Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

‘గుర్తింపు’ లేని ఉన్నత విద్య

వెయ్యికి చేరువలో వివిధ విశ్వవిద్యాలయాలు, సుమారు 40వేల కళాశాలలు, ఇతరత్రా మరో పదకొండున్నర వేల సంస్థలతో... భారత ఉన్నత విద్యారంగం విస్తృతి, ఒక్కముక్కలో- చూపులకు ఏపు. నాణ్యతా ప్రమాణాల గతిరీతులు పరికించబోతే, అత్యధికం నేలబారు! పరిశోధనల పరంగా భారత్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నీ కలిపి లెక్కించినా కేంబ్రిడ్జ్‌ (బ్రిటన్‌) లేదా స్టాన్‌ఫోర్డ్‌(అమెరికా)కు సరితూగవన్న లోతైన విశ్లేషణలు, ఇక్కడ ఊడలు దించుకున్న అవ్యవస్థను కళ్లకు కడతాయి. జాతీయ ప్రమాణాల మదింపు, గుర్తింపు ప్రదాన మండలి (ఎన్‌ఏఏసీ- న్యాక్‌) తాజా అధ్యయన వివరాలు క్షేత్రస్థాయిలో దిగ్భ్రాంతకర యథార్థాలను ఆవిష్కరిస్తున్నాయి. బోధన స్థాయి, పరిశోధనల విస్తృతి, సిబ్బంది పనితీరు, విద్యాప్రమాణాల ప్రాతిపదికన దేశీయంగా వెనకబాటుతనానికి మూలాల్లో రుగ్మతలే కారణమని అవి ధ్రువీకరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 600 విశ్వవిద్యాలయాలు, 25వేల కళాశాలలు అక్రెడిటేషన్‌ (అధీకృత సంస్థలుగా గుర్తింపు) పొందనే లేదని ‘న్యాక్‌’ చెబుతోంది. పలు సాకులతో కొన్ని విద్యాసంస్థలు గుర్తింపు సాధన ప్రక్రియకు ముఖం చాటేశాయి. సర్వేలో పాల్గొంటే అధమస్థాయి శ్రేణిలో నిలిచి పరువు మాస్తామన్న వెరపుతో దూరంగా ఉండిపోయినవే 22 శాతం. కసరత్తులో పాలుపంచుకున్నవాటిలో ఎకాయెకి 72శాతం క్రమంగా పనితీరు మెరుగుపరచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామంటున్నాయి. తమిళనాడు వంటిచోట్ల రమారమి రెండున్నరవేల ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపు సాధించగలిగినవి ఎనిమిది వందలకు లోపు! మేలిమి విద్యాభ్యాసానికి, సృజనాత్మక పరిశోధనలకు వేదికలు కావాల్సినవి- ప్రమాణాల ఉన్నతీకరణను గాలికొదిలేసినా, సర్టిఫికెట్ల జారీని కొనసాగిస్తూనే ఉండటం... ప్రమాదకర పోకడల్ని ప్రస్ఫుటీకరిస్తోంది!

జాతి నిర్మాణంలో అత్యంత కీలక భూమిక పోషించాల్సిన ఉన్నత విద్యారంగం- పడకేసిన బోధన, పడిలేవని శోధనలకు నెలవుగా దిగులు పుట్టిస్తోంది. నిర్ధారిత ప్రమాణాలు కొరవడితే ‘న్యాక్‌’ నుంచి గుర్తింపు దక్కదు. గ్రామీణ భారతంలో మౌలిక వసతులకు, ఇ-లెర్నింగ్‌ తదితరాలకు కొరత కనీస ప్రమాణాల పట్ల అలసత్వానికి అద్దం పడుతోందన్న ‘న్యాక్‌’ ఫిర్యాదు సమస్య మూలాల్ని స్పృశించేదే. అక్రెడిటేషన్‌ నిమిత్తం నిర్ధారిత రుసుముగా దాదాపు మూడున్నర లక్షల రూపాయల నగదు, 18 శాతం జీఎస్‌టీ చెల్లించగల ఆర్థిక స్థోమత కరవైన ప్రభుత్వ కళాశాలల సంఖ్య దండిగానే ఉంది! రాష్ట్రాలవారీగా అనేక విశ్వవిద్యాలయాలు పాలక మండళ్లు లేక, వైస్‌ఛాన్సలర్ల ఖాళీలు భర్తీకాక, నిధుల ప్రవాహం ఎండిపోయి... సమస్యల కూపాల్ని తలపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో చోటుచేసుకోదలచిన ఏ సంస్థలైనా విశేష ప్రతిభా సంపన్నుల్ని బోధన సిబ్బందిగా నియమించుకోవాల్సిందేనన్న ఆక్స్‌ఫర్డ్‌ ఉద్బోధ శిరోధార్యమైనా- అందుకు దీటుగా వనరుల కేటాయింపులేవీ? సృజనాత్మక బోధనలో మేలిమి ప్రమాణాల పట్ల ప్రపంచంలోని పది మేటి విశ్వవిద్యాలయాలు కనబరచిన శ్రద్ధ- 800 మంది వరకు నోబెల్‌ విజేతల్ని తీర్చిదిద్దింది. అందుకు విరుద్ధంగా నియామకాలు, కేటాయింపులు, వనరుల పరికల్పనలో అలసత్వం మూలాన దేశీయంగా 90శాతం కళాశాలలు, 70 శాతం విశ్వవిద్యాలయాలు నాసి చదువులకు మారుపేరై నిరుద్యోగుల ఉత్పత్తి కర్మాగారాలుగా భ్రష్టుపడుతున్నాయి. అధీకృత సంస్థలుగా గుర్తింపు పొందడానికే కిందుమీదులవుతున్నవి అంతర్జాతీయంగా ఎలా పోటీపడగలుగుతాయి? ప్రాథమిక చదువులకు గట్టి పునాది ఏర్పరచి, ఉన్నత విద్య పరిపుష్టీకరణను అత్యవసర మానవ పెట్టుబడిగా పరిగణించి, అన్ని స్థాయుల్లో అత్యుత్తమ బోధన సిబ్బందిని సమకూర్చే విశిష్ట సంస్థనొకదాన్ని అవతరింపజేస్తేనే- పరిస్థితి పోనుపోను తేటపడుతుంది!

Posted on 06-05-2020