Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

రాష్ట్రాల సభ రాణిస్తోందిలా!

* ప్రజాస్వామ్యానికి ఊతం... ఎగువసభ

రాజ్యసభ మొట్టమొదటి సమావేశం 68 ఏళ్ల క్రితం- 1952 మే 13న జరిగింది. ద్రవ్య బిల్లుల ఆమోదం వంటి కొన్ని అంశాల్లో మినహా ఇతర అన్ని అంశాల్లో లోక్‌సభ, రాజ్యసభలకు రాజ్యాంగం సమాన అధికారాలు ఇచ్చింది. ద్రవ్య బిల్లును లోక్‌సభ మాత్రమే ఆమోదించాలి. గ్రాంట్ల కోసం కేంద్ర ప్రభుత్వ డిమాండ్లకు ఆమోద ముద్రవేసే అధికారమూ లోక్‌సభకే దఖలుపడింది. ఇలాంటి బిల్లులకు రాజ్యసభ సవరణలు ప్రతిపాదించి కానీ, ప్రతిపాదించకుండా కానీ 14 రోజుల్లో తిప్పిపంపాలి. అలా పంపకపోతే ఆ బిల్లులను రాజ్యసభ ఎలాంటి సూచనలు లేకుండా తిప్పిపంపినట్లుగా పరిగణిస్తారు. ఇంతవరకు ఇలాంటివి 63 సార్లు జరిగాయి. రాష్ట్రాల జాబితాలోని అంశాలపై చట్టాలు చేయడం, కొత్త అఖిల భారత సర్వీసులను సృష్టించడం వంటి కొన్ని ప్రత్యేకాధికారాలు రాజ్యసభకు ఉన్నాయి. లోక్‌సభ రద్దయినపుడు ఆత్యయిక స్థితి ప్రకటన, రాష్ట్రపతి పాలన విధింపు ప్రకటనను జారీ చేసేది రాజ్యసభే. 1949లో రాజ్యాంగ నిర్మాణ సభ చర్చల్లో పార్లమెంటులో రెండో సభ ఉండనవసరమే లేదనే వాదన బలంగా వినిపించింది. రెండో సభ సామ్రాజ్యవాద అవశేషమనీ, ప్రజోపయోగ చట్టాలకు మోకాలడ్డటం తప్ప అది మరేమీ చేయలేదనే ప్రతికూల వాదన గట్టిగానే ముందుకొచ్చింది. ఇలా ఎనిమిది రోజులపాటు వాదప్రతివాదాల తరవాత రాజ్యసభ ఆవశ్యకత గురించి ఎం.అనంతశయనం అయ్యంగార్‌, ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌ చేసిన వాదనలు నెగ్గాయి. రాష్ట్రాల వాణిని రాజ్యసభ వినిపిస్తూ సమాఖ్య స్ఫూర్తిని నిలబెడుతుందని, లోక్‌సభ ఒకవేళ భావోద్వేగంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే రాజ్యసభ సంయమనాన్ని బోధిస్తుందని వారు వాదించారు. అనుభవజ్ఞులు, విజ్ఞానులు, ప్రజ్ఞాశీలుర దృక్పథాన్ని శాసన నిర్మాణ ప్రక్రియకు ఉపయోగించుకోవడానికి ఎగువ సభ తోడ్పడుతుందని నచ్చజెప్పారు. చివరకు వారి అభిప్రాయమే మన్ననకు నోచుకుంది.

రాజ్యసభలో బలాబలాలు
లోక్‌సభ, రాజ్యసభలు పరస్పర భిన్న ఎన్నికల ప్రక్రియలతో రూపొందుతాయి. కొన్ని అంశాల్లో తప్ప మిగతావాటిపై చట్టాలు చేయడానికి, సవరించడానికి రెండు సభల సమ్మతి తప్పనిసరి అని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. లోక్‌సభ నిర్ణీత కాలావధి ముగిసిన తరవాత రద్దయితే, రాజ్యసభ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు లోక్‌సభలో మెజారిటీ ఉన్న ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ కొరవడవచ్ఛు అలాంటి సందర్భాల్లో చట్ట నిర్మాణంలో లోక్‌సభకు రాజ్యసభ అడ్డుతగలవచ్చనే అనుమానాలు, ఆరోపణలు రాకపోలేదు. అవి ఎంతవరకు నిజమో పరిశీలించడం ఉచితంగా ఉంటుంది.

