Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

కొవిడ్‌ మాటున మరో మాయావి

* నేడు ప్రపంచ మలేరియా నిర్మూలన దినం

ప్రస్తుతం ప్రపంచ దృష్టి కొవిడ్‌ 19 వ్యాధి మీదే కేంద్రీకృతం కావడంతో మలేరియాపై పోరాటం నీరసించే ప్రమాదం ఏర్పడింది. ప్రపంచంలో ఏటా మలేరియా తాకిడి తీవ్రంగా ఉండే 20 దేశాల్లో భారతదేశం ఒకటి. మిగతా మలేరియా పీడిత దేశాలు ఆఫ్రికా ఖండంలో, అందునా సహారా ఎడారి దిగువన ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సారథ్యంలో అంతర్జాతీయ సమాజం భుజం కలిపి పోరాడటం వల్ల 2010 నుంచి 2018 వరకు మలేరియా కేసులు, మరణాలు తగ్గసాగాయి. 2010లో ప్రపంచవ్యాప్తంగా మలేరియా వల్ల 5,85,000 మరణాలు సంభవిస్తే, 2018లో అవి 4,05,000కు తగ్గాయి. ఆ సంవత్సరం ప్రపంచంలో 22.8కోట్ల మందికి మలేరియా వచ్చింది. దోమ కాటుతో వ్యాపించే మలేరియాపై క్రమంగా పైచేయి సాధిస్తున్నామనే సంతోషం కరోనా వైరస్‌ దెబ్బకు ఆవిరైపోతోంది. ఈ ఏడాది జనవరి మొదలుకొని ఏప్రిల్‌ 24 వరకు ఈ వైరస్‌ వల్ల చనిపోయినవారి సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరువైంది. ఇది ఇంకా పెరగకుండా చూడటానికి అన్ని దేశాలూ హోరాహోరీ సమరం జరపడం స్వాగతించాల్సిన అంశమే కానీ, ఈ జోరులో మలేరియాపై పోరును నీరుగార్చకూడదు. మలేరియా వల్ల ఇప్పటికీ ప్రపంచంలో రోజుకు 1,100 మరణాలు సంభవిస్తున్నాయని మరచిపోకూడదు.

కొరవడుతున్న శ్రద్ధ
మలేరియా నిర్మూలనకు మరిన్ని నిధులు కేటాయించి, ఆరోగ్య రక్షణ యంత్రాంగాన్ని ఇంకా బలోపేతం చేయడానికి ప్రపంచం పునరంకితం కావాలి. 2000 సంవత్సరం నుంచి ప్రపంచం మలేరియా పీడిత ఆఫ్రికా దేశాలకు దోమ కాటు నుంచి రక్షణగా మందు పూత పూసిన దోమ తెరలను 200 కోట్లకుపైగానే అందించింది. కానీ, నేడు కొవిడ్‌పై పోరుకు ఐరోపా, అమెరికా, చైనా, భారతదేశాల్లో ఆరోగ్య సంరక్షణ యంత్రాంగాలు ఎన్నడూ లేనంత ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. దీంతో మలేరియా నిర్మూలనపై శ్రద్ధ, ఉత్సాహం, నిధుల వ్యయం తగ్గుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దకపోతే 2020లో సహారా ఎడారి దిగువ దేశాల్లో మలేరియా మరణాలు 7,69,000కు చేరవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 2000 సంవత్సరం తరవాత ఎన్నడూ ఎరుగని మరణాల రేటు ఇది. ఇంకా దారుణమేమిటంటే 2018లో మలేరియా వల్ల మరణించినవారిలో మూడింట రెండువంతులమంది అయిదేళ్ల లోపు బాలలే కావడం. మలేరియాను నిర్లక్ష్యం చేస్తే గత 20 ఏళ్లలో సాధించిన విజయాలు వృథా అవుతాయి.

