Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

వందేళ్ల వెలుగు!


* ఉద్యమాల నుంచి పరిశోధనల దాకా...
బోల్షివిక్‌ విప్లవం విజయవంతమై ప్రపంచ కార్మికులను విజయగర్వంలో ముంచితే... యాదృచ్ఛికంగా అదే ఏడాది ప్రాణం పోసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నిరంతర చైతన్యానికి వేదికైంది. విజ్ఞానం, వికాసం, పరిశోధనలకోసం ఓ విద్యా కేంద్రం కావాలన్న దశాబ్దాల ఆకాంక్షకు నిజాం ఫర్మానా ఆనాడు దిక్సూచిగా నిలిచింది. దేశంలోనే తొలిసారిగా స్థానిక భాషలో విద్యాబోధన కోసం ఓ విశ్వవిద్యాలయం ఏర్పాటు కావడం ఎంతోమంది ప్రముఖుల్ని ఆకర్షించింది. తదనంతరం ఎన్నో చారిత్రక ఘట్టాలకు, శాస్త్ర సాంకేతిక పురోభివృద్ధికి, విద్యావ్యాప్తి, సామాజిక ఉద్యమాలకు చిరునామాగా మారింది. కేవలం విద్యకే పరిమితం కాకుండా సిరియానుంచి రాష్ట్ర సాధన ఉద్యమం వరకు నిత్యచైతన్య విలసితమై తన ప్రస్థానాన్ని విస్తారం చేసుకుంది. ఉస్మానియా శతవసంతాల ప్రారంభ వేడుకలో ప్రసంగించిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ- పరిశోధన, నవకల్పనలపై దృష్టి సారించి వర్సిటీ కొత్త మైలు రాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు. దశాబ్దాలుగా నాణ్యతే ప్రామాణికంగా ప్రస్థానిస్తున్న ‘ఉస్మానియా’- ప్రణబ్‌ వ్యాఖ్యలను అందిపుచ్చుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు ఉరకాల్సి ఉంది.