భారత్‌లో 1952లో మొట్టమొదటిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కేవలం 29 ఏళ్లపాటు మాత్రమే రాజ్యసభలో మెజారిటీ ఉంటూవచ్చింది. తదుపరి 39 సంవత్సరాల్లో పాలక పార్టీ ఇక్కడ మైనారిటీలో పడిపోయింది. ముఖ్యంగా గడచిన 31 ఏళ్లలో నిరంతరం మైనారిటీలోనే ఉందని రాజ్యసభ సచివాలయ విశ్లేషణ తెలుపుతోంది. 1952 మే 13 నుంచి ఇంతవరకు రాజ్యసభ మొత్తం 5,472 సార్లు సమావేశమై, 3,857 బిల్లులను ఆమోదించింది. వీటిలో భారతదేశ సామాజిక, ఆర్థిక రూపాంతరీకరణకు సంబంధించిన కీలక బిల్లులెన్నో ఉన్నాయి. వీటన్నింటినీ లోక్‌సభతో చేయీచేయీ కలిపి సాకారం చేసి నవ భారత నిర్మాణంలో రాజ్యసభ ముఖ్య పాత్ర వహించింది. సహకారం, సఖ్యత, సాహచర్యాలకు ప్రతీకగా నిలుస్తూనే, జాతి శ్రేయస్సు కోసం కొన్ని సందర్భాల్లో తన స్వతంత్ర దృక్పథాన్ని చాటుకుంది. కొన్ని చట్టాలపై రెండు సభలకూ భేదాభిప్రాయాలు వచ్చినపుడు వాటిని పరిష్కరించుకోవడానికి సంయుక్త సమావేశాలను ఏర్పాటు చేశారు ఇలాంటిది కేవలం మూడుసార్లు మాత్రమే జరిగింది. మొదటి సంయుక్త సమావేశం 1961లో జరిగింది. 1959నాటి వరకట్న నిషేధ బిల్లును లోక్‌సభ ఆమోదించినా, రాజ్యసభ తోసిపుచ్చడంతో ఈ సంయుక్త సమావేశం నిర్వహించుకోవలసి వచ్చింది. అప్పటి పాలక పార్టీకి రాజ్యసభలోనూ మెజారిటీ ఉండటం గమనార్హం. 1978లో బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ రద్దు బిల్లు, 2002 టెర్రరిజం నిరోధక బిల్లును రాజ్యసభ నిరాకరించినప్పుడు సైతం ఉభయ సభల సంయుక్త సమావేశం జరుపుకోవలసి వచ్చింది. ఈ రెండు సందర్భాల్లో పాలక పార్టీకి రాజ్యసభలో సంఖ్యా బలం లేదు. 1970లో రాజభరణాల రద్దుకు ఉద్దేశించిన 24వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ తిరస్కరించినపుడు అది తిరోగమన పంథాకు పరాకాష్ట అని విమర్శలు వచ్చాయి. గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలకు సాధికారత కల్పించడానికి ఉద్దేశించిన రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను 1989లో తోసిపుచ్చినప్పుడూ ఇలాంటి విమర్శే వచ్చింది. తరవాత ఈ మూడు బిల్లులనూ ఉభయ సభలూ ఆమోదించాయనుకోండి. 1987నాటి అవినీతి నిరోధక బిల్లుతోపాటు కొన్ని ఇతర బిల్లుల ఆమోద ప్రక్రియను రాజ్యసభ ఆలస్యం చేయడం నిజమే. ఈ బిల్లుల విషయంలో లోక్‌సభ తొందరపాటు ప్రదర్శించిందని ఎగువసభ భావించింది. అయితే 1984లో అప్పటి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా ఆగస్టు 25న ఒకే ఒక్క రోజులో అయిదు రాజ్యాంగ సవరణ బిల్లులకు ఎగువ సభ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాజ్యసభలో సంఖ్యా బలం కొరవడినా జీఎస్టీ, తలాక్‌ త్రయం, దివాలా చట్టం, జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ, పౌరసత్వ సవరణ బిల్లుల వంటివి ఎగువ సభ ఆమోదం పొందాయి. దీన్ని బట్టి రాజ్యసభ కొన్ని సందర్భాల్లో స్వతంత్ర పంథాను అనుసరించినా అత్యధిక సందర్భాల్లో పాలక పార్టీకి సహకరించింది. రాజ్యసభ అడ్డంకులు సృష్టించడమే పనిగా పెట్టుకోలేదనడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి?

