Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

మహమ్మారిపై వియత్నాం విజయం

* ఒక్క మరణమూ నమోదుకాని వైనం

కొవిడ్‌ కోరలు పెరకడంలో తైవాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, జర్మనీల విజయగాథలు విన్నాం. ఈ దేశాలు క్రమంగా లాక్‌డౌన్‌ ఎత్తివేసి ఆర్థిక రథాలను తిరిగి పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయనే వార్తలు వస్తున్నాయి. కరోనాపై పోరులో ఈ దేశాలకన్నా మేటి విజయాన్ని సాధించిన వియత్నాం గురించి మాత్రం అంతగా వెలుగులోకి రాకపోవడం చిత్రమే. పైన చెప్పుకొన్న దేశాలన్నింటిలో కొవిడ్‌ వల్ల మరణాలు సంభవించగా, వియత్నామ్‌లో కనీసం ఒక్క మరణమూ నమోదు కాలేదు. ఆ ఆసక్తికర వాస్తవం ఎందుకో మరుగున పడిపోయింది. మే 8వ తేదీనాటికి జర్మనీలో దాదాపు 7,392 మరణాలు సంభవించగా, వియత్నాం సమీపంలోని సింగపూర్‌లో 20, తైవాన్‌లో 6, దక్షిణ కొరియలో 256 మరణాలు చోటుచేసుకున్నాయి. వియత్నాం మాత్రం కొవిడ్‌ మృత్యుభూతాన్ని తన దరిదాపుల్లోకి చేరనివ్వలేదంటే కారణం- ఆ దేశం మిగతా ప్రపంచంకన్నా చాలాముందుగా మేల్కోవడం, పకడ్బందీగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం.

పటిష్ఠమైన నిఘా వ్యవస్థ
ఇప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా గురించిన సమాచారాన్ని చైనా తొక్కిపెట్టిందని భగ్గుమంటున్నారు. కానీ, బీజింగ్‌ను నమ్మకూడదని వియత్నామ్‌కు బాగా తెలుసు. రెండు దేశాల మధ్య గతంలో జరిగిన యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠమిది. చైనాలో ఏదో కొత్త వైరస్‌ వ్యాపిస్తోందని వియత్నామ్‌కు చెందిన సైబర్‌ నిఘా సంస్థ ఏపీటీ32 ముందే పసిగట్టింది. వెంటనే చైనా ఎమర్జన్సీ నిభాయింపు మంత్రిత్వ శాఖ, వుహాన్‌ నగర పాలక సంస్థ వ్యవహారాలు తెలుసుకోవడానికి సైబర్‌ నిఘా పెట్టింది. చైనా, జర్మనీ, అమెరికా తదితర దేశాలకు చెందిన కంపెనీల రహస్యాలను తెలుసుకోవడానికి ఏపీటీ32 2012 నుంచే సైబర్‌ దాడులు నిర్వహిస్తోందని అమెరికన్‌ సైబర్‌ భద్రతా సంస్థ ఫైర్‌ ఐ వెల్లడించింది. ఏపీటీ32 సంస్థకు వియత్నాం ప్రభుత్వంతో తెరచాటు సంబంధాలు ఉన్నాయనీ తెలిపింది. చైనాలోని వుహాన్‌లో 2019 నవంబరు-డిసెంబరు మధ్య ఏదో కొత్త తరహా వైరస్‌ వ్యాపిస్తోందని స్థానిక వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల్లో నడచిన సంభాషణలను అమెరికాతోపాటు వియత్నాం కూడా ఆలకించింది. చైనాలోని తమ దౌత్యవేత్తలు, వ్యాపారులు, విద్యార్థుల నుంచి మరింత సమాచారం సేకరించి వైరస్‌ ఉనికిని రూఢి చేసుకుని చప్పున రంగంలోకి దిగింది. చైనాతో తనకు సుదీర్ఘ భూసరిహద్దు ఉన్నందువల్ల కరోనా వైరస్‌ తమ మీద దాడి చేసే ప్రమాదం జాస్తి అని గ్రహించింది. దీన్ని ఎదుర్కోవడానికి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి త్రిముఖ వ్యూహం అనుసరించింది. దేశంలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం పౌర హక్కుల గురించి పట్టింపులకు పోకుండా కొంత కరకుగానే చర్యలు తీసుకుంది.

