Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

కక్ష్య తప్పిన విద్యాలక్ష్యాలు


సమూల సంస్కరణలకు సమయం...
గడచిన రెండేళ్ల నుంచి జరుపుతున్న చర్చల సారాంశాన్నంతా క్రోడీకరిస్తూ, కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ విద్యావిధానం ముసాయిదా ప్రకటించింది. టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌ అధ్యక్షతన ఏర్పాటైన సంఘం తయారుచేసిన నివేదిక ఆధారంగా, విద్యావ్యవస్థపై ఆసక్తి కలిగినవారి అభిప్రాయాలు కోరుతూ మానవ వనరుల మంత్రిత్వశాఖ అంతర్జాలంలో దాన్ని పొందుపరచింది. పాఠశాల, ఉన్నత విద్యకు సంబంధించి అనేక అంశాలతో కూడిన ముసాయిదాను ఇదివరకే ప్రకటించారు. ఈ ప్రక్రియలో ఇదే చివరి ముసాయిదా. దీనిపై అభిప్రాయాలు, సూచనలను స్వీకరించి, సమీక్షించిన తరవాత ప్రభుత్వం నూతన విద్యావిధానంపై సమగ్ర ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. కొత్త ముసాయిదాను సంగ్రహంగా ఉండేలా తయారు చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువల ఆధారంగా జాతీయ విద్యావిధానం రూపకల్పనపై దృష్టి సారించారు. కొత్త విద్యావిధానం ద్వారా అయిదు ప్రధాన లక్ష్యాలను సాధించదలచారు. ముసాయిదాలో మొత్తంగా 21 అంశాలను పొందుపరచారు. సుబ్రమణియన్‌ చెప్పినట్లు- మంత్రిత్వశాఖ అంతర్జాలంలో సంక్షిప్త నివేదికను మాత్రమే వెల్లడించింది. మొత్తం నివేదిక ప్రతిని బయటపెడితే ప్రజలకు మరిన్ని విషయాలు తెలిసేవి. అయినప్పటికీ, మూల విషయాలపై అవగాహన కలగడానికి ఈ ముసాయిదా ఉపకరిస్తుంది.

