Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సరికొత్త ఆవిష్కరణలే శరణ్యం

* వైరస్‌పై పోరులో పరిశోధన పాత్ర కీలకం

ఏటా ఏప్రిల్‌ 26వ తేదీన ప్రపంచ మేధా హక్కుల రక్షణ దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ ఏడాది కరోనా కలవరంలో దాని గురించి పెద్దగా పట్టించుకున్నవారు లేకుండాపోయారు. ఈ వైరస్‌పై మానవుడు గెలవాలంటే కొత్త మందులు, వ్యాక్సిన్లను కనిపెట్టకతప్పదు. వాటిని కనిపెట్టిన దేశాలు, వ్యక్తులు, సంస్థల మేధాహక్కులు (ఐపీఆర్‌) అమూల్యమైనవిగా మారనున్నాయి. అటువంటి హక్కులకు 193 దేశాలు సభ్యులుగా ఉన్న ప్రపంచ మేధాహక్కుల పరిరక్షణ సంస్థ (విపో) సాధికార గుర్తింపునిస్తోంది. పేటెంట్లు, కాపీరైట్లు, పారిశ్రామిక డిజైన్లు, ట్రేడ్‌ మార్కులు, భౌగోళిక సూచీలను ఐపీఆర్‌ లేదా మేధా హక్కులుగా పరిగణిస్తారు. ప్రపంచంలోని 8 కోట్ల పైచిలుకు పేటెంట్లకు, 4 కోట్లకు పైబడిన బ్రాండ్లకు, ఒక కోటీ 22 లక్షల పారిశ్రామిక డిజైన్లకు, 200 దేశాల మేధాహక్కులకు సంబంధించిన 15,988 చట్టాలు, ఒప్పందాలు, రికార్డులు, విధాన పత్రాలకు విపో సంరక్షకురాలిగా నిలుస్తోంది. పేటెంట్‌ సహకార ఒప్పందం కింద ఒక వ్యక్తి లేదా సంస్థ పేటెంట్‌ కోసం పెట్టే అంతర్జాతీయ దరఖాస్తు విపో సభ్య దేశాలన్నింటిలో చలామణి అవుతుంది.

వ్యవస్థలు బలోపేతం కావాలి
నేడు అమెరికా, ఐరోపాలలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డి)కి నిధుల కేటాయింపు తగ్గిపోయింది. అందుకే ఆ దేశాల నుంచి కొత్త పేటెంట్ల కోసం దరఖాస్తులూ తగ్గాయి. కొవిడ్‌ కు వైరస్‌ కనిపెట్టడంలో ఆలస్యానికి కారణమిదే. 2018లో మొత్తం 33 లక్షల పేటెంట్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. అది అంతకుముందు సంవత్సరంకన్నా 5.2 శాతం ఎక్కువే కానీ 2018 పేటెంట్ల దరఖాస్తుల్లో మొట్టమొదటిసారిగా అమెరికాను చైనా మించిపోయింది. మొత్తం పేటెంట్‌ దరఖాస్తుల్లో సగం చైనావే. అమెరికా నుంచి 5 లక్షల దరఖాస్తులే వచ్చాయి. 1883 నుంచి 1963 వరకు పేటెంట్‌ దరఖాస్తుల్లో ప్రథమ స్థానం అమెరికాదే. 1970-2005 మధ్యకాలంలో జపాన్‌, అమెరికాలు కలసి అత్యధిక పేటెంట్‌ దరఖాస్తులు పెట్టాయి. 2005 నుంచి చైనా జోరు పెరగసాగింది. నేడు ప్రపంచంలో దాఖలవుతున్న పేటెంట్‌ దరఖాస్తుల్లో 85.3 శాతం చైనా, అమెరికా, జపాన్‌, జర్మనీ, దక్షిణ కొరియాల నుంచే వస్తున్నాయి. 2008లో ఆసియా దేశాలు 50.8 శాతం దరఖాస్తులు దాఖలు చేయగా, 2018లో వాటి వాటా 66.8 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల వాటా 43.7 నుంచి 30 శాతానికి తగ్గింది.

