Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

కాలకూటానికి కావాలి విరుగుడు

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో నేటికి సరిగ్గా 33 ఏళ్ల క్రితం, 1984 డిసెంబరు మూడో తేదీ అర్ధరాత్రి దాటాక దాదాపు ఒంటిగంట సమయంలో మహాప్రళయం సంభవించింది. అక్కడి యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) క్రిమి సంహారిణుల కర్మాగారంలో సంభవించిన పెను ప్రమాదం- ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పారిశ్రామిక దుర్ఘటనగా చరిత్ర పుటలకెక్కింది. ఆ కర్మాగారం నుంచి అరగంటపాటు గాల్లోకి వెలువడిన సుమారు 40 టన్నుల ‘మిక్‌’ (మిథైల్‌ ఐసో సైనెట్‌) విషవాయువు, ఆ ప్రాంతాన్నంతటినీ మరుభూమిగా మార్చింది. ఆ దుర్ఘటనలో 3,800 మందికి పైగా మరణించారని, 2.5 లక్షల మంది శాశ్వతంగా అంగవికలురయ్యారని అంచనా. అనేక కుటుంబాలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. చాలామంది ఆచూకీ లేకుండా పోయారు. వెయ్యిమందికి పైగా పూర్తిగా చూపు కోల్పోయారు. యూనియన్‌ కార్బైడ్‌ క్రిమి సంహారిణుల కర్మాగారం స్వర్ణోత్సవ సంవత్సరం (ఆ కంపెనీ 1934లో ఏర్పాటైంది)లో సంభవించిన ఆ ఘోర ప్రమాదం, చివరకు మహా విషాదాన్నే మిగిల్చింది. స్టోరేజీ ట్యాంకులోకి పెద్దమొత్తంలో నీరు చేరడమే ప్రమాదానికి కారణమని తేల్చారు. దానివల్ల వెలువడిన విషవాయువు భారీ సంఖ్యలో ప్రజల ప్రాణాలు తోడేసింది. వివిధ భద్రతా చర్యలు, ప్రజల్లో అవగాహన, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కావలసిన సన్నద్ధత లేకపోవడంతో తీవ్ర అనర్థం జరిగింది. చట్టపరమైన, సాంకేతిక, వ్యవస్థాగత, మానవ తప్పిదాల ఫలితమే ఆ దురంతం. తగిన ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే అంతటి దారుణం జరిగి ఉండేదేకాదు.

ఎన్నో విషాదాలు...
భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనే కాదు, చెర్నోబిల్‌ (రష్యా), సెవెసో (ఇటలీ), త్రీమైల్‌ ఐలాండ్‌ (అమెరికా) ప్రమాదాలు సృష్టించిన మారణ హోమాల సెగ నేటికీ చల్లారలేదు. అవి రేపిన గాయాలు ఈనాటికీ పచ్చిగానే ఉన్నాయి. విశ్వమానవాళి గుండెల్లో సూదుల్లా గుచ్చుకొంటున్నాయి. అంతేకాదు, భారతదేశంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకొన్న పలు విషవాయువు దుర్ఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది మే నెల సంగతి. దిల్లీలోని తుగ్లకాబాద్‌ ప్రాంతంలోగల రెండు పాఠశాలల్లో హఠాత్తుగా హాహాకారాలు చెలరేగాయి. సమీపంలోని కంటైనర్‌ డిపో నుంచి విషవాయువు వెలువడటంతో 475 మంది విద్యార్థులు, తొమ్మిది మంది ఉపాధ్యాయులు అస్వస్థతకు గురై, ఆస్పత్రుల పాలయ్యారు. జాతీయ విపత్తు సహాయ దళం (ఎన్‌డీఆర్‌ఎస్‌) సత్వరం రంగంలోకి దిగబట్టి సరిపోయింది కానీ, లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇటీవలి కాలంలో ఈ తరహా రసాయన విపత్తులు ఎన్నో సంభవించాయి. 2013 ఆగస్టులో విశాఖలోని హిందుస్థాన్‌ పెట్రోలియం శుద్ధి, పెట్రో రసాయనాల సముదాయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మరణించారు. 34 మంది గాయపడ్డారు. అంతకుముందు 2009లో జైపూర్‌లోని ఇండియన్‌ ఆయిల్‌ టెర్మినల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతిచెందారు. ఆరుకోట్ల డాలర్లకు పైగా నష్టం సంభవించింది. ఈ ఏడాది మార్చి 15న కాన్పూర్‌లోని శివరాజ్‌పూర్‌లో భయానకమైన రసాయన ప్రమాదం చోటుచేసుకొంది. ఒక శీతల గిడ్డంగి సదుపాయంలో గ్యాస్‌ ఛాంబర్‌ నుంచి అమ్మోనియా వెలువడటంతో భారీ పేలుడు సంభవించింది. భవనం పైకప్పు కుప్పకూలి రెండు డజన్ల మందికి పైగా చిక్కుబడ్డారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ను తక్షణం పిలిపించినా, పెద్దగా ప్రయోజనం లేకపోయింది. అయిదుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు ఆస్పత్రిలో కన్నుమూశారు. భిలాయి ఉక్కు కర్మాగారంలో విషవాయువు వెలువడిన ఘటనలో 50 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు సహా అయిదుగురు ఉద్యోగులు తుది శ్వాస విడిచారు. ఈ ఘటనలపై దర్యాప్తు జరిపిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారసంస్థ (ఎన్‌డీఎమ్‌ఏ) మానవ తప్పిదాలు, నిర్వహణ లోపాలే ఈ ప్రమాదాలకు కారణమని తేల్చి చెప్పింది. ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలు అనుసరించకపోవడం, పరికరాలు ఉపకరణాల విషయంలో ప్రమాణాలు పాటించకపోవడం కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణమేనని అది స్పష్టం చేసింది.

