Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సమరస భావమే భారత్‌ బలం

ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరిగిన ప్రపంచకప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో భారత జట్టు కనుక పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోయినట్లయితే నిరుత్సాహంతో భారతీయులు తీవ్ర విచారంలో మునిగిపోయేవారు. కానీ, ప్రేక్షకులతో కొట్లాటకు దిగేవారు కారు. కరాచీ సహా పాకిస్థాన్‌లోని అనేక ఇతర ప్రాంతాల్లో కొంతమంది పాక్‌ క్రీడాభిమానులు టీవీ సెట్లను పగులకొట్టారు. భారత్‌లో పరిస్థితి ఇందుకు కొంత విరుద్ధం. తమ జట్టు పాక్‌ చేతిలో ఓడిపోతే అవమానభారంతో కుంగిపోయినా- వీధులకెక్కి నిరసన ప్రదర్శనలు చేయడం, గొడవలకు దిగడం వంటివాటికి భారతీయులు దూరంగా ఉంటారు. భారతీయ సమాజం ఇలాంటి వాటన్నింటికీ అతీతంగా ఎంతో ఎదిగిపోయిందని చెప్పలేం కానీ, ఇతరుల పట్ల సహన గుణాన్ని, ఇచ్చిపుచ్చుకొనే లక్షణాన్ని ఖాయంగా అలవరచుకొంది. బహుళ సంస్కృతుల నిలయమైన భారతదేశం ఇతర సంస్కృతులతో సహజీవనాన్ని జీవన ధర్మంగా మలచుకొంది. ప్రపంచంలో ఇండొనేసియా తరవాత అత్యధిక ముస్లిం జనాభా ఉన్నది భారతదేశంలోనే. అందువల్ల అన్ని వర్గాలు చేయీచేయీ కలిపి ముందడుగు వేస్తేనే ప్రగతిపథంలో దూసుకు వెళ్లగలమని భారతీయ సమాజం గ్రహించింది. అత్యధిక సంఖ్యాకులైన హిందువులు ఈ వాస్తవాన్ని గుర్తించి, ఇతర మతవర్గాలతో శాంతియుత సహజీవనం చేస్తున్నారు.

దురదృష్టవశాత్తూ హిందూ సమాజంలో ఈమధ్య తీవ్రవాద దృక్పథం కలిగినవారి సంఖ్య పెరుగుతోంది. వారు ఈ దేశాన్ని హిందుస్థాన్‌గా మార్చాలనుకొంటున్నారు. హిందూ రాష్ట్ర స్థాపనే లక్ష్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌.ఎస్‌.ఎస్‌.) పనిచేస్తున్నా, ఈ సంస్థ సంకుచిత దృక్పథాన్ని అత్యధిక హిందువులు తోసిపుచ్చుతున్నారు. కాషాయీకరణను భారత ప్రజలు ఆమోదించరని ఆర్‌.ఎస్‌.ఎస్‌. రాజకీయ పార్శ్వమైన భారతీయ జనతాపార్టీ(భాజపా) గుర్తించినట్లుంది. అందుకే, అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. హిందుత్వపట్ల అనురక్తిని భాజపా ప్రస్తుతానికి పక్కనపెట్టి ఉండవచ్చు కూడా. మొత్తంమీద మతతత్వ పంథా ఎదురు తన్నుతోందని ఆ పార్టీ గ్రహించినట్లుంది.

మౌనం వీడిన మోదీ

ఇటీవల దేశంలో జరిగిన కొన్ని మతపర ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎట్టకేలకు మౌనం వీడింది ఈ గ్రహింపుతోనే కావచ్చు. దిల్లీలో క్రైస్తవులు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మోదీ, 'నా ప్రభుత్వం అందరికీ మతపరంగా పూర్తి స్వేచ్ఛ ఇస్తుంది. ప్రతి వ్యక్తికీ ఎటువంటి నిర్బంధం, అనుచిత ప్రభావాలు లేకుండా తనకు నచ్చిన మతంలో కొనసాగడానికి లేదా చేరడానికి తిరుగులేని హక్కు ఉంది. ఇతర మతవర్గాలపై ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఏ మతవర్గాన్నీ నా ప్రభుత్వం అనుమతించదు. అన్ని మతాలకూ సమాన గౌరవం ఇస్తాం' అని ఉద్ఘాటించారు. ఇటీవల కొన్ని చర్చిలపై దాడులు జరగడాన్ని ఉద్దేశించి మోదీ ఈవిధంగా మాట్లాడినట్లుంది.

మోదీకి లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ తన పార్టీ అజెండా విషయంలో సంయమనం పాటించారు. ఉమ్మడి పౌరస్మృతి, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న 370వ రాజ్యాంగ అధికరణ రద్దు వంటి వివాదగ్రస్త అంశాలు భాజపా అజెండాలో ఉన్న సంగతి తెలిసిందే. మోదీ ఉన్నట్టుండి లౌకికవాదిగా మారారని అనుకోలేం. కానీ, భారతీయ సమాజం భిన్నత్వంలో ఏకత్వ పంథాకు కట్టుబడి ఉందని ఆయన తెలుసుకొని ఉండాలి. కానీ, 'రామజన్మభూమి, సేతుసముద్రం జాతీయ సమస్యలు. సంఘ్‌ పరివార్‌ లక్ష్యాలను స్పష్టం చేయడానికి ఇటువంటి సమస్యలు మరిన్ని లేవనెత్తుతాం' అని ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ ప్రకటించడం ఆందోళనకరం. భారతదేశాన్ని మతరాజ్యంగా మార్చడం అసాధ్యమని భగవత్‌, సంఘ్‌పరివార్‌ గుర్తించాలి. మతరాజ్య భావన భారతీయుల నిజప్రవృత్తికి విరుద్ధం.

