Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పరిశుభ్రతే ఆయుధం

* చరిత్ర చెబుతున్న ఆరోగ్య పాఠం

చరిత్ర చెబుతున్న ఆరోగ్య పాఠంప్రస్తుతం కరోనా వైరస్‌ నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి మనకున్న అతి పెద్ద ఆయుధాలు- భౌతిక దూరం పాటింపు, మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత. సబ్బు, శానిటైజర్లతో తరచూ చేతులు శుభ్రపరచుకోవడం సర్వసాధారణంగా మారింది. సుమారు 170 ఏళ్ల క్రితం హంగేరీకి చెందిన డాక్టర్‌ ఇగ్నస్‌ సెమెల్‌వైజ్‌ తొలిసారిగా ఆరోగ్య రక్షణ కోసం చేతులు శుభ్రపరచుకోవాలని చెప్పినప్పుడు తోటి వైద్యులే అవహేళన చేశారు. అంతేకాదు... అందరూ ఒక్కటై ఆయన్ను వేధించారు. చేతుల పరిశుభ్రతలోని శాస్త్రీయత అర్థం చేసుకున్న తరవాత వైద్యులందరికీ అదొక విధిగా మారింది. అనంతరం ఫ్రెంచ్‌ మైక్రోబయాలజిస్ట్‌ లూయీ పాస్టర్‌ క్రిముల వల్లనే ఇన్‌ఫెక్షన్‌ వంటి వ్యాధులు వస్తాయని కనుక్కున్నారు. ఆ పరిశోధన వైద్య శాస్త్రాన్ని ఓ కొత్త మలుపు తిప్పింది. నేడు వైద్యులే కాదు, సామాన్య ప్రజానీకమూ చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలనే స్పృహను కరోనా వైరస్‌ కలగజేసిందన్నది వాస్తవం. ఈ సందర్భంగా చేతుల పరిశుభ్రతకు, వ్యాధుల విస్తరణకు మధ్య సంబంధాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎన్నో అనారోగ్యాలకు మూలం
కంటికి కనిపించని కోట్లాది సూక్ష్మ క్రిములు, మలినాలు, దుమ్ము, ధూళి, అవాంఛనీయ పదార్థాలు మనుషుల చేతుల్లోకి వచ్చి చేరతాయి. ఆ చేతిని సబ్బుతో శుభ్రం చేసుకోకుండా కన్ను, ముక్కు, ముఖాన్ని ఎక్కడైనా తాకినప్పుడు లేదా ఆహారం తీసుకునేటప్పుడు అవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల సాధారణ జలుబు మొదలు భయంకరమైన కలరా, డయేరియా తదితర అంటువ్యాధుల బారినపడతారు. ఇన్‌ఫ్లుయెంజా వంటి శ్వాసకోశ వ్యాధులూ సంక్రమిస్తాయి. అత్యంత సులభంగా సోకి, అతి వేగంగా విస్తరించే ప్రమాదకర గుణం కరోనా వైరస్‌కు ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కరోనా జాగ్రత్తల గురించి ఇంతగా చెబుతున్నారు. చేతుల పరిశుభ్రత అందులో ప్రథమస్థానం ఆక్రమిస్తోంది. అత్యధిక శ్రామిక జనాభా ఉన్న భారత్‌ లాంటి దేశంలో చేతుల పరిశుభ్రత ప్రచారాన్ని ఇప్పుడు ఉద్యమస్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అందుకే ఉత్పన్నమైంది.

