Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సమగ్ర వ్యూహంతో సమరభేరి

* కొవిడ్‌ పై మోదీ హోరాహోరీ

భారతదేశంలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాని రోజుల్లోనే ఆ మహమ్మారి వలల ముప్పును ముందే పసిగట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుంది. డిసెంబరులో చైనాలో కరోనా కలవరం మొదలైనప్పుడే అది మన గడప కూడా దాటనుందని ఆయన గుర్తించారు. మన దేశంలో మొట్టమొదటి కేసు జనవరి 30న నమోదైంది. అంతకుముందు నుంచే ఆయన ప్రతీ మంత్రివర్గ సమావేశంలో కరోనా వైరస్‌ కేవలం చైనాకు పరిమితం కాబోదని, దాన్ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చారు. తదనుగుణంగా మొదట విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయడం మొదలుపెట్టి, తరవాత క్రమంగా పరీక్షలను విస్తృతం చేయనారంభించాం. రైలు, విమాన ప్రయాణాలను రద్దు చేశాం. కరోనా అనుమానితులను మనేసర్‌లో విదేశాంగశాఖ ఏర్పాటుచేసిన శిబిరంలో క్వారంటైన్‌ చేశాం.

సర్వసన్నద్ధం
భారత ప్రభుత్వం కరోనా తీవ్రతను గ్రహించి దాన్ని ఎదుర్కోవడానికి పకడ్బందీగా చర్యలు తీసుకోసాగింది. మొదట్లో మన దేశంలో కొవిడ్‌ 19 చికిత్సకు ప్రత్యేకించిన ఆస్పత్రులటూ ఏవీ ఉండేవి కావు. కానీ, ఇప్పుడు దేశమంతటా 700 ప్రత్యేక కొవిడ్‌ ఆస్పత్రులు, రెండు లక్షల పైచిలుకు ఐసొలేషన్‌ పడకలు, 15 వేల ఐసీయూ పడకలను సిద్ధం చేసుకున్నాం. కరోనా రోగులకు చికిత్స చేసే వైద్యులు, వైద్య సిబ్బందికి వైరస్‌ సోకకుండా అడ్డుకునే వ్యక్తిగత రక్షణ దుస్తులు (పీపీఈ) ఉత్పత్తిచేసే కర్మాగారాలేవీ లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వచ్చేది. కానీ, ఇప్పుడు పీపీఈల తయారీలో 39 కర్మాగారాలు తలమునకలుగా ఉన్నాయి. ఇప్పటికే 22 లక్షల పీపీఈ కిట్ల పంపిణీ కూడా జరిగిపోయింది. కొవిడ్‌కు ముందు ఎన్‌95తో సహా ఎటువంటి మాస్కులూ భారత్‌లో తయారయ్యేవి కావు. ఇప్పుడు 60 లక్ష మాస్కుల తయారీ, పంపిణీ జరిగిపోయాయి. నేడు ఎన్‌95తో సహా పలు రకాల మాస్కుల తయారీకి కొత్త ఫ్యాక్టరీలు వెలిశాయి. అనేక చిన్న యూనిట్లతోపాటు కుటుంబాలూ మాస్కులు తయారుచేస్తున్నాయి. గతంలో దేశమంతటికీ పుణెలో ఒకే ఒక్క వైరాలజీ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఉండేది. అక్కడ రోజుకు 4,000 కరోనా పరీక్షలు మాత్రమే చేయగలిగేవాళ్లం. ఇప్పుడు ఏకంగా 300 ల్యాబ్‌లు ఏర్పడి రోజుకు 80 వేల పరీక్షలు చేసే స్థాయిని అందుకున్నాం. కొవిడ్‌ వ్యాప్తికి ముందు దేశంలో ఉన్న వెంటిలేటర్లు కేవలం 8,400. ఇప్పుడవి 30 వేలకు మించిపోయాయి. మన కర్మాగారాలు మరో 30 వేల వెంటిలేటర్లను తయారుచేసే స్థితికి చేరాయి. ఇదంతా ప్రధాని మోదీ తీసుకున్న చొరవతోనే సాధ్యమైంది. ఒకవైపు దేశాన్ని సమర సన్నద్ధం చేస్తూనే, రెండోవైపు ఇతర దేశాల అధినేతలతో మాట్లాడుతూ పరస్పరం అనుభవాలను పంచుకున్నారు. ఇతరుల కార్యాచరణలో భారత్‌కు పనికొచ్చే అంశాలను అందిపుచ్చుకొని ఇక్కడ అమలు చేశారు.

కొవిడ్‌పై పోరుకు ఉద్యోగులను ఆర్థికంగా సన్నద్ధులను చేయడానికి భవిష్య నిధి ఖాతాల నుంచి కొంత నగదు ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఫలితంగా తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు రూ.36 కోట్లు ఉపసంహరించుకోవడం వీలైంది. చిన్న వ్యాపార సంస్థల యాజమాన్యాలు, కార్మికుల తరఫున మూడు నెలలపాటు భవిష్య నిధి మొత్తాలను ప్రభుత్వమే జమ చేస్తుందని మోదీజీ వాగ్దానం చేశారు. రిజర్వు బ్యాంకు రెపో రేట్లు తగ్గించి ఆర్థిక వ్యవస్థలోకి అదనంగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు విడుదలయ్యేలా చూసింది. మధ్యతరగతివారి రుణ కిస్తీల చెల్లింపును మూడు నెలలపాటు వాయిదా వేసే సౌలభ్యం కల్పించింది.