పాకిస్థాన్‌ మత ప్రాతిపదికన ఏర్పడిన దేశమే అయినా, అది రానురానూ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దేశ విభజన పర్యవసానంగా పాకిస్థాన్‌ ఏర్పడిన తరవాత పాక్‌ జాతిపిత మహమ్మదాలీ జిన్నా తమ దేశంలో మతాన్ని, రాజ్యవ్యవస్థను కలగలపబోమని ప్రకటించారు. వాస్తవానికి జరుగుతోంది అందుకు పూర్తి విరుద్ధం. నేడు పాకిస్థాన్‌ జనాభాలో మైనారిటీలు అయిదు శాతానికి లోపే ఉంటారు. వారు ఎక్కువ సంఖ్యలో కేంద్రీకృతమైన సింధ్‌లో మైనారిటీ వర్గాల మహిళలను పెళ్లి పేరిట బలవంతంగా మతం మార్చుకునేట్లు చేస్తున్నారు. పాకిస్థాన్‌లో మతోన్మాదుల దాడికి గురికాని హిందూ ఆలయం ఒక్కటి కూడా లేదు.

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం మతపరమైన స్వేచ్ఛను కాపాడలేకపోవడంవల్ల 2014లో మతపరమైన మైనారిటీలపై దాడులు పెచ్చరిల్లాయని న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల నిఘా సంస్థ(హెచ్‌.ఆర్‌.డబ్ల్యు.) వెల్లడించింది. పాకిస్థాన్‌కు 2014 సంక్షోభ సంవత్సరమని, ఆ ఏడాది మత శాఖల మీద విశృంఖలంగా దాడులు జరిగాయని, ఉత్తర వజీరిస్థాన్‌లో సైనిక కార్యకలాపాలవల్ల పది లక్షల మందికి పైగా ప్రజలు నిర్వాసితులయ్యారని హెచ్‌.ఆర్‌.డబ్ల్యు. తెలిపింది. 'పౌరులకు రక్షణ కల్పించి, న్యాయపాలనను నిర్వహించడమనే మౌలికవిధిని పాకిస్థాన్‌ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. మతపరమైన మైనారిటీ వర్గాల మీద 2014లో తీవ్రవాదుల దాడులు, అణచివేత పేట్రేగిపోయినా వాటిని అరికట్టలేకపోయింది' అని హెచ్‌.ఆర్‌.డబ్ల్యు. ఆసియా విభాగం ఉప సంచాలకులు ఫెలిమ్‌ కైన్‌పేర్కొన్నారు.

జనచైతన్యమే రక్ష

భారతదేశంలో కూడా పలు మసీదులపై దాడులు జరగకపోలేదు. అయితే, వాటి గురించి సమాచార సాధనాల్లో వార్తలు వస్తాయి. ఇటువంటి హేయమైన చర్యలు జరుగుతున్నందుకు సమాజాన్ని, ప్రభుత్వాన్ని ఉదారవాదులు తప్పుపడతారు. పాకిస్థాన్‌లో ఇలాంటి ఖండనమండనలు విననే వినం. ఏది ఏమైనా భారత్‌, పాకిస్థాన్‌లు విభేదాలు పరిష్కరించుకోనంతవరకు రెండు దేశాల్లో మైనారిటీలు దాడులకు గురవుతూనే ఉంటారు. ఉభయుల మధ్య శత్రుత్వాన్ని తగ్గించుకోవాలన్న స్పృహ కొరవడటం శోచనీయం. ఈ విషయంలో పాక్‌ తప్పు చాలా ఉంది. ఆ దేశంలో పాఠ్యగ్రంథాలను సైతం మార్చివేసి, చరిత్రను వక్రీకరించి, బాల్యం నుంచే హిందువుల పట్ల, భారతదేశం పట్ల వ్యతిరేకతను నూరిపోస్తున్నారు. పాకిస్థాన్‌ విద్యార్థులకు అసత్యాలు, అర్ధసత్యాలు బోధిస్తూ విద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారు. భారతదేశంలో ఇలాంటి వక్రీకరణలకు ఇంతవరకు తావు లేదు. కానీ, చరిత్ర కాషాయీకరణ ప్రయత్నాల పట్ల అందరూ అప్రమత్తంగా మెలగాలి. కులమత భేదాలను రెచ్చగొట్టేవారిని ఓటర్లు వ్యతిరేకిస్తారని దిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘనవిజయం విస్పష్టంగా చాటింది. దేశమంతటా ఇలాంటి చైతన్యం పెరగాల్సి ఉంది. భారత్‌, పాకిస్థాన్‌లు ఎంత త్వరగా తమ విభేదాలను పరిష్కరించుకుంటే మైనారిటీలకు అంత మంచిది.

క్రికెట్‌ ఆట ఎంతో నైపుణ్యం అవసరమైన క్రీడే కానీ, మ్యాచ్‌ జరిగే రోజున సత్తా చాటే జట్టుకే విజయం సిద్ధిస్తుంది. కావాలంటే, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌ జట్టును పసికూన ఐర్లాండ్‌ చిత్తుగా ఓడించిన వైనాన్ని చూడండి. ఇక్కడ నేర్వాల్సిన పాఠమేమంటే- క్రికెట్‌ ఆడేటప్పుడు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి తప్ప రెండు దేశాల మధ్య ఉన్న ఇతర సమస్యలతో ఆటను ముడిపెట్టి చూడకూడదు. క్రీడాకారులకు ఈ విషయం తెలిసినా, ప్రేక్షకులకు తెలిసినట్లు లేదు!

(రచయిత - ఎస్‌.దీపాంకర్‌ )
Posted on 19-02-2015