Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

నగరాలకు వరద ముట్టడి

* సృజనాత్మక విధానాలు తక్షణావసరం
2013... ముంబయి; 2014... శ్రీనగర్‌; 2015.. చెన్నై; 2016... దిల్లీ, బెంగళూరు... ఈ నగరాల్లో ఆకాశం బద్దలై జనజీవితం కుదేలవడం చూశాం. హైదరాబాద్‌ నగరం ఒక మోస్తరు భారీ వర్షాలకే అల్లల్లాడటం చూస్తూనే ఉన్నాం. గతంలో భారీ వర్షాలవల్ల పల్లపు ప్రాంతాలు మాత్రమే జలమయమైతే, నేడు రోజుల తరబడి ­రంతా జలదిగ్బంధంలో చిక్కుకుపోతోంది. ఒకప్పుడు వర్షాకాలమంతా వానలు కురిస్తే, నేడు సీజను మొత్తంలో కురవాల్సిన వర్షాలు కొద్దిరోజుల్లోనే నెత్తిన పడుతున్నాయి. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాల సీజనులో 430-490 మి.మీల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, నిరుడు కేవలం ఒక్కరోజులోనే 340 మి.మీల వర్షం చెన్నైని ముంచెత్తింది. 2005 జులై 26న 18 గంటలపాటు 944 మి.మీల వర్షం కురిసి ముంబయి విలవిల్లాడింది. ఈ ఏడాది జులైలో 15 గంటలపాటు విడవకుండా కురిసిన వర్షం బెంగళూరును తలమునకలు చేసింది. దిల్లీ-జైపూర్‌ రోడ్డు మీద మోకాలి లోతు నీరు నిలిచి 15-20 కిలోమీటర్ల పొడవునా వాహనాలు స్తంభించిపోయాయి. భారతీయ నగరాలన్నింటిలోకి ఎక్కువగా వరదల బారినపడే కోల్‌కతాకు ఏటా జలగండం ఎదురవుతూనే ఉంటుంది. పట్టణాల్లో వాన నీరు నేలలోకి ఇంకడానికి బహిరంగ స్థలాలు, ఇతర ఏర్పాట్లు లేక వరదలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో 300 ప్రాంతాల్లో నీరు నిలిచిపోతోంది. హైదరాబాద్‌లోని మూసీ, చెన్నైలో కూవం, ముంబయిలో మిత్తీ నదులు నేడు మురుగుతో పూడిపోయాయి. ఈ నగరాల్లో తుపాను నీటి డ్రెయిన్లూ శిథిలమవడంతో వాన నీరు వేగంగా బయటకు వెళ్లలేకపోతోంది. చెన్నైలో 2,847 కిలోమీటర్ల పొడవైన రహదారులు ఉన్నా తుపాను డ్రెయిన్ల పొడవు 855 కిలోమీటర్లు మాత్రమే. హైదరాబాద్‌కు 4,000 కిలోమీటర్ల పొడవైన తుపాను డ్రెయిన్లు అవసరమైనా, అందుబాటులో ఉన్నవి 800-1000 కిలోమీటర్లకు మించవు. ఉన్న కొద్దీ కూడా పూడుకపోతున్నా పట్టించుకునేవారు లేరు. మురుగు నీటికీ, తుపాను నీటికీ వేర్వేరు డ్రెయిన్లను నిర్మించి, వర్షాకాలం వచ్చేముందే వాటిలో పూడిక తీయాల్సి ఉన్నా, గుత్తేదారులు, అధికారుల అవినీతి వల్ల ఈ ప్రక్షాళన దెబ్బతింటోంది.

