Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

వణికే చేతికి వూతకర్ర!


* వృద్ధులకు ‘వయోశ్రీ’ ఆసరా
‘దేశంలోని 50 శాతానికి పైగా వృద్ధులు వేధింపులకు, ఇతర ఇబ్బందులకు గురవుతున్నారు. కుమారులు, కోడళ్లు, ఇతర బంధువుల దూషణలు, చిత్రహింసల వల్ల వారు నానా ఇబ్బందులు పడుతున్నారు...’- ఇవి ‘హెల్ప్‌ ఏజ్‌ ఇండియా’ తాజా సర్వేలో వెల్లడైన అంశాలు. జాతిసంపదగా భావించే వయో వృద్ధులకు ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడం ఆందోళనకర పరిణామం. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇటీవల ఆవేదన వ్యక్తంచేశారు. వృద్ధుల్ని ఆదుకోవడం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల కర్తవ్యం. వయసు రీత్యా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే నిరుపేద వృద్ధుల్ని ఆదుకొనేందుకు, వారికి మనోధైర్యం కల్పించేందుకు- కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ‘జాతీయ వయోశ్రీ యోజన’ పేరిట దీన్ని అమలు చేయనున్నారు.

సామాజిక భద్రతే ప్రధానం
ప్రపంచంలోనే అత్యధిక వయోవృద్ధుల జనాభా భారతదేశంలో ఉంది. ప్రస్తుతం 13 కోట్లమంది వయసు పైబడిన వారున్నారు. 2050 కల్లా ఆ సంఖ్య 32.3 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించింది. దేశంలోని వయోవృద్ధుల్లో 71 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మిగిలిన 29 శాతం నగరాల్లో, పట్టణాల్లో ఉన్నారు. ప్రతి అయిదుగురిలో ఒకరు ఒంటరిగా నివసిస్తున్నారు. సమితి నివేదిక ప్రకారం- 2050లో వయసు పైబడినవారిలో 80 శాతం చైనా, భారత్‌లలోనే ఉంటారు. శతాధిక వృద్ధుల సంఖ్యలో చైనాను భారత్‌ మించిపోనుంది. దేశంలోని వయోవృద్ధుల్లో 51 శాతానికి పైగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. పలు సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. వైకల్యాలు, వ్యాధులతో పాటు ఆర్థికంగా కష్టనష్టాల పాలవుతున్నారు. అజాగ్రత్త, నియంత్రణ కోల్పోవడం, అశక్తత వంటివి వారికి ఇబ్బందికరంగా మారాయి. పిల్లలే వారికి ఆసరా కావడంలేదు. స్వార్థం, మానవతా విలువలు లోపించడం, అనుబంధాలు కోల్పోవడం వంటి కారణాల వల్ల అనేకమంది తమ తల్లిదండ్రుల పోషణను పట్టించుకోవడం లేదు. వృద్ధుల్ని అగౌరవపరచడం, దూషించడం, శారీరకంగా హింసించడం వంటి హేయమైన చర్యలకు పాల్పడుతున్నారు. వృద్ధుల సంరక్షణను చాలా కుటుంబాలు ఓ బాధ్యతగా స్వీకరించడం లేదు. తప్పించుకునేందుకే యత్నిస్తున్నాయి. వృద్ధుల్ని ఇంట్లో కాకుండా ఇతర చోట్లకు, చివరికి ఆశ్రమాలకు పంపించడానికే మొగ్గు చూపుతున్నారు. పిల్లల నిరాదరణ కారణంగా పలువురు వృద్ధులకు ఒంటరితనం శాపంగా మారింది. సామాజిక భద్రత పథకాలు వారికి అంతగా ఉపయోగపడటం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా పింఛను వస్తోంది. కేంద్రం 60 ఏళ్లు దాటినవారికి రూ.300నుంచి రూ.400వరకే సాయం అందిస్తోంది. ఆయా రాష్ట్రాలు మరో వంద రూపాయలు కలిసి ఇవ్వాలని సూచిస్తోంది. దీంతో అధికశాతం రాష్ట్రాల్లో పింఛను నెలకు రూ.500 మాత్రమే లభిస్తోంది. దేశంలో 15 కోట్ల మంది వృద్ధులుంటే, కేవలం 14.18 లక్షల మందికి మాత్రమే కేంద్రం ‘ఇందిరాగాంధీ సామాజిక పింఛను పథకం’ అమలు చేస్తోంది. వృద్ధులైనవారికి బియ్యం పంపిణీ పథకం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. నిత్యావసరాలు అందడంలేదు. దేశంలో వృద్ధాశ్రమాల సంఖ్య చాలా తక్కువ. దేశవ్యాప్తంగా అవి 1200 లోపు నమోదై ఉన్నాయి. పదవీ విరమణ రోజునే ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలూ కల్పించాల్సి ఉన్నా- కేంద్రంలోగాని, రాష్ట్రాల్లోగాని సక్రమంగా అమలుకావడం లేదు.
మన దేశంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ కోసం కేంద్రప్రభుత్వం 2007లో చట్టాన్ని తెచ్చింది. ‘తల్లిదండ్రులు, పెద్దల పోషణ, సంక్షేమ చట్టం’ పేరిట గల ఈ చట్టాన్ని అమలు చేయాలా వద్దా అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేసి రాష్ట్రప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలులోకి తీసుకురావచ్చు. ఇప్పటికి 22 రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. వారసుల నుంచి నెలవారీ భరణాన్ని ఇప్పించడం; అనాథాశ్రమాల్లో ఉచితంగా భోజన, వసతులు కల్పించడం; వైద్య ఆరోగ్య సదుపాయాలు; తల్లిదండ్రుల్ని పట్టించుకోనివారికి మూడు నెలల వరకు జైలు, జరిమానా; భరణాన్ని ఎగ్గొట్టినవారికి నెల రోజుల వరకు జైలుశిక్ష వంటి కీలక అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి. చట్టాలున్నా వాటి అమలు సరిగ్గా జరగడంలేదు. ఫిర్యాదుల స్వీకరణకు సరైన యంత్రాంగం లేదు. దీంతో కొందరు బాధితులు పోలీసుస్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. వారి నుంచి సకాలంలో స్పందన లభించడం లేదు. కొందరు వృద్ధులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. వారికి రైళ్ల ఛార్జీలో యాభై శాతం రాయితీ ఇచ్చినా, అది సులభతరంగా లేదు. రైళ్లలోనూ వారికి సీట్లు లభించడం లేదు. బస్సుల్లోనూ ఇదే పరిస్థితి. పింఛన్ల కోసం బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా, ప్రత్యేక సేవలు అందడం లేదు. న్యాయస్థానాలు వయోవృద్ధుల సంరక్షణకు సంబంధించిన అంశాలపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తున్నాయి. యుక్తవయసుకు వచ్చి, విచక్షణ జ్ఞానం కలిగిన పిల్లలు వృద్ధులైన తమ తల్లిదండ్రుల్ని హింసిస్తున్న సందర్భాల్లో ఆ సంతానాన్ని తక్షణం ఆ ఇంటినుంచి వెళ్లగొట్టేయాలని ఇటీవల దిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. అంతేకాదు, ఆ వృద్ధులుంటున్న ఇంటి నుంచి సంతానాన్ని ఖాళీ చేయించాలనీ నిర్దేశించింది. పిల్లలతో కలిసి ఉంటున్న ఆ ఇంటిపై వయోవృద్ధులైన తల్లిదండ్రులకు చట్టపరమైన హక్కుంటే చాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి తీర్పుల వల్ల కొంత మార్పు కనిపిస్తోంది.

