Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

మనిషిదే పైచేయి!

‘ఆరోగ్యమే మహాభాగ్యం’, ‘ఐకమత్యమే మహాబలం’. ఒకప్పుడు పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పాఠ్యప్రణాళికలో వ్యాసరచనా అంశాలివి. వక్తృత్వాంశాలు కూడా. ఇవి పాతబడిన సూక్తులు కావు- నిత్యసత్యాలు. ఏ దేశంలోనైనా, ఏ సమాజంలోనైనా మనిషి తప్పనిసరిగా గుర్తుంచుకుని పాటించాల్సిన విలువైన సందేశాలు. నేటి విశ్వవ్యాప్త సంక్షోభంలో ఈ రెండూ మానవాళికి మార్గదర్శకాలు.

ప్రపంచ మానవుడు రెండు ప్రపంచ యుద్ధాలు చూశాడు. దేశాల మధ్య సుదీర్ఘకాలం జరిగిన యుద్ధకాండనూ తిలకించాడు. ఎన్నోసార్లు ఆర్థిక సంక్షోభాలనూ ఎదుర్కొన్నాడు. కలరా, మశూచి, ప్లేగు, క్షయ, కుష్ఠు, స్వైన్‌ ఫ్లూ, చికున్‌ గన్యా... ఇంకా రకరకాల వింత జ్వరాలను, రోగాలను చవిచూశాడు. పోరాడాడు. కొన్నింటితో అడపా దడపా పోరు సాగిస్తూనే ఉన్నాడు. ఇవాళ ఒక క్రిమి యావత్‌ ప్రపంచాన్నీ అతలాకుతలం చేస్తోంది. బహుశా ప్రపంచ చరిత్రలో మనిషి ఇంతగా భీతిల్లిన సందర్భం మరొకటి లేదేమో. అగ్రరాజ్యమా, ఆకలి దేశమా, అపరకుబేరుడా, దినసరి కూలీయా, మేధావా, నిరక్షరాస్యుడా, నిత్యకృషీవలుడా, సోమరిపోతా- ఈ తేడాలు లేవు. అందాల హర్మ్యంలో ఉన్నవాడికి, నిరాశ్రయుడిగా రోడ్డుమీద నిస్సహాయంగా నిలబడినవాడికీ ఒకటే ఆందోళన. ఎవరి స్థాయిలో వాడి తపన. మానవాళిని ఇంతగా ఏకం చేసిన వికృత సమదర్శినిగా కరోనా మనముందు నిలిచింది.

ఇవాళ ఏ దేశానికి ఏ దేశమూ శత్రువు కాదు. ప్రచ్ఛన్న యుద్ధాల సమయం కాదిది. ఎవరి బాధ వాడిది. ఎవరికి వారు తమను తాము రక్షించుకోవాలనే తపనే దేశాల మధ్య అప్రకటిత అంగీకారం.

మనుషుల రవాణా లేదు. ఎక్కడవాళ్లక్కడే. ఆర్థిక మనుగడ కోసం ఒక స్థాయిలో పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాలు చూస్తున్నాం. ప్రాణాల రక్షణ కోసం వైజ్ఞానిక వినిమయం తిలకిస్తున్నాం. ఇది దేశాల మధ్య అవగాహన. సర్దుబాటు. మనుషులదీ అదే దారి. మనం బతకాలి, ఇతరుల్ని బతకనివ్వాలి. ఇది ఎప్పుడూ శక్తిమంతమైన జీవన సూత్రం. స్వార్థంతో మనిషి దీన్ని విస్మరిస్తున్నాడు. సాటి మనిషినే కాదు, ప్రకృతిపైనే తిరుగుబాటు చేశాడు. సహజ వనరుల్ని దోపిడి చేశాడు. ప్రకృతిలోని వాయువులు గతి తప్పాయి. సుఖాల మోజులో పరిసరాల పచ్చని దృశ్యాల్ని చెరిపేశాడు మనిషి. ఇది మనిషి స్వయంకృతాపరాధం. ఈ నరమేధానికి కర్త, కర్మ- మనిషే. దైనందిన జీవితం అసిధారావ్రతమైంది. ‘మనిషి రోడ్డున పడ్డాడు’- ఇది పాతమాట. ఇప్పుడు మనిషికి రోడ్డు నిషేధం. ఇల్లే స్వర్గం. గృహ నిర్బంధం ఒకప్పుడు శిక్ష. ఇప్పుడొక నియమం. ఇంటిపట్టున ఉండకుండా కాళ్లకు చక్రాలు కట్టుకు తిరిగేవాడు తన స్వేచ్ఛను ఎవరో హరిస్తున్నట్లు బాధపడవచ్ఛు మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి. కాని అడుగడుగునా సంకెళ్లే. స్వేచ్ఛ విశృంఖలత్వం కారాదు. మనతోపాటు మన తోటివారూ ఆనందంగా జీవించాలంటే స్వీయ నియంత్రణ ఉండాలి.