ప్రస్తుతం ఆఫ్రికాలో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉన్నా అది ఎల్లకాలం అలానే ఉంటుందనే భరోసా లేదు. అటు మలేరియానూ, ఇటు కరోనాను ఎదుర్కొనే ఆర్థిక సత్తా కానీ, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు కానీ నిరుపేద ఆఫ్రికా దేశాలకు లేవు. 2014-16 మధ్యకాలంలో ఆఫ్రికాలో ఎబోలా వ్యాధి విరుచుకుపడినప్పుడు వైద్య చికిత్సా వ్యవస్థల శక్తియుక్తులన్నీ ఎబోలా కట్టడికి మళ్లడంతో మలేరియా వల్ల, ఇతర వ్యాధుల వల్ల మరణాలు ఒక్కపెట్టున పెరిగిపోయాయి. ఈ ఏడాది కొవిడ్‌ వల్ల మళ్లీ అలాంటిది జరగనివ్వరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ప్రపంచంలో మూడు శాతం మలేరియా కేసులకు నిలయమైన భారత్‌ 2030కల్లా దీన్ని పారదోలాలని లక్షిస్తున్నా కొవిడ్‌పై పోరు అందుకు అడ్డు వచ్చే ప్రమాదం ఉంది. భారత్‌లో ఏటా మే నెలలో, వర్షాలు మొదలయ్యాక జులై, ఆగస్టులలో మలేరియా కేసులు పతాక స్థాయికి చేరతాయి. వీటిని నిరోధించడానికి మార్చి, ఏప్రిల్‌ నెలల నుంచే ఆరోగ్య కార్యకర్తలు దోమల నివారణ మందులు పిచికారీ చేయడం, ఫాగింగ్‌ చేయడం, మలేరియా నిరోధంపై అవగాహన పెంచడం వంటి కార్యక్రమాలను ముమ్మరంగా చేపడతారు.

కేటాయింపులు తగ్గకూడదు
ప్రభుత్వం ఉచితంగా దోమ తెరలను పంపిణీ చేసి, లక్షణాలు బయటపడని ‘ఎఫెబ్రైల్‌ మలేరియా’ కేసులకు చికిత్స చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించగలిగింది. కానీ, కరోనా దెబ్బకు దేశంలో లాక్‌డౌన్‌ విధించినందువల్ల ఈ కార్యక్రమాలన్నీ వెనుకబడే ప్రమాదం ఉంది. లాక్‌డౌన్‌ కాలంలో ఇంటింటికీ తిరిగి మలేరియా పరీక్షలు చేయడమూ కష్టమవుతోంది. ఈ అస్తవ్యస్త పరిస్థితిని తక్షణం సరిదిద్దాలి. జాతీయ, రాష్ట్ర స్థాయులతోపాటు నగరాలు, గ్రామాల స్థాయిలోనూ మలేరియా నివారణ కార్యక్రమాలు నిర్వహించాలి. గ్రామాల్లోని కేసులకు అక్కడికక్కడే చికిత్స అందిస్తే, నగరాల్లోని ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. గ్రామాల్లో మలేరియా నిర్ధారణ కిట్లు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, పడకలు, చికిత్సా సౌకర్యాలను ఇప్పటికే అందుబాటులో ఉంచడంతో- నగర ఆస్పత్రులకు పని తగ్గుతుందని జాతీయ మలేరియా నియంత్రణ ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. కొవిడ్‌వల్ల మలేరియా నిరోధానికి నిధుల కేటాయింపు తగ్గకుండా చూసుకోవాలి. ప్రస్తుతం మలేరియా చికిత్సకు వాడే క్లోరోక్విన్‌ మందును కొవిడ్‌ చికిత్సకు మళ్లిస్తున్నందున ఈ మందుకు అమాంతం గిరాకీ పెరిగిపోయింది. దీనివల్ల మలేరియా రోగులకు క్లోరోక్విన్‌ కొరత రాకుండా జాగ్రత్తపడాలి. దాంతో పాటు సరికొత్త మలేరియా మందులు, వ్యాక్సిన్ల కోసం పరిశోధనలను ముమ్మరం చేయాలి. ఇందుకు కావాల్సిన నిధులను ప్రపంచదేశాలు సమష్టిగా సమకూర్చాలి. కానీ, వాస్తవంలో జరుగుతున్నది అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రపంచంలో మలేరియా నిర్మూలనకు 500 కోట్ల డాలర్ల కేటాయింపులు జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో అంచనా వేసినా, 270 కోట్ల డాలర్లు మాత్రమే లభిస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.

- ఆర్య
Posted on 25-04-2020