Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ముంగిట్లో ముప్పు- విస్మరిస్తే తప్పు!


భారతదేశంలో ఏటా వరదలు లేదా కరవు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ విపత్తులు పెద్దయెత్తున ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తున్నాయి. వాటివల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి. అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థమీదే పెనుభారం పడుతోంది. వరదల కారణంగా పరిమిత ప్రాంతంలోనే నష్టం కలుగుతుంది. కరవు విశాల భూభాగంలో భారీ సంఖ్యలో ప్రజానీకాన్ని కాటేస్తుంది. వరదలు, కరవులకు, వాటివల్ల ఏర్పడుతున్న కష్టనష్టాలకు చాలావరకు మానవ చర్యలే కారణం. దేశంలో వరద పీడిత ప్రాంత పరిధి 1978లో 3.3 కోట్ల హెక్టార్ల నుంచి 2010లో దాదాపు అయిదుకోట్ల హెక్టార్లకు పెరిగినట్లు ప్రణాళిక సంఘ కార్యాచరణ బృందం 2011లో తెలిపింది. విస్తృత స్థాయిలో పర్యావరణం ధ్వంసమైందనడానికి ఇది నిదర్శనం. ఈ పరిస్థితి ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. 1953-2010 మధ్యకాలంలో వరదల కారణంగా రూ.8.12 లక్షల కోట్ల మేరకు (2011 నాటి ధరల ప్రకారం) నష్టం సంభవించినట్లు రాష్ట్రాలు నివేదించాయని కార్యాచరణ బృందం వెల్లడించింది. వివిధ వరద నివారణ కార్యక్రమాల కోసం 2010 వరకు రూ.1.26 లక్షల కోట్లు వ్యయం చేసినట్లు రాష్ట్రాలు తెలిపాయి. కాలం గడుస్తున్నకొద్దీ నష్టాలు పెరుగుతూ వచ్చాయి. ఐక్యరాజ్య సమితి విపత్తు నష్టనివారణ కార్యాలయం విడుదల చేసిన ప్రపంచ మదింపు నివేదిక (2015) ప్రకారం- వివిధ ఉత్పాతాల కారణంగా భారతదేశం ఏటా రూ.65 వేలకోట్ల మేరకు ఆర్థికంగా నష్టపోతోంది. అందులో వరదల వల్ల సంభవిస్తున్న నష్టమే రూ.50 వేలకోట్లు. విపత్తుల వల్ల సంభవిస్తున్న మరణాల్లో 31 శాతానికి వరదలే కారణం. ఆ నివేదికలో తుపాను నష్టాన్ని విడిగా చూపించారు. అది ఏటా రూ.3,500 కోట్ల వరకు ఉంది. విపత్తు మరణాల్లో 16.7 శాతం తుపానుల వల్లే సంభవిస్తున్నాయి. కరవు నష్టాల విషయంలో మాత్రం నిర్దిష్ట అంచనాకు రాలేకపోయారు. అవి విశాల భూభాగంలో దీర్ఘకాలంపాటు సంభవించడమే అందుకు కారణం. భారతదేశంలో 2014, 2015లలో వరసగా రెండేళ్లపాటు సంభవించిన కరవు, 10 రాష్ట్రాల్లోని 256 జిల్లాల్లో సుమారు 33 కోట్ల ప్రజానీకం జీవితాల్లో కల్లోలం రేపింది. ఈ కరవు కారణంగా మొత్తం రూ.6.5 లక్షల కోట్ల మేరకు నష్టం సంభవించి ఉండవచ్చునని వాణిజ్య సంస్థ ‘అసోచామ్‌’ అంచనా వేసింది. కరవు వల్ల దాదాపు 1.2 కోట్ల టన్నుల మేరకు ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. ఫలితంగా ఆహార ధాన్యాలు, ముఖ్యంగా పప్పు దినుసుల ధరలు భారీగా పెరిగాయి.