అడుగడుగునా సవాళ్లు
ముసాయిదా ప్రకారం విస్తృతి, నాణ్యత, నిపుణత, ఉద్యోగ సామర్థ్యం, పాఠ్యాంశాల రూపకల్పన, సాంకేతికత, ఉపాధ్యాయ వృత్తిపరమైన అర్హత, బోధన సామర్థ్యం, సమత్వం వంటివి భారతీయ విద్యావ్యవస్థకు పెనుసవాళ్లుగా మారాయి. ఏడు దశాబ్దాలుగా ఇవే అంశాలు చర్చనీయాంశాలవుతున్నాయి. 1964-66 మధ్యకాలంలో కొఠారి కమిషన్‌ విస్తృతంగా అధ్యయనం జరిపి, ఎన్నో విలువైన సూచనలు చేసింది. అవేవీ సరిగ్గా అమలైన దాఖలాలు లేవు. 2009లో విద్యను హక్కుగా ప్రకటించినప్పటికీ, వంద శాతం అక్షరాస్యత అందని మానిపండుగానే మిగిలింది. ఇంచుమించు నూటికి నూరుపాళ్లు అక్షరాస్యత సాధించిన ఆర్మీనియా, క్యూబా, ఎస్తోనియా, హంగరీ, సెర్బియా వంటి చిన్న దేశాలకన్నా భారత్‌ వెనకే (74 శాతం) మిగిలిపోయింది. ప్రపంచ సగటు 86.3 శాతాన్ని చేరుకోలేకపోయాం. ప్రాథమిక విద్యాస్థాయిలోనూ వంద శాతం ప్రవేశాలు సాధించలేకపోతున్నాం. స్థూల ప్రవేశాల శాతం ప్రాథమిక స్థాయిలో 98.1 శాతం. అవి ప్రాథమిక స్థాయిలో 93.3 శాతానికి, మాధ్యమిక స్థాయిలో 73.5 శాతానికి, మాధ్యమికోన్నత స్థాయిలో 49.1 శాతానికి పడిపోతున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న బాలకార్మికుల సంఖ్యను గమనిస్తే, మన ప్రాథమిక విద్యావ్యవస్థలోని డొల్లతనం బయటపడుతుంది. కనీసం ఈ స్థాయిలోనైనా గట్టిగా కృషి చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ మాత్రం బాధ్యత వహించడం లేదు. కేంద్రం ‘సర్వశిక్షా అభియాన్‌’ వంటి పథకాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నా, రాష్ట్రాల స్థాయిలో గట్టి కృషి జరగడంలేదు. అందుకే, ప్రాథమిక స్థాయిలో ‘నిర్బంధ విద్య’ అమలు కావాలంటే ‘ప్రీ స్కూల్‌ వ్యవస్థ’ మీద దృష్టి సారించాలని కమిటీ సూచించింది. ముఖ్యంగా సమీకృత శిశు అభివృద్ధి సేవలు (ఐసీడీఎస్‌)లో భాగమైన అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని సూచించింది. తక్కువ ప్రవేశాలు కలిగిన పాఠశాలలను గుర్తించి, వాటిపై శ్రద్ధ వహించాలని; విద్యాహక్కు చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని; కేంద్రీయ విద్యాలయాలు, జవహర్‌ నవోదయ విద్యాలయాలు, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలను విస్తృతం చేస్తూ, వెనకబడిన ప్రాంతాలపై శ్రద్ధ చూపాలనీ పేర్కొంది. ఈ అంశాలకు సంబంధించి ముసాయిదాలో కొత్తదనం ఏమీ లేదు. పాఠశాల విద్యపై రాష్ట్రాలు దృష్టిసారిస్తే తప్ప పరిస్థితిలో గుణాత్మక మార్పు రాదు. మధ్యలో బడి మానేసేవారి (డ్రాపవుట్ల) శాతం బాగా పెరుగుతుండటం- ఆందోళన కలిగించే అంశం. ఈ సమస్య పరిష్కారానికి ‘బడి పిలుస్తోంది’ వంటి కార్యక్రమాలను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నా, ఫలితాలు ఆశాజనకంగా లేవు. ప్రతి ‘సబ్జెక్టుకు ఒక టీచరు’ ఆశయం ఇంకా విధాన స్థాయిలోనే ఉంది. ఏకోపాధ్యాయ పాఠశాలలను ద్వి ఉపాధ్యాయ పాఠశాలలుగా మార్చే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు ఒనగూడటానికి ఇంకా చాలా సమయం పట్టవచ్చు. ఈలోగా అనేక రాష్ట్రాలు ‘క్లస్టర్‌ విధానం’ ప్రవేశపెట్టాలనుకొంటున్నాయి. దానివల్ల డ్రాపవుట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.
ప్రాథమిక విద్యారంగానికి సంబంధించి ముసాయిదాలో వెల్లడించిన పరిష్కారాలు, విధాన నిర్ణయాలు చాలా సాదాసీదాగా ఉన్నాయి. విద్యా వ్యవస్థలోని వివిధ స్థాయుల్లో అలసత్వం, నిర్లక్ష్యం, అభద్రత భావం పెరిగిపోయిన పరిస్థితుల్లో ముసాయిదాలో సూచనలు మరింత సృజనాత్మకంగా ఉండాల్సింది. పాఠశాల స్థాయిలో ప్రస్తుతం కనీసం 40 శాతం, ఉన్నత విద్యాస్థాయిలో 70 శాతం భాగస్వామ్యం ప్రైవేటు రంగానిదే. వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణ అరకొరగా ఉందన్న విషయం అనేక సంఘటనలు, నివేదికల ద్వారా ప్రస్ఫుటమవుతోంది. ఈ రంగాన్ని సంస్కరించాలంటే కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా కమ్యూనిటీ పాఠశాలల స్థాపనను ప్రోత్సహించడం; గ్రామసభలకు, తల్లిదండ్రులకు స్కూలు యాజమాన్య బాధ్యతలు కట్టబెట్టడం; ప్రభుత్వ నియంత్రణ స్థానంలో, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయడం, పాఠశాల స్థాయిలోనే వృత్తివిద్య విభాగాలను ఏర్పాటు చేయడం; సేవా, ధార్మిక సంస్థలకు, సంఘాలకు విద్యావ్యవస్థలో క్రియాశీల ప్రాతినిధ్యం కల్పించడం వంటి చర్యలు అవసరం. కేవలం వృత్తివిద్యలపైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తూ సంస్థలను ఏర్పాటు చేయాలి. ఇందులో వృత్తివిద్య ప్రధాన అధ్యయనాంశంగా, సాధారణ విద్య ద్వితీయ పఠనాంశంగా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదాను విధాన ప్రకటనగా వెలువరించే క్రమంలో మరింత కసరత్తు జరిపి వినూత్న పథక రచన చేయాల్సి ఉంది.

