Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

నీటి నిర్వహణకు నిధుల కటకట

వర్షపాత రూపంలో సకల జీవులకు ప్రకృతి ఉచితంగా అందించే కానుకే నీరు. కనుక, దానికి వెలకట్టకుండా ప్రజలకు ఉచితంగా అందించాలన్నది కొందరు సామాజిక శాస్త్రవేత్తల భావన. తాగడానికి, సేద్యానికి, ఇతర అవసరాలకు వాన నీటిని నేరుగా ఉపయోగించుకున్నప్పుడు దాన్ని సామాజిక వినిమయ వస్తువుగా కాకుండా ఆర్థిక వస్తువుగా భావించడం, వెల కట్టి వినియోగదారుల నుంచి రుసుము వసూలుచేయడం న్యాయం కాదన్నది వారి వాదన. కానీ, నదులపై డ్యాములు, బ్యారేజీలు నిర్మించి, జలాశయాల్లో వాననీటిని ప్రభుత్వం నిల్వచేస్తోంది. కాలువలు, అనేక కట్టడాలు నిర్మించి పంట చేలకు నీరు అందజేస్తోంది. అందుకోసం పెద్దయెత్తున నిధులు వెచ్చిస్తోంది. తాగునీటి కోసం పట్టణాలు, గ్రామాల్లో నీటి పంపిణీ పథకాలు చేపడుతోంది. పంపుల ద్వారా తాగునీటిని ఇంటింటికి అందజేస్తోంది. డబ్బు ఖర్చయ్యే ఇలాంటి వ్యవస్థలన్నింటినీ ఆర్థిక వ్యవస్థలుగా పరిగణించి కొంత సొమ్ము (నీటి తీరువా) ప్రజలనుంచి వసూలుచేయాల్సి ఉంటుంది. తాగడానికి గాని, వ్యవసాయ, పారిశ్రామికావసరాలకు గాని సరఫరా చేసే నీటిని విద్యుత్‌ సరఫరా మాదిరిగా మీటర్లతో కొలిచి, హేతుబద్ధమైన ధర నిర్ణయించి వినియోగదారుల నుంచి వసూలుచేయనట్లయితే, అది వృథా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