ఆర్థిక మూలాలకు ఎసరు
భారతదేశం వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏటా వేలకోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నప్పటికీ, సరైన ప్రణాళిక లేకపోవడంవల్ల అంతిమంగా కష్టనష్టాలే మిగులుతున్నాయి. వరదలు, కరవుల ప్రభావాన్ని తగ్గించి, డబ్బును సద్వినియోగం చేసుకోవడానికి కొత్త దృక్పథాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ప్రకృతి విపత్తుల వల్ల సంభవిస్తున్న వాస్తవిక నష్టాలు అంతా ఇంతా కాదు. సంపాదనపరుల్ని కుటుంబాలు కోల్పోతున్నాయి. ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. విద్యావకాశాలు చేజారుతున్నాయి. అప్పుల భారం పెరుగుతోంది. ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే, విపత్తు నష్టాల మొత్తం కళ్లు బైర్లుకమ్మే స్థాయిలో ఉంటుంది. కానీ, మొత్తం ఆర్థిక వ్యవస్థతో పోల్చిచూసి, వాటిని పెద్దగా పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు తరచు వరదల బారిన పడుతున్నాయి. ఫలితంగా వాటి ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోతున్నాయి. ఈ పరిస్థితి నిస్సహాయతకు అద్దంపడుతోంది. బాధ కలిగిస్తోంది. ముఖ్యంగా మధ్య, దిగువ తరగతులకు చెందిన కుటుంబాలకు కుటుంబాలే కూలిపోతున్న తీరు కలచివేస్తోంది. ఉదాహరణకు నిరుటి చెన్నై వరదలే తీసుకొందాం. వాటి కారణంగా దాదాపు లక్ష నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్థల యజమానులు భారీగా నష్టపోవడానికి ప్రధాన కారణం- విపత్తు నష్టాల బారినుంచి ఆ నిర్మాణాలను కాపాడుకోవడానికి బీమా చేయించకపోవడమే. చెన్నై వరదల కారణంగా ఆయా నిర్మాణాలకు రూ.20 వేలకోట్ల దాకా నష్టం వాటిల్లింది. అందులో బీమా ద్వారా పొందగలిగిన నష్టపరిహారం రూ.1000 కోట్లు మాత్రమే. తరుచూ వరదల వల్ల ప్రజోపయోగ మౌలిక వసతులు దారుణంగా దెబ్బతింటున్నాయి. వాటి మరమ్మతుల కోసం భారీ మొత్తంలో నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఇతరత్రా మౌలిక వసతుల కల్పన కోసం వ్యయం చేయాల్సిన నిధులను ప్రభుత్వం ఈ మరమ్మతుల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
ఇటీవలి సంవత్సరాల్లో వరదల గతిరీతులు విపరీతంగా మారాయి. ప్రత్యేకించి నగరాలు తరచు వరదల గుప్పిట్లో చిక్కుకొంటున్నాయి. గడచిన 12 నెలల కాలంలో చెన్నై, హైదరాబాద్‌ వంటి మహానగరాలే కాకుండా ఇండోర్‌, నెల్లూరు వంటి చిన్న నగరాలు సైతం వరదల వల్ల కకావికలమయ్యాయి. ఈ వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు బాగా పెరిగి, ఆర్థిక వ్యవస్థ మీదా పెనుభారం పడుతున్న పరిస్థితుల్లో, ప్రభుత్వ ఆలోచనల్లోనూ మార్పు రావాలి. నష్టం సంభవించాక సహాయ చర్యలు ఎలాగూ తప్పవు. నష్టనివారణ కార్యక్రమాల కోసం మరిన్ని నిధులు కేటాయించడం తక్షణావసరం. ఐక్యరాజ్య సమితి పేర్కొన్నట్లు విపత్తు నష్ట తీవ్రత తగ్గించడానికి కొత్త విధానం రూపొందించాలి. సంస్థాగత చట్రాన్ని ఏర్పాటుచేసి, పకడ్బందీ చర్యలు చేపట్టాలి. సుస్థిరాభివృద్ధి దిశలో సాగిపోవడానికి ఇవి దోహదపడతాయి. ముఖ్యంగా, సమాజం యావత్తూ ఒక్కుమ్మడిగా కదలి నివారణ చర్యలు చేపడితేనే, విపత్తు నష్టాలు కనీస స్థాయికి తగ్గుతాయి. వరద, కరవు నివారణ చర్యలు కేవలం ప్రభుత్వ బాధ్యత అని భావించడంవల్లే చిక్కొచ్చిపడుతోంది.