పేటెంట్ల కోసం దరఖాస్తు పెట్టిన 10 అగ్రదేశాల జాబితాలో భారత్‌ చోటు సంపాదించలేకపోయినా, సదరు దరఖాస్తుల ఉపసంహరణలో మాత్రం మేటిగా నిలిచింది. 2019 ఆగస్టులో భారత్‌ 16,289 దరఖాస్తులు మాత్రమే పెట్టింది. విపో సభ్యదేశాలన్నింటిలోనూ చెలామణీ అయ్యే పీసీపీ తరగతి దరఖాస్తుల్లో భారత్‌ వాటా 203 మాత్రమే. అందులోనూ ప్రభుత్వ రంగ సంస్థలైన సీఎస్‌ఐఆర్‌, ఐ.ఐ.ఎస్‌.సి, ఐఐటీలు కేవలం 125 పేటెంట్‌ దరఖాస్తులు దాఖలు చేశాయి. మన విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి కొత్త ఆవిష్కరణలు రావడం లేదనడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి? ఆర్‌ అండ్‌ డి మీద ఎక్కువ నిధులు ఖర్చుపెట్టగలిగిన దేశాలు సహజంగానే ఎక్కువ పేటెంట్లు సాధిస్తాయి. ఏటా విపో వెలువరించే ప్రపంచ నవీకరణ సూచీ (జీఐఐ)లో 2017లో 60వ స్థానంలో ఉన్న భారతదేశం 2019లో 52వ ర్యాంకుకు ఎగబాకింది. మన విద్యా ప్రమాణాలు, ముఖ్య రంగాల్లో ఉద్యోగుల ఉత్పాదకత ఉన్నతంగా లేకపోవడం వల్ల, వ్యవస్థలు బలహీనంగా ఉండటం వల్ల నవకల్పనల్లో రాణించలేకపోతున్నాం.

ఫార్మా, వైద్యరంగాల్లో నిర్లక్ష్యం
ప్రపంచ పేటెంట్‌ దరఖాస్తుల్లో 30 శాతం ఐటీ, ఎలక్ట్రికల్‌ ఉపకరణాలకు సంబంధించినవే. వైద్య సాంకేతికతకు సంబంధించిన పేటెంట్ల కోసం చేసిన దరఖాస్తులు 4.5 శాతం కాగా, రసాయన శాస్త్ర సంబంధమైనవి 24 శాతం. ఫార్మా పేటెంట్ల దరఖాస్తులు కేవలం 3.6 శాతమైతే, బయోటెక్‌ రంగంలో దాఖలైన దరఖాస్తులు 2.2 శాతం. వైద్య, ఫార్మా రంగాల్లో పరిశోధనను నిర్లక్ష్యం చేసినందున ఇప్పుడు కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాం. ఇకనైనా భారత్‌ సహా అన్ని ముఖ్య దేశాల ప్రభుత్వాలు మేల్కొని ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధన సంస్థలకు నిధుల కేటాయింపును పెంచాలి. కంపెనీలకు భారత ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల రూపాయల సబ్సిడీలనిస్తోంది. ఇకపై మేధా హక్కులను ఉత్పన్నం చేసే కంపెనీలకు అత్యధిక పన్ను రాయితీలనిచ్చి, కేవలం లాభాపేక్షతో క్రయవిక్రయాలకు పరిమితమయ్యే కంపెనీలకు రాయితీలు, సబ్సిడీలను తగ్గించాలి. ఉన్నత నైపుణ్యాలు అవసరమయ్యే రంగాల్లో ప్రతి ఒక్క ఉద్యోగం అయిదు పరోక్ష ఉద్యోగాలను సృష్టించగలుగుతుంది. కాబట్టి భారతదేశం ఈ రంగాలపైన, పరిశోధన అభివృద్ధిపైన దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలి.

Posted on 28-04-2020