భారతదేశంలో పర్యావరణ చట్టాలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. ప్రమాదకారక పరిశ్రమలకు చిక్కాలు బిగించే పరిస్థితి లేదు. పర్యావరణ ప్రభావాలను మదింపు చేయకుండానే ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులకు చకచకా అనుమతులు ఇచ్చేస్తోంది. ప్రమాదకర వ్యర్థాలు, రసాయనాలు, పదార్థాల మీద ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐక్యరాజ్య సమితి సమావేశం జరిగినప్పుడు ప్రమాదకర వ్యర్థాలను సమర్థంగా నిర్వహించే స్థితిలో ఉన్నామని భారత బృందం వాదించింది. దేశంలో వరసగా పారిశ్రామిక, విషవాయు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా వాదనలో పస ఉండదు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో పత్తిపంట రైతు బతుక్కి మంట పెడుతోంది. క్రిమిసంహారిణుల విషప్రభావం కారణంగా ఆ ఒక్క ప్రాంతంలోనే ఈ ఏడాది జులై నుంచి 35 మంది రైతులు మృత్యువాత పడ్డారు. యావత్‌మాల్‌ జిల్లాలోనే 18 మంది కన్నుమూశారు. నాగపూర్‌, అకోలా, అమరావతి జిల్లాల్లో సైతం అలాంటి ఘటనలే చోటుచేసుకొన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో క్రిమిసంహారిణులు ఉపయోగిస్తున్న తీరుమీదే భయానుమానాలు చెలరేగుతున్నాయి. మోనో క్రోటోఫాస్‌, ఆక్సిడిమెటాన్‌మిథైల్‌, అసిఫెట్‌, ప్రొఫెనోఫాస్‌, ఫిప్రోనిల్‌, ఇమిడాక్లోప్రిడ్‌, సైపర్‌మెథ్రిన్‌ వంటి క్రిమిసంహారిణులను కలిపి వాడుతున్న పద్ధతి రైతుల పాలిట ప్రాణాంతకమవుతోందని వెల్లడైంది. దీనిపై నివేదిక అందాక అయిదు రకాల క్రిమిసంహారిణుల మిశ్రమాలను మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. విషపూరిత క్రిమిసంహారిణుల కారణంగా దేశంలో మరణాలు సంభవించడం, పెద్దసంఖ్యలో రైతులు ఆస్పత్రులపాలబడటం ఇదే మొదటిసారి కాదు. జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం విషపూరిత క్రిమిసంహారిణుల కారణంగా 2015లో దేశంలో 7,060 మంది మృతిచెందారు. 2013లో బిహార్‌లోని శరణ్‌ జిల్లా ధర్‌మషతి గండమాన్‌ గ్రామంలో మధ్యాహ్న భోజనంలో మోనోక్రోటోఫాస్‌ క్రిమిసంహారిణి అవశేషాల కారణంగా 23 మంది బడిపిల్లలు అకాలమరణం పాలయ్యారు. వరంగల్‌ జిల్లాలో రైతుల మరణాలకు క్రిమిసంహారిణుల పిచికారే కారణమని 2002 జనవరిలో ఒక నివేదికలో వెల్లడైంది.

మోనోక్రోటోఫాస్‌, ఆక్సిడిమెటాన్‌మిథైల్‌ అత్యంత ప్రమాదకరమైన క్రిమిసంహారిణులని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఎప్పుడో ప్రకటించింది. ఐరోపా సమాఖ్య (ఈయూ) సహా అనేక దేశాలు వాటిని ఇదివరకే నిషేధించాయి. భారతదేశంలో మాత్రం ఈ క్రిమిసంహారిణులను ఈనాటికీ విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో వినియోగిస్తున్న మొత్తం క్రిమిసంహారిణుల్లో దాదాపు 30 శాతం అత్యంత ప్రమాదకరమైనవే కావడం అందోళనకరం.