ఆర్థిక చేయూత
కేంద్ర ప్రభుత్వం కేవలం కొవిడ్‌ చికిత్స కోసం రూ.15 వేలకోట్లు విడుదల చేసింది. రాష్ట్రాల ఉపద్రవ నియంత్రణ నిధికి రూ. 11 వేల కోట్లు విడుదల చేసింది. కేంద్రం భవన నిర్మాణ కూలీల కోసం రూ.31 వేలకోట్లు విడుదల చేసి, ఆ సొమ్మును వేగంగా పంపిణీ చేయాల్సిందిగా రాష్ట్రాలను కోరింది. పొలం నుంచి మార్కెట్‌కు వ్యవసాయోత్పత్తులు సులువుగా చేరేలా ఏర్పాట్లు చేశారు. రైతులకు నిధులు వేగంగా అందించి, పంటలు విరగపండటానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సాయపడుతున్నారు. కరోనా వల్ల వ్యవసాయం దెబ్బతినకుండా మోదీజీ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ప్రజల మనఃపూర్వక మద్దతు లేనిదే లాక్‌ డౌన్‌ విజయవంతం కావడం కష్టం. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా ప్రజలతో మనసువిప్పి మాట్లాడుతూ వారి స్వచ్ఛంద సహకారం కోరుతున్నారు. నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నానని భరోసా ఇస్తున్నారు. సుదీర్ఘ లాక్‌ డౌన్‌ వల్ల వచ్చిపడే కష్టనష్టాలకు వారిని మానసికంగా సన్నద్ధుల్ని చేయడం వల్ల మార్చి 22న జనతా కర్ఫ్యూను 99 శాతం ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు. మోదీజీ పిలుపు మేరకు ప్రజలు ఆ రోజు సాయంత్రం చప్పట్లు తాళాలు కొట్టి శంఖారావాలు చేసి కొవిడ్‌పై పోరాడే వైద్య సిబ్బందిని ఉత్సాహపరచారు. దీంతో ప్రజలు కొవిడ్‌పై సమైక్యంగా క్రమశిక్షణాయుతంగా పోరాడటానికి రంగం సిద్ధమైంది.

ప్రజలు ఈ పోరాటంలో అనుసరించాల్సిన నాలుగు అంచెల వ్యూహాన్ని మోదీజీ వారికి బోధించారు. అవి- ముఖానికి మాస్క్‌ ధరించడం, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం, బయటికొస్తే భౌతిక దూరం పాటించడం, ఎంతో అవసరమైతే తప్ప ఇంటి గడప దాటకపోవడం. వీటిని పాటించడం ద్వారా ప్రజలు క్రమంగా కొవిడ్‌పై పోరుకు కావలసిన లక్షణాలను, అలవాట్లను అలవరచుకున్నారు. తమ ప్రవర్తనలో తగు మార్పులు చేసుకున్నారు. ఆపైన ప్రధాని మోదీ ఒక రాత్రి 9 గంటలకు 9 నిమిషాల సేపు దీపాలు వెలిగించాలని కోరిన మీదట దేశమంతా ఉత్సాహంగా ఆ పని చేసింది. ఇల్లూవాకిళ్లూ లేనివారు, మురికివాడ వాసులు కూడా దీపాలు వెలిగించడం కనిపించింది. మోదీజీ తమ భద్రత కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నారు కాబట్టి ఆయన పిలుపును ఈ విధంగా పాటిస్తున్నామని వారు చెప్పారు. మే మూడో తేదీన విమానాలు, నౌకల నుంచి వైద్యులపై పూలవర్షం కురిపించడం ద్వారా దేశమంతటినీ ఉత్తేజపరచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి నుంచీ కొవిడ్‌పై పోరుకు పటిష్ఠ వ్యూహం రూపొందించుకుని, దాన్ని అంచెలచెలుగా అమలు చేస్తూ, అడుగడుగునా ప్రజలను కలుపుకొని ముందుకెళ్లారు. ప్రపంచంతో, ప్రజానీకంతో ఎప్పటికప్పుడు సంభాషిస్తూ కరోనా వైరస్‌ను అన్ని వైపుల నుంచి ముట్టడిస్తూ కొవిడ్‌ కట్టడికి సంపూర్ణ పోరాటం జరుపుతున్నారు.

పేదలకు అండగా...
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌ డౌన్‌ విధించక తప్పదని గ్రహించిన మోదీజీ పేదల కోసం రూ.1.70 లక్షల కోట్ల సహాయక ప్యాకేజీ ప్రకటించారు. 80 కోట్ల మంది పేద భారతీయులకు కిలో రెండు, మూడు రూపాయల ధరకు అయిదు కిలోల గోధుమ లేక బియ్యం అందించారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు 15 కిలోల బియ్యం లేదా గోధుమ, మూడు కిలోల పప్పు ఉచితంగా పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు ఈ విధంగా కనీస ఆహార భద్రత కల్పించారు. అల్పాదాయ వర్గాలకు చెందిన 20 కోట్లమంది మహిళల జన్‌ ధన్‌ ఖాతాల్లో రాబోయే మూడు నెలల కోసం నెలకు రూ.500 చొప్పున జమ చేశారు. ఇంకా 8.4 కోట్లమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.2,000 చొప్పున వేశారు. ఉజ్వల వంటగ్యాస్‌ పథకం కిందకు వచ్చే ఎనిమిది కోట్లమంది లబ్ధిదారులకు ఉచితంగా మూడు సిలిండర్లు అందించారు.

Posted on 07-05-2020