Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అంకురిస్తున్న అవకాశాలు


నవీకరణతో ఆర్థికాభివృద్ధి వూపందుకుని ఉద్యోగ వ్యాపారాలు విజృంభిస్తాయి. 21వ శతాబ్దంలో నవీకరణకు స్టార్టప్‌ (అంకుర) పరిశ్రమలు చిరునామాగా నిలుస్తున్నాయి. నేడు అమెరికాలో కొత్త ఉద్యోగావకాశాలకు అంకుర పరిశ్రమలే సృష్టికర్తలు. అక్కడ అంకుర పరిశ్రమలు స్థాపితమైన ఏడాదిలోనే ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. గడచిన మూడు దశాబ్దాల్లో అంకుర సంస్థలు ఏటా సగటున 15 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పిస్తూ వచ్చాయి. నేటి అంకుర పరిశ్రమ రేపు బృహత్తర సంస్థగా ఆవిర్భవించగలదని ఎన్నోసార్లు నిరూపితమైంది. నవీకరణకు పూర్తి ప్రోత్సాహం లభిస్తేనే అంకుర పరిశ్రమలు వర్ధిల్లుతాయి. ఏటా ప్రచురితమయ్యే అంతర్జాతీయ నవీకరణ సూచీని చూస్తే భారతదేశం కొంత పురోగతి సాధించినా, చైనా మనకన్నా వేగంగా ముందుకు దూసుకెళ్తొందని తెలిసివస్తుంది. 2008-09లో ఈ సూచీపై భారత్‌ ర్యాంకు 41. చైనా ర్యాంకు 37. తరవాత భారత్‌ స్థాయి దిగజారి నిరుడు 81కి చేరింది. ఈ ఏడాది మనదేశం 66వ ర్యాంకుకు ఎదిగినా, చైనా ఎకాయెకి 25వ స్థానాన్ని అందుకొంది. అదే స్విట్జర్లాండ్‌ వరసగా ఆరేళ్ల నుంచి అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంటోంది. భారత్‌ తన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కేవలం ఒక శాతాన్ని నవీకరణ, పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలపై ఖర్చు చేస్తోంది. చైనా తదితర దేశాలు మనకన్నా ఇంకా ఎక్కువ మొత్తాలను వెచ్చిస్తూ వేగంగా దూసుకెళ్తున్నాయి.

యువతలో కొత్త ఉత్సాహం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్టార్టప్‌ ఇండియా కార్యక్రమం మన అంకుర పరిశ్రమలకు కొత్త వూపు తీసుకొస్తోంది. మధ్యతరగతి సంఖ్యతోపాటు పట్టణీకరణ పెరగడం వల్ల కొత్త వస్తుసేవలకు గిరాకీ పెరిగి అంకుర పరిశ్రమలకు, మేకిన్‌ ఇండియాకూ వరం కానుంది. స్టార్టప్‌ పరిశ్రమలకు ఆరంభ దశ నుంచి చేయూతనిచ్చి సొంత కాళ్లపై నిలబడేట్లు చేయడంలో ‘ఇంక్యుబేటర్లు’ కీలక పాత్ర పోషిస్తున్నాయి. బెంగళూరు నగరం నేడు దేశంలోని 26 శాతం స్టార్టప్‌లకు స్థావరంగా నిలుస్తోంది. తదుపరి స్థానాలను దిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (23 శాతం), ముంబయి (17 శాతం), హైదరాబాద్‌ (8 శాతం), చెన్నై, పుణెలు (6 శాతం) ఆక్రమిస్తున్నాయి. స్టార్టప్‌లలో ప్రతి ఉద్యోగి తన పని తానే చేసుకుంటాడు. అతడిపై అతిగా నియంత్రణ, పర్యవేక్షణలు ఉండవు. కాబట్టి ఉద్యోగి తన సృజనాత్మకతను కనబరచి వేగంగా పైకి ఎదిగే అవకాశం లభిస్తుంది. ఉద్యోగికి పనిలో సంతృప్తి లభించి చీటికిమాటికి ఉద్యోగం మారకుండా పూర్తి ఏకాగ్రతతో పనిచేస్తాడు. భవిష్యత్తులో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) విస్తరణ-విజృంభణల్లో అంకుర పరిశ్రమలు కీలక పాత్ర పోషించనున్నాయి. స్మార్ట్‌ నగరాల ప్రాజెక్టును సాకారం చేయడంలోనూ స్టార్టప్‌లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. యువతీయువకులకు ఏటా కోటి ఉద్యోగాలు కల్పించాలంటే పారిశ్రామికోత్పత్తి, పారిశ్రామిక నమూనా, వ్యవసాయాధార ఆహారశుద్ధి, పునరుత్పాదక ఇంధన వనరుల రంగాల్లో కొత్త స్టార్టప్‌లు విరివిగా ఉద్భవించాలి.