అవగాహన కొరవడి అనర్థం
భారతదేశంలో విషపూరిత క్రిమి సంహారిణుల కారణంగా ఏటా దాదాపు 10 వేలమంది మరణిస్తున్నారు. ఎలాంటి రక్షణలు లేకుండా దేశంలో ఈ తరహాలో విశృంఖలంగా పురుగు మందులను వాడుతున్నారంటే, అందుకు పూర్తి బాధ్యత కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖది, రాష్ట్రాల వ్యవసాయ విభాగాలదే. క్రిమి సంహారిణుల నియంత్రణ నిబంధనల్లో ఉన్న లోపాలను తక్షణం సరిదిద్దగలిగితే ఈ మరణాలకు చాలావరకు అడ్డుకట్ట వేయవచ్చు. క్రిమి సంహారిణుల మిశ్రమాలు, మోతాదుల విషయంలో రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ విభాగాలు విఫలమవుతున్నాయి. ఏ పంటకు ఏ రకాల క్రిమి సంహారిణులను ఎంతమేరకు వాడాలో చెప్పేవారు లేరు. ఈ పరిస్థితి కొనసాగినంతకాలం సమస్య పరిష్కారం కాదు. ప్రభుత్వం ఇప్పుడు మొట్టమొదట చేయాల్సిన పని మొదటిశ్రేణిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన క్రిమి సంహారిణులను నిషేధించడం! పురుగు మందుల సురక్షిత ఉపయోగం కోసం సరికొత్త నిర్వహణ చట్టాన్ని తీసుకురావలసిన అవసరం ఉంది. రైతులు క్రిమి సంహారిణుల పాలబడకుండా, వాటి అవశేషాలు ఆహార పదార్థాల్లో చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.

అప్రమత్తతే రక్షాకవచం
20వ శతాబ్దం మధ్య నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రసాయనాల ప్రాధాన్యం పెరగనారంభమైంది. ప్రస్తుతం 60 వేల నుంచి 70 వేల రకాల రసాయనాలు ఉపయోగంలో ఉన్నాయి. ఆర్థికాభివృద్ధితో ముడివడి ఉన్న దృష్ట్యా రానున్నకాలంలో రసాయనాల ఉత్పత్తి, వినియోగం పెరిగే అవకాశం ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సైతం రసాయనాల ప్రాముఖ్యం పెరుగుతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రసాయన పరిశ్రమల వాటా 13 శాతం. మొత్తం దేశ ఎగుమతుల్లో రసాయనాల వాటా సైతం దాదాపు 13 శాతంగా ఉంది. ఏటా 10 నుంచి 12 శాతం దాకా వాటి వృద్ధి నమోదవుతోంది. రసాయనాల మీద అధికంగా ఆధారపడే పరిస్థితి ఉండటంతో, వాటి పర్యవసానాల దృష్ట్యా ప్రజారోగ్య రంగాన్ని పటిష్ఠపరచాల్సిన అవసరం ఉంది. ఎలాంటి అవాంఛిత పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ రంగాన్ని సర్వసన్నద్ధం చేయాలి. ఎక్కడ ఏ దశలోనూ ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా చూడాలి. నాణ్యత ప్రమాణాల విషయంలో కచ్చితంగా వ్యవహరించాలి. ఒకవేళ ప్రమాదం చోటుచేసుకొంటే, తక్షణం నష్టనివారణ చర్యలకు సంబంధిత వ్యవస్థల్ని సర్వదా సన్నద్ధంగా ఉంచాలి. రసాయన విపత్తుల నిర్వహణపై జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎమ్‌ఏ) ఇటీవల కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. వాటిని అనుసరించి సంబంధిత మంత్రిత్వశాఖలు, విభాగాలు, రాష్ట్రాల అధికారులకు నిర్దేశాలు జారీ చేయనున్నారు. దేశంలో రసాయన భద్రత కోసం సీఐఎఫ్‌ (చీఫ్‌ ఇన్‌స్పెక్టొరేట్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌)ను ప్రక్షాళించేందుకూ ఎన్‌డీఎమ్‌ఏ సిద్ధపడుతోంది. రసాయన పరిశ్రమల విపత్తు నిర్వహణపై జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించే ప్రక్రియా కొనసాగుతోంది. మరోవైపు ప్రపంచం నెత్తిన వేలాడుతున్న రసాయనాయుధాల కత్తి మరింత ఆందోళన కలిగిస్తోంది. అయిదేళ్లుగా కొనసాగుతున్న సిరియా అంతర్యుద్ధమే ఇందుకు సాక్ష్యం. ప్రభుత్వ దళాలు తిరుగుబాటుదారుల మీద, వారిపట్ల సానుభూతి చూపుతున్న ప్రజాసమూహాల పైనా జరిపిన రసాయన ఆయుధాల దాడిలో 1,500 మంది దాకా మరణించినట్లు వార్తలు వచ్చాయి. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఇదిబ్‌ పట్టణంపై సిరియా దళాలు ఇటీవల జరిపిన రసాయన దాడిలో 11 మంది పిల్లలతోపాటు 72 మంది మృతిచెందారు. 550 మందికి పైగా గాయపడ్డారు. పంటపొలాలు మొదలుకొని పరిశ్రమలను దాటి యుద్ధరంగానికీ విస్తరిస్త్ను ప్రమాదకర రసాయనాల పరుగుకు పగ్గం వేయాలంటే, తద్వారా ప్రజల్ని, పరిసరాల్ని, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో తక్షణ ఉమ్మడి కార్యాచరణే శరణ్యం!

- నీరజ్‌ కుమార్‌
Posted on 05-12-2017