి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల నిల్వలు ప్రస్తుతం పుష్కలంగా ఉన్నాయి. కానీ, కరోనా వ్యాప్తి భయంతో అనేక దేశాలు విధిస్తున్న ఆంక్షలతో పరిస్థితి అదుపు తప్పుతుందని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కువగా పంటలు పండించి ప్రపంచ ప్రజల ఆకలి తీర్చే ప్రధాన దేశాలు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలూ ఆహారోత్పత్తుల ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి. ప్రపంచంలోనే గోధుమ పంటను అత్యధికంగా పండించే దేశాల్లో మూడో స్థానంలో ఉన్న రష్యా- కరోనా దృష్ట్యా గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ప్రధాన పంటల ఎగుమతులపై ఎటువంటి ఆంక్షలు విధించినా అంతర్జాతీయ మార్కెట్‌లో కుదుపులు ఖాయం. ఇప్పటివరకు భారతదేశంలో రాష్ట్రాల మధ్య వ్యవసాయోత్పత్తుల రవాణాపై ఎలాంటి ఆంక్షలూ లేకున్నా, వాటి ధరలు రాజుకుంటున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం బియ్యం ధర నెలరోజుల వ్యవధిలోనే కిలోకు ఒక డాలరు మేర (రూ.73) అదనంగా పెరిగింది. ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల అనేది పేదల పోషకాహార లోపానికి విలోమానుపాతంలో ఉంటుందని ప్రపంచ వ్యవసాయ, ఆహార సంస్థ స్పష్టం చేసింది. ఉదాహరణకు గత రెండు దశాబ్దాల్లో రెండుసార్లు ప్రపంచ మార్కెట్‌లో ఆహారోత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. అస్థిరత కారణంగా 2007-08లో, మళ్లీ 2011లో ప్రపంచ మార్కెట్‌లో ధరల మంట అధికమైంది. ఈ రెండు సందర్భాల్లో పేదలకు పోషకాహారం అందక పౌష్టికాహారలేమితో బాధపడేవారి సంఖ్య పెరిగినట్లు ఎఫ్‌ఐఓ అధ్యయనంలో గుర్తించారు. ధరలు పెరిగినప్పుడు పేదలే కాకుండా, దిగువ మధ్యతరగతి ప్రజలూ నిత్యం పోషకాహారం తీసుకోవడం కష్టంగా మారుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 82.10 కోట్ల మంది సమతులాహారం దొరక్క బాధపడుతున్నారు.

అతిపెద్ద సవాలిదే!
మహమ్మారి కొవిడ్‌ కేసులు, మరణాలు అధికంగా ఉన్న చైనా, ఇటలీ, స్పెయిన్‌, అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు ఆర్థికంగానే కాకుండా ఆహార, ఆరోగ్య భద్రతలో అగ్రస్థానంలో ఉన్నవే. అభివృద్ధి చెందిన, ఆదాయం బాగానే ఉన్న దేశాల్లోనే ఇప్పటిదాకా కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాల్లో సాధారణంగానే పోషకాహారలోపంతో బాధపడేవారు, ఆకలితో అలమటించే నిరుపేద ప్రజల శాతం చాలా తక్కువగా ఉంది. ధనవంతులు, ఆరోగ్యపరంగా బలంగా ఉన్న ప్రజలే ఈ వ్యాధికి తట్టుకోలేక కన్నుమూస్తున్నారు. అక్కడే కరోనా మరణ మృదంగం మోగుతోందంటే ఇక పేదదేశాల పరిస్థితి ఏమిటనేది తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న అంశం. పోషకాహారలోపంతో బాధపడే నిరుపేదల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారికసలే ఆహారకొరత ఉంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నీ ఆంక్షలు పెట్టి, ఎగుమతులు ఆపేస్తే, పేదదేశాల ప్రజలు ఆకలితో అలమటించడం ఖాయం. పేద దేశాల్లో కరోనా విస్తృతమైతే దాన్ని అరికట్టడంతో పాటు ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడమూ ప్రపంచానికి పెద్ద సవాలుగా మారనుంది.

ముందు జాగ్రత్తలే కీలకం
సామాజిక దూరం అమలు చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ పేద దేశాలకు శాపం కాకుండా చూడాలి. ఆహార భద్రతపైనా పాలకులు ముందుచూపుతో వ్యవహరించాల్సిన తరుణమిది. ప్రపంచ మార్కెట్‌కు తృణధాన్యాల ఎగుమతుల వాటాలో 81శాతం పది దేశాల చేతుల్లోనే ఉంది. వీటిలో రెండో స్థానంలో ఉన్న రష్యా ఇప్పటికే తృణధాన్యాలపై ఆంక్షలు పెట్టింది. ప్రపంచంలోనే అత్యధికంగా బియ్యం ఎగుమతి చేసే దేశాల్లో మూడో స్థానంలో ఉన్న వియత్నాం కొత్త ఎగుమతి కాంట్రాక్టులు తీసుకోకుండా నిషేధం విధించింది. కాంబోడియా ఇదే దారిలో ఉంది. 2007-08లో, ఆ తరవాత 2011లో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగిన తరవాత కొంతకాలానికి ఆకలితో బాధపడే పేదల సంఖ్య బాగా పెరిగి కొన్ని ఆఫ్రికా, ఆసియా దేశాల్లో రాజకీయ అస్థిరత నెలకొంది. ఆహారోత్పత్తుల నిల్వలు, సరఫరా, పంపిణీ, విక్రయాల వ్యవస్థలన్నింటిపై ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తూ, నిరంతరం పర్యవేక్షించాలి. ధరల పెరుగుదల లేకుండా జాగ్రత్తపడాలి. రేషన్‌కార్డులున్న పేదలకు సరఫరానే కాకుండా, డబ్బున్నవారు విచ్చలవిడిగా కొనేసి దాచేయకుండా కొనుగోళ్లపైనా ఆంక్షలు పెట్టాలి. అందరికీ సమతుల ఆహారం సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలి. ఆర్థికమాంద్యం ముప్పు పొంచి ఉందని ఇప్పటికే ఐక్యరాజ్యసమితి కూడా హెచ్చరించింది. ప్రజలకు రాబోయే రెండేళ్లపాటు ఆహార, ఆరోగ్య భద్రత కల్పించేలా ముందస్తు ప్రణాళికలు అత్యావశ్యకం.

- మంగమూరి శ్రీనివాస్‌
Posted on 24-04-2020