ఇతర దేశాలకన్నా చాలాముందు నుంచే, అంటే ఫిబ్రవరి నుంచి వియత్నామ్‌లోని విమానాశ్రయాల్లో దిగిన ప్రయాణికులను థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడం మొదలుపెట్టారు. తాము ఎవరెవర్ని కలిసిందీ, తమ ప్రయాణ, ఆరోగ్య చరిత్రలు ఏమిటి అనే అంశాలను వారు స్వచ్ఛందంగా అధికారులకు వెల్లడించాలి. శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీలు దాటినవారందరినీ సమీపంలోని వైద్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్షలు చేయసాగారు. విమానాశ్రయాలతోపాటు రెస్టారెంట్లు, బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థలు, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లు సైతం థర్మల్‌ స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేశాయి. మే 8వ తేదీకల్లా వియత్నామ్‌లో కరోనా పరీక్షలు 2,61,004 దాటిపోయాయి. ఎక్కడైనా కరోనా కేసులు వస్తే ఆ వీధి లేదా ఊరును కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి జనసంచారానికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఇప్పుడు అన్ని దేశాలూ ఇదే పనిచేస్తున్నా, వీటన్నింటినీ వియత్నాం చాలా ముందుగానే మొదలుపెట్టింది. అందుకే తొమ్మిది కోట్ల జనాభా ఉన్న వియత్నామ్‌లో ఇప్పటి వరకు 288 కేసులు మాత్రమే నమోదయ్యాయి. టెస్ట్‌ కిట్ల కోసం చైనా మీదో, మరే దేశంపైనో ఆధారపడకుండా సొంతంగా మూడు రకాల కిట్లను తయారుచేసుకుంది. కేవలం 25 డాలర్ల (దాదాపు రూ.1,880) ధరకు లభించే ఈ కిట్లు కేవలం గంటన్నరలో కరోనా వైరస్‌ ఉన్నదీ లేనిదీ చెప్పేస్తాయి. స్వదేశంలో చౌకగా తయారైన టెస్ట్‌ కిట్లు కరోనాపై సమరంలో కీలక పాత్ర వహించాయి.

ఫలించిన వ్యూహాలు
ఫిబ్రవరి రెండో వారం తరవాత విదేశాల నుంచి తిరిగివచ్చిన వియత్నామీయులను 14 రోజుల క్వారంటైన్‌కు పంపడం మొదలుపెట్టారు. ఈ ప్రక్రియను ఆలస్యం చేసిన దేశాలు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్‌ కేసులతో దగ్గరగా మసలిన స్వదేశీయులను, విదేశీయులను క్వారంటైన్‌ చేశారు. మార్చి నుంచే నగరాలను, కొన్ని నగరాల్లోని నిర్దిష్ట ప్రదేశాలను వియత్నాం ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేసింది. బయటివారు ఈ నగరాల్లో ప్రవేశించాలంటే 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సిందే. పల్లెల్లో ఒక్క కేసు వచ్చినా బయటివారిని రానివ్వకుండా కంచెలు వేశారు. కొవిడ్‌ వ్యాధి ఏదో మామూలు ఫ్లూ జ్వరం వంటిది కాదని, అది చాలా తీవ్రమైన రోగమని ఈ ఏడాది జనవరి నుంచి వియత్నాం ప్రభుత్వం సామాజిక మాధ్యమాలు, ఇతర ప్రసార సాధనాల ద్వారా ప్రజలను హెచ్చరించసాగింది. దేశ ప్రధాని మొదలుకొని క్యాబినెట్‌ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల నాయకుల పేర్లతో ప్రజలకు ఫోన్లలో సంక్షిప్త సందేశాలు పంపి అప్రమత్తం చేయసాగింది. కొవిడ్‌ వ్యాధిగ్రస్తుల వివరాలనూ ప్రభుత్వం వెల్లడించింది. క్వారంటైన్‌ నుంచి పరారైనవారి ప్రయాణ వివరాలను వెల్లడిచేయసాగింది. వారి పేర్లను కాక వారి కేసు నంబర్లను ప్రజలకు ప్రకటించసాగింది. ఇప్పుడైతే అన్ని దేశాలూ ఇలాంటి చర్యలే తీసుకుంటున్నా, అందరికన్నా ముందే మేల్కోవడం వల్లనే వియత్నాం ఒక్క మరణమూ లేకుండా కరోనాను కట్టడి చేయగలిగింది.

- వరప్రసాద్‌
Posted on 09-05-2020