చైతన్య ఝరి ‘ఉస్మానియా’!
‘భారతీయ ఉన్నత విద్యారంగం రెండో దశకు విస్తరిస్తున్న సందర్భంలో ఉస్మానియా వర్సిటీ ప్రారంభమైంది. హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ల మేధోపరమైన అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడింది. భారతీయ భాషలో పాఠాలు చెప్పిన తొలి విశ్వవిద్యాలయం ఇదే’ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు అక్షర సత్యాలు. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఫర్మానాతో దేశీయ భాషల్లో స్థాపించిన మొదటి విశ్వవిద్యాలయంగా ‘ఉస్మానియా’ చరిత్రకెక్కింది. స్థానిక భాషల్లో విద్యాబోధనకు పట్టంకట్టి మహోన్నత స్ఫూర్తి కేంద్రంగా నిలిచింది. హైదరాబాద్‌ సంస్థానంలో అత్యధికులు తెలుగు, మరాఠీ, కన్నడ భాషల్లోనే మాట్లాడేవారు. కేవలం పది శాతం మంది మాట్లాడే ఉర్దూను బోధన మాధ్యమంగా ఎంచుకోవడంపట్ల పలువురు ప్రముఖులు అభ్యంతరం తెలిపారు. కానీ, అప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే వర్సిటీలున్నాయి. తొలిసారిగా స్థానిక భాషలో ఉస్మానియా వర్సిటీని ఏర్పాటు చేయడంపట్ల అంతగా వ్యతిరేకత ఏర్పడలేదు. కేవలం 225 మంది విద్యార్థులతో సాయంకాలం తరగతులతో ప్రస్థానం ప్రారంభించిన యూనివర్సిటీ- కోటికిపైగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, ప్రపంచంలో మరే విశ్వవిద్యాలయం సాధించలేని ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం 83 దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారంటే- వర్సిటీ పరిధి, విస్తృతి అవగతమవుతుంది. ఎనిమిది క్యాంపస్‌ కళాశాలలు, అయిదు అనుబంధ కళాశాలలు, జిల్లాల్లో పీజీ కేంద్రాలతోపాటు 410 అనుబంధ డిగ్రీ కళాశాలలు ఉస్మానియా సొంతం! ఆసియాలోనే చెప్పుకోదగ్గ గ్రంథాలయం ‘ఉస్మానియా’ సొంతం. దాదాపు అయిదున్నర లక్షల పుస్తకాలు ఆ లైబ్రరీలో ఉన్నాయి. ఇందులో 5,500 అరుదైన రాతప్రతులనూ భద్రపరిచారు. ఈ క్యాంపస్‌ లైబ్రరీలో ఒకేసారి 1,500 మంది చదువుకోవచ్చు. పుస్తకాలతోపాటు ఆరు వేల 825 తాళపత్రాలు, 11వేల 486 పరిశోధన పత్రాలు ఇక్కడ పొందుపరిచారు. పరిశోధక విద్యార్థుల కోసం ఐక్యరాజ్య సమితి కేంద్రాన్నీ ఏర్పాటు చేశారు. ‘సమితి’లో ప్రచురించే అన్నిరకాల గ్రంథాలనూ ఇక్కడ సైతం భద్రపరుస్తున్నారు.
ఉద్యమాల వూట ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆనాటి వందేమాతర ఉద్యమం మొదలు స్వరాష్ట్ర ఉద్యమం వరకు కుడి ఎడమల సైద్ధాంతిక సంఘర్షణకు, అస్తిత్వ పోరాటాలకు అడ్డాగా నిలిచింది. జాతీయోద్యమాలకు పురుడు పోసిన ఈ చదువుల వనమే- సాయుధ పోరాటాలకూ సైరన్‌లూదింది. ఒక దశలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వంటి మేరునగధీరులూ ఉస్మానియా విద్యార్థుల ఉద్యమాలకు అండగా నిలబడ్డారు. ఆ పోరాటాలే దేశం గర్వించదగ్గ నాయకత్వాన్ని అందించాయి. వందేమాతర ఉద్యమంలో పాల్గొన్న యువకుల్లో చాలా మంది గొప్ప నాయకులుగా ఎదిగారు. వారిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో పాటు దేవులపల్లి వెంకటేశ్వరరావు, సర్వదేవరభట్ల రామనాథం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కె.ఎల్‌.మహేంద్ర, ఎ.గురువారెడ్డి వంటి ఉద్దండులున్నారు. నిజాం పాలనలో ఉన్నత విద్య ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పటికీ- యూనివర్సీటీ పౌర సమాజంలోని సాంస్కృతిక, రాజకీయ, జాతీయవాద భావాల్ని ప్రతిబింబించింది. 1920లు, 1930ల్లో బ్రిటిష్‌ జమానాలో దేశవ్యాప్తంగా చెలరేగిన జాతీయవాద; కార్మిక, కర్షక ఉద్యమాలు యూనివర్సిటీతోపాటు కాలేజీ విద్యార్థుల్ని ఎంతగానే ప్రభావితం చేశాయి. ఖిలాఫత్‌, సహాయ నిరాకరణ, క్విట్‌ ఇండియా ఉద్యమాల పట్ల విద్యార్థులు ఆకర్షితులై సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో తమ వంతు పాత్ర పోషించారు. కవులుగా, మేధావులుగా రాజ్‌ బహదూర్‌ గౌర్‌వంటి అనేకమంది ఉస్మానియా విద్యార్థులు, అధ్యాపకులు సాయుధ పోరాటానికి అండగా నిలిచారు. ఉస్మానియా ప్రాంగణంలో విభిన్న ఆలోచన ధోరణులు, భావజాలాలు, రాజకీయ సిద్ధాంతాలు విలసిల్లాయి. ఆర్యసమాజ్‌, మజ్లిస్‌, హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌, సోషలిస్ట్‌, కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రాతిపదికన జరిగిన అనేక ఉద్యమాల్లో ఉస్మానియా విద్యార్థులు తమదైన ముద్ర వేశారు. వామపక్ష భావజాలంతో నిజాం వ్యతిరేక, తెలంగాణ సాయుధ పోరాటాల్లో పాల్గొన్నారు.

