Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

కొన్ని నెలల్లో కరోనా టీకా?

ప్రపంచ దేశాలపై పగపట్టినట్లు- కర్కోటక కరోనా వైరస్‌ అమానుష దాడి యథేచ్ఛగా కొనసాగుతోంది. విశ్వవ్యాప్తంగా 40 లక్షలకు చేరువగా కేసులు, రెండు లక్షల 73 వేల మరణాలు... కొవిడ్‌ రూపేణా మహా సంక్షోభ తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. విస్తృత ప్రాణనష్టం సంభవించిన దేశాల జాబితాలో అమెరికాను వెన్నంటి యూకే, ఇటలీ, స్పెయిన్‌ విలవిల్లాడుతున్నాయి. 56 వేలకు పైగా కేసులు, దాదాపు 19 వందల మరణాలతో భారత్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. దేశదేశాల్లో 90 వేలమంది వరకు ఆరోగ్య సిబ్బందికీ కరోనా సోకిన ఉదంతాలు తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో- మహమ్మారిని కట్టడి చేయగల వ్యాక్సిన్‌ కోసం యావత్‌ ప్రపంచం ఆశగా నిరీక్షిస్తోంది. వివిధ వైరస్‌ల జన్యు పరిణామాల్ని గుర్తించి, జన్యుక్రమాన్ని విశ్లేషించే పరిశోధనల నిమిత్తం ఇండియాతోపాటు పలు దేశాలకు మౌలిక సాధన సంపత్తి ఉంది. అయినా ఇప్పటికీ టీకాలు కనుక్కోలేకపోయిన వైరస్‌లు ఎన్నో ఉన్నాయంటున్న శాస్త్రవేత్తలు, కరోనాకు సంబంధించీ వ్యాక్సిన్‌ రూపకల్పన ఏమంత సులభతరం కాదని కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌లో చోటుచేసుకుంటున్న అనూహ్య ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్లు) పరిశోధకులకు గడ్డు సవాలు విసరుతున్నాయి. లక్ష్యసాధన క్లిష్టతరమయ్యే కొద్దీ శాస్త్రవేత్తల్లో పట్టుదల ఇనుమడిస్తుందని కరోనా సంక్షోభం చాటుతోంది. ఆ మహమ్మారి జన్యుక్రమాన్ని జనవరి ఏడో తేదీన చైనా ఆవిష్కరించింది. దానిపై ఇప్పటిదాకా పలు వైద్య, ఔషధ సంస్థలు ఆరు వేల దాకా పరిశోధన పత్రాలు వెలువరించడం అరుదైన రికార్ఢు సరైన విరుగుడు కోసం అందరూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని చూస్తున్న దశలో- ముమ్మర పరిశోధనలు ఒక కొలిక్కి వచ్చి కొన్ని రకాల సంజీవనుల తయారీపై కొత్త ఆశలు మోసులెెత్తుతున్నాయి. కరోనా ధాటితో కిందుమీదులవుతున్న ప్రపంచానికి తాజా పరిణామాలు కారుచీకట్లో కాంతిరేఖల్లా గోచరిస్తున్నాయి.

పరిశోధనలు, నవ్యావిష్కరణల్లో కాకలు తీరిన ఇజ్రాయెల్‌- కొవిడ్‌ బాధితులు వేగంగా కోలుకోవడానికి దోహదపడే సరికొత్త చికిత్సను త్వరలో అందుబాటులోకి తేనుందంటున్నారు. కరోనాను నిలువరించి, ఆ వైరస్‌ను బాధితుల శరీరంలోనే అంతమొందించే యాంటీబాడీల ఉత్పత్తి వాణిజ్య స్థాయిలో ఆరంభమైతే- కొవిడ్‌ నియంత్రణలో అదో పెద్ద ముందడుగు కాగలదు! కరోనా కట్టడికి ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ఇటలీకి చెందిన ‘టకీస్‌’ సంస్థ చెబుతోంది. చింపాంజీల్లోని అడెనో వైరస్‌తో రూపొందించిన టీకా సామర్థ్యాన్ని నిగ్గుతేల్చడానికి ఔషధ ప్రయోగాలు ఫలవంత దశకు చేరాయని ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఇటీవలే ప్రకటించింది. భారత్‌లోనే ఇంచుమించు 30 వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నట్లు ప్రధాని మోదీ స్వయంగా నిర్ధారించారు. ఎబోలా చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్‌తో పాటు నాలుగు రకాల ఔషధాలు కరోనాను ఎదుర్కోగలవన్నదీ మానవాళికి ఉపశమనం కలిగించే సమాచారమే. ఒకప్పుడు కరాళ నృత్యం చేసిన ప్లేగు, విపరీత భయాందోళనలు సృష్టించిన మశూచి మొదలు పోలియో, తట్టు (మీజిల్స్‌) వరకు ఎన్నింటికో కోరలు, కొమ్ములు విరిచిన ఘనత రోగ నిరోధక టీకాలదే. కొన్ని నెలల వ్యవధిలో కరోనా వ్యాక్సిన్‌ సిద్ధమయ్యాక దాన్ని 780 కోట్ల ప్రపంచ జనాభాలో 50 నుంచి 70 శాతం వరకు వినియోగించాల్సి ఉంటుందన్నది నిపుణుల అంచనా. ఆ స్థాయిలో డోసులను చురుగ్గా సిద్ధం చేయడమన్నది దేశీయంగా అంతర్జాతీయంగా దిగ్గజ ఔషధ సంస్థల ముందున్న గడ్డు సవాలు. వ్యాక్సిన్‌ ఎవరు ఎప్పుడు కనుక్కున్నా, దాన్ని చౌకలో విస్తృత ప్రాతిపదికన మానవాళికి చేరువ చేయడంలో ప్రపంచ దేశాలు ఏకతాటిపై నిలవాలి. అలా ప్రదర్శితమయ్యే సంఘటిత శక్తే, కరోనా మహమ్మారిని దిగ్బంధించగలిగేది!

Posted on 09-05-2020