Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

దారితప్పిన పరిశోధన

* రాశి ఘనం- వాసి దీనం
బోధన, పరిశోధన- విశ్వవిద్యాలయాలకు రెండు కళ్ల వంటివి. విద్యను విశ్వవ్యాప్తంచేసే కృషిలో భాగంగా నాణ్యమైన చదువును సమర్థంగా అందించడం ఆయా సంస్థల బాధ్యత. మనదేశంలో విశ్వవిద్యాలయాల స్థాపనకు ప్రేరణ ఇచ్చినవి బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి వంటి సంస్థలు. పారిశ్రామిక విప్లవానికి నాందిగా పదహారు, పదిహేడో శతాబ్దాల్లో ఆవిష్కరణలు, శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఎంతో తోడ్పాటు అందించాయి. ఇంగ్లండ్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌ తదితర ఐరోపా దేశాల్లో మొదలైన శాస్త్ర విజ్ఞాన ప్రగతి, నేడు అమెరికా, కొన్ని ఆసియా దేశాల అభివృద్ధికి కారణమైంది. ప్రపంచంలోని అనేక దేశాలు ఆ స్ఫూర్తి ఆధారంగానే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రగాములుగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ విధమైన శాస్త్రాభివృద్ధికి విశ్వవిద్యాలయాలు చేస్తున్న కృషి ఎనలేనిది. పరిశోధనలను ద్విగుణీకృతం చేయడంలో, కొత్త ఆవిష్కరణలకు తోడ్పాటు అందించడంలో ఉన్నత విద్యాసంస్థలు ప్రపంచమంతటా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. మానవ వికాస పరిణామ క్రమంలో ఉన్నత విద్యాసంస్థల పాత్ర మరువలేనిది. కానీ మనదేశంలోని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు ఏ విధంగా సాగుతున్నాయో గమనిస్తే నిరాశే మిగులుతుంది.

అరకొర సమాచారం
విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు సక్రమంగా జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడే సూచీ, అవి బహుకరించే డాక్టరేట్‌ డిగ్రీలు. దీని ద్వారా విశ్వవిద్యాలయాల్లో ఏ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. కానీ, దేశంలో అన్ని విశ్వవిద్యాలయాలు కలిపి ఎన్ని పీహెచ్‌డీలు ప్రదానం చేశాయన్నదానిపై సమగ్రమైన ‘గణాంక సమాచార నిధి’ (డాటా బేస్‌) ఏమీ లేదు. కొంతకాలం ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఏఇయూ) సంస్థ నిర్వహించింది. దీనిపై కచ్చితమైన సమాచారం ఏమీలేదు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు కలిపి సంవత్సరానికి సుమారుగా పది నుంచి పదిహేను వేలదాకా పీహెచ్‌డీలు మంజూరు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లోటును గమనించిన ‘ఇన్‌ఫ్లిబ్‌నెట్‌’, యూజీసీ అధీకృత సంస్థ ‘శోధ్‌గంగ’ అనే పోర్టల్‌ ద్వారా దేశంలోని విశ్వవిద్యాలయాల్లో సమర్పించిన డాక్టరేట్‌ డిగ్రీలకు సంబంధించిన సిద్ధాంత గ్రంథాల (థీసెస్‌)ను డాటా బ్యాంకుగా నిర్వహిస్తోంది. ఇన్‌ఫ్లిబ్‌నెట్‌ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన 1991 నుంచి, నేటి వరకు ఈ పోర్టల్‌కు చేరిన సిద్ధాంత గ్రంథాల సంఖ్య 3,352. నేటివరకు ఎక్కువ డిగ్రీలు ప్రదానం చేసిన మొదటి పది సంస్థల్లో ఆంధ్రా, అన్నా, జివాజి, ఎటర్నల్‌, క్రైస్ట్‌, గుల్బర్గా, భారతిదాసన్‌, కేరళ, కాలికట్‌ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ పోర్టల్‌కు తమ సమాచారాన్ని పంపిస్తున్న విశ్వవిద్యాలయాలు చాలా తక్కువ. అందువల్ల గత రెండున్నర దశాబ్దాల నుంచి కేంద్రాన్ని నిర్వహిస్తున్నా, అందుబాటులోకి వచ్చిన సమాచారం అతి తక్కువ.

