Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

వధ్యశిలపై... ఉపాధి విద్య!

'మీరే దేశ భవిష్యత్తు నిర్ణేతలు... మీతోనే 'మేక్‌ ఇన్‌ ఇండియా' సాకారం కావాలి'- దేశవ్యాప్తంగా శిక్షణ పూర్తిచేసుకున్న నాలుగు లక్షలమంది పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఫోన్‌ ద్వారా పంపిన సంక్షిప్త సందేశమిది. ఐటీఐ విశిష్టత తెలియజేసే ఈ మాటలు అన్ని రాష్ట్రాలవారిలో నూతనోత్సాహం నింపుతున్నాయి.

సాంకేతిక శిక్షణ ద్వారా స్వయంఉపాధికి బాటలు వేసేవిగా ఐటీఐ సంస్థలకు తొలినుంచి మంచి పేరు ఉన్నప్పటికీ, ఉమ్మడి రాష్ట్రంలోఉన్న పరిస్థితి వేరు. మునుపటి ప్రభుత్వాల నిర్లక్ష్యధోరణి కారణంగా ఐటీఐలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. మౌలిక వసతులు లేకపోవడం, ప్రమాణాలు కొరవడటం వల్ల అనేక సంస్థలు అసలు గుర్తింపునే కోల్పోయే ప్రమాదం ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తోంది. కేంద్రప్రభుత్వం, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో కొత్తగా ఏర్పాటైన భారతీయ నాణ్యత మండలి(క్యూసీఐ) తగిన వసతులు, ప్రమాణాలున్న వాటికే ఇకనుంచి గుర్తింపు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అధికశాతం ఐటీఐల 'స్థాయి' తక్కువగా ఉండటం, వచ్చే విద్యాసంవత్సరం నుంచే నూతన నిబంధనలు అమలులోకి రానుండటంతో- విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బోధకుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం చేపట్టే సత్వర చర్యలపైనే అందరి చూపులూ కేంద్రీకృతమయ్యాయి!

గుజరాత్‌ ఆదర్శం

ఉపాధి అవకాశాలతో కూడిన నైపుణ్యాత్మక శిక్షణ అందించడం, పరిశ్రమలకు మానవ వనరుల అవసరాలు తీర్చడం, యువతలో నిరుద్యోగ నిర్మూలన వంటి లక్ష్యాలతో ఆరు దశాబ్దాలనాడే 'క్రాఫ్ట్‌మెన్‌' పథకం కింద ఐటీఐలు ప్రారంభమయ్యాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లలో సాధారణ విద్య పూర్తిచేసినవారికి ఇవి శిక్షణ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఈ డిప్లొమాలనే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రామాణికం చేయడంతో, ఐటీఐ పూర్తిచేసినవారు వాటిని విరివిగా పొందుతున్నారు. గుజరాత్‌, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి ఈ శిక్షణ సంస్థలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు వీటికి పెద్దపీట వేయడంతో పాటు తగినన్ని ప్రోత్సాహకాలనూ అందజేస్తున్నాయి. గుజరాత్‌లో సరికొత్తగా వంద సంస్థలను ప్రభుత్వం మంజూరుచేసింది. ఇప్పటికే అక్కడ 282 ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి. మొత్తం 497 ప్రైవేటు ఐటీఐలున్నాయి. వీటికి ప్రభుత్వం ఆర్థికసాయం(ఎయిడ్‌) అందజేస్తోంది. అదే రాష్ట్రంలో మరో 500 'కౌశల్య వర్ధన్‌'(నైపుణ్య వృద్ధి) కేంద్రాలు, 700 వృత్తి విద్యాశిక్షణ కేంద్రాలున్నాయి. వాటిల్లో ఏటా పది లక్షలమందికి శిక్షణ అందిస్తున్నారు. దాదాపు 60శాతం మందికి పరిశ్రమల్లో ఉద్యోగాలు సిద్ధంగా ఉంటున్నాయి. మిగిలినవారు స్వయంఉపాధి పొందుతున్నారు. ఐటీఐ పూర్తి చేసుకున్నవారికి ప్రభుత్వం ఆర్థిక, రుణ సాయం కల్పిస్తూ స్వయంఉపాధి అవకాశాల్ని విస్తృతం చేస్తోంది. గుజరాత్‌తో పోల్చిచూస్తే, తెలంగాణ పరిస్థితి బాధాకరంగా మారింది. ఈ రాష్ట్రంలో కేవలం 60 ప్రభుత్వ, 200 పైగా ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐల్లో 21వేలమంది, ప్రైవేటు సంస్థల్లో లక్షమంది వరకు శిక్షణ పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగు విద్య ప్రమాణాలకు దీటుగా లేదని, ఐటీఐలను ప్రభుత్వం పెద్దయెత్తున ప్రారంభించి తమకు అనుసంధానించాలని పారిశ్రామిక సంస్థలు కోరుతున్నాయి. నిజానికి ఇక్కడ కొత్తవాటి ఏర్పాటు గగనంగా మారింది.

