Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ఇంటి నుంచే హలో డాక్టర్‌...

* టెలీ వైద్యానికి పెరిగిన ఆదరణ

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆరోగ్య వ్యవస్థలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. లాక్‌డౌన్‌ వల్ల ప్రజలంతా గృహాలకు పరిమితమయ్యారు. తమకున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు, స్వల్ప రుగ్మతలకు ఆస్పత్రులకు వెళ్ళలేకపోవడంతో ప్రత్యామ్నాయ చికిత్సా మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ప్రజలకు, ప్రభుత్వాలకు తలెత్తింది. అమెరికాలో ఒక్క మార్చిలోనే ఆస్పత్రులకు వెళ్లే రోగుల సంఖ్య 50 శాతానికి పడిపోయినట్లు అక్కడి గణాంకాలు సూచిస్తున్నాయి. వీరికి చరవాణి సహాయంతో అందించే చికిత్స ఎంతగానో ఉపయోగపడింది. 2019లో (కరోనాకు ముందు) ఈ టెలిఫోన్‌ వైద్యంపై ఆధారపడినవారు బహు స్వల్పం. ఈ ఏడాది వీరి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. త్వరలోనే టెలీ వైద్యం ద్వారా చికిత్స పొందేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు దాటవచ్చని అంచనా. యూనివర్సిటీ హాస్పిటల్‌ జూరిచ్‌ (స్విట్జర్లాండ్‌)లో టెలీవైద్యం ద్వారా 1999 నుంచి 2018 వరకు 59,360 మంది చికిత్స పొందుతూ వచ్చారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే వీరి సంఖ్య అమితంగా పెరిగిందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

బహుముఖ ప్రయోజనాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రతిపాదనల మేరకు టెలీ వైద్యం ద్వారా ప్రజలు తమ ఆరోగ్యం గురించి దూరాన ఉన్న వైద్యులతో సంప్రతించవచ్చు. వ్యాధి నిర్ధారణ, సలహాలు, సూచనలు, జాగ్రత్తల వంటి సేవలను వాటి ద్వారా పొందవచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెంపుదలకు ఆహార నియమావళి, వ్యాయామ పద్ధతులపైనా సలహాలు స్వీకరించవచ్చు. ఇది ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. డబ్బు, సమయం ఆదా అవుతాయి. కనుక భవిష్యత్తులో టెలీ వైద్యానికి ప్రజాదరణ లభించగలదని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ విధానం స్త్రీలు, వృద్ధులు, దివ్యాంగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సంతాన సాఫలయం, బాహాటంగా తమ ఇబ్బందులు చెప్పడానికి బిడియపడేలా చేసే వ్యాధులు (లైంగిక సమస్యలు, చర్మ, సుఖవ్యాధులు, జననేంద్రియాల సమస్యలు, ఊబకాయం, మానసిక రుగ్మతలు వంటివి) ఉన్నవారు టెలీవైద్యం పట్ల ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. పదేళ్ల వ్యవధిలో అంతర్జాలం, బ్రాడ్‌బ్యాండ్‌, వీడియో అనుసంధానం వంటి సమాచార సాంకేతిక వ్యవస్థలు ఎంతో వేగవంతం కావడం టెలీ వైద్యానికి ఆయువుపట్టుగా మారింది. ప్రజా రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో నివసించేవారికి ఈ విధానం వరమవుతుంది.

టెలీ వైద్యం తొలి అడుగులు మనదేశంలో 2001లోనే పడ్డాయి. అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సహకారంతో ఈ చరవాణి వైద్యాన్ని ఓ కార్పొరేట్‌ వైద్యసంస్థ అప్పట్లోనే ప్రారంభించింది. చిత్తూరుకు 20 కిలోమీటర్ల దూరంలోని అరగొండ గ్రామంలో తొలిసారి ఈ విధానాన్ని అమలుపరచారు. ఆపై ఈశాన్య రాష్ట్రాల్లోని 45 కుగ్రామాలకు ఈ వైద్యసేవలను విస్తరించారు. 135 కోట్ల జనాభాగల దేశంలో 70 శాతం ప్రజలు పల్లెలు, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కేవలం 30 శాతం పట్టణాలు, నగరాల్లో ఉన్నారు. కానీ, పట్టణ నగరాల్లోనే 80 శాతం వైద్యులు, వైద్యశాలలు ఉండటం గమనార్హం. నిర్దిష్ట విధానం, చట్టభద్రత కొరవడటం వల్ల కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల వైద్యమండళ్లు టెలీ వైద్యాన్ని వ్యతిరేకించాయి. రెండు దశాబ్దాల పాటు తాబేలు నడకను తలపించిన టెలీవైద్య విస్తృతి, లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల వ్యవధిలోనే విపరీతమైన ప్రజాదరణకు నోచుకుంది. దాంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 25న టెలీ వైద్యం మార్గదర్శకాలను ప్రకటించి, చట్టభద్రత కల్పించింది. తాజా పరిణామాల వల్ల పలు ప్రైవేట్‌ ఆరోగ్య బీమా సంస్థలు, వైద్యానంతరం ఖర్చులు తిరిగి చెల్లించే సంస్థలు ముందుకొస్తున్నాయి.

నాణానికి మరోవైపు...
కొందరు వైద్యనిపుణులు మాత్రం టెలీ వైద్య విధానాన్ని తప్పుపడుతున్నారు. ఇది సంప్రదాయ అల్లోపతీ వైద్య విధానం కాదని వాదిస్తున్నారు. భౌతికంగా రోగిని చూడకుండా, తాకకుండా, చేతితో, స్టెతస్కోపుతో పరీక్షించకుండా రోగ నిర్ధారణ చేయడం, మందులు సూచించి సలహాలు ఇవ్వడం శాస్త్రీయం కాదని చెబుతున్నారు. వీటివల్ల రోగికి, వైద్యుడికి తగిన భద్రత ఉండదంటున్నారు. రోగి సమాచారం గోప్యంగా ఉంచడం, నిక్షిప్తం చేయడం కష్టమంటున్నారు. విధాన దుర్వినియోగం, వైద్యంలో జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు. అత్యవసర కేసులకు చికిత్స అందించే క్రమంలో అనర్థాలు జరిగే అవకాశాలు అధికంగా ఉండటంవల్ల టెలీ వైద్యాన్ని విమర్శకులు ‘తిరోగమనం వైపు పడుతున్న ముందడుగు’గా చెబుతున్నారు. సంప్రదాయ వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా అల్లోపతీ వైద్య విధానం గతి తప్పకుండా చూడాలి. నియమ, నిబంధనలను పటిష్ఠంగా అమలుపరచాలి. ఇది కొత్త విధానం కనుక గాడిన పడే వరకు క్షుణ్నంగా పరిశీలిస్తూ నిరంతర సమీక్షలు జరుపుతుండాలి. లోపాలను గుర్తించి ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడుతుండాలి.

- డాక్టర్‌ శివప్రసాద్‌
(రచయిత- ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్‌)
Posted on 07-05-2020