భూతాపంతో కష్టనష్టాలు
అందుకే అధిక వర్షాలతో నదులు పొంగిపొరలి నగరాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆకస్మిక వర్షాల వల్ల తపతి, తుంగభద్ర నదులు ఉప్పొంగడం వల్ల 2006లో సూరత్‌, 2009లో కర్నూలు నీట మునిగాయి. నదులు ఉప్పొంగినప్పుడు డ్యామ్‌ల నుంచి క్రమక్రమంగా నీరు వదలాలనే ముందుజాగ్రత్తను అధికారులు గాలికి వదలేయడమే ఈ ఉపద్రవానికి మూలం. 2006లో తపతీ నది పైనున్న ఉకై డామ్‌ నుంచి చెప్పాపెట్టకుండా నీటిని విడుదల చేయడంవల్ల సూరత్‌ మునిగింది. ఇప్పుడు నీటి విడుదలకు 48 గంటల ముందునుంచే సంక్షిప్త సందేశాలు (ఎస్‌ఎంఎస్‌) పంపుతున్నారు. మునిసిపల్‌ శాఖ స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా డ్యామ్‌ నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. నగర పౌరులు కూడా ఫేస్‌బుక్‌ బృందాలుగా ఏర్పడి వరద సమాచారాన్ని తెలియజేస్తున్నారు. గృహయజమానులు, వ్యాపార సంస్థలు, వజ్రాల వ్యాపారులు తమ కట్టడాల ఎత్తు పెంచుకోగా, 2006 తరవాత కొత్త భవనాలన్నింటిలో గ్రౌండ్‌ఫ్లోర్‌ను పార్కింగ్‌కు మాత్రమే ఉపయోగిస్తున్నారు. వరద నీరు పారే ప్రాంతాల్లో నిర్మాణాలకు 2006 నుంచి మునిసిపల్‌ అధికారులు అనుమతి బంద్‌ చేశారు. సూరత్‌లో ప్రభుత్వ-ప్రజా భాగస్వామ్యం విజయవంతమై, 2013లో భారీ వర్షాలు వచ్చినా నగరవాసులకు నష్టం జరగలేదు.

భూతాపం వల్ల పెరుగుతున్న ఆకస్మిక వరదలను ఎదుర్కోవడానికి మరింత పకడ్బందీ ప్రణాళిక అవసరం. ఈ అవగాహన కొరవడటం వల్ల ఆకస్మిక వరదలు ప్రపంచ పట్టణాల పుట్టి ముంచుతున్నాయి. ప్రస్తుతం 20 ఏళ్లకు ఒకసారి పెను తుపానులు సంభవిస్తుంటే 2100నాటికి నాలుగేళ్లకు ఒక పెనుతుపాను చొప్పున విరుచుకుపడుతుందని అమెరికా వాతావరణ పరిశోధకులు హెచ్చరించారు. తుపానులు తెచ్చిపెట్టే భారీ వరదల వల్ల భారత్‌కు ఏటా సగటున 700 కోట్ల డాలర్ల (దాదాపు రూ.46 వేలకోట్ల) ఆర్థిక నష్టం వచ్చిపడుతోందని గత ఏడాది ఐక్యరాజ్య సమితి లెక్కగట్టింది. ప్రస్తుతం 48 లక్షలమంది భారతీయులు ప్రకృతి ఉత్పాతాలకు ఎర అవుతుంటే, 2030కల్లా వారి సంఖ్య కోటీ 90 లక్షలకు చేరనుంది.

వచ్చే అయిదేళ్లలో మౌలిక వసతుల ప్రాజెక్టులపై లక్ష కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని నిర్ణయించిన భారత ప్రభుత్వం, వరదలు, తుపానుల నుంచి ఈ ప్రాజెక్టులను రక్షించుకోకపోతే పెట్టుబడి నీటిపాలవుతుంది. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ 2011లో అయిదు నెలలపాటు వరద నీటిలో మునగడంతో టొయోటా, హోండా వంటి కార్ల విడిభాగాల యూనిట్లు దెబ్బతిన్నాయి. విడిభాగాల సరఫరా నిలిచిపోయి ఇతర దేశాల్లోని ఈ కంపెనీల ఫ్యాక్టరీల్లో కార్ల ఉత్పత్తి తగ్గించాల్సి వచ్చింది. 2015 వరదల వల్ల చెన్నైలో బీఎండబ్ల్యూ, ఫోర్డ్‌, హ్యుండయ్‌, రెనో కార్ల ఉత్పత్తిలో 15 శాతం కోతపడింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆరేళ్లలో 98 నగరాలను స్మార్ట్‌ నగరాలుగా తీర్చిదిద్దాలని సంకల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం, పాత నగరాల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి.