చర్చలతోనే చట్టాల్లో నాణ్యత
రాజ్యసభ విధినిర్వహణకు పదేపదే అంతరాయం కలగడం ఆందోళనకరం. 1997వరకు 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉత్పాదకత కనబరచిన ఎగువసభ, 1998-2004 మధ్య 87శాతానికి పరిమితమైంది. 2005-2019 మధ్య ఉత్పాదకత 76 శాతమే. 2015 నుంచైతే కేవలం 61శాతం కార్యక్రమాలను మాత్రమే పూర్తిచేయగలిగింది. 1952 నుంచి చట్టాలపై రాజ్యసభ 29శాతం సమయాన్ని వెచ్చించగా, పర్యవేక్షణ పనులకూ అంతే సమయం వెచ్చించడం ఆందోళనకరమే. ప్రభుత్వ వ్యవస్థ జవాబుదారీగా వ్యవహరించేట్లు చూడటానికి రాజ్యసభ 1978-2004 మధ్యకాలంలో 39.5శాతం సమయాన్ని వెచ్చించగా, 2015 నుంచి అది కేవలం 12.34శాతానికి పడిపోయింది. సభకు తరచూ అంతరాయం కలుగుతూ ప్రశ్నోత్తర సమయం వృథా కావడం వల్లే రాజ్యసభ తన విధులను సంపూర్ణంగా నిర్వహించలేకపోతోంది. కీలక అంశాలపై చర్చకు రాజ్యసభ ఎక్కువ సమయం కేటాయించడమూ దీనికి ఒక కారణమే. 1978-2004 మధ్య రాజ్యసభ విధినిర్వహణ సమయంలో 33.54శాతాన్ని ఇటువంటి చర్చలకు, పరిశీలనలకు కేటాయించగా, 2015 నుంచి అత్యధికంగా 46.59శాతం సమయాన్ని వెచ్చిస్తున్నారు. పెద్దగా చర్చలు లేకుండా బిల్లులను ఆమోదించేయడమూ అభిలషణీయం కాదు. అలా చేసే చట్టాల్లో నాణ్యత కొరవడుతుంది. లొసుగులు మిగిలిపోతాయి. చీటికిమాటికి అంతరాయాలు కలిగి నిశిత పరిశీలనకు, చర్చకు తగిన సమయం లేక బిల్లులను హడావిడిగా ఆమోదించేయడం జరుగుతుంది. 1998 నుంచి ఈ ధోరణి ప్రబలడం ఆందోళనకరం. ఏదైనా బిల్లు మంచిచెడ్డలను వాస్తవిక, నిష్పాక్షిక దృష్టితో చర్చించి, లోపాలను సరిదిద్దాలి తప్ప రాజకీయ వాగ్యుద్ధాలతో సభా సమయాన్ని వృథా చేయకూడదు. అనివార్యంగా వచ్చే అంతరాయాలకు, పనిగట్టుకుని సభ సాగకుండా అడ్డుకోవడానికి చాలా తేడా ఉంటుంది. ఈ పరిస్థితి మారాలి. లోతైన చర్చ జరగడానికి అన్ని పార్టీలూ తోడ్పడుతూ రాజ్యంగ స్ఫూర్తిని కాపాడాలి. ఇకనైనా ఉద్దేశపూర్వక అంతరాయాలకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చాలి.

Posted on 13-05-2020