Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

కుటుంబ వ్యవస్థకు కరోనా సవాళ్లు

* నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

మనిషి సంఘజీవిగా ఎదగడానికి ఊతమిచ్చే మొట్టమొదటి సామాజిక సంస్థ కుటుంబం. కొన్నేళ్లుగా కుటుంబ వ్యవస్థ బలహీనపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కుటుంబాల ప్రాముఖ్యాన్ని, ఆ వ్యవస్థలో వస్తున్న మార్పులను తెలియజేయడానికి ఐక్యరాజ్యసమితి 1993 మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది కరోనా ప్రపంచాన్ని చుట్టుముట్టిన తరుణంలో- ‘అభివృద్ధిలో ఉన్న కుటుంబాలు: కోపెన్‌హేగెన్‌, బీజింగ్‌+25’ అనే ఇతివృత్తాన్ని ఎంచుకుంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 25 ఏళ్ల క్రితం కోపెన్‌హేగెన్‌, బీజింగ్‌ సమావేశాల్లో కుటుంబ ప్రాధాన్యం, సామాజిక అభివృద్ధిలో దాని పాత్ర గురించి ప్రముఖంగా ప్రస్తావించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి నాటి తీర్మానాలను ముందుంచుతూ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని దేశాల్లో కుటుంబ వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ఊపందుకున్నాయి. సాంకేతిక రంగం విస్తరించింది. విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. ప్రజల జీవన ముఖచిత్రం మారింది. కుటుంబాల్లో సామాజిక బంధాల కన్నా ఆర్థిక బంధాలకు ప్రాధాన్యమిచ్చే తత్వం పెరిగింది. ఉపాధి నిమిత్తం జరిగే వలసలు కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. సమష్టి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మార్పు చెందాయి. ఫలితంగా సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. పిల్లలు ప్రేమానురాగాలకు, వృద్ధులు ఆలనాపాలనలకు దూరమవుతున్నారు. చైల్డ్‌ కేర్‌ కేంద్రాలకు, వృద్ధాశ్రమాలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 65 శాతం కుటుంబాల్లోనే దంపతులు పిల్లలతో లేదా ఉమ్మడి కుటుంబం కింద జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. దీంతో వృద్ధుల సామాజిక భద్రత సమస్యగా మారిందని హెచ్చరించింది.

కరోనా విపత్తు సందర్భంగా కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ- ఐక్యరాజ్యసమితి తగిన సూచనలు చేసింది. పేదరికం పెరిగి, కుటుంబాలు ఒత్తిడికి లోనై మహిళలు, పిల్లలపై హింస పెచ్చరిల్లుతోంది. ఇంట్లో మహిళలపై పనుల భారం పెరిగింది. కుటుంబ సభ్యుల మధ్య సమానత్వం లేకుండా లింగ సమానత్వం సాధ్యం కాదని ఐక్యరాజ్యసమితి ఈ సందర్భంగా హితవు పలికింది. ఈ కఠిన సమయంలో 2020 కొవిడ్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వ సామాజిక విధానాలు అత్యంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తులు, కుటుంబాల సంక్షేమంపై దృష్టి సారించే విధంగా ఉండాలని; పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులున్న కుటుంబాలకు అండగా నిలవాలని కోరింది. ఆర్థిక, సామాజిక విధానాల్లో మార్పు రావాలని సూచించింది.

భిన్నత్వంలో ఏకత్వ సూత్రాన్ని చాటుతున్న భారతదేశం- ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పుట్టినిల్లు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థే పునాది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మార్పులొచ్చినా- భారత్‌లో కుటుంబాలు అనాదిగా మన పూర్వీకుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులను భవిష్యత్‌ తరాలకు అందజేసే వారసత్వ కేంద్రాలుగా తమ ఉనికిని నేటికీ కొనసాగిస్తున్నాయి. భారత్‌లో ఉమ్మడి కుటుంబాలు పలు కారణాలతో వ్యష్టి కుటుంబాలుగా మారినప్పటికీ- అనేక అంశాల్లో ఉమ్మడితత్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఇదే నేడు కరోనాను జయించడానికి బలాన్నిస్తోంది.

కరోనా కాలంలో భారతీయ కుటుంబాల్లో సంభవించిన మార్పులు పరిశీలిస్తే- ధనిక, పేద తేడా లేకుండా సభ్యులంతా కుటుంబ జీవనంపై సమీక్షించుకునే అవకాశం దొరికింది. బయట విలాస, వినోద కార్యక్రమాలకు స్వస్తి పలికి కుటుంబంతో కలిసి జీవించడానికి అవకాశం ఏర్పడింది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు ఆప్యాయతలు పెరిగాయి. పరిశుభ్రతకు ప్రాధాన్యం పెరిగింది. కుటుంబంలో శ్రమిస్తున్న మహిళలను ఇంటిల్లపాదీ గౌరవించడానికి అవకాశం ఏర్పడింది. చిన్నపిల్లల చిరు పలుకులు, పెద్దవాళ్ల మాటలు వినే అవకాశం దొరికింది. కుటుంబ వ్యవస్థ బలపడటానికి ఇది ఒక శుభ పరిణామమని చెప్పవచ్ఛు కరోనా మహమ్మారి భారతీయ కుటుంబాలకు సవాళ్లనూ విసిరింది. మహిళలపై గృహహింస పెరగడం అందులో ముఖ్యమైంది. జాతీయ మహిళా కమిషన్‌కు పెద్దయెత్తున అందిన ఫిర్యాదులు దీనికి నిదర్శనంగా నిలిచాయి. పేద కుటుంబాల్లో చిన్నపిల్లల్లో పౌష్టికాహార లోపం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు వేధిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కరోనా వ్యాప్తిపై భయాందోళనలు పెరిగి కుటుంబాల్లో అభద్రతా భావం చోటుచేసుకుంటోంది. లాక్‌డౌన్‌వల్ల వలస కూలీల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భారతీయ కుటుంబ జీవనశైలిలో కరోనా మార్పు తీసుకువస్తూ- ఆరోగ్యంపై స్పృహనూ పెంచింది. ఈ సంక్షోభం ముగిసిన తరవాతా ప్రతి కుటుంబం దీన్ని పాటిస్తే భవిష్యత్తులో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోగల శక్తియుక్తులను సాధించగలుగుతాం.

- సంపతి రమేష్‌ మహారాజ్‌
(రచయిత: సామాజిక విశ్లేషకులు)
Posted on 15-05-2020