Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

గతానుభవాల క్రోడీకరణ

* పాఠాలు నేర్వాల్సిన యువత

కొవిడ్‌ వ్యాధి ఎక్కువగా వృద్ధులనే బలిగొంటుందని, యువతకు దాన్ని తట్టుకునే సహజ శక్తి ఉందని వింటున్నాం. భారత జనాభాలో 65 శాతం 35 ఏళ్ల లోపు యువజనులే కావడం మనకు వరమని సంబరపడుతున్నా, వయసుతో వచ్చే అనుభవాన్ని కరోనా కాటువల్ల కోల్పోతున్నామన్నది కలవరపరచే వాస్తవం. ప్రపంచయుద్ధం, స్వాతంత్య్ర పోరాటం, దేశవిభజన తెచ్చిపెట్టిన హింసాయుత మత కలహాలను ముందుతరాల నేతలు, అధికారులు చూశారు, నిభాయించారు. స్వాతంత్య్రానంతరం కరవుకాటకాలు, ఆహార కొరత, ఇరుగుపొరుగు దేశాలతో యుద్ధాలు, తుపానులు, భూకంపాల వంటి ప్రకృతి ఉత్పాతాలను తట్టుకుంటూనే ఆనకట్టలు, పరిశ్రమలు స్థాపిస్తూ నవ భారత నిర్మాణానికి పాటుపడ్డారు.

స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశజనాభా 31.4 కోట్లు మాత్రమే. 1960ల వరకు దేశంలో తరచూ కలరా వ్యాధి ప్రబలుతూ ఉండేది. వృద్ధ తరంవారికి వాటిని అధిగమించిన అనుభవం ఉంది. 1991 ఆర్థిక సంస్కరణల తరవాత కొత్తతరం నాయకులు, నిర్వాహకులు తెరమీదికి వచ్చారు. వారి సీనియర్లు మహా అయితే 1980లలో పగ్గాలు చేపట్టి ఉంటారు. ముందు తరాలవారికి ఎదురైన సవాళ్లు వీరికి పూర్తిగా కొత్త. దీంతో కొవిడ్‌ వంటి అనూహ్య విపత్తులు వచ్చిపడితే వాటిని ఎదుర్కోవడానికి కావలసిన భావనలు, అనుభవాలు వీరికి కొరవడ్డాయి. ముందు తరాలవారు మరణించడం, లేదా పదవీవిరమణ చెందడం వంటి కారణాలతో వీరికి మార్గదర్శకత్వం ఇచ్చేవారు లేకుండాపోతున్నారు. భారతీయ వ్యవస్థలో కీలకమైన ఉద్యోగి-అధికారి గణం(బ్యూరాక్రసీ)లో, సైన్యాధికార యంత్రాంగంలో ఈ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 1971 బంగ్లాదేశ్‌ యుద్ధమే మన సైన్యం నిర్వహించిన చిట్టచివరి ప్రధాన యుద్ధం. రేపుటాంకులు, యుద్ధ విమానాలు, నౌకలతో శత్రుదేశంపై విరుచుకుపడాలంటే వారికి అనుభవంగల నాయకత్వం పూర్తిస్థాయిలో లభ్యం కాకపోవచ్చు. చాలా సంస్థలు తమ చరిత్ర, అనుభవాలు, స్మృతులను నిక్షిప్తం చేసుకున్నాయి. అవి భావితరాలకు కరదీపికలవుతాయి. రేపు వచ్చిపడే ఉపద్రవాలు, సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడతాయి. మనం ఇప్పటికైనా మేల్కొనాలి. వేగంగా అనుభవాలు, విజ్ఞాన సంపద, స్మృతులను భావి కార్యాచరణకు అందించే పనిని మొదలుపెట్టాలి.

పూర్వం సంభవించిన ఉత్పాతాలు, ప్రకృతి వైపరీత్యాలు, వాటిని మనం అధిగమించిన తీరును కాలబద్ధంగా రికార్డుల్లో నమోదు చేయాలి. నిన్నమొన్నటి వరకు దస్త్రాల్లో నమోదైనవాటిని డిజిటల్‌ పద్థతిలో చేయవచ్చు. పాత రికార్డులను డిజిటలీకరించవచ్చు. బ్రిటిష్‌ వలసపాలననాటి రికార్డులను, నివేదికలను 2015 నుంచే డిజిటలీకరించడం మొదలుపెట్టింది. ఈ ప్రక్రియలో పుస్తకాలు, పాత రికార్డులతోపాటు ఫైళ్ళ మీద రాతలు, గతంలో ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లను ఎదుర్కొన్న తీరులో చేసిన పొరపాట్లు, సాధించిన విజయాలను, వాటికి సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలనూ నిక్షిప్తం చేయాలి. పాత కాలపు దస్త్రాలు భారత్‌లో పలుచోట్ల లభ్యమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. మచిలీపట్నంలోని ఈ కార్యాలయంలో 1840నాటి ఈస్టిండియా కంపెనీ దస్త్రాలు ఉన్నప్పటికీ, వాటి సంరక్షణ చూసేవారు లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ రికార్డులను సత్వరం డిజిటలీకరిస్తే ముందు తరాలకు పరిశోధనాగారంగా అవి ఉపయోగపడతాయి. ఇలాంటి పురాతన పత్రాలు అనేక జిల్లా కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. బ్రిటిష్‌ వారికన్నా ముందు మొఘలులు, విజయనగర, మరాఠాల పాలనానుభవం, శాసనాలు, కైఫీయతులు, ఫర్మానాల రూపంలో ఎక్కడెక్కడో పడి ఉన్నాయి. ఇంకా మౌఖిక, జానపద, గ్రామీణ సాహిత్యం, పత్రాల్లోనూ పూర్వకాలంనాటి వైపరీత్యాల గురించి, వాటిని నిభాయించిన తీరు గురించి ఎంతో సమాచారం నిక్షిప్తమైఉంది. వీటి సారాన్ని మన పాఠ్య గ్రంథాల్లో పొందుపరచి బాలలు, యువతకు బోధించాలి. మన ఉద్యోగులు, అధికారులకు భావి సవాళ్లను ఎదుర్కోవడంలో శిక్షణ ఇచ్చేందుకు పురాతన నివేదికలను ఉపయోగించుకోవచ్చు. కొవిడ్‌ వంటి అనూహ్య మహమ్మారులను అధిగమించడానికి తోడ్పడతాయి.

Posted on 17-05-2020