Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

‘సరస్వతి’కి దక్కని లక్ష్మీ కటాక్షం!

* విశ్వవిద్యాలయాల ఎదుగుదలకు విఘాతం

ప్రపంచంలో ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితా విడుదలైన ప్రతిసారీ మనదేశంలో విద్యాసంస్థల వెనకబాటు గురించి విస్తృత చర్చ జరుగుతూ ఉంటుంది. ఉన్నత విద్యాసంస్థల్లో నాణ్యత ప్రమాణాల గురించి చర్చలు ఏళ్ల తరబడి సాగుతున్నా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరవాత ఈ అంశంపై దృష్టి సారించింది. సరికొత్త జాతీయ విద్యావిధానం రూపకల్పన దిశగా 2015లో చర్యలకు ఉపక్రమించింది. ఎంపిక చేసిన 20 ఉన్నత విద్యాసంస్థలను అంతర్జాతీయ ప్రమాణాలతో అలరారే విధంగా తీర్చిదిద్దాలని నిరుడు సంకల్పించింది. ప్రభుత్వరంగం నుంచి పది, మిగిలినవి ప్రైవేటు రంగం నుంచి ఎంపిక చేయాలని నిర్ణయించింది. భారీగా ఆర్థికసాయం అందజేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందిపుచ్చుకొనేలా వాటిని తీర్చిదిద్దాలనేది కేంద్ర సర్కారు ఆశయం. ఈ మేరకు మొన్న ఆగస్టులో కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఎంపిక కాగోరే సంస్థలకు ఉండాల్సిన లక్షణాలను, అవి సాధించాల్సిన లక్ష్యాలను అందులో పొందుపరచింది. దీనిపై విద్యావేత్తల నుంచి విమర్శలు వెలువెత్తడంతో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి వివరణలు అందజేసింది. ఇప్పటికీ ప్రాథమ్య సంస్థల ఎంపిక విధానంపై తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి.

అహేతుక నిబంధనలు
ప్రాథమ్య సంస్థలుగా ఎంపిక కావడానికి బరిలో నిలవాలనుకున్న విద్యాసంస్థలు తొలుత యూజీసీకి దరఖాస్తు చేసుకోవాలి. అందుకు అవసరమైన అర్హత ప్రమాణాలను యూజీసీ తన అధికారిక వెబ్‌సైట్లో సెప్టెంబరులోనే పొందుపరచింది. వాస్తవానికి యూజీసీ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలుగల సంస్థలకు ఉండాల్సిన లక్షణాలను అందులో పొందుపరచడమే విడ్డూరం. దరఖాస్తు రుసుమునే ఏకంగా కోటి రూపాయలుగా యూజీసీ నిర్ణయించింది. అనేక విద్యాసంస్థలకు నిబంధనల సారాంశం అర్థం కాకపోవడంతో అక్టోబరులో యూజీసీ ఓ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. ఎవరికీ అందనంత ఎత్తులో నిబంధనలు ఉన్నాయని అనేక విద్యాసంస్థలు వాపోయాయి. సమీక్షా సమావేశం అనంతరం తన వివరణలను యూజీసీ వెబ్‌సైట్లో ఉంచింది. నేటికీ గందరగోళం కొనసాగుతూనే ఉంది. విషయాన్ని ఇంత సంక్లిష్టం చేసే బదులు, మానవ వనరుల మంత్రిత్వశాఖ తన వద్ద ఉన్న సమాచారం ప్రాతిపదికన అర్హత కలిగిన సంస్థలను ఎంపిక చేయవచ్చు. జాతీయ విద్యాసంస్థల ర్యాంకింగులనూ ఆ శాఖ ఏటా ప్రకటిస్తోంది. స్పష్టమైన సమాచారం దగ్గరే ఉన్నప్పుడు కొత్తగా ఎంపిక కోసం ఇంత సుదీర్ఘ ప్రక్రియ చేపట్టడం వృథాప్రయాస అనక తప్పదు. ప్రపంచ ర్యాంకింగుల్లో మన విద్యాసంస్థల స్థాయిని ఎంపికకు ఓ ప్రమాణంగా తీసుకోవచ్చు. ఆ ర్యాంకింగులను ప్రకటించే టీహెచ్‌ఈ, క్యూఎస్‌ల సంస్థల నుంచి అదనపు సమాచారం రాబట్టవచ్చు. జాతీయ ప్రాధాన్య సంస్థ గుర్తింపు కోసం కొత్త విద్యాసంస్థల నుంచీ దరఖాస్తులు కోరడం ఇంకో విచిత్రం. ఒకవైపు విద్యారంగంలో విశేష అనుభవం ఉండాలని చెబుతూనే కొత్త సంస్థలూ పోటీ పడవచ్చుననడం అనేక సందేహాలకు తావిస్తోంది. దేశంలో ఎనిమిది వందలకు పైగా విశ్వవిద్యాలయాలు, 38 వేలకు పైగా కళాశాలలు ఉన్నాయి. కేవలం 20 సంస్థలనే ప్రాధాన్యంగల వాటిగా గుర్తిస్తామని కేంద్రం చెబుతోంది. దీనివల్ల మిగిలిన సంస్థలు కొరగానివన్న అభిప్రాయం జనావళిలో ప్రబలే ప్రమాదం ఉంది. మనది సమాఖ్య వ్యవస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ మనదేశంలో విశ్వవిద్యాలయాలను స్థాపించి నిర్వహించవచ్చు. 90 శాతానికి పైగా కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి పరిధిలోనే ఉన్నాయి. ఇక కేంద్ర విద్యాసంస్థలకు ఆర్థికంగా దన్ను అధికం. కేంద్రం తన పరిధిలో ఓ వర్సిటీని ఏర్పాటు చేస్తే ఆరంభంలోనే కనీస మాత్రంగానైనా రూ.100 కోట్లు సమకూరుస్తుంది. ఆపై ఏటా రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు కేటాయిస్తుంది. రాష్ట్రాలు మాత్రం తమ వర్సిటీలకు అయిదు కోట్ల రూపాయలనైనా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాయి. కనీసం రూ.20కోట్ల రూపాయలనైనా రాష్ట్ర వర్సిటీలు సమకూర్చుకోలేక యూజీసీ గుర్తింపునకూ దూరమవుతున్నాయి.

నాణ్యత ప్రమాణాల ర్యాంకుల్లో మనమెక్కడ?
టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (టీహెచ్‌ఈ) ప్రకటించిన తాజా విశ్వవిద్యాలయాల ప్రపంచ ర్యాంకింగుల్లో మనదేశ విద్యాసంస్థల వెనకబాటు ప్రస్ఫుటంగా కనబడుతోంది. బెంగళూరులోని ఐఐఎస్‌సీ 251 నుంచి 300 మధ్యలో ర్యాంకును దక్కించుకుని దేశంలో అగ్రస్థానంలో ఉంది. మొత్తం వెయ్యి ప్రకటిత ర్యాంకుల్లో 801 నుంచి 1000 స్థానాల మధ్య శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నిలిచింది. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించే విశ్వవిద్యాలయాల జాతీయ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ యూనివర్సిటీ 14, ఉస్మానియా 38, శ్రీవెంకటేశ్వర 68, ఆంధ్ర విశ్వవిద్యాలయం 69 స్థానాల్లో నిలిచాయి.

నిరుడు నవంబరులో యూజీసీ విడుదల చేసిన ఆర్థిక గణాంకాలు కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల మధ్య అంతరాన్ని వెల్లడిస్తున్నాయి. దాని ప్రకారం పన్నెండో పంచవర్ష ప్రణాళికలో 2013-14 నుంచి 2016-17 వరకు నాలుగేళ్లలో 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు భారీయెత్తున రూ.6,406 కోట్లు కేంద్రం నుంచి మంజూరయ్యాయి. మరోవైపు 159 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు అన్నింటికీ కలిపి కేవలం రూ.911 కోట్లే దఖలుపడ్డాయి. సగటున ప్రతి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏటా రూ.160 కోట్లు పొందగా, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు జమపడింది రూ.5.7 కోట్లు మాత్రమే! ఇంతటి దీనావస్థలో కునారిల్లుతున్న రాష్ట్ర వర్సిటీలు, కళాశాలలు ఏ విధంగా జాతీయ ప్రాధాన్య సంస్థ పథకానికి అర్హత పొందగలిగేది కేంద్ర సర్కారుకే తెలియాలి. నిజానికి పొందుపరచిన నిబంధనల ప్రకారం కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రెండు మూడింటికి మినహా ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందగల అర్హతలు దేనికీ లేవు. ఎంపిక కాగల అవకాశమూ లేదు. కాబట్టి, విశ్వవిద్యాలయ పరిధి వెలుపలి ఐఐటీలు, ఐఐఎమ్‌లను పరిగణనలోకి తీసుకోవాలి. ఇవి చాలావరకు స్వయంపోషక సంస్థలుగా కొనసాగుతున్నాయి. వీటిపై ప్రభుత్వ అజమాయిషీ సైతం తక్కువే. అయితే గుర్తింపు ప్రభుత్వరంగ జాబితాలో ఇస్తారా, ప్రైవేటు సంస్థలుగా పరిగణిస్తారా అన్నది కేంద్రసర్కారే తేల్చుకోవాలి. ప్రైవేటు రంగంలోని విద్యాసంస్థల విషయానికొస్తే, పథకం మొత్తం డీమ్డ్‌ లేదా ప్రైవేటు విశ్వవిద్యాలయాల చుట్టూ పరిభ్రమించే విధంగా ఉంది. నిజానికి డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల భావన, అమలు ఈ శతాబ్దం ప్రారంభం నుంచే వూపందుకుంది. వీటికి సంబంధించి యూజీసీ నిబంధనలూ 2000 సంవత్సరం తరవాత వెలుగులోకి వచ్చినవే. అంటే, కేవలం పదిహేనేళ్ల క్రితం ఉనికిలోకి వచ్చిన ఈ విద్యాసంస్థలు శతాబ్దాల చరిత్ర గల ఆక్స్‌ఫర్డ్‌ (1096), స్టాన్‌ఫర్డ్‌ (1885), ఎంఐటీ (1861) వంటి సంస్థలతో పోటీపడాలనడం సహేతుకంగా లేదు. బరిలో నిలబడాలంటే అందుకు తగిన సాధన సంపత్తిని మన విద్యాసంస్థలకు సమకూర్చగలగాలి. కాబట్టి, కేంద్రం ప్రతిపాదిస్తున్న పథకం ఉద్దేశాలు, అర్హత నిబంధనలను పునస్సమీక్షించాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి పదేసి సంస్థల ఎంపిక అన్నదే సహేతుకంగా లేదు. ఈ సంఖ్యను వందకు పెంచాలి. అప్పుడే మరిన్ని సంస్థలకు అవకాశం దక్కుతుంది. కొద్దిపాటి ఆర్థిక సహాయం అందజేస్తే మెరుగైన ఫలితాలు రాబట్టగల విద్యాసంస్థలూ అనేకం ఉన్నాయి. ఈ పథకం ద్వారా వాటిని వెలుగులోకి తీసుకురావాలంటే గుర్తించాల్సిన సంస్థల సంఖ్యను పెంచాలి. ఇప్పటికే ఐఐఎస్‌సీ, ఎన్‌ఐఎన్‌, సీసీఎంబీ సహా ఇతర కేంద్రరంగ పరిశోధక సంస్థలు; ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎమ్‌లు అన్నీ ప్రముఖ విద్యాసంస్థలుగా గుర్తింపు కలిగి ఉన్నాయి. నిధుల అందుబాటుకూ లోటు లేదు. వీటికే కొత్త పథకం కింద మళ్ళీ నిధులు ధారపోస్తే ఒనగూడే ప్రయోజనం ఏమిటి? ఈ సంస్థలను బలోపేతం చేస్తూనే, మట్టిలో మాణిక్యాలుగా ఉన్న ప్రభుత్వరంగంలోని విద్యాసంస్థలను కొన్నింటిని ఎంపిక చేసి, ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేయడమే అన్ని విధాలా సబబుగా ఉంటుంది.

ప్రాతిపదిక మారాలి
అరకొర నిధులతో నెట్టుకొస్తున్నప్పటికీ, అనేక రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రమాణాలపరంగా మంచి గుర్తింపునే పొందుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రా, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు జాతీయస్థాయిలో మంచి పేరు పొందాయి. తమిళనాడులోని అలగప్ప విశ్వవిద్యాలయం 3.64 స్కోరుతో ‘ఎ+’ గ్రేడు సాధించింది. ఒడిశాలోని ఉత్కళ్‌ విశ్వవిద్యాలయం, కర్ణాటకలోని మైసూరు వర్సిటీ గొప్ప ప్రగతి సాధించాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల పరిమిత నిధులతో మనుగడ సాగిస్తున్నవే. కాబట్టి ‘జాతీయ ప్రాధాన్య సంస్థలు’గా గుర్తింపు పొందడానికి వేరే కొలమానాల జోలికి పోకుండా జాతీయ మదింపు-గుర్తింపు మండలి (నాక్‌) ప్రకటించే గ్రేడ్‌లను ప్రాతిపదికగా తీసుకోవాలి. మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(నిర్ఫ్‌) ర్యాంకింగులనూ కొద్దిపాటి మార్పులతో పరిగణనలోకి తీసుకోవచ్చు. ‘ఇనిస్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌’ (ఐఓఈ) అనే ఈ పథకాన్ని మరింత లోతుగా కేంద్రం పరిశీలించాలి. వాస్తవిక దృక్పథంతో తగిన మార్పులు చేసి సరికొత్త నిబంధనలు తీసుకురావాలి. అప్పుడే ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైన దన్ను అందుకుని మేలిమి విద్యాలయాలు నాణ్యత ప్రమాణాల విషయంలో ప్రపంచ సంస్థలతో పోటీపడగలుగుతాయి!

Posted on 06-12-2017