నీరు వంటి సహజ వనరులను సరిగ్గా నిర్వహించుకోలేకపోతున్నాం. పట్టణీకరణా ఒక పద్ధతి లేకుండా సాగిపోతోంది. పట్టణ ప్రాంతాలు, నగరాలు తరచుగా వరదల పాలబడటానికి ఇవి ప్రధానంగా కారణమవుతున్నాయి. పట్టణాలకు సంబంధించి సరైన ప్రణాళిక కొరవడినందువల్లే చినుకుపడితే వణుకుపుట్టే దురవస్థ దాపురించింది. ఇటీవలి కాలంలో నగరాలు బాగా విస్తరించాయి. దాంతోపాటే ఆ నగరాల్లో భూముల విలువలు ఇంతలంతలయ్యాయి. దాంతో ప్రతీ అంగుళం భూభాగాన్ని నిర్మాణం కోసమే ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరూ భావించే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో మురుగుకాల్వల నిర్వహణ, నీటినిల్వ, వాన నీటి సంరక్షణ వంటి అంశాలను పక్కన పెడుతున్నారు. ఇళ్లు, అపార్టుమెంట్లు లేదా వాణిజ్య భవనాలు... ఇలా నిర్మాణాలు ఏవైనా పద్ధతి అదే. వరదలు, కరవుల బారి నుంచి బయటపడేందుకు కావలసిన చర్యలను పెద్దపెద్ద వ్యాపార సంస్థలూ చేపట్టడంలేదు. పరిసరాలన్నవి ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా జీవించడానికి అనువుగా ఉండాలన్న మాట మరచిపోతున్నాం. ఇదివరకు నగరాల్లో విరివిగా ఉద్యానాలు ఏర్పాటుచేసేవారు. చెరువులూ ఉండేవి. మడ అడవులూ పెంచేవారు. అవి సహజసిద్ధ నిరోధకాలుగా పనిచేసి, వరదలను అడ్డుకొనేవి. ఇప్పుడు, ఎక్కడ చూసినా దురాక్రమణే. చెరువులు లేవు, అడవులూ లేవు. ఎంతో రాజకీయ సంకల్పం ఉంటే తప్ప ఈ పరిస్థితిని అధిగమించలేరు. వివిధ స్థాయుల్లో స్వప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నవారు బలంగా ఉన్నప్పుడు, వారిని కాదని రాజకీయ నాయకత్వం దీటుగా ముందడుగు వేస్తుందని భావించలేం. అలా జరగనంతకాలం పట్టణ ప్రాంతాలు, నగరాలు తరచు వరదలతో సతమతం కావాల్సిందే. మాగాణి భూములు తగ్గిపోవడం మరో సమస్య. ప్రపంచవ్యాప్తంగా కోస్తా ప్రాంతాల్లోని మాగాణి భూములు 1980-2000 మధ్యకాలంలో 52 శాతం దాకా పడిపోయాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇది ఆందోళనకర పరిణామం.