రోడ్డుకు దూరమైపోయామని కొందరి ఆక్రోశం. మాకు బతకడానికి రోడ్డేదీ అని చాలామంది గోడు. తెల్లారితే అల్పాహారం అమ్ముకునేవాడు, సాయంకాలం పకోడీలు, వేడి బజ్జీలు, మరొకటో మరొకటో అమ్ముతూ బతుకుబండి సాగించేవాడు, గంట మోగిస్తూ పిల్లలకు చల్లని ఐస్‌క్రీం అందించేవాడు, వీధుల్లో చిత్తు కాగితాలు, ఇనుప ముక్కలు, ఖాళీ సీసాలు ఏరుకునేవాళ్లు... వీళ్లంతా ఏరీ? కమ్మరి కొలిమి మండటం లేదు. కుమ్మరి చక్రం తిరగడం లేదు. సాలెల మగ్గంతో పడుగు పేకల శ్రుతి వినిపించడం లేదు. సమస్త వృత్తుల చిహ్నాలూ మసకబారిపోయాయి.

పెను విపత్తులో మనిషికి అండగా పనిచేస్తున్న వ్యవస్థలు కొన్ని. ‘వైద్యో నారాయణో హరిః’ సూక్తి సత్యమైన సందర్భమిది. రక్షకభటులు చోరుల్ని పట్టుకోవడమే గాక, రోడ్డుమీద రాకపోకల్ని నియంత్రించడానికే గాక- వాస్తవంగా మనిషి రక్షణ కోసం పనిచేస్తున్నారు. నయానా భయానా చెబుతున్నారు. గీత దాటవద్దంటున్నారు. మన ఇంటి చెత్త, ఒంటి చెత్త- ఏ దుర్గంధమైనా ప్రక్షాళన చేసే కర్మయోగులు పారిశుద్ధ్య కార్మికులు. ఇంకా క్షేత్రస్థాయిలో తమ సేవలందిస్తున్న కర్మచారులెందరో. ఈ వ్యవస్థలు పని చేయకపోతే మృత్యుదేవత విలయతాండవం చేసేది. మనిషి మారణహోమంలో సమిధయ్యేవాడు.

మనుషులు భౌతికంగా దూరమైనా మానసికంగా దగ్గరయ్యారు. విదేశాల్లో ఉన్న పిల్లలు, ఇక్కడి తల్లిదండ్రుల మధ్య మొక్కుబడి పలకరింపులు లేవు. ఆత్రుత, ఆందోళన. ఎవరికెవరూ ఏమీ చేయలేని స్థితి. అందరిదీ ఒకే పరిస్థితి.

మనుషుల మధ్య సంఘీభావం ప్రస్ఫుటమవుతోంది. ఉన్నవాడు లేనివాడికి ఆపన్నహస్తం అందిస్తున్నాడు. మనుషుల్లో మానవత్వం పరిమళిస్తోంది. అంటరానితనం ఒక తాత్కాలిక ప్రాకృత నియమం మాత్రమే. మనుషుల మనసుల మధ్య ఎల్లలు లేవు. ఇదే ఐకమత్యమంటే. ఒక సౌహార్ద్ర భావసమైక్యత. నైరాశ్యపు చీకట్లు అలముకున్న సాటి మనుషుల జీవితాల్లో చిన్నపాటి వెలుగైనా నింపడానికి ప్రతివాడూ దీపధారి కావాలి. ఆరోగ్య జీవన గీతం ఆలపించాలి. సౌమనస్య శాంతిగీతం ప్రతిధ్వనించాలి. ఈ యుద్ధంలో మనిషే గెలుస్తాడు. మానవత్వానిదే అంతిమ విజయం!

- డి.భారతీదేవి
Posted on 09-05-2020