పరిశోధనల్లో రెండో అంశం పరిశోధన ప్రాజెక్టులకు సంబంధించినది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు బోధన, పరిశోధనల మార్గదర్శకత్వంతో పాటుగా, పరిశోధన ప్రాజెక్టులనూ నిర్వహిస్తుంటారు. ఎన్ని ఎక్కువ ప్రాజెక్టులు, ఎంత విలువగలిగినవి ఉంటే అంత ప్రాచుర్యం లభిస్తుంది. సాధారణంగా ఈ పరిశోధన ప్రాజెక్టులను యూజీసీ, ఎస్‌ఐఆర్‌, డీఎస్‌టీ, డీబీటీ, ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ తదితర జాతీయస్థాయి సంస్థలు మంజూరు చేస్తుంటాయి. కొన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలూ పరిశోధన ప్రాజెక్టులను నిధులు ఇస్తాయి. పరిశ్రమలు, కార్పొరేట్‌ వర్గాలూ వారి అవసరాలను బట్టి విశ్వవిద్యాలయాలకు పరిశోధన నిధులు అందజేస్తాయి. జాతీయస్థాయిలో, ఐఐఎస్‌సీ, టీఐఎఫ్‌ఆర్‌ వంటి సంస్థలు ఈ విధమైన నిధులతోనే తమ కార్యకలాపాలను సాగిస్తుంటాయి. విశ్వవిద్యాలయాల విషయానికి వస్తే, అవసరమైన నిధుల్లో అయిదు శాతమైనా అందుబాటులో ఉండదు. కాబట్టి, దేశీయ విశ్వవిద్యాలయాల నాణ్యత, స్థాయి పెరగాలంటే పరిశోధన ప్రాజెక్టులపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

ఇక మూడో అంశం- పరిశోధన పత్రాల ప్రచురణ. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయనడానికి ఈ పత్రాల ప్రచురణ గుర్తు. జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో (జర్నల్స్‌) ఎన్ని పరిశోధన పత్రాలు ప్రచురిస్తే అంత కీర్తి. దేశంలో పరిశోధన పత్రాల సంఖ్యాపరంగా చూస్తే ఈ మధ్యకాలంలో 10-15 శాతం వరకు పెరుగుదల నమోదవుతోంది. 2009 నుంచి 2014 వరకు భారత శాస్త్రజ్ఞులు ప్రచురించిన పత్రాల్లో 13.9 శాతం పెరుగుదల నమోదైందని, ఇది ప్రపంచ సగటైన 4.1 కంటే చాలా అధికమని ఎల్‌సీవర్‌ ప్రచురణ సంస్థకు చెందిన ‘స్కోపస్‌’ ఇండెక్స్‌ విభాగం తెలియజేసింది. కానీ భారత శాస్త్రజ్ఞుల పత్రాల సైటేషన్లు ప్రపంచం మొత్తంలో 3.4 శాతమే. దీన్నిబట్టి మనం వాసిలోకన్నా రాశిలోనే ముందున్నామని అర్థమవుతోంది.
శాస్త్ర పరిశోధనల విషయంలో భారత విద్యాసంస్థల స్థాయి, నాణ్యత గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది.ఈ కృషిని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తే తప్ప ఫలితాలు ఆశాజనకంగా, సంతృప్తికరంగా ఉండవు. అధ్యాపకులు, పరిశోధకులు, విద్యాసంస్థలు, పరిశోధక సంస్థలు, ప్రభుత్వాలు కొన్ని నిర్దిష్ట అంశాలపై శ్రద్ధ వహించి, తమ తమ స్థాయుల్లో తగిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అమలవుతున్న బోధన, పరిశోధన కలగలిపి ఉన్న పరిస్థితి నుంచి నూతనంగా కేవలం పరిశోధనలపైనే దృష్టి సారించే విధంగా, అదే ప్రధాన వ్యాపకంగా ఉండే విధంగా కొన్ని విశ్వవిద్యాలయాల రూపురేఖలు మార్చాలి. ఇటువంటి విశ్వవిద్యాలయాలకు తోడ్పాటుగా జాతీయ పరిశోధన సంస్థలైన సీఎస్‌ఈఆర్‌, డీఆర్‌డీఓ వంటి వాటితో భాగస్వామ్యం ఏర్పరచాలి. పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం’గాని, ప్రైవేట్‌ ఈక్విటీగాని, వెంచర్‌ కాపిటల్‌ సపోర్టుగాని వాటికి అందించవచ్చు. ఈ విధంగా పరిశోధనలకు నూతన ఒరవడిని కల్పించవచ్చు. నిజానికి యూజీసీ ఇప్పటికే కొన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’గా గుర్తించి ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తోంది. మొత్తం వ్యవస్థలో ఇది అయిదు శాతమైనా ఉండదు. ఒక నిర్దిష్ట కాలంలో చెప్పుకోదగిన ప్రగతిని సాధించాలంటే పరిశోధన రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసిందే.