నీటి నిల్వతో బహుళ ప్రయోజనాలు
భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా జనవనరులు ఉపయోగించుకొంటోంది. వాటిని వినియోగిస్తున్న తీరు మాత్రం అత్యంత అసమర్థంగా ఉంది. అందుకే తరచు వరదలు, కరవులు దాపురిస్తున్నాయి. దేశంలో, ముఖ్యంగా ద్వీపకల్ప ప్రాంతంలో వాన నీరే ప్రధాన జల వనరు. దేశంలో దాదాపు 75 శాతం వర్షపాతం నైరుతి రుతుపవనాల ద్వారానే సంభవిస్తోంది. ఈ వర్షమంతా మూడు నాలుగు నెలల్లోనే కురుస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో వర్షం కురిసినప్పుడు, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి రాష్ట్రాలు ముందుగానే సిద్ధపడాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన పకడ్బందీ వ్యవస్థలను నేటిదాకా పూర్తిస్థాయిలో ఏర్పరచకపోవడం పెద్ద లోపం. ప్రస్తుత చెరువులు, తటాకాలు, జలాశయాలకు తోడు మరిన్ని బ్యారేజీలు, చెక్‌డ్యాములు, రిజర్వాయర్లు తదితర నీటినిల్వ ప్రాంతాల కోసం భారీయెత్తున నిధులు కేటాయించవలసిన అవసరం ఉంది. పెద్దపెద్ద ప్రాజెక్టులమీదే దృష్టి కేంద్రీకరిస్తున్న ప్రభుత్వాలు, వీటిని విస్మరిస్తుండటం దురదష్టకరం. ప్రస్తుత కాల్వల వ్యవస్థను పటిష్ఠపరచడంతోపాటు నదుల నుంచి నీటిని మరింత సమర్థంగా వినియోగించుకొనేందుకు వీలుగా టెలిమెట్రి కేంద్రాలను ఏర్పాటుచేయడం ప్రయోజనదాయకం. ప్రస్తుత నదీ వ్యవస్థల పరిస్థితి దారుణంగా తయారైంది. కరవు పరిస్థితుల్లో, ఎండాకాలంలో నదీవ్యవస్థలు పూర్తిగా ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో భారీగా వానలు కురిస్తే, ఎగువ నుంచి వరద నీరు వస్తే, మిగులు జలాల్ని సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోంది. ఒక్క గోదావరి నది నుంచే ఏటా 1,500 నుంచి 3,000 శతకోటి ఘనపుటడుగుల దాకా నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నట్లు అంచనా. ఆయా ప్రాంతాలు, ప్రదేశాలకు నిర్దిష్టంగా వాతావరణ సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం రాష్ట్రాన్నో, జిల్లానో పరిగణనలోకి తీసుకొని వాతావరణ సూచన చేయడంవల్ల ప్రయోజనం ఉండదు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అందుకు వీలుగా వాతావరణ విభాగానికి ప్రభుత్వం భారీయెత్తున నిధులు కేటాయించాలి. మన ఆలోచనలన్నీ ప్రస్తుత అవసరాల చుట్టే తిరుగుతుంటాయి. కరవులు, వరదల కారణంగా భవిష్యత్తులో మరింత నష్టం జరగకుండా చూసేందుకు గట్టి చర్యలు చేపడితేనే ఫలితం ఉంటుంది. అన్నిస్థాయుల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు చేపడితే మంచిది. ఈ విపత్తులవల్ల వాటిల్లే నష్టాన్ని పూడ్చడానికి ఎంత మొత్తం అవసరం అవుతుందన్నదానిపై ముందస్తు అంచనాతో ఇలాంటి కార్యక్రమాలు రూపొందించాలి. విభిన్న స్థాయుల్లో ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం జవాబుదారీతనమన్నదే ఎక్కడా కనిపించడంలేదు. చెరువులు, కుంటలు, నదీతీర ప్రాంతాలు ఎన్నోచోట్ల కబ్జాలకు గురవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులే కాకుండా స్వయంగా ప్రభుత్వ విభాగాలు సైతం వాటిని కబ్జా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ బయటపడినా, టౌన్‌ ప్లానింగ్‌ తదితర అధికారులను ఎంతమందిని ఇంతవరకు బాధ్యులుగా తేల్చారు, ఎవరిమీద చర్యలు చేపట్టారు? విపత్తుల కోరల్లో నుంచి ప్రజలు బయటపడాలంటే ఈ పరిస్థితి మారాల్సిందే. అందుకు వివిధ స్థాయుల్లో ప్రయత్నాలు ప్రారంభంకావలసిన సమయమిదే!

Posted on 15-10-2016