కరోనా నేపథ్యంలోనే మల మూత్ర విసర్జన అనంతరం చేతులు కడుక్కునే సంస్కృతిపై ఇటీవల యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌ (యూకే) 63 దేశాల్లో ఓ సర్వే నిర్వహించింది. వెన్వెంటనే చేతులు శుభ్రం చేసుకునే అలవాటు లేని పది దేశాల జాబితాలో భారత్‌ నిలిచింది. అదే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే (2019)’ సందర్భంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం- ప్రతి పది పేద కుటుంబాల్లో కేవలం రెండు మాత్రమే సబ్బుతో చేతులు కడుక్కుంటున్నట్లు తేలింది. చేతుల పరిశుభ్రతపై సర్వేలతో పాటు మన చుట్టూ కనిపిస్తున్న క్షేత్రస్థాయి నిజాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. అనేక అనారోగ్య సమస్యలకు కారణం చేతుల అపరిశుభ్రతేనని వైద్యులూ చెబుతున్నారు. చేతులు శుభ్రం చేసుకోవాల్సిన ముఖ్య సందర్భాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో వివరించింది. ఆహారం తినే ముందు, తిన్న తరవాత, మల మూత్ర విసర్జన చేసినప్పుడు, రోగిని తాకినప్పుడు, పిల్లలను తాకే ముందు, జంతువులను ముట్టుకున్నప్పుడు, వాటి వ్యర్థాన్ని తీసిన తరవాత, చెత్తను పారేసినప్పుడు విధిగా సబ్బునీటితో చేతులు శుభ్రపరచుకోవాలని సూచించింది. ఈ అలవాటు వల్ల దాదాపు 50 శాతం రోగాలకు ప్రజలు దూరం కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఏటా అక్టోబర్‌ 15న ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటారు. చేతుల శుభ్రత అనేది వ్యక్తిగత పరిశుభ్రతలో భాగం కనుక ప్రపంచవ్యాప్తంగా ‘వాష్‌’ (వాటర్‌, శానిటేషన్‌, హైజీన్‌) అనే కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారు.

ఆటంకంగా నీటి కొరత
ఇది వేసవి కాలం. చేతుల పరిశుభ్రతకు నీటి కొరత అడ్డంకిగా మారింది. ప్రజారోగ్యంలో చేతుల పరిశుభ్రత ప్రాముఖ్యం ప్రస్తావనకు వచ్చినప్పుడు, అందుకు నీటికొరత అడ్డంకిగా ఉందని నీతి ఆయోగ్‌ సైతం వాపోయింది. నిరక్షరాస్యత, పేదరికం లాంటి సామాజిక సమస్యలతో పాటు నిర్లక్ష్యమూ క్షేత్రస్థాయిలో చేతుల పరిశుభ్రతకు ఆటంకంగా మారింది. ప్రజారోగ్య విధానాలపై ప్రభుత్వాల తీరూ మారాల్సిన అవసరం ఉంది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొత్త వ్యాధులు ప్రబలకుండా చూడటానికి, వాటిని ఎదుర్కోవడానికి ప్రజారోగ్య పథకాలతోపాటు స్వచ్ఛతా కార్యక్రమాలనూ విస్తృతంగా చేపట్టాలి. దానిలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు చేతుల పరిశుభ్రతకూ చోటివ్వాలి. భారత దేశంలోని పేద ప్రజానీకానికి చేతుల్ని శుభ్రం చేసుకునే సబ్బు లేదా శానిటైజర్‌ను రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా పంపిణీ చేయాలి. వాతావరణ కాలుష్యం కారణంగా పుట్టుకొస్తున్న అనేక రకాల కొత్తకొత్త బ్యాక్టీరియా, వైరస్‌ల వ్యాప్తిని అరికట్టి, ఆరోగ్యంగా జీవించడానికి వ్యక్తిగత పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలి. అదొక సంస్కృతిగా స్థిరపడాలి. పారిశుద్ధ్య కార్యక్రమాలు, రక్షిత మంచినీటి పథకాలను పటిష్ఠంగా అమలుపరచాలి. కనుక పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతను పాఠ్యాంశంగా బోధించాలి. ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలూ పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి. కరోనా వైరస్‌ ప్రజలకు ఒక కొత్త జీవన విధానం నేర్పిన తరుణంలో, భవిష్యత్తులోనూ ఈ జాగ్రత్తలను కొనసాగించాలి. అప్పుడే ఆరోగ్య భారత స్వప్నం సాకారమవుతుంది.

- సంపతి రమేష్‌ మహారాజ్‌
(రచయిత- సామాజిక విశ్లేషకులు)
Posted on 08-05-2020