చైనా పెద్దపీట
వృద్ధుల సంరక్షణకు చైనా విశేష ప్రాధాన్యమిస్తోంది. ఆ దేశంలోని ప్రతీ ఒక్కరినీ పింఛను పథకం పరిధిలోకి చేర్చింది. విస్తృతంగా సమీకృత ఆశ్రమాల్ని ఏర్పాటు చేసింది. వాటిలో వసతితో పాటు అన్ని సౌకర్యాలనూ కల్పించింది. వారిని చైనా- జాతి వనరులుగా గుర్తిస్తోంది. అభివృద్ధి మండలిలో ఇప్పటికే భాగస్వామ్యం కల్పించింది. వృద్ధుల సంక్షేమానికి అక్కడ ఏటా పదివేల కోట్ల రూపాయల మేర వెచ్చిస్తున్నారు. చైనాను ఆదర్శంగా తీసుకొని, అలాంటి విధానాల్ని మన దేశంలోనూ అమలు చేయాల్సి ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనాలో, వృద్ధుల సంరక్షణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. వారసులు, ఇతరత్రా ఏ అండా లేని వారికోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. వృద్ధులైన ప్రతి ఒక్కరికీ ఆహారం, వస్త్రాలు, గృహవసతి, వైద్యసాయం అందించేలా ప్రణాళిక రూపొందించారు. చైనాలో రెండున్నర కోట్ల మందికి పైగా ఈ కార్యక్రమ పరిధిలో ఉన్నారు. ఆదాయ వనరులు లేనివారికి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అక్కడి ప్రభుత్వం అందిస్తుంది. అక్కడ నాలుగు కోట్లమంది దీన్ని పొందుతున్నారు. ఆరోగ్యంగా ఉండి తాము ఇంకా పనిచేస్తామని ముందుకొచ్చేవారికి చైనా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉపాధి కల్పిస్తున్నారు. ప్రభుత్వ క్షేత్రాల్లో వ్యవసాయానికి అనుమతిస్తున్నారు.

