Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అందివచ్చిన ‘ఇంధన’ అవకాశం

* ప్రణాళికతోనే ప్రయోజనం

ముడిచమురు రంగంలో ‘అంగట్లో అన్నీఉన్నా అల్లుడి నోట్లో శని ఉంద’నే చందంగా తయారైంది భారత్‌ పరిస్థితి. ధరలు పాతాళానికి పడిపోతున్నా ఆ అవకాశాన్ని దేశం అందిపుచ్చుకోలేక పోతోంది. చమురు ధరలు ఇరవై రెండేళ్ల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా అత్యధిక దేశాలు లాక్‌డౌన్‌లో ఉండటంతో ఆయిల్‌ వినియోగం గణనీయంగా పడిపోవడం, సౌదీ అరేబియా-రష్యాల చమురు యుద్ధం... కారణాలేవైనా ఈ ఏడాది జనవరిలో 65 అమెరికన్‌ డాలర్లున్న బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర ప్రస్తుతం 19 డాలర్లకు పడిపోయింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు, అత్యధికంగా చమురు వినియోగించే దేశాల్లో ఒకటైన భారత్‌కిది సువర్ణావకాశం. కానీ, పాలకుల్లో కొరవడిన ముందుచూపు, తక్కువ నిల్వ సామర్థ్యం కారణంగా ఈ అరుదైన అవకాశాన్ని భారత్‌ చేజార్చుకుంటోంది. ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకుంటే ఇండియా భారీగా విత్తలోటును తగ్గించుకునే అవకాశం ఉండేదని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ముడిచమురు ధర ఎంత పతనం అవుతున్నా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పు కనిపించడం లేదు. ధరల తగ్గుదల లబ్ధి సామాన్యుడికి బదలాయింపు కావడం లేదు. అందుకు కారణం ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌లపై ఎప్పటికప్పుడు ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుకుంటూ పోవడమే. 2014 నుంచి పెట్రోల్‌పై 142శాతం, డీజిల్‌పై 318శాతం చొప్పున సుంకం పెంచారు. నలభై రోజుల్లో క్రూడ్‌ ధర సగానికి సగం పడిపోయినా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గలేదు.

ఉత్పత్తి, డిమాండ్‌, వినిమయం ఆధారంగానే ప్రతి వస్తువు ధర ప్రభావితం అవుతుంది. ప్రపంచ విపణిలో క్రూడ్‌ ధరలు పడిపోగానే మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గవు. ముందు దేశంలో నిల్వ ఉన్న చమురు వినియోగం కావాలి. ఆపై విదేశాల నుంచి తక్కువ ధరలో లభించే ఇంధనం దిగుమతి కావాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంధన వినియోగం గణనీయంగా తగ్గింది. ఏప్రిల్‌ 15 నాటికి దేశంలో సగటు ఇంధన వినియోగం 65శాతం పడిపోయింది. వినియోగం పూర్తిగా తగ్గడంతో చమురుశుద్ధి కంపెనీల్లో నిల్వలు పేరుకుపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న డెబ్భై అయిదు వేల పెట్రోల్‌బంకుల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. జూన్‌ మొదటి వారం వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని విశ్లేషకుల అంచనా.

అత్యవసర పరిస్థితులు తలెత్తితే తట్టుకునేలా ప్రతీ దేశానికి మూడునెలల వినియోగానికి సరిపడా వ్యూహాత్మక ఇంధన నిల్వలు ఉండాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) సూచిస్తోంది. కానీ మనదేశంలో కేవలం తొమ్మిది రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, కర్ణాటకలోని మంగళూరు, పదూర్‌లలో వ్యూహాత్మక ఇంధన నిల్వ కేంద్రాలున్నాయి. వీటి సామర్థ్యం 3.90 కోట్ల బ్యారెళ్లు. అత్యధికంగా చమురు వినియోగించే అమెరికాకు 73 కోట్ల బ్యారెళ్లు, చైనాకు 55 కోట్ల బ్యారెళ్లు, జపాన్‌కు 52.80 కోట్ల బ్యారెళ్ల నిల్వ సామర్థ్యం ఉంది. మనకన్నా చిన్న దేశమైన దక్షిణకొరియా సైతం అత్యవసరాల కోసం 21.40 కోట్ల బ్యారెళ్లు నిల్వ చేసుకుంటోంది. విదేశీ దిగుమతులపైనే ఆధారపడే భారత్‌లాంటి దేశాలు ఇంత తక్కువ నిల్వ సామర్థ్యం కలిగి ఉండటం క్షేమకరం కాదంటోంది ఐఈఏ. ప్రస్తుతం ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఒడిశాలోని చాందీఖోల్‌, కర్ణాటకలోని పదూర్‌లో రూ.35వేల కోట్ల వ్యయంతో 65 లక్షల టన్నుల సామర్థ్యంతో వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలు నిర్మిస్తోంది. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకో నాలుగైదేళ్లు పడుతుంది.

వ్యూహాత్మక ఇంధన నిల్వ కేంద్రాలు, చమురు సంస్థల రిఫైనరీల్లో పేరుకుపోయిన ఇంధన నిల్వలను మే మూడోవారం దాకా కదిలించే పరిస్థితి లేదంటున్నారు ఇండియన్‌ స్ట్రాటజిక్‌ పెట్రోలియం రిజర్వ్స్‌ లిమిటెడ్‌ సీఈఓ హెచ్‌పీఎస్‌ అహుజా. దీంతో ప్రపంచ విపణిలోని తక్కువ ధరలకు అందుబాటులో ఉన్న చమురును కొనుగోలు చేయడానికి ఇతర మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్‌లలో ముడిచమురు కొనుగోలు చేసి అక్కడే నిల్వ చేసుకునేలా అనుమతించాలని ఆయా దేశాలతో చర్చలు జరుపుతున్నామని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెబుతున్నారు. అవసరమైతే అంతర్జాతీయ ఇంధన సంస్థ సాయం తీసుకుంటామని అంటున్నారు. భారత్‌లోని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల రిఫైనరీల్లోనూ 65రోజులకు సరిపడా చమురు నిల్వ సామర్థ్యం ఉంది. అంతర్జాతీయ విపణిలో ధరలు తక్కువగా ఉన్నప్పుడు చమురు కంపెనీల రిఫైనరీలు, వ్యూహాత్మక ఇంధన నిల్వ కేంద్రాల్లో ఆయిల్‌ని నిల్వ చేసేలా, పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం చేసుకునే విషయాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోంది. ఈ తాత్కాలిక ఉపశమన చర్యలు ముందే చేపట్టి ఉంటే భారత్‌ భారీగా లబ్ధి పొందేది. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితిని ఒక పాఠంలా భావించాలి. ముడిచమురు నిల్వకు సంబంధించి మెరుగుదల సాధనకు శాశ్వత చర్యలు చేపట్టాలి!

- శ్రీనివాస్‌ బాలె
Posted on 29-04-2020