Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పనిలో గనిలో కార్ఖానాలో...


* బాల్యానికి ఎన్నడు బంధ విముక్తి?
‘చదువుకోవాల్సిన పిల్లలతో నానాచాకిరీ చేయించడం అంటే- అది వారిని అన్నివిధాలా హింసించడమే! అంతకు మించిన క్రూరత్వం, మానవతకు అపచారం ప్రపంచంలో మరేవీ ఉండవు’ నోబెల్‌ శాంతి పురస్కార విజేత కైలాస్‌ సత్యార్థి వ్యాఖ్య ఇది. బాలల హక్కుల పరిరక్షణ కోసం ‘బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌’ పేరిట మూడున్నర దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న ఆయన- ప్రపంచంలోని 150 దేశాల్లో బాలకార్మిక వ్యవస్థ పాతుకుపోయిన చేదు వాస్తవాలను వెల్లడించిన ఆయన ఆ దురవస్థను రూపుమాపాల్సిన చారిత్రక అవసరాన్ని గట్టిగా ఉద్బోధిస్తున్నారు. అంతకంతకూ ఉద్ధృతమవుతున్న ఈ సమస్యకు ప్రభుత్వాలు అప్పుడప్పుడు చేసే చట్ట సవరణలతోనో, సామాజిక సేవాసంస్థలు అప్పటికప్పుడు చేపట్టే ఆందోళనలతోనో పరిష్కారం సాధించలేం. ఎక్కడికక్కడ నట్లు బిగించాల్సిన తరుణంలో చట్టాలకు ప్రభుత్వాలు చేసే సవరణలు తప్పులతడకగా ఉంటే సమస్య మరింత సంక్లిష్టమవుతుంది. మరోవంక స్వచ్ఛంద సంస్థలూ కేవలం నిరసన ప్రదర్శనలకే పరిమితమైతే నిర్మాణాత్మక మార్పు సాధ్యం కాదు. వివిధ సామాజిక, ఆర్థిక అంశాలతో ముడివడిన ఈ సంక్షోభానికి సమగ్ర పరిష్కారాలను అన్వేషించే క్రమంలోనే పసితనం వసివాడుతోంది! వారి రక్షణ ఛత్రానికి నిలువునా తూట్లు పడుతున్నాయి. బాలకార్మికుల సంఖ్య అంతర్జాతీయంగా 16.8 కోట్లకు పైమాటే. ఇది ఐరోపా దేశాల్లోని బాలల మొత్తం సంఖ్య కంటే ఎంతో ఎక్కువని పిల్లల సంక్షేమ సంస్థ ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ తాజా నివేదిక వెల్లడించింది. ‘బాల్యాన్ని హరిస్తున్నారు’ అంటూ ఆ సంస్థ వెలువరించిన గణాంకాలు అందర్నీ నిశ్చేష్టపరచేవే. భారత్‌లో 3.2 కోట్లమంది బాలబాలికల్లో అనేకులు వివిధ ప్రమాదకర పనుల్లో కొనసాగుతున్నారని, ఆ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికమని ఆ నివేదిక నిగ్గుతేల్చడం గుండెల్ని మెలిపెట్టే వాస్తవమే! ప్రభుత్వ దస్త్రాల కెక్కని, సేవాసంస్థలకూ అంతుపట్టని వివరాలు ఇంకెన్నో! నేడు ‘ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినం’. బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో మగ్గినంతవరకు, దినదిన గండంగా రోజులు వెళ్లదీసినంతవరకు ఇలా ఎన్ని దినోత్సవాలు వచ్చివెళ్లినా ఒరిగేదేమిటి?