సంక్షేమంలో భారత్‌కు 71వ స్థానం
ప్రపంచవ్యాప్తంగా 96 దేశాల్లో వృద్ధుల సంక్షేమం, సౌకర్యాలు, ప్రజా రవాణా వంటి అంశాలపై ‘గ్లోబల్‌ ఏజ్‌ వాచ్‌’ సంస్థ అధ్యయనం చేయగా, అందులో భారత్‌ 71వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌ ప్రథమ స్థానం పొందింది. అక్కడ వృద్ధులకు ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేస్తోంది. సంపూర్ణ ఆరోగ్య సేవలు అందిస్తోంది. ప్రజా రవాణా సౌకర్యం కల్పించింది. అత్యధిక సంఖ్యలో వృద్ధులు అక్కడ వృత్తి, ఉద్యోగాల్లో ఉంటున్నారు.

సంరక్షణ పొందటం ఓ హక్కు
వయోవృద్ధుల జీవన స్థితిగతులు ఇబ్బందికరంగా మారుతున్న తరుణంలో, వారిని ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 60 ఏళ్లు దాటిన వృద్ధుల కోసం ‘ జాతీయ వయోశ్రీ’ పేరిట ప్రత్యేక పథకాన్ని చేపట్టింది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ప్రారంభించనున్నారు. దేశంలోని వృద్ధుల్లో 55 శాతానికి పైగా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకొని; వృద్ధులకు అవసరమైన వాకర్లు, క్రచ్‌లు, కళ్లద్దాలు, వినికిడి పరికరాలు, కృత్రిమ దంతాలు, చక్రాల కుర్చీలు, ట్రైప్యాడ్లు తదితర సదుపాయాలు కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. దీని కోసం ప్రభుత్వం రూ.477 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద నిర్వహించే ఒక్కో శిబిరంలో దాదాపు 2,000 మందికి సాయం చేస్తారు. పథకంకింద లబ్ధిదారులను ఎంపిక చేయాలని కేంద్రం ఇటీవలే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసింది.
ఇలాంటి పథకాలు మరిన్ని రావాలి. ప్రధానంగా, సామాజిక భద్రత కింద నెలవారీ పింఛనును దేశవ్యాప్తంగా కనీసం రూ.1,000కి పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఈ మేరకు చెల్లిస్తున్నారు. వయోవృద్ధులను తేలికగా తీసేయరాదు. ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల్లో వారిని భాగస్వాములు చేయాలి. వృద్ధుల సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించాలి. కొత్తతరానికి వారి విలువ తెలియజెప్పేలా పాఠ్యాంశాల్ని రూపొందించాలి. వృద్ధులకు గౌరవ మర్యాదల గురించి వివిధ మాధ్యమాల్లో ప్రచారం చేయాలి. కుటుంబ సంబంధాల్లో వృద్ధులకు ఆప్యాయత, అనురాగం పంచడం ఓ ప్రధానాంశం కావాలి. వృద్ధాప్యంలో ఆత్మగౌరవంతో బతకగలమన్న ధీమా వారికి కల్పించాలి. ఆర్థిక భద్రత, వైద్య సేవలు అందించగలగాలి. ప్రభుత్వం తగినన్ని వృద్ధాశ్రమాలు స్థాపించాలి. ప్రైవేటు సంస్థలనూ ప్రోత్సహించాలి. వయోవృద్ధులు సంరక్షణ పొందడాన్ని ఓ హక్కుగా మార్చాల్సి ఉంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతల్ని కుమారులు, కుమార్తెలు భరించాల్సి ఉంటుంది. బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. అటువంటి కేసులను విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలి. రైళ్లలో, బస్సుల్లో ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచాలి. ఉద్యోగులకు పదవీ విరమణ రోజునే అన్ని ప్రయోజనాలూ సిద్ధించేలా చర్యలు తీసుకోవాలి. ఒంటరితనాన్ని దూరం చేసేందుకు సలహా కేంద్రాలు అవసరమవుతాయి. ప్రభుత్వం సత్వరం ఈ తరహా చర్యలు చేపట్టినప్పుడే, వృద్ధులకు వూతం అందజేసినట్లవుతుంది. వృద్ధాప్యాన్ని గౌరవించినట్లవుతుంది!


- ఆకారపు మల్లేశం
Posted on 24-03-2017