ఉత్కృష్ట విద్యాసంస్థల కొరత మన నవీకరణ స్వప్నానికి అడ్డుతగులుతోంది. విద్యకు కేటాయిస్తున్న నిధులు నిరాశాజనకంగా ఉన్నాయి. అయితే బొంబాయి, మద్రాసు ఐఐటీలు తమ ప్రాంగణాల్లో విద్యార్థుల అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఇటువంటి ప్రాంగణ స్టార్టప్‌లు దేశమంతటా ఉద్భవించాలి. అదే సమయంలో కుటుంబాల దృక్పథంలోనూ మార్పు రావాలి. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలు శీఘ్రమే ఏదో ఒక ఉద్యోగంలో కుదురుకోవాలని ఆశిస్తారు. వారి దృక్పథం మారాలంటే తమ సంతానం సొంత కంపెనీలు పెట్టి వృద్ధిలోకి వస్తారనే నమ్మకం కలగాలి. దీనికి అనువైన పాఠ్యప్రణాళికలను సిద్ధం చేయాలి. చాలామంది యువతీయువకులు అంకుర పరిశ్రమలను స్థాపించాలనుకొంటున్నా, ఆ పని ఎలా చేయాలో వారికి తెలియదు. ఈ విషయంలో వారికి తగిన మార్గదర్శకత్వం అవసరం.
అంకుర పరిశ్రమలను, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) సముదాయాలుగా ఏర్పాటు చేస్తే డిజైన్‌, టెస్టింగ్‌, టూల్స్‌ను ఉమ్మడిగా వినియోగించుకొని ఖర్చులు ఆదా చేసుకోగలుగుతాయి. అన్నింటినీ మించి సులువుగా వ్యాపారం చేసుకొనే వెసులుబాటు ఉంటే అవి ఎంతో వృద్ధిచెందుతాయి. 2016 వ్యాపార సౌలభ్యసూచీలోని 189 దేశాల జాబితాలో భారత్‌ 130వ స్థానంలో ఉంది. గత ఏడాదికన్నా నాలుగు స్థానాలు పైకి ఎగబాకినా అది చాలదు. అంతర్జాలం చలవతో నేడు టాంజానియా అడవుల్లో కాని, సౌదీ ఎడారిలో కాని కొత్త పరిశ్రమలను స్థాపించి నడపడం సుసాధ్యమైపోయింది. అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలంటే మన దేశంలో వ్యాపార వాతావరణాన్ని ఇంకా ఎంతో మెరుగుపరచాల్సి ఉంది.

బాలారిష్టాలు
ఏదిఏమైనా అంకుర పరిశ్రమల రంగంలో భారత్‌ చాలా ఆలస్యంగా మేల్కొందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తనను కలిసిన సిలికాన్‌ వ్యాలీ సీఈఓల వద్ద వ్యాఖ్యానించారు. ఈ పొరపాటును వెంటనే సరిదిద్దుకోవాలి. స్టార్టప్‌ల కోసం ఏర్పాటు చేయతలపెట్టిన రుణహామీ నిధి ఇంతవరకు అమలులోకి రాలేదు. స్టార్టప్‌లు శీఘ్రమే వ్యాపార సంస్థలుగా నిలదొక్కుకోవడానికి తోడ్పడే నిమిత్తం రూ.10 వేలకోట్ల మహా నిధి ఏర్పాటు చేయనున్నట్లు గత జూన్‌లో కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది.
అంకుర పరిశ్రమను స్థాపించడం సులువే కానీ, దాన్ని దినదిన ప్రవర్ధమానం చేయడం తేలిక కాదు. అందుకే అనేక స్టార్టప్‌లు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి తంటాలు పడుతున్నాయి. భారతీయ యువత సరైన పూచీకత్తు చూపలేరు కనుక బ్యాంకులు రుణాలివ్వడానికి ముందుకురావడం లేదు. ఒకవేళ ఎంతో కొంత ఇచ్చినా, అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఈ ఖరీదైన రుణాలతో వ్యాపారం చేయడం అంకుర పరిశ్రమలకు కష్టం. వ్యాపార ప్రణాళిక బాగుండి, యువ వ్యవస్థాపకులు సత్తా కలిగినవారైతే ఉదారంగా బ్యాంకు రుణాలిచ్చి ప్రోత్సహించాలి. ఈ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం భారత్‌ ఆకాంక్షల నిధిని ప్రారంభించడం ప్రశంసనీయం. ఈ నిధి అంకుర పరిశ్రమలకు, ఎంఎస్‌ఎంఈలకు రుణ వితరణ చేస్తుంది. ఇన్ఫోసిస్‌, విప్రో వంటి ప్రైవేటు సంస్థలూ స్టార్టప్‌ నిధులను ప్రారంభించాయి. నేడు దేశంలోని స్టార్టప్‌లలో 80-90 శాతం మహానగరాల్లోనే ఉద్భవిస్తున్నాయి. చిన్నపట్టణాల్లో, గ్రామాల్లో రహదారులు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. ఈ లోటుపాట్లను భర్తీ చేస్తే దేశం నలుమూలలకూ స్టార్టప్‌ సంస్కృతి విస్తరిస్తుంది. మహిళల్లో వ్యవస్థాపక సత్తాకు ఆచరణ రూపమిచ్చే వాతావరణం భారత్‌లో కొరవడింది. సాధారణంగా ఇంజినీరింగ్‌, టెక్నాలజీ రంగాల్లో మహిళల సంఖ్య తక్కువ కాబట్టి అంకుర పరిశ్రమల్లో వారి ప్రాతినిధ్యమూ తక్కువగానే ఉంటోంది. వారికోసం ప్రత్యేక కోర్సులు రూపొందించి స్టార్టప్‌ల వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దాలి.

Posted on 03-09-2016