ప్రయోగాత్మకంగా విద్య
విశ్వవిద్యాలయాల్లో పరిశోధనల నాణ్యత పెరగాలంటే విద్యార్థులను బోధన, పరిశోధన వ్యాపకాల్లో క్రియాశీలకం చేయాలి. ప్రస్తుతం విస్తృతంగా అమలులో ఉన్న ‘బట్టీ విధానం’ విడనాడి అమెరికా వంటి దేశాలు అనుసరిస్తున్న స్వయం శిక్షణ మార్గాన్ని ఎంచుకోవాలి. అధ్యాపకుడు ‘మార్గదర్శి’గానే తప్ప, నిత్యం బోధించే ‘పరికరం’గా మారరాదు. విద్యార్థుల్లో పరిశీలించే తత్వాన్ని, తర్కించే ధోరణిని పెంపొందించాలి. క్షేత్రస్థాయి అవగాహనకు ప్రాధాన్యం కల్పించాలి. చదువుకు శాస్త్రీయతను జోడించాలి. ఈ లక్షణాలు విద్యార్థికి అలవడే విధంగా పాఠ్యాంశాలను సంస్కరించాలి. ఈ రోజున బోధనంతా సిద్ధాంతపరంగానే సాగుతోంది తప్ప, ప్రయోగ పర్వానికి ప్రాముఖ్యం తగ్గిపోయింది. పాఠశాల స్థాయి నుంచి కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయి వరకు ప్రయోగశాలల ప్రాముఖ్యం పెరగాలి. ‘అనుభవపూర్వకమైనదే అసలైన విద్య’ అనే ధోరణి ప్రబలాలి. విశ్వవిద్యాలయాల్లో పరిశోధన ప్రమాణాలను నిర్ధారించేందుకు ఒక కేంద్రీకృత సంస్థను ఏర్పాటుచేయాలి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల నడుమ ‘విజ్ఞాన కేంద్రం’గా నిలబడాలంటే, అరువు తెచ్చుకున్న సాంకేతిక పరిజ్ఞానం, వ్యవస్థా స్వరూపం, నిర్వహణ పద్ధతులు ఏమాత్రం సరిపోవు. ఏ దేశమైనా తనదైన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. దానికి ఆ దేశ సామాజిక, సాంస్కృతిక సంపదే పునాది కావాలి. ఆ పునాదుల ఆధారంగానే నూతన భావజాలాన్ని, నిర్వహణ పద్ధతులను నిర్మించాలి. అందుకోసం నడుంకట్టాల్సిన సమయమిదే!

- ఆచార్య కోదాటి వియ్యన్నరావు
(పూర్వ ఉప‌కుల‌ప‌తి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాల‌యం)
Posted on 20-07-2016