Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

కొవిడ్‌ నేర్పిన క్రమశిక్షణ!

* మారుతున్న జీవనశైలి

ప్రస్తుతం ప్రపంచాన్నంతటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి... కరోనా! అందరూ ‘కరోనా’ చేస్తున్న విలయ మారణకాండను తిట్టుకొంటున్నవాళ్లే! దాని పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ఎదురుచూసేవాళ్లే! దాన్ని చంపే వైరస్‌ నాశక వ్యాక్సిన్‌ రాకకై కళ్లల్లో వత్తులు వేసుకొని నిరీక్షిస్తున్నవాళ్లే. సందేహంలేదు. ‘కరోనా’ ఒక మృత్యుకారక భూతం! ఎవరూ కాదనలేరు. కానీ ఈ మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తున్న తరుణంలో మనిషి నేర్చుకొంటున్న గుణపాఠాలను సైతం చర్చించుకోవాలి!

‘కరోనా’ లేని కాలంలో ప్రపంచం ఎలా ఉంది, మానవుడి విచ్చలవిడితనానికి హద్దులు ఉండేవా? నాగరికత పేరుతో మనిషి ప్రవర్తించిన ప్రమాదకర ధోరణులను ఒక్కసారి పరిశీలించాలి. మనిషికి అనేక కారణాలవల్ల క్రమశిక్షణ కొరవడింది. జనసమ్మర్దాల మధ్య జీవనం కొనసాగిస్తూ చేసిన క్రమశిక్షణలేని ప్రవర్తనలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడ చూచినా ఎగబడే స్వభావం మనిషిది. వేచి చూసే ఓపిక శూన్యం. సుఖాలకోసం రాత్రీ, పగలూ తేడా లేకుండా క్లబ్బులలో, పబ్బులలో చేసిన కేళీ విలాసాలు ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. నిరంతరం మద్యపానమత్తులో తూగడం ఎవరిని ఉద్ధరించడానికి? కొంపలన్నీ కొల్లేరవుతున్నా మనిషి అనేక వ్యసనాలకు బానిసగా మారి చేసిన విచ్చలవిడి కరాళనృత్యాలను కరోనా కట్టడి చేసింది. ఇంటి తిండిని మరచిపోయి పూటకూళ్ల అంగళ్లలో భోజనాలు చేస్తూ చెలరేగినవారిని కరోనా ఇంటి తిండికి పరిమితం చేసింది. ఒళ్లూ, డబ్బూ గుల్ల చేసుకొంటూ మనిషి పరిసరాలనే మరచిపోయేవాడు. వ్యక్తిగత శుభ్రతను గాలికి వదిలేసి, అందరికీ తన కల్మషాలను అంటగట్టేవాడు. విందులూ, వినోదాలపేరుతో చేసే ఖర్చుకు అడ్డూ అదుపూ ఉండేది కాదు. పెళ్ళిళ్లలోని విందుభోజనాలలో తినేది తక్కువ, పారేసేది ఎక్కువగా జాతి సంపదను వ్యర్థం చేశారు. వీటన్నింటినీ కరోనా కట్టడి చేసింది. మనిషికి క్రమశిక్షణ నేర్పింది. భౌతికదూరాన్ని పాటిస్తూ భారతీయ సనాతన సంస్కృతి నేర్పిన నమస్కారాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దింది. వ్యక్తిగత శుభ్రతను అనుక్షణం పాటించేలా దారి చూపింది. వ్యక్తిత్వ నైర్మల్యాన్నీ అలవాటు చేసింది.