వసివాడుతున్న పసితనం
ప్రపంచవ్యాప్తంగా బాలల్లో అత్యధికులు బాల్యాన్ని కోల్పోతున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల మధ్య రాళ్లు కొట్టి, పొగాకు చుట్టి, బట్టీల్లో బరువులు మోసి, నానారకాల పనుల మధ్య వసివాడిపోతున్నారు. చట్టాలకు పదునుపెట్టడంలో, వాటిని చురుగ్గా అమలుచేయడంలో ప్రభుత్వాల ఉదాసీనత బాలల పాలిట ప్రాణాంతకమవుతోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) రూపొందించిన చట్టాన్ని దాదాపు అన్ని దేశాలూ సమ్మతించి సంతకాలు చేశాయి. ఆచరణకు వచ్చేసరికి బాధ్యతను మరచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా- ఆకలి, అవిద్య కలగలిసి బాల్యాన్ని బలిపీఠంమీదకు నెడుతున్నాయి. బ్రెజిల్‌వంటి దేశాలు బాలకార్మిక వ్యవస్థ నిరోధానికి ఏదోస్థాయిలో కృషి చేస్తుండటం కొంతలో కొంత వూరట. సంతానాన్ని చదివించే నిరుపేద తల్లిదండ్రుల్ని ‘నగదు బదిలీ’ వంటి పథకాలతో కొన్ని దేశాల్లో ఆదుకుంటున్నారు. బాలలపట్ల ఇసుమంత బాధ్యతనూ కనబరచని మునుపటి ప్రభుత్వాల నిర్వాకాల ఫలితంగా ఇండియాలో పరిస్థితి దారుణంగా మారింది. ప్రైవేటు రంగంలో బాల కార్మికులకు పెద్దపీట వేసి యాజమాన్యాలు ఏటా సాగిస్తున్న శ్రమదోపిడి విలువ దాదాపు లక్షా 22 వేలకోట్ల రూపాయలని భారత్‌లోని వివిధ స్వచ్ఛంద సంస్థలు ఆరేళ్ల క్రితమే తమ అధ్యయనాల్లో వెల్లడించాయి. ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం బాలభారతంలో ఆక్రోశం నింపింది. నిర్బంధ ఉచిత విద్య పేరిట చట్టాలు, పిల్లలతో పనులు చేయించడాన్ని నిషేధించే శాసనాలు వచ్చాయే కానీ- వాటి అమలు అంతంతమాత్రమే. పద్నాలుగేళ్లలోపు బాలబాలికలు ఎలాంటి ఉపాధి పనుల్లోనూ ఉండరాదని మూడు దశాబ్దాలనాడే చట్ట సవరణ చేశారు. బడిఈడు పిల్లలతో పనులు చేయిస్తే, కనీసం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష తథ్యమని గతేడాది కేంద్రం గట్టిగా హెచ్చరించింది. సంబంధిత సవరణ బిల్లును భారత పార్లమెంటు ఆమోదించడాన్ని హర్షించిన ఐఎల్‌ఓ, యునిసెఫ్‌లు- ప్రమాదకరమైన పనుల్ని బాలలతో చేయించకుండా రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. నిషేధించిన పనులు చేస్తుండగా వారిని గమనించి అడ్డుకునే ప్రభుత్వాలు, బాలల పునరావాస కల్పనకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలనీ సూచించాయి. నూతన చట్టంలో బాలల వయసును 18 ఏళ్లకు పొడిగించడంతోపాటు, ఆ లోపు వయస్కులను పనుల్లో నియమించడం శిక్షార్హమని స్పష్టం చేశారు. అయితే పిల్లలతో కొందరు చేయిస్తున్న ప్రమాదకర పనుల జాబితాను 83 నుంచి ఏకంగా 31కి కుదించడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ వృత్తి, వ్యాపారం అంటే ఏమిటో సవ్యంగా నిర్వచించని చట్ట నిబంధనతో సామాజిక ప్రయోజనం సాధ్యమేనా? చట్టాలు చేయాల్సిన పని- పిల్లల పొట్టకొట్టడం కాదు! బాలకార్మిక దురవస్థ మూలాలకు చికిత్స చేయకుండా ఏ ప్రభుత్వమూ ఏమీ చేయలేదని 37 ఏళ్ల క్రితమే గురుపాదస్వామి సంఘం కుండ బద్దలుకొట్దింది. ప్రమాదకర పనుల్లో బాలల్ని వినియోగించడం ఆగేదెన్నడని 20ఏళ్లనాడే సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇంటాబయటా బాలలతో వెట్టిచాకిరి చేయించడాన్ని అమానుషంగా తీర్మానించింది గంగూలీ సంఘం. ఉన్నత మాధ్యమిక విద్యను అభ్యసించాల్సిన వయసులో 4.7 కోట్లమంది పిల్లలు అసలు చదువులకే దూరంగా ఉంటున్నారని జాతీయస్థాయిలో నిర్వహించిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బిహార్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్రల్లో బాలకార్మిక సమస్య తీవ్రత పట్ల ‘క్రై’ (బాలల హక్కులు-మీరు) ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.