లోపాలకు కళ్లెం
కొత్త సవాళ్లకు దీటుగా ఉన్నత విద్యకు సంబంధించిన ముసాయిదాను ప్రకటించారు. ఉపాధి అవకాశాల్లో అంతరాన్ని తగ్గించడం, నైపుణ్య భారత్‌ మిషన్‌ ఆధారంగా నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ; వృత్తి, సాంకేతిక విద్యలకు ఇతోధిక ప్రోత్సాహం; జీవిత కాలం చదువు వంటివాటిని ముసాయిదాలో పేర్కొనడం ముదావహం. నేటికీ ఉన్నత విద్యా రంగంలో స్థూల ప్రవేశాల నిష్పత్తి (జీఈఆర్‌) 23.6 శాతం మాత్రమే. ఈ నిష్పత్తి సామాజికంగా వెనకబడిన వర్గాలైన ఎస్‌సీలు (18.5 శాతం), ఎస్‌టీల(13.3 శాతం)లో మరింత తక్కువగా ఉంది. ఈ అసమానత సమస్యను సరిదిద్దే పరిష్కార మార్గాల్లో వేటినీ ముసాయిదాలో ప్రస్తావించలేదు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇష్టానుసారం కొత్త కళాశాలలకు, విశ్వవిద్యాలయాల స్థాపనకు అనుమతులు జారీ చేసేశాయి. వాటికి కల్పించాల్సిన సౌకర్యాలు, నాణ్యత ప్రమాణాలను మాత్రం పట్టించుకోలేదు. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ వంటి సంస్థల పర్యవేక్షణ సైతం నామమాత్రంగా ఉండటంవల్ల పరిస్థితి మరింత దిగజారింది. కేంద్రం జాతీయ విద్యా ప్రకటన ఆమోదించే క్రమంలో ఈ వలయాన్ని ఛేదించే ప్రయత్నం జరగాలి. ‘సెల్ఫ్‌ ఫైనాన్స్‌’ కోర్సుల కోసం నిధులు కేటాయించడంతోపాటు, బోధకులనూ నియమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం తీసుకునే చర్యలవల్ల సానుకూల ఫలితాలు సాకారమవుతాయి. ఉన్నత విద్యా సంస్థలను పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ముసాయిదాలో అభిలషించారు. అందుకోసం అయిదేళ్ల కాలావధిలో దేశవ్యాప్తంగా వందకుపైగా ‘ఇంక్యుబేషన్‌’ కేంద్రాలు నెలకొల్పాలని ప్రతిపాదించారు. ‘పేటెంట్‌’ హక్కుల సాధన ఈ కేంద్రాల పనితీరుకు గీటురాయిగా మారితే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయి. దేశంలోని మొత్తం విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో కనీసం మూడో వంతు (అంటే 13,000)ను ఈ పథకం కిందికి తీసుకు వస్తే తప్ప ఫలితాలు రావు. మరోవంక పరిశోధనలే కీలకాంశంగా ‘విశ్వవిద్యాలయాల’ను స్థాపించాల్సిన అవసరమూ ఉంది. కేంద్రం ఆశిస్తున్న ‘నైపుణ్య భారత్‌’ సాధన నిమిత్తం విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు పరిశోధనకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.
ఉన్నత విద్యలో పాలన వ్యవస్థలను సంస్కరించడం ముసాయిదా ప్రస్తావించిన మరో ముఖ్యాంశం. ఇందుకోసం ‘సివిల్‌ సర్వీసెస్‌’ తరహాలో ‘భారతీయ విద్యా సేవల’(ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌) వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపోస్తోంది. నిజానికి బ్రిటిష్‌వారి కాలంలోనే ప్రజాపాలన సేవల్లో ఒకటిగా విద్యా సర్వీసు సైతం 1896 నుంచి 1924వరకు కొనసాగింది. ప్రస్తుత విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు ఉపకరించే చక్కటి సూచన ఇది. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఈ సర్వీసులకు రెండు మార్గాల్లో అధికారులను ఎంపిక చేస్తే బాగుంటుంది. అనుభవం, విద్యార్హతలు ఉన్న కొందరు విద్యావేత్తలను ఒక భాగంగా, సివిల్‌ సర్వీసెస్‌ తరహాలో ప్రత్యక్ష ఎంపిక విధానం ద్వారా కొందరిని కలిపి భారతీయ విద్యా సేవల వ్యవస్థను రూపొందిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. విధాన ప్రకటనలో ఈ విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. దేశ విద్యావ్యవస్థను సమూలంగా సంస్కరించే మరిన్ని సృజనాత్మక, క్రియాశీల అంశాలను జోడించి ‘విద్యా ప్రకటన’ను జారీ చేయడంపై ప్రభుత్వం శ్రద్ధపెట్టాలి.

Posted on 14-09-2016