పూర్వకాలంలో ఇంటిలోని వ్యక్తి బయట తిరిగివచ్చినా, ఇంటిలోనికి కొత్త చుట్టం వచ్చినా, అతిథి ఏతెంచినా మొదట కాళ్లు కడుక్కోవడానికీ, ఆ తరవాత చేతులు కడుక్కోవడానికీ, ఆపైన నోటిని శుభ్రం చేసుకోవడానికీ అర్ఘ్య, పాద్య, ఆచమనీయాలకోసం స్వచ్ఛమైన నీరు ఇచ్చేవారు. ఇది కేవలం మర్యాద మాత్రమే కాదనీ, మర్యాద నెపంతో పూర్వులు ఆరోగ్య సూత్రాలుగా వీటిని పాటించేవారనీ కరోనా పుణ్యమా అని తెలిసింది. ఇప్పుడు అందరూ అలనాటి ఆరోగ్యకరమైన అలవాట్లను స్మరించుకొంటూ, వాటిని పాటించాలని చెప్పడం శుభపరిణామం. ఇంటిలో ఉంటూనే శారీరకారోగ్యాన్ని సాధించే యోగాసనాలూ ఇప్పుడు అలవాటుగా మారుతున్నాయి. పూర్వం యోగులు యోగసాధన ద్వారా చిరకాలం జీవించారనీ, నిత్యనూతనంగా, నిత్యోత్సాహంగా పనిచేశారనీ తెలుస్తోంది. అవే అలవాట్లను ఇప్పుడు ప్రతిమనిషీ పాటించవలసిన అగత్యం ఏర్పడింది. మంచి అలవాట్లు ఎక్కడున్నాసరే, స్వీకరించి, వాటిని అనుసరించాలని కరోనా నేర్పుతున్న పాఠంగా అనుకోకతప్పదు!

ప్రయాణాలలో పాటించవలసిన నియమాలను సైతం ఈ విపత్తు తేటతెల్లం చేసింది. ప్రకృతిలో లభించే ఔషధులు ఎంత విలువైనవో, వాటి వాడకం వల్ల విషక్రిముల నివారణ ఎలా సుసాధ్యమో తెలిసింది. ఆహార పదార్థాలలో కల్తీలు ఎంతటి ప్రాణాంతకాలో తెలుసుకొనేలా చేసింది. పర్యావరణాన్ని రక్షించేందుకు వాతావరణాన్ని ఎంత నిర్మలంగా ఉంచాలో ప్రత్యక్షం చేసి చూపింది. వన్యమృగాలు ఎంతో హాయిగా జీవించగలిగే వాతావరణం ఎలా ఉండాలో చెప్పింది. అనావశ్యక సంచారాన్ని కట్టడి చేసింది. వ్యక్తి, కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం, ప్రపంచం ఎలా హద్దులలో ఉండాలో నియమాలను చూపింది. ఇంటి పరిసరాలలో నిర్మూలించవలసిన కల్మషాలనూ, పాటించవలసిన పరిశుభ్రతలను నేర్చుకొమ్మని ఉపదేశించింది. వాహనాల నియంత్రణవల్ల విష వాయువుల ఉద్గారాలు అంతరించి, ప్రకృతి ఎలా పులకరిస్తున్నదో కళ్లకు కట్టే విధంగా చూపింది. పుడమిని ఆవరించి ఉన్న రక్షణాత్మక ‘ఓజోన్‌’ పొరలో ఏర్పడిన రంధ్రం ఎలా క్రమంగా తగ్గిపోయి, భూగోళాన్ని చల్లగా కాపాడిందో చూపింది. మనిషి ఆహారపు అలవాట్లలో ఏవి మంచివో, ఏవి కాదో తెలుసుకునే వ్యవధిని ఇచ్చింది. ఇంటిలోనే ఉంటూ కుటుంబసభ్యులతో కలిసి పంచుకొనే ఆనందానుభూతులు సైతం జీవితానికి అవసరమని తెలిపింది. ఆపదలు ఏర్పడినప్పుడు తోటివారిని ఎలా ఆదుకోవాలో సూచించింది. బతుకంటే కేవలం భోగాలూ, విలాసాలే కాదనీ, నిరాడంబరత, తృప్తి, సంతోషం, ఆరోగ్యం అని చాటింది. గుట్టలు గుట్టలుగా సంపాదించిన సంపదలు మనిషి ఆనందానికి ఉపయోగపడవనీ, త్యాగంలోనే జీవనసార్థకత ఉందనీ తెలిపింది. ఆత్మోన్నతికీ, ఆత్మవికాసానికీ సైతం సమయం వెచ్చించాలని హెచ్చరించింది. ప్రపంచాన్ని రక్షించాలన్నా, భక్షించాలన్నా ఒక్క క్రిమి చాలు అని గుణపాఠం చెప్పింది! ‘కరోనా’ ఎలా పుట్టిందో, ఎక్కడ పుట్టిందో అనవసరం. దాని నివారణకోసం మాత్రం మనిషి ఎన్నో గుణపాఠాలు నేర్చుకొంటున్నాడు.

- తిగుళ్ల అరుణకుమారి
Posted on 16-05-2020