సామాజిక చైతన్యంతోనే పరిష్కారం
ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులుగా బాధ్యతాయుత స్థానాల్లో ఉంటూ- పిల్లలతో ఇళ్లల్లో బండచాకిరీ చేయిస్తున్న ప్రబుద్ధుల బాగోతం ఆంధ్రప్రదేశ్‌లో ఆ మధ్య వెలుగు చూసింది. ఆర్థిక అవసరాల కోసం కొంతమంది తల్లిదండ్రులే తమ పిల్లల్ని పనుల్లో పెడుతుండటం హృదయ విదారకం. ఇది చాలదన్నట్లు ప్రభుత్వ విభాగాల్లోనూ కొందరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. బండారం బయటపడిన యజమానులపై చర్యలు తీసుకోవడం మాని, నోటీసులు ఇవ్వడంతోనే సరిపెడుతున్నారు. యంత్రాంగాన్ని ఆవరించిన ఈ స్తబ్ధతను వదలగొట్టేందుకు ప్రభుత్వాలు చురుకైన చర్యలు చేపట్టాల్సి ఉంది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో విద్య, శిశు సంక్షేమం, న్యాయ, పోలీసు శాఖలతో పాటు స్థానిక సంస్థల పాత్ర సమధికం. పునరావాసానికి సంబంధించి, బాలల సదనాల ప్రాముఖ్యమూ ఎనలేనిది. బాలలను చాకిరి నుంచి విముక్తం చేసి, అక్కున చేర్చుకొని ఆదరించడానికి అన్ని చేతులూ ఒక్కటి కావాలి. స్పందించే హృదయాలన్నీ ఒక్కటై నిలవాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ మేరకు కొంత చొరవ వ్యక్తమవుతుండటం వూరట కలిగించే పరిణామం. బాలల హక్కుల సమాచార పత్రాలతో ప్రభుత్వాలు ప్రచార యాత్రలు నిర్వహించడం అందుకు ఓ ఉదాహరణ. పసి వయసులో పిల్లల్ని పనిలో పెట్టి వారిని శారీరక, మానసిక హింసలకు గురిచేసే వ్యక్తులకు గట్టి బుద్ధి చెప్పేందుకు నిజానికి ఉన్న చట్టాలు చాలు. ఇప్పుడు కావలసిందల్లా క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని, బాల కార్మిక వ్యవస్థకు నిబద్ధమై ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేసే చొరవ మాత్రమే! తక్కువ ముట్టజెప్పి ఎక్కువ పని చేయించవచ్చన్న కక్కుర్తి- బాలల వెట్టికి మూలకారణమవుతోంది. దాన్ని ఛేదించాలంటే, పిల్లల్ని పనిలో పెట్టుకొనే ‘సంస్థల’పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపితీరాలి. కేసుల నమోదులో మీనమేషాలు లెక్కించే కార్మిక, రెవిన్యూ శాఖల్ని ఆసాంతం క్షాళన చేయడమే తక్షణ పరిష్కారం. సత్వర విచారణకు అనువుగా మరిన్ని సంచార న్యాయస్థానాల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంకట్టాల్సిన తరుణమిది. తమ నిర్వహణలోని శాఖల్లో, తమ నిధులతో నడిచే సంస్థల్లో- అధికారులైనా, ఉద్యోగులైనా ఏవిధంగానూ పిల్లల్ని పనిలో పెట్టుకోరాదన్న నిబంధన విధించి దాన్ని తు.చ. తప్పకుండా అమలుపరచాలి. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన బాధ్యత ప్రభుత్వానిదే కాదు, పౌరసమాజానిది కూడా! ఈ అవగాహన చట్టాల్ని, ప్రభుత్వ కార్యాలయాల్లో దుమ్ముపడుతున్న దస్త్రాల్ని దాటి ప్రజాక్షేత్రంలో విస్తరించిననాడు, ఏ దేశంలోనూ బాల్యం ముడుచుకుపోదు- వికసిస్తుంది!


- జంధ్యాల శరత్‌బాబు
Posted on 12-06-2017