Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అవినీతి అంతం... ప్రగతికి వూతం


* రాటుతేలాల్సిన ప్రభుత్వ విధానం
కేంద్రప్రభుత్వ ప్రధాన ఆశయం- భారత్‌ను అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడం! ఇందులో భాగంగానే, నల్లధనాన్ని అరికట్టడానికి వీలుగా పెద్దనోట్లు ఉపసంహరించారు. ఇటీవల ‘ఒకటే దేశం-ఒకటే పన్ను’ విధానం తెచ్చారు. దేశంలో పరిస్థితులు చాలావరకు మారితేనే, మోదీ ప్రభుత్వ సమున్నత లక్ష్యం నెరవేరుతుంది. తరచుగా ఏదో ఒక చోట దర్యాప్తు సంస్థలు, అవినీతి నిరోధక విభాగాలు కొందరు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారుల నివాసాలపై దాడులు నిర్వహించి సోదాలు సాగిస్తున్నాయి. లక్షల్లో నగదు కట్టలు, కేజీల కొద్దీ బంగారు- వెండి ఆభరణాల్ని స్వాధీనం చేసుకుంటున్నాయి. పెచ్చుపెరుగుతున్న అవినీతికి నిదర్శనమే ఆ సంపద. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న ప్రపంచ పౌరసమాజ సంస్థ ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ ఇటీవలి అధ్యయనంలో విస్మయం కలిగించే అంశాలెన్నో వెల్లడయ్యాయి. మొత్తం 16 ఆసియా- పసిఫిక్‌ దేశాల జాబితాలో... అవినీతికి సంబంధించి భారత్‌దే మొదటి స్థానం! ఆ జాబితాలో జపాన్‌ అట్టడుగున ఉంది. భారత్‌లోని ప్రతి పదిమందిలోనూ ఏడుగురు- ప్రజాసేవలు, ప్రభుత్వం కలిగించే సౌకర్యాలు పొందడానికి యంత్రాంగంలో కొందరి చేతులు తడపాల్సి వస్తోంది. దీనికి విరుద్ధంగా జపాన్‌లో లంచాలు 0.2 శాతమే అని అధ్యయనంలో తేలింది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తులైన భారత్‌, చైనా సహా ఆసియా- పసిఫిక్‌ మండలంలోని 16 దేశాల్లో పరిస్థితి దిగ్భ్రమ కలిగిస్తోంది. ఆ దేశాల్లోని ప్రతి నలుగురిలోనూ ఒకరు- అంటే, 90కోట్లమంది ప్రజోపయోగ సేవలు పొందడానికి లంచాలు ఇవ్వాల్సి వస్తోందన్నది అధ్యయన సారాంశం. దీన్ని బట్టి అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో ఇట్టే బోధపడుతుంది.