చదువుల్లో ఘనాపాఠి!
రాజకీయ, సామాజిక చైతన్యానికే కాదు- బహుముఖ ప్రజ్ఞాపాటవాలూ ఉస్మానియా విద్యార్థుల సొంతం. సాహిత్యం, భాషా వికాసంతోపాటు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలోనూ ‘ఉస్మానియా’ ఎన్నో మైలురాళ్లుదాటింది. ప్రపంచ ప్రఖ్యాత ‘జర్నల్స్‌’లోనూ ఇక్కడి అధ్యాపకులు, విద్యార్థుల పరిశోధనలు ప్రచురితమయ్యాయి. 1960ల్లో ‘ఉస్మానియా’ కేంద్రంగా ప్రపంచస్థాయి పరిశోధనలు జరిగాయి. నిజామియా అబ్జర్వేటరీతోపాటు అమీర్‌పేట్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌ అబ్జర్వేటరీ ఏర్పాటైంది. అంతరిక్ష పరిశోధనలకోసం ఏర్పాటుచేసిన రంగాపూర్‌ ‘అబ్జర్వేటరీ’ ఆ రోజుల్లో ఆసియా దేశాల్లోనే అతిపెద్దది. దాని సాయంతో అంతరిక్ష పరిశోధనలు నిర్వహించేవారు. ఇప్పటికీ రంగాపూర్‌ ‘అబ్జర్వేటరీ’ ఎన్నో పరిశోధనలు చేస్తోంది. దేశం మొత్తంలోనే ఏ విశ్వవిద్యాలయానికీ లేని జీవశాస్త్ర మ్యూజియం ‘ఉస్మానియా’ ప్రత్యేకత! ఇక్కడి మ్యూజియంలో విదేశాలుసహా దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి సేకరించిన అమూల్యమైన, అంతరించిపోతున్న జాతుల ‘స్పెసిమెన్స్‌’ సైతం అందుబాటులో ఉన్నాయి. ఇది దేశంలోనే రెండో అతిపెద్ద మ్యూజియం కావడం విశేషం. వృక్ష శాస్త్రంలోనూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రపంచస్థాయి పరిశోధనలకు వేదికగా మారింది. దేశంలోని ఆర్గానిక్‌, సింథటిక్‌, ఫార్మా, రసాయన రంగాల్లో ఉస్మానియా విద్యార్థులే ఎక్కువగా కనిపిస్తారు. ఈ విశ్వవిద్యాలయంలో భూగర్భ శాస్త్రం సైతం అత్యంత పురాతనమైనది. ఆధునిక అవసరాలకు దీటుగా ప్రవేశపెట్టిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌, నావిగేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ వంటి విభాగాలు ఇక్కడ బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. సీపీఎంబీ- (సెంటర్‌ ఫర్‌ ప్లాంట్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ) సైతం ఉస్మానియాలో స్థాపించారు. సంప్రదాయంగా వస్తున్న వృక్ష, జంతు శాస్త్రాల్లో ఆధునిక పరిజ్ఞానం చొప్పించేందుకు సీపీఎంబీ ఎంతగానో కృషి చేస్తోంది. స్థానిక ప్రజల ఆరోగ్య సమస్యలపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు చేసి- జన్యుక్రమం సేకరించి పెట్టింది. భవిష్యత్తులో వ్యక్తుల జన్యు విశ్లేషణ, జన్యు క్రమం ఆధారంగా వివిధ రోగాలను నయం చేసేందుకు వీలుంటుంది. చదువుల తల్లిగానేగాక, ఉద్యమాల కల్పవల్లిగానూ విలసిల్లిన ఉస్మానియ విశ్వవిద్యాలయం తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందనడంలో మరో మాటలేదు!

- పోరెడ్డి రఘుపతి
Posted on 28-04-2017