సూచనలు... సిఫార్సులు
బ్రిటిష్‌ పాలనలో మనదేశంలోని సాగునీటి వ్యవస్థలను వాణిజ్య సంస్థలుగా పరిగణించి, పెట్టిన పెట్టుబడిపై తగిన ఆదాయాన్ని సమకూర్చిపెట్టే పనులనే చేపట్టేవారు. సాగునీటి వ్యవస్థలు పెట్టుబడితోపాటు, దానిపై వడ్డీని కూడా నిర్థారిత సమయంలో రాబట్టాలని భావించేవారు. కాలక్రమంలో వాటిపై రాబడి రేటు మారుతూ వచ్చింది. 1919 వరకు ఆ రేటు పెట్టుబడిపై నాలుగు శాతం. 1919-21 మధ్య అది అయిదు శాతంగా ఉంది. తరవాత 1949 వరకు ఆరు శాతంగా ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రభుత్వ వైఖరిలో సమూలమైన మార్పు వచ్చింది. సాగునీటి వ్యవస్థలను వాణిజ్య సంస్థలుగా కాకుండా, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలుగా ప్రభుత్వం భావించసాగింది. అందుకు తగిన విధంగా సాగునీటి వ్యవస్థల నుంచి రాబడిని ఆరు నుంచి 3.75 శాతానికి తగ్గించారు. 1949 ఏప్రిల్‌ ఒకటి నుంచి ఆ విధానాన్ని అమలులోకి తెచ్చారు. సాగునీటి పథకాలను ఆదాయ సముపార్జన కోసం కాకుండా సామాజిక సంక్షేమ దృష్టితో చేపట్టి, సాగునీటి రేట్లను తక్కువగా ఉండేటట్లు చూడాలని 1972లో రెండో సాగునీటి సంఘం సిఫార్సు చేసింది. నీటిరేట్లు సాగునీటి వ్యవస్థ నిర్వహణ, మరమ్మతులకు కూడా చాలినంతగా లేవని, అవి అవసరాల మేర ఉండేలా చూడాలని సాగునీటి, జలవనరుల మంత్రుల జాతీయ సదస్సు 1986లో అభిప్రాయపడింది. నీటిరేట్లు సాగునీటి వ్యవస్థ నిర్వహణ మరమ్మతులకు చాలినంతగా ఉండి, నీటిని పొదుపుగా వాడేలా వినియోగదారులను ప్రేరేపించే విధంగా ఉండాలని 1987లో ఆమోదించిన జాతీయ జలవిధానంలో సిఫార్సు చేశారు. సకాలంలో నమ్మకంగా సాగునీటిని అందిస్తూ కాలక్రమంలో గమ్యాన్ని చేరడానికి అన్ని ప్రయత్నాలు చేయాలనీ అందులో స్పష్టీకరించారు. పెట్టుబడిపై రాబడి 2.5 శాతంగా ఉండాలని అయిదో ఆర్థిక సంఘం సూచించగా, ఆరు, ఏడో ఆర్థిక సంఘాలు ఒక్క శాతంగా ఉండాలని సిఫార్సు చేశాయి. సాగునీటిపై కనీస రాబడి సాగునీటి వ్యవస్థ నిర్వహణకు సరిపడా ఉండాలని ఎనిమిదో ఆర్థిక సంఘం సైతం అభిప్రాయపడింది. సాగునీటి వ్యవస్థ ఆర్థిక పరిస్థితిని గ్రహించిన తొమ్మిదో ఆర్థిక సంఘం, చివరకు ఎనిమిదో ఆర్థిక సంఘ సిఫార్సులనే బలపరచింది. ఈ సిఫార్సులను అమలుచేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం విముఖత ప్రదర్శిస్తూ వచ్చాయి.
ప్రభుత్వం సాగునీటి విలువ మదింపుపై 1991 అక్టోబరులో వైద్యనాథన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. అందుబాటులో ఉన్న సాగునీటిని సైతం పూర్తిస్థాయిలో వినియోగించుకొనకపోవడం, ఆశించిన తక్కువగా వినియోగించటం, ఆశించిన ఉత్పాదకత లేకపోవడం, సాగునీటి పథకాలపై వరస నష్టాల వంటి వివిధ అంశాలపై అది విస్తృత స్థాయి చర్చ రేకెత్తించింది. ప్రజా సాగునీటివ్యవస్థల నుంచి వచ్చే రాబడి, వాటి కార్యాచరణ, పోషణ ఖర్చులకు కూడా చాలడంలేదన్న అభిప్రాయం అప్పటికే బలపడింది. కాలువల పోషణ అధ్వానంగా ఉందని, అందువల్ల అవి ఆశించిన విధంగా నీటిని అందించలేకపోతున్నాయంటూ రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సాగునీటి రేట్లు రాష్ట్రానికి రాష్ట్రానికీ; ప్రాజెక్టు ప్రాజెక్టుకీ; ప్రతి పంటకు, పంట కాలానికి మారుతున్నాయని; చాలా రాష్ట్రాల్లో ఎంతోకాలంగా సాగునీటి రేట్లు సవరించలేదని, వాటి వసూళ్లూ సక్రమంగా జరగడంలేదని ప్రభుత్వానికి అర్థమైంది. ఆ పరిస్థితిని చక్కదిద్దేదెలాగో సూచించాలంటూ వైద్యనాథన్‌ కమిటీని తెరపైకి తెచ్చింది. ఆ కమిటీ సూచనలు, సిఫార్సుల ప్రకారం- నీటి రేట్లు వినియోగదారుల నుంచి వసూలుచేసే వాస్తవిక ఖర్చులే గానీ, పన్ను కాదు. నిర్వహణ, పెట్టుబడిపై వడ్డీ, తరుగుదలకు అనుగుణంగా నీటిరేట్లు ఉండాలి. వాటిని అయిదేళ్లకు ఒకసారి పునఃపరిశీలన చేయాలి. నీటి విలువలను తక్కువగా నిర్థారిస్తే, అది వనరుల లభ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిర్వహణ, మరమ్మతులకు చాలీచాలని నిధులు ఇస్తే- సేవల నాణ్యతా ప్రమాణాలు పడిపోతాయి. ఖర్చులను, నీటి నాణ్యతను దృష్టిలో పెట్టుకొని నీటిరేట్లు నిర్ణయించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు నీటిరేట్లను తగిన విధంగా పెంచకపోవడం సాగునీటి వ్యవస్థల క్షీణతకు దారితీస్తోంది. అందువల్ల, సాగునీటి వ్యవస్థ నిర్వహణ ఖర్చుల దృష్ట్యా పెట్టుబడిపై ఒక్క శాతం రాబడిని వసూలుచేయాలని సిఫార్సు చేసింది.

