Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అక్షరమే తరగని ఆస్తి

* అమ్మభాషను కాపాడుకోవడం అందరి బాధ్యత

‘నాదు దేశము నాదు జాతి నాదు భాష’ అనే అహంకారం ప్రతి ఒక్కరూ ప్రదర్శించాలన్నారు రాయప్రోలు. దేశం, జాతి, భాష... ఈ మూడింటి సంబంధం ముప్పేటలుగా పేనుకొని మానవ అస్తిత్వానికి చిరునామాగా నిలుస్తుంది. అస్తిత్వ పోరాటాలన్నింటికీ భాషే ఉచ్ఛ్వాస. అలాంటి భాష మాతృభాషగా సంక్రమించి ఆ జాతి అస్తిత్వానికి సుస్థిరమైన కోటను నిర్మిస్తుంది. సుఖదుఃఖాల్లో, సంభ్రమాశ్చర్యాల్లో, శరీరంలోని వివిధ నాడులు ఎలా స్పందిస్తాయో అలాగే పుట్టుకతో వచ్చిన భాషా స్పందిస్తుంది. మనం వేరే భాషలో మాట్లాడే ప్రతీ మాట జ్ఞాపకం తెచ్చుకుంటూ మాట్లాడేదే! కానీ మాతృభాష నిద్రావస్థలో సైతం సహజంగా, అసంకల్పితంగా వస్తుంది. మాతృభాషకు, అన్యభాషకు చాలా తేడా ఉంది. మన తెలుగు భాష విషయానికి వస్తే- దేశం అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం జరిగిన ప్రతి ఉద్యమంలోనూ అది ప్రధాన భూమిక వహించింది. ఇప్పటికే పలు రకాల ప్రమాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మన భాషకు తాజాగా యూనికోడ్‌ విషయంలో కొత్త ముప్పు ఎదురవుతోంది.

లిపిని పరిరక్షించాలి
భాషను పరిరక్షించడమంటే భాషను ప్రేమించడమే! అలాంటి మన తెలుగు భాష ఉనికినే రూపుమాపే ప్రయత్నాలు పక్కవాళ్లు చేస్తూ ఉంటే ఊరికే చేతులు కట్టుకొని కూర్చోవడం ఎంతవరకు సబబు? తెలుగులో యూనికోడ్‌ వినియోగం ఎంత అధ్వానంగా ఉందో చూస్తే మనవాళ్లకు మాతృ భాషపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. తెలుగు ఫాంట్ల విషయంలో నేటికీ వ్యాపార ధోరణే రాజ్యమేలుతోంది. యూనికోడ్‌లో పుస్తకాలు అచ్చు వెయ్యాలన్న ఆలోచనగానీ, అచ్చు వేసే నైపుణ్యాలుగానీ మనవాళ్లకు లేవనే విమర్శలూ ఉన్నాయి. ఇటీవల తిరువాయిమొళి, తిరుప్పావై, తిరుప్పల్లాండు మొదలైన దివ్య ప్రబంధ గ్రంథాల్లో విరివిగా వాడే రెండు వర్ణాలను ( ) తెలుగు లిపిలో చేర్చడానికి తమిళులు ప్రయత్నించడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదు. ‘యూనికోడ్‌’ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. ప్రపంచంలో ఏ భాష అయినా ఇందులో సభ్యత్వాన్ని పొందితే, ఆ భాష సాంకేతికంగా పరిపుష్టిని పొందినట్టే లెక్క. తెలుగు భాష కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇందులో సభ్యత్వం తీసుకుంది. అలా తీసుకున్న ప్రతి భాషకూ యూనికోడ్‌ సర్వసభ్య సంఘం కొన్ని సంకేతాలను అందిస్తుంది. వీటిద్వారా విశ్వవ్యాప్తంగా ఒకే విధంగా కంప్యూటర్లలో ఇతర ఉపకరణాల్లో వివిధ భాషల మధ్య వారధి నిర్మించినట్లవుతుంది. భాషను అభివృద్ధి చేసుకోవడానికి; భాషానువాదం, భాషాంతరీకరణం, లిపి మార్పిడి, యంత్రానువాదం మొదలైన అనేక వ్యవస్థల్లో ఈ యూనికోడ్‌ వినియోగం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే కాలాలకు తెలుగు భాషను, సాహిత్యాన్ని అందించేందుకు, శాశ్వత సంరక్షణకు ఇది ఒక్కటే మార్గం. ఇటువంటి యూనికోడ్‌ ప్రతిభాషకూ 128 అక్షరాలను చేర్చుకొనేలా వెసులుబాటు కల్పిస్తుంది. ఏ భాషలో ఎలాంటి వ్యవహారాలు ఉంటాయో గమనించి, ప్రాచీన, శాసన భాషా లిపులను అధ్యయనం చేసి అందులో ఉన్న అక్షరాలన్నింటినీ ఈ యూనికోడ్‌లో చేర్చవచ్ఛు ఆ పట్టికలో మొట్టమొదటి 128 స్థానాలూ ఆంగ్లభాషకు కేటాయించారు. ఆ వరసలో లాటిన్‌, రోమన్‌... ఇలా వివిధ భాషలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగు అక్షరాల స్థానసంఖ్య 3,072-3,200. ఇందులో అక్షరాలే కాదు... అంకెలు, గుణింతాల చిహ్నాలు, ఇతర చిహ్నాలూ- ఇలా ఎన్నో చేర్చారు.