పట్టణ ఉష్ణ ద్వీప ప్రభావం
భూతాపం వల్ల ఆకస్మిక కుంభవృష్టి సరికొత్త ఉత్పాతంగా ఆవిర్భవించిందంటే కారణం- ‘పట్టణ ఉష్ణ ద్వీప ప్రభావమే’. పరిసర ప్రాంతాలకన్నా పెద్ద నగరాలు, పట్టణాలపైన వేడి ఎక్కువగా ఉండటంతో ఈ ఉష్ణ నగరాల మీద పయనించే వర్ష మేఘాలు ఒక్కసారిగా తమలోని జలాన్ని గుమ్మరించేస్తాయి. ముంబయి, దిల్లీ, చెన్నై మహా నగరాల్లో మెరుపు వరదలకు ఇదే మూలకారణమని భారత ఉష్ణమండల వాతావరణ పరిశోధన సంస్థ నిర్ధారించింది. శివార్లలోని చెరువులు, చిత్తడి నేలలను పూడ్చి కాంక్రీటు కట్టడాలు నిర్మించడం, తుపాను జలాలను బయటకు తీసుకెళ్లే డ్రెయిన్ల మీదా భవనాలు కట్టడంతో వరద జలాలు బయటకు వెళ్లలేక నగరాలు పదేపదే మునిగిపోతున్నాయి. రవాణా, కమ్యూనికేషన్లు, విద్యుత్‌ సరఫరా విచ్ఛిన్నమవుతున్నాయి. ప్రభుత్వం, ప్రజలు సత్వరం మేల్కొనకపోతే పట్టణ వరదలు మరింత ఉద్ధృతంగా, మరింత తరచుగా విరుచుకుపడటం ఖాయం. ఇకనైనా అలసత్వం వీడి వినూత్న ఆలోచనలను ఆచరణలో పెట్టాల్సి ఉంది.

సన్నద్ధత ముఖ్యం
ఇక్కడ ఇతర దేశాల అనుభవాల నుంచి పాఠాలు నేర్వవచ్చు. గడచిన 35ఏళ్లలో చైనాలో నగరాల సంఖ్య 193 నుంచి 653కి పెరిగింది. వీటిలో మురుగు, తుపాను డ్రెయిన్లు 20 రెట్లు విస్తరించినా, ఒక్క 2013లోనే 230 నగరాలు వరదపాలయ్యాయి. ఈ దుస్థితి నివారణకు ‘మన నగరాలు స్పాంజ్‌ల మాదిరిగా వర్షపు నీటిని పీల్చుకోవాలి’ అని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మూడేళ్ల క్రితం పిలుపు ఇచ్చారు. తదనుగుణంగా తొలి దశలో బీజింగ్‌, షాంఘైలతో సహా మొత్తం 30 నగరాలను స్పాంజుల్లా మార్చే కార్యక్రమం మొదలైంది. స్పాంజ్‌ నగరాల్లో నీరు మడుగులు కట్టదు. ఇక్కడి మెత్తని పేవ్‌మెంట్లు చప్పున వర్షపు నీటిని పీల్చి భూగర్భ పొరల్లోకి ఇంకిస్తాయి. అక్కడి నుంచి ఆ నీరు నదులు, చెరువులు, కుంటల్లోకి చేరుతుంది. స్పాంజ్‌ నగరాల్లో ఎక్కడ చూసినా హరిత వనాలే. అక్కడి పార్కింగ్‌ స్థలాల్లో కూడా పడిన నీరు పడినట్లు నేలలోకి ఇంకుతుంది. స్పాంజ్‌ నగరాల్లోని నేల, వనాలు 85 శాతం వర్షపు నీటిని నేలలోకి ఇంకిస్తాయి. అందువల్ల స్పాంజ్‌ నగరాల్లో ఉష్ణోగ్రత రెండు, మూడు డిగ్రీలు తక్కువ ఉండి, పట్టణ ఉష్ణ ద్వీప ప్రభావం అదృశ్యమవుతుంది.

ఇతర దేశాల్లోనూ పాతనగరాలను స్పాంజుల్లా మారుస్తున్నారు. ఒకప్పుడు పచ్చని వనాలతో కళకళలాడుతూ ‘ఉద్యాన నగరం’గా పేరుమోసిన సింగపూర్‌ నేడు మరిన్ని వనాలను పెంచి ‘ఉద్యాన వనం లోపల అలరారుతున్న నగరం’గా ప్రశంసలు అందుకుంటోంది. సగం నగరం కింద వర్షపు నీటిని పీల్చుకునే భూగర్భ జలాశయాలను ఏర్పరచారు. అవి మరుగు దొడ్లకే కాక తాగడానికీ నీరు అందిస్తున్నాయి. అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నగర వీధులను వర్షపు నీటిని పీల్చుకునే హరిత వీధులుగా మార్చారు. అక్కడి ఫిలడెల్ఫియా నగరం 25 ఏళ్లలో 250 కోట్లతో వేలాది స్పాంజి పేవ్‌మెంట్లు, పార్కులను నిర్మించబోతోంది. జపాన్‌లో టొయూకా నగర శివార్లలో కనుమరుగైన చిత్తడి నేలలను పునరుద్ధరించారు. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌ హేగెన్‌లో టాసింగ్‌ ప్లాడ్స్‌ అనే ఉద్యానవనానికి స్పాంజ్‌ లక్షణం అబ్బించారు. ఈ పార్కులో నడకదారి (పేవ్‌మెంట్‌) పక్కన మట్టి నేలలో మొక్కలు పెంచుతున్నారు. అక్కడ తలకిందులు గొడుగు మాదిరి నిర్మాణాలు వర్షపు నీటిని పట్టి భూగర్భ జలాశయాల్లోకి ఇంకిస్తాయి. వాటిపైన స్పాంజిలాంటి ఉపరితలం మీద పిల్లలు గంతులు వేసినప్పుడు పుట్టే శక్తి, భూగర్భ పైపుల నుంచి నీటిని తోడి పార్కులోని మొక్కలకు అందిస్తుంది. వచ్చే 20 ఏళ్లలో కోపెన్‌ హేగెన్‌లో మొత్తం 300 టాసింగ్‌ ప్లాడ్స్‌ తరహా ఉద్యానాలను సృష్టించాలని నగరపాలిక నిర్ణయించింది. నెదర్లాండ్స్‌లోని రాటర్‌డామ్‌ నగరంలో బెంథెమ్‌ప్లెయిన్‌ చౌకీలో నిర్మించిన మూడు కాంక్రీటు బేసిన్లు వర్షపు నీటిని నిల్వ చేస్తున్నాయి.

ఇప్పుడు మన పట్టణాల ముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి- మురుగు, తుపాను డ్రెయిన్ల వంటి సంప్రదాయ వసతుల (గ్రే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)కే అంటిపెట్టుకోవడం. లేదంటే హరిత-నీలి వ్యవస్థ (గ్రీన్‌-బ్లూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)కు మారడం. కురిసిన నీటిని వనాల్లో, బహిరంగ స్థలాల్లో ఇంకించి అవసరమైనప్పుడు వాడుకోవడానికి హరిత-నీలి వ్యవస్థ తోడ్పడుతుంది. సంప్రదాయ పద్ధతిలో మరిన్ని భూగర్భ పైపులు నిర్మించినా భూతాపం తెచ్చిపెట్టే కుంభవృష్టిని అవి తట్టుకోలేవు. అదే హరిత-నీలి వసతులతో తుపాను నీటిని ఇంకించి శుద్ధి చేసి ప్రజలు, పార్కులు, పరిశ్రమలకు అందిస్తే నిత్యకల్యాణం పచ్చతోరణం అవుతుంది.

- ఏఏవీ ప్రసాద్‌
Posted on 12-08-2016