Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

విశ్వవిద్యాలయాల వెనకబాటు

* కొవిడ్‌పై పరిశోధనల్లో ఉసూరు

కొవిడ్‌ తాకిడితో మన ఆరోగ్య వ్యవస్థ లోపాలు బట్టబయలయ్యాయి. కరోనాకు మందులు, వ్యాక్సిన్లు కనిపెట్టడానికి ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ముమ్మరంగా కృషి చేస్తుంటే, భారతీయ విశ్వవిద్యాలయాలు అదే ఊపుతో బరిలో దిగలేకపోవడం విచారకరం. మన విశ్వవిద్యాలయాల పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) పటిమ ఏపాటిదో దీన్నిబట్టి అవగతమవుతోంది. ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌, జాన్స్‌ హాప్కిన్స్‌, సింగ్‌ హువా వంటి విఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు కరోనాపై పరిశోధనలు చేస్తూ, వ్యాధి వ్యాప్తి గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయమైతే స్వయంగా కరోనా వ్యాక్సిన్‌ తయారుచేస్తోంది. త్వరలోనే దాన్ని ప్రపంచానికి అందించనున్నట్లు ప్రకటించింది. అదే భారతదేశంలో ఐఐటీలు, ఐఐఎస్‌సీ తప్ప మరే విద్యా సంస్థ లేక విశ్వవిద్యాలయం కరోనాపై పోరులో ఎటువంటి భాగస్వామ్యమూ తీసుకోవడం లేదు. వైద్య కళాశాలల పరిస్థితీ ఇంతే. ఇలాంటి ఉపద్రవ పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాలు సమన్వయంగా పరిశోధనలు జరిపి పరిష్కారం కనుగొంటాయనే ఆశ భారత్‌లో నెరవేరడం లేదు. గడచిన దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా (క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో) 500 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో చైనా వర్సిటీల సంఖ్య రెట్టింపయింది. భారతీయ విశ్వవిద్యాలయాల సంఖ్య చాలా స్వల్పంగా పెరిగింది. ప్రపంచంలో 10 అగ్రశ్రేణి పరిశోధనా సంచికలలో ప్రచురితమయ్యే భారతీయ పరిశోధనా పత్రాలు 15.8 శాతం మించవు. బ్రిటన్‌ నుంచి 37.3 శాతం, అమెరికా నుంచి 36.2 శాతం, జర్మనీ నుంచి 33.4 శాతం, చైనా నుంచి 27.6 శాతం చొప్పున పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కేవలం 1.3 శాతాన్ని శాస్త్ర, సాంకేతిక పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)పై ఖర్చుచేస్తున్నందువల్లనే మన పరిస్థితి ఇంత దిగనాసిగా ఉంది.

శాస్త్రవేత్తల నిర్విరామ కృషి
కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఫిబ్రవరి 11, 12 తేదీల్లో జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయంలో సమావేశమైన సందర్భంగా ప్రధానంగా రెండు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రమాదకరమైన వైరస్‌ల కట్టడికి వినూత్నరీతిలో పరిశోధనలు నిర్వహించాలనేది ఒకటైతే, అంతర్జాతీయ పరిశోధనా వేదికలకు దోహదపడే ప్రాథమ్యాలను గుర్తించాలనేది రెండోది. విశ్వవిద్యాలయాల పరిశోధక బృందాలు ప్రస్తుతం కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు పరిశోధనల్లో నిమగ్నమై ఉన్నాయి. హాంగ్‌కాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ‘అటానమస్‌ రోబో’లకు రూపకల్పన చేసింది. ఇవి వైరస్‌ ఉన్న ప్రాంతాలను 99.99శాతం వైరస్‌ రహితంగా మారుస్తాయి. పలు దేశాల విశ్వవిద్యాలయాల బృందాలు శక్తిమేరకు పరిశోధనల్లో పాలు పంచుకుంటున్నాయి. ఈ తరుణంలో భారత్‌లోని వర్సిటీలూ తమ శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. భారత్‌లో ఐఐటీలు 208 ప్రాజెక్టులతో కరోనాపై పోరులో అగ్రగాములుగా ఉన్నాయి. ఆరు ఐఐటీలు వ్యక్తిగత రక్షణ సాధనాల (పీపీఈ) రూపకల్పనకు 45 ప్రాజెక్టులు చేపట్టాయి. శుభ్రత (శానిటైజేషన్‌), చికిత్సలకు సంబంధించి 33 ప్రాజెక్టుల్లో నిమగ్నమై ఉన్నాయి. కృత్రిమ మేధ, టెస్టింగ్‌ కిట్లు, వైద్య ఉపకరణాలు, రోబోలు, నిఘా, డేటా ఎనలిటిక్స్‌ రంగాల్లోనూ ప్రాజెక్టులు రూపొందాయి. ఐసోలేషన్‌ వార్డులలో మందులు, ఆహారం పంచే రోబోలు, విశాల ప్రదేశాలను శానిటైజ్‌ చేసే డ్రోన్లు, కిరాణా సరకులను అతి నీలలోహిత కిరణాలతో క్రిమి రహితం చేసే కంటైనర్ల రూపకల్పనలో ఐఐటీలు నిమగ్నమయ్యాయి. ఐఐటీ దిల్లీ విద్యార్థులను, అధ్యాపకులను కొవిడ్‌ సంబంధ పరిశోధనలు చేయాల్సిందిగా ప్రోత్సహిస్తోంది. అందుకు నిధులు సమకూరుస్తోంది. ఐఐటీ మద్రాసు కూడా ఇదే పంథా అనుసరిస్తోంది. కరోనా కేసుల నిఘాకు వైడ్‌ యాంగిల్‌ కెమేరా రూపొందిస్తోంది. ఐఐటి దిల్లీ రూపొందించిన ప్రత్యామ్నాయ క్లినికల్‌ టెస్టింగ్‌ పద్ధతిని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ఆమోదించింది. ఈ పద్ధతిలో కచ్చితత్వం ఎక్కువ. శ్వాస, దగ్గు, మాటను బట్టి కొవిడ్‌ 19 వ్యాధిని నిర్ధారించే సాధనాన్ని బెంగుళూరులో ఐఐఎస్‌సీ రూపొందిస్తోంది. అది వైద్య సిబ్బందికి మరింత రక్షణ ఇచ్చి, మరింత కచ్చితమైన పరీక్షా ఫలితాలను ఇస్తుంది. ఐఐటీ మండి మూడు పరిశోధన ప్రాజెక్టులను, ఐఐటీ పాలక్కాడ్‌ 10 ప్రాజెక్టులను, ఐఐటీ గోవా ఒక ప్రాజెక్టును చేపట్టాయి.