తెలుగు పట్టికలో తమిళ వర్ణాలు
తమిళ భాషలో , అనే రెండు వర్ణాలనుతెలుగులో నాలాయిర దివ్యప్రబంధంలో వాడటం కనిపిస్తుంది. ఆయా ప్రబంధాలను తెలుగులో చదివేటప్పుడు వాటి ఉచ్చారణ సరిగ్గా తెలియక ‘ళ, త్త’ లుగా ఉచ్చరించడం కనిపిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీన వినోద రాజన్‌ అనే తమిళ వ్యక్తి ఇంతకుముందు పేర్కొన్న వైష్ణవ గ్రంథాల ఆధారంగా తెలుగు యూనికోడ్‌ స్థానాల్లో తమిళంలో ఉన్న ఆ రెండు వర్ణాలను చేర్చాలని ప్రతిపాదన చేశారు. స్పందించిన యూనికోడ్‌ సంఘం ఎలాంటి సంప్రతింపులు లేకుండా, ముఖ్యంగా తెలుగువారి అభిప్రాయం తీసుకోకుండానే వాటిని చేర్చేందుకు ఆమోదించింది. అన్యభాషా ధ్వనులు, ప్రవేశించినప్పుడు వాటికి తగిన ప్రత్యామ్నాయాలను స్వీయభాషా లిపి చిహ్నాలతోనే ఏర్పరచుకోవాలి తప్ప ధ్వనులతోపాటు లిపి చిహ్నాలను స్వీకరించడం అశాస్త్రీయం. తద్వారా ఆయా లిపుల నైసర్గిక సంపదను నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రెండు అక్షరాల విషయంలో అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఒక భాషలో వాడే అన్ని ధ్వనులకూలిపి చిహ్నాలు ఉండాలన్న నియమమేమీ లేదు. అన్ని ధ్వనులనూ లిపి ద్వారా సూచించడం కుదరదు. అలాగే ఈ తమిళ వర్ణాలను ‘ళ’ కారంగానూ ‘త్త’ కారంగానూ తెలుగువాళ్లు వాడుతున్నారు. వైష్ణవ గ్రంథాల్లో ఆయా వర్ణాల సహజ ఉచ్చారణ తెలియడం కోసం తమిళ లిపిలో అక్షరాలను ముద్రించేవారు గానీ, వాటికి తెలుగులో లిపి రూపం లేక కాదు. పైగా ఆ అక్షరాలు తెలుగులో ఎప్పుడో ధ్వని పరిణామం పొందాయి. ఇటువంటి అవగాహన లేమివల్ల స్వీయాధిపత్యం చలాయించడం కోసమే ఇలాంటి ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి తెలుగు వారంతా ఏకమై అక్షర ఆస్తిని నిలబెట్టుకోవాలి. ఈ బాధ్యత అందరిదీ.

- డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్‌
(రచయిత- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులు)
Posted on 16-05-2020