హేతుబద్ధంగా వసూళ్లు
చాలా రాష్ట్రాల్లో సాగు చేసిన భూవిస్తీర్ణాన్నిబట్టి నీటిరేట్లు వసూలు చేస్తున్నారు. దానివల్ల సరఫరాచేసే నీటిపరిమాణం, కాలం, కచ్చితత్వాలపై తీవ్ర వ్యతిరేక ప్రభావం పడుతోంది. కాబట్టి, సరఫరా చేసే నీటి పరిమాణాన్నిబట్టి నీటిరేట్లు వసూలుచేయడం సమంజసమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి చేయాల్సిందల్లా సరఫరా చేసే నీటి యూనిట్‌ పరిమాణానికి విలువను లెక్కగట్టి, దానిప్రకారం సరఫరాచేసిన మొత్తం నీటి పరిమాణానికి బిల్లు తయారుచేసి, దాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయడమే. దీనివల్ల నీటివృథాను బాగా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఇందుకోసం కాలువలపై అవసరమైన చోట్ల క్రమబద్ధీకరణ, కొలత సాధనాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి కొంత అదనపు ఖర్చవుతుంది. ప్రతి రైతు పొలం వద్ద సరఫరా చేసే నీటి పరిమాణాన్ని కొలవడం ఎంతో ఖర్చుతో కూడిన పనేగాక, ఆచరణ సాధ్యం కాదు కూడా! కానీ, ఒక తూము ద్వారా సరఫరా చేసే నీటిని కొలత సాధనం ద్వారా కొలిచి, దానికి విలువగట్టి, ఆ మొత్తాన్ని ఆ తూము కింద సాగు చేసిన పొలాల విస్తీర్ణం ప్రకారం సంబంధిత రైతుల నుంచి వసూలుచేయాల్సి ఉంటుంది.
ఇటీవలి కాలంలో కొన్ని ముఖ్యమైన పంటల మార్కెట్‌ ధరలు పెరిగాయి. దీనివల్ల రైతులకు పంటలపై ఆదాయం పెరిగింది. అదే సమయంలో కూలీరేట్లు, నిర్మాణ వస్తువుల ధరలూ కట్టుతప్పాయి. కాలువలు, ఇతర నిర్వహణ, మరమ్మతుల ఖర్చులు ఆకాశాన్ని అంటాయి. రైతులకు సక్రమంగా నీరందించాలంటే, సాగునీటి వ్యవస్థను సరైన రీతిలో నిర్వహించాల్సిందే. వినియోగదారుల నుంచి వసూలు చేసే నీటి తీరువాలను ఆ మేరకు పెంచాల్సి ఉంటుంది. ఆ పెంపుదల హేతుబద్ధంగా ఉండాలి. రైతులు, ఇతర వినియోగదారులు సహా ఎవ్వరికీ భారం కాని రీతిలో దుర్భరం అనిపించని విధంగా ఈ పెంపుదల ఉండాలి. అందుకు ప్రభుత్వాలు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వస్తాయో చూడాలి!

Posted on 20-08-2016