విషసంస్కృతి ‘విశ్వరూపం’
భారత్‌లో 2010 తరవాత వెలుగు చూసిన 2 జీ, ఆదర్శ్‌ సొసైటీ, బొగ్గు, ఇతర భూ కుంభకోణాలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను మంటగలిపాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మునుపెన్నడూ లేని విధంగా అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయి. ఉన్నత స్థాయిలో ప్రభావితం చేయగల రాజకీయ, రాజకీయేతర, వ్యాపార శక్తులు నైతిక విలువలకు తిలోదకాలిచ్చి వ్యవస్థను భ్రష్టు పట్టించిన తీరుకు అవన్నీ నిదర్శనాలు. వాణిజ్యరంగంతో పాటు ఉత్పాదక, పారిశ్రామిక సంస్థల్లో కొన్ని 78 శాతం అవినీతికి ఆస్కారం కలిగిస్తున్నాయని వెల్లడైంది. నిజానికి అది 90 నుంచి 95 శాతం వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. దేశంలోని వివిధ బహుళజాతి సంస్థలూ ఈ జాడ్యానికి లోనయ్యాయన్నది కఠోర సత్యం. ప్రాథమికంగా అవి విదేశీ వర్తక, వాణిజ్య నియంత్రణ చట్టాలకు లోబడి కార్యకలాపాలు నిర్వహించాలి. పలు పరిణామాల దృష్ట్యా అంతగా పట్టించుకోకపోవడం వల్ల, అన్నీ పెడదోవ పడుతున్నాయి. విదేశీ శక్తులు చేపట్టే కొన్ని చర్యలు అవినీతికి అడ్డుకట్ట వేయకపోగా, ‘మనీ లాండరింగ్‌’ వంటి ఆర్థిక నేరాలకు ఉసిగొల్పుతున్నాయి. భారత్‌లో పలు అవినీతి నిరోధక, అవినీతి వ్యతిరేక చట్టాలున్నప్పటికీ- అవేమీ స్థితిగతుల్ని నియంత్రించలేకపోతున్నాయి. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ప్రభుత్వ యంత్రాంగంలో ఎవరూ ఏ రూపంలోనూ లంచం, ఇతరత్రా ముడుపులు స్వీకరించకూడదు. కానీ, మొత్తం ప్రాజెక్టు/ ఒప్పందంలోని వ్యయంలో రెండు నుంచి పది శాతాన్ని ముడుపుల రూపంలో పుచ్చుకోవడం పరిపాటిగా మారింది.
దేశంలోని 20 రాష్ట్రాల్లో- ప్రభుత్వ సదుపాయాలు పొందడం కోసం లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు, అనుభవాలపై ‘సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌’ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం చేసింది. గత మార్చిలో అది వెల్లడించిన నివేదికలోని అంశాల ప్రకారం- కర్ణాటక రాష్ట్రం అవినీతిలో మొదటి స్థానంలో ఉంది. ఆ తరవాతి స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్‌, పంజాబ్‌ ఉన్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అవినీతి తక్కువగా ఉన్నట్లు తేలింది. పెద్దనోట్ల రద్దు వల్ల అవినీతి తగ్గిందని పలువురు అభిప్రాయపడ్డారు. సంస్థ నివేదిక ప్రకారం- ఈ సంవత్సరంలో 20 రాష్ట్రాల్లో 10 ప్రభుత్వ సేవల్లో సంబంధితులు ఇచ్చిన లంచాల మొత్తం రూ.6350 కోట్లు. 2005లో ఆ మొత్తం రూ.20,500 కోట్లు! అవినీతి తగ్గుముఖం పడుతోందన్నది ఆ నివేదిక సారాంశమైనా, దుష్ట సంస్కృతిని రూపుమాపడానికి చేయాల్సింది ఎంతో ఉందన్నది సుస్పష్టం. నివేదిక వెల్లడించిన మరో అంశం- దేశంలోని అత్యధిక శాతం రాష్ట్రాల ప్రజల అనుభవాల ప్రకారం, గరిష్ఠ అవినీతి పోలీసు శాఖలోనే ఉంది. ఆ తరవాతి స్థానాల్లో గృహ నిర్మాణం, పన్నుల విభాగాల వంటివి ఉన్నాయి.
ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దేశం తలసరి ఆదాయ స్థాయిని బట్టి అవినీతి తీవ్రతను అంచనా వేయాలి. ఒక నిర్ణీత ఆదాయస్థాయి వద్ద అవినీతి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. కానీ అధిక ఆదాయస్థాయితో పోల్చి చూసినప్పుడు- అల్పాదాయ వర్గాలపై దాని ప్రభావం ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలపై ఆధారపడి ఉంటాయి. సంపన్న దేశాలు అవినీతి నిర్మూలనకు చేపడుతున్న చర్యలతో పోల్చి చూస్తే, ఇతర దేశాలు వెనకబడటానికి ప్రధాన కారణం- వనరుల లోపం. అవినీతి నిరోధక యంత్రాంగం సుస్థిరత కోల్పోవడమూ కారణమే. ఏ దేశమైనా ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే అవినీతికి అడ్డుకట్ట వేయాలి. అందుకు దోహదం చేసే అవినీతి నిరోధక యంత్రాంగాన్ని; సరిపడా ఆర్థిక, మానవ వనరుల్ని సమకూర్చుకోవాలి. భారత్‌లోని అవినీతి నిరోధక సంస్థలో పోనుపోను మానవ వనరుల కొరత తీవ్రమవుతోంది. నేడు న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య- న్యాయమూర్తుల కొరత. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ 2016 డిసెంబరులో ఇచ్చిన నివేదిక గ్రూప్‌-ఎ పోస్టుల్లో 27.70 శాతం, గ్రూప్‌-బి పోస్టుల్లో 28.57 శాతం ఖాళీలున్నట్లు తేల్చి చెప్పింది. కేంద్ర శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం- మంజూరైన పోస్టుల సంఖ్య 7,274. దేశంలోని అవినీతి నిరోధక విభాగాలకు మౌలిక సదుపాయాలు కల్పించి బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. సింగపూర్‌ వంటి దేశాలు పటిష్ఠమైన అవినీతి నిరోధక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. దేశంలో 2014లోనే లోక్‌పాల్‌ చట్టాన్ని అమలులోకి తెచ్చినప్పటికీ, నేటికీ లోక్‌పాల్‌ను నియమించలేదు.

సంస్కరణలు... శిక్షలు
ప్రభుత్వ విధానాలను సరళీకృతం చేయడం ద్వారానే, ఆయా సేవల్లో అవినీతిని అదుపు చేయడం సాధ్యపడుతుంది. ప్రభుత్వాలు పరిపాలన తీరును మెరుగుపరచుకుని, పకడ్బందీ చర్యలు చేపట్టాలి. ‘కాగ్‌’ సూచించిన దారిలో, అన్ని రాజకీయపక్షాలూ అంతర్గత సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. ప్రైవేట్‌, వ్యాపార, పారిశ్రామిక సంస్థలు అవినీతి నివారణకు సంబంధించి ముందస్తు చర్యలపై దృష్టి నిలపాలి. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. సమాచార, ప్రసార మాధ్యమాలు; ఇతర దృశ్య-శ్రవణ మాధ్యమాల్ని వినియోగించి న్యాయపరమైన అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించాలి. ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేసి, నేరగాళ్లకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవల అవినీతి నిరోధక శాఖలు నిర్వహించిన దాడుల్లో అక్రమార్కుల ఆస్తులెన్నో బయటపడ్డాయి. ఈ మధ్య కాలంలో తెలంగాణలో భూ కుంభకోణాలు, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం సంచలనం సృష్టించింది. తెలంగాణలో ఓ గనుల శాఖ అధికారి నివాసంలో సోదాల వల్ల కోట్లాది రూపాయల ఆస్తులు వెలుగు చూశాయి. రెవిన్యూ, పోలీసు, వాణిజ్య పన్నుల శాఖలకు చెందిన కొందరు అధికారులపై అ.ని.శా. నిర్వహిస్తున్న దాడుల్లో భారీగా ఆస్తులు ఇప్పటికీ బయటపడుతున్నాయి. దీన్నిబట్టి, ప్రభుత్వ సేవల్లో అవినీతి ఎంతగా పాతుకుపోయిందో అవగతమవుతోంది. కర్ణాటకలోని గనుల కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. గోవా, ఒడిశాల్లోనూ పెద్దయెత్తున గనుల కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వాల నిబద్ధత, పౌరసమాజం చిత్తశుద్ధి వల్లనే అవినీతి నిర్మూలన సాధ్యమవుతుంది.

Posted on 18-07-2017