వ్యాక్సిన్‌ ఉత్పత్తికి భారత్‌ చొరవ
ఎన్ని ప్రతికూలతలు ఉన్నా, భారత్‌ గట్టిగా తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదని అంతరిక్ష, రక్షణ రంగాల్లో సాధించిన విజయాలు నిరూపిస్తున్నాయి. కొవిడ్‌కు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ తయారుచేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇటీవల ప్రకటించారు. పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలసి సాధ్యమైనంత త్వరగా కొవిడ్‌ వ్యాధికి వ్యాక్సిన్‌ తయారుచేయడానికి సన్నద్ధమవుతోంది. దేశంలో ఇంకా 20 శాస్త్ర సాంకేతిక సంస్థలు వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

తక్షణం చేయాల్సిందేమిటి?
భారత రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) బహుళ పొరల మాస్కులు, బాడీ సూట్‌, వ్యక్తిగత రక్షణ పరికరం (పీపీఈ)గా ఉపకరించే బయోసూట్‌లు తయారుచేస్తోంది. వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, గాగుల్స్‌ టెస్ట్‌ కిట్లు, వైరల్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ మీడియాల రూపకల్పనలో నిమగ్నమైంది. పలువురు కొవిడ్‌ రోగులకు ఒకేసారి శ్వాసను అందించే వెంటిలేటర్‌ను డీఆర్డీఓ రూపొందిస్తోంది. అది త్వరలోనే అందుబాటులోకి రావచ్ఛు అయిదు పొరల ఎన్‌ 99 మాస్కునూ సంస్థ సృష్టిస్తోంది. అందులో రెండు పొరలు వైరస్‌ను నిరోధించే నానో మెష్‌తో తయారవుతాయి. వైద్యులు, సహాయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల కోసం బాడీ సూట్‌ నూ తయారుచేస్తోంది. రకరకాల వైరస్‌లు, అంటువ్యాధులను ఎదుర్కొన్న అనుభవంతో భారతదేశం కరోనాపై పోరాటంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించగల వీలుంది. చెన్నైలోని జాతీయ అంటువ్యాధుల నిరోధక సంస్థ, దిల్లీలోని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం, బెంగుళూరులోని అంటు వ్యాధుల పరిశోధన కేంద్రం, పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థలకు ప్రభుత్వం మరిన్ని అండదండలిచ్చి పరిశోధనలను ప్రోత్సహించాలి. ఇలాంటి సంస్థలతోపాటు దేశంలోని విశ్వవిద్యాలయాలూ నవీకరణ సాధనకు అంకితం కావాలి. కరోనా నిర్మూలనకు కేవలం వైద్య సంస్థలే పరిశోధనలు చేయాలని లేదు. విశ్వవిద్యాలయాలూ అందులో పాలు పంచుకోవచ్ఛు వివిధ విశ్వవిద్యాలయాలు వివిధ విభాగాలలో సమన్వయం నెరపవచ్ఛు తద్వారా కొవిడ్‌పై కలిసికట్టుగా విజయం సాధించాలి.

Posted on 05-05-2020