Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ప్రభుత్వానికి సవాళ్లెన్నో...

* లాక్‌డౌన్‌ అనంతరం వెంటాడనున్న సమస్యలు

‘నేను కరోనా వల్ల చనిపోకపోయినా ఉపాధి లేక ఆకలితో చనిపోవలసి రావచ్చు’ అని బిహార్‌కు చెందిన ఓ నిరుపేద వలస కూలీ ఇటీవల ఓ టెలివిజన్‌ చానల్‌లో అన్నారు. ఆయన మాటలు ప్రభుత్వానికి ఎదురవుతున్న ధర్మ సంకటానికి అద్దం పడుతున్నాయి. ఎవరు బతకాలి, ఎవరు మరణించాలి అనే అంశాన్ని ప్రభుత్వం తేల్చుకోవలసిన సమయం వచ్చేస్తోంది. మే 4వ తేదీన కేంద్రం లాక్‌డౌన్‌ ఎత్తివేస్తుందా లేదా అనేదాని మీద అంతా ఆధారపడి ఉంటుంది. వైరస్‌ బారి నుంచి కొన్ని ప్రాణాలను రక్షించి, లక్షలు, కోట్లమందిని నిరుద్యోగం, ఆకలి భూతాలకు ఎరవేయాలా అన్నది తేల్చుకోవాలి. బహుశా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు భద్రమనుకున్న ప్రాంతాలలో లాక్‌డౌన్‌ను సడలించి, ఆ ప్రాంతాలలో క్రమంగా ఆర్థిక కార్యకలాపాలను అనుమతించే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ ద్వారా మరణాలను తగ్గించగలిగినా, వ్యాక్సిన్‌ విస్తృతంగా అందుబాటులోకి వచ్చేవరకు కరోనా వైరస్‌ వ్యాపిస్తూనే ఉంటుంది. వ్యాక్సిన్‌ చేతికి అందడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరం వరకు పట్టవచ్చు. ఈలోగా లాక్‌డౌన్‌ల పొడిగింపుల వల్ల 40 కోట్ల దినసరి కూలీలు దారుణంగా దెబ్బతింటున్నారు. వారిలో చాలామంది ఆకలితో మరణించే ప్రమాదం ఉంది. వరుసగా లాక్‌డౌన్‌లు విధిస్తూ పేదలకు సంక్షేమ చెల్లింపులు జరుపుతూ ఉంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం తప్పదు. ముందే ఆర్థిక మందగతితో సతమతమవుతున్న కేంద్ర, రాష్ట్రాలకు భారీ సంక్షేమ బిల్లు మోయలేని భారమవుతోంది.

మేలుచేసే నిర్ణయాలతోనే రక్షణ
భారతదేశం కొన్ని దశాబ్దాల నుంచి వేగవంతంగా ఆర్థికాభివృద్ధి నమోదు చేస్తున్న మధ్యాదాయ దేశంగా వార్తల్లో నిలుస్తోంది. అలాంటిది కాస్తా లాక్‌డౌన్‌ దెబ్బకు మళ్లీ పేద దేశంగా మారిపోయే ప్రమాదం ఉంది. రోగం కన్నా మందు ప్రమాదకరమంటే ఇదే. ఈ వాస్తవాన్ని గమనించబట్టి అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఐరోపాలోని స్వీడన్‌ దేశం లాక్‌డౌన్‌కు దూరంగా ఉన్నాయి. ‘వృద్ధులు నిండు జీవితం అనుభవించారు, యువజనులకు జీవితం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. వారి కోసం వృద్ధులు త్యాగం చేయాలి’ అంటూ అమెరికాలోని టెక్సస్‌ రాష్ట్ర గవర్నర్‌ డ్యాన్‌ ప్యాట్రిక్‌ లాక్‌డౌన్‌కు ససేమిరా అన్నారు. ఆర్థిక కార్యకలాపాలను యథావిధిగా కొనసాగనిచ్చారు. భారతదేశం ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోగలదా అంటే సందేహమే. పాలకుడు అత్యధికులకు మేలు చేసే నిర్ణయాలు, విధానాలనే చేపట్టాలని మహాభారతంలో విదురుడు సలహా ఇచ్చారు. ఒక గ్రామాన్ని రక్షించడం కోసం ఒక వ్యక్తిని త్యాగం చేయొచ్చు, ఒక దేశాన్ని రక్షించడానికి ఒక నగరాన్ని త్యాగం చేయొచ్చని విదురుడు పేర్కొన్నారు. ఆ లెక్కన కొవిడ్‌ వ్యాధి వల్ల కన్నా లాక్‌డౌన్‌ వల్ల ఎక్కువమంది చనిపోయేట్లుంటే, దాన్ని ఎత్తివేయడానికే విదురుడు ఓటు వేస్తారన్నమాట.

రాష్ట్ర ప్రభుత్వాలు మే 4 తరవాత మధ్యే మార్గాన్ని అనుసరించవచ్చు. కరోనా పరీక్షలు, వ్యాధి వ్యాప్తి రేటును పరిగణనలోకి తీసుకుని రెడ్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో క్రమంగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తూ ఆర్థిక కార్యకలాపాలను అనుమతించే అవకాశముంది. తద్వారా ప్రాణ నష్టాన్ని, ఆర్థిక నష్టాన్నీ, నిరుద్యోగాన్ని బాగా తగ్గుస్థాయిలో పట్టి నిలపడానికి రాష్ట్రాలు ప్రాధాన్యమివ్వవచ్చు. కొందరు నిపుణులు మే నెల మధ్యకల్లా కొవిడ్‌ వ్యాధి మళ్లీ విజృంభించవచ్చని, అప్పుడు తిరిగి లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉందని అంటున్నారు. అలాంటి పరిస్థితే వస్తే- ఈసారి ప్రభుత్వం ప్రజలకు మరింత వ్యవధి ఇవ్వాలి. వలస కార్మికులు పొలోమంటూ సొంత ఊళ్లకు పోటెత్తకుండా, ఎక్కడివారికి అక్కడే ఆశ్రయం, ఆహారాలను అందించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించి సిబ్బంది జీతభత్యాలకు భరోసా కల్పించాలి.

నైతికతే ఆలంబనగా!
రానున్న వారాల్లో భారతదేశం మరెన్నో ధర్మ సంకటాలను ఎదుర్కోవలసి రావచ్చు. ఉదాహరణకు ఏదైనా ఆస్పత్రిలో ఒకే ఒక ఐసీయూ పడక ఉందనుకుందాం. ఆస్పత్రికి 50 ఏళ్ల వయసు మీరిన కొవిడి రోగి, 20 ఏళ్ల యువ రోగీ వస్తే, ఆ పడకను ఎవరికి ఇవ్వాలనేది ఒక ధర్మ సంకటం. 50 ఏళ్ళ వ్యక్తికి ఎక్కువ నైపుణ్యాలు ఉంటాయి కాబట్టి సమాజానికి అతడి వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందనీ, అందువల్ల అతనికే ఐసీయూ పడక ఇవ్వాలని వాదించేవారు ఉంటారు. కానీ, ఇది కూడా విచక్షణ పాటించడం కిందకే వస్తుంది. నన్నే కనుక తీర్పు చెప్పమంటే మొదట వచ్చిన వ్యక్తికే ఐసీయూ పడక ఇవ్వాలంటాను, లేదంటే లాటరీ వేసి తేల్చాలంటాను. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తిని ఆరా తీయడంలో ప్రభుత్వానికి నిఘా యాప్‌లు, డేటా నెట్‌వర్క్‌లు తోడ్పడుతున్నాయి. కరోనా సంక్షోభం తొలగిన తరవాత ప్రభుత్వం ఈ వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తపడటమెలా అన్నది మరో ధర్మ సందేహం. ప్రభుత్వం మే 4న తీసుకోబోయే నిర్ణయం ధర్మబద్ధంగా, నైతిక విలువలకు అనుగుణంగా ఉండాలి.

Posted on 01-05-2020