పొరుగు రాష్ట్రాల్లో ఉపాధి కల్పన శాఖకు భారీగా నిధులు కేటాయించడమే కాక, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను పర్యవేక్షణకు నియమిస్తున్నారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి కల్పన-శిక్షణ శాఖను పూర్తిగా అప్రధాన శాఖగా మార్చారు! తమకు నచ్చని అధికారులను ఇందులో నియమించే 'ఆనవాయితీ'ని కొనసాగించారు. తరచూ వారి బదిలీలు సాగిస్తూ వచ్చారు. కొత్తగా వచ్చినవారిని ఇందులో నియమించి, ఆ తరవాత మరో హోదాకు మార్చేవారు. 'బడ్జెట్‌' కేటాయింపులు అతి తక్కువ. పలు శిక్షణ సంస్థలకు సదుపాయాలు మచ్చుకైనా కానరావు. భవనాలు సరిపోయినన్ని లేవు. పాత భవనాల్లో అనేకం శిథిలావస్థకు చేరాయి. ప్రయోగశాలలు ఎందుకూ కొరగాని షెడ్లలో నడుస్తున్నాయి. తరగతి గదులకు మరమ్మతుల వూసే లేదు. వసతిగృహాలు అధ్వానంగా తయారయ్యాయి. మంచినీటికి ఎప్పుడూ కటకటే. భవనం, సిబ్బంది సమకూరిన తరవాతే ఐటీఐలను మంజూరు చేయాల్సి ఉంటుంది. అవేవీ లేకుండానే గత ఎన్నికలకు ముందు కొన్నిచోట్ల మంజూరుచేశారు. ఫలితంగా ఒక్కో ఐటీఐ ప్రాంగణంలో రెండు లేదా మూడు సంస్థలు నడుస్తున్నాయి! రోడ్లు, ప్రహరీ గోడలు, వాహనాలు నిలిపి ఉంచే స్థలాలు చాలాచోట్ల లేవు. ఇతర రాష్ట్రాలు అక్కడి బాలికల కోసం విరివిగా శిక్షణ సంస్థలు ఏర్పాటు చేస్తుంటే, ఇక్కడ ఆ తరహా చొరవ లోపించింది. ఈ సంస్థలకు బోధకుల కొరత ఏ మాత్రం ఉండకూడదు. అయినా, ఉమ్మడి రాష్ట్రంలో బోధకుల నియామకాలు అంతగా జరగలేదు. తెలంగాణలో 630 పోస్టులు అంటే, సగటున ఒక్కో సంస్థకూ పదికి పైగా సిబ్బంది కొరత ఉంది. నిబంధనల మేరకు ఒక్కోచోట 30మందికి ఒక బోధకుడు అవసరం. ప్రస్తుతం 90నుంచి 100మందికి ఒకరు ఉన్నారు. బోధకుల సర్దుబాటు ప్రక్రియా చాలా ఇబ్బందికరంగా మారింది. ప్రపంచబ్యాంకు నిధులతో 'ప్రతిభా కేంద్రాలు'గా ఎంపిక చేసిన ఐటీఐల్లో బహుళ కోర్సులు ఉంటాయి. అక్కడి అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, అక్కడా సిబ్బంది కొరతే ప్రతిబంధకంగా తయారైంది. ప్రయోగశాలలు, కార్యశాల(వర్క్‌షాపు)ల్లో అధునాతన వసతులు ఉండాలి. అత్యాధునిక యంత్రాలనే ఉపయోగించాలి. అయినప్పటికీ, దశాబ్దాలకిందట ఉన్న యంత్రసామగ్రినే ఇప్పటికీ వినియోగిస్తున్నారు.

ఇంజినీరింగ్‌ విభాగంలోని శిక్షణార్థికి రూ.400, ఇతర విభాగాల్లోనైతే రూ.300వంతున ప్రభుత్వం వెచ్చించాల్సి ఉండగా- ఉమ్మడి రాష్ట్రంలో అతి తక్కువగా కేటాయించారు. తగినంత బోధనా సామగ్రి సైతం అందుబాటులో లేదు. విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికీ తగినన్ని నిధులు లేని దురవస్థ తాండవిస్తోంది. చాలా ఐటీఐల్లో శిక్షణ మొక్కుబడిగా సాగుతోంది. మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలనే వినతిని ఇన్నాళ్లూ పట్టించుకున్న నాథుడే లేడు. పాతకాలం నాటి పాఠ్యాంశాలనే నేటికీ కొనసాగిస్తున్నారు. పరీక్షల నిర్వహణ ఓ ప్రహసనంగా తయారైంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు చేపట్టిన రాజీవ్‌ ఉద్యోగశ్రీ పథకం కింద- అభ్యర్థుల శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఐటీఐలను ఉపయోగించుకున్నా, వాటికి వసతుల కల్పనను విస్మరించారు. శిక్షణ పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్‌ను కన్వీనర్‌ నియమించి, ప్రతి ఐటీఐలోనూ సంస్థల యాజమాన్య కమిటీ (ఐఎంసీ) ఏర్పాటుచేశారు. అవి సవ్యంగా పనిచేయలేదు. శిక్షణ పూర్తి చేసినవారికి పాలిటెక్నిక్‌ డిప్లొమాలో రెండో సంవత్సరం ప్రవేశం కల్పిస్తున్నారు. అభ్యర్థుల డిమాండుకు అనుగుణంగా సీట్లు ఉండటం లేదు. అప్రెంటిస్‌షిప్‌ విధానం అమలు కూడా రాష్ట్రంలో అరకొరగానే ఉంది.

ప్రమాణాల పెంపుదలే ముఖ్యం

'మేక్‌ ఇన్‌ ఇండియా' ప్రోత్సాహక విధానంలో భాగంగా, దేశవ్యాప్తంగా ఐటీఐలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.వాటిలో ప్రమాణాలను పెంచి నిపుణులను తయారుచేసేందుకు వీలుగా ప్రణాళిక రూపొందించింది. కేంద్ర ఉపాధి కల్పన శాఖ, అసోచామ్‌, సీఐఐ, ఫిక్కి వంటి పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు 38మందితో భారతీయ నాణ్యత మండలిని ఏర్పాటుచేసింది. అంతర్జాతీయ ప్రమాణాలు అనుసరించి జాతీయస్థాయి గుర్తింపు ప్రక్రియ చేపట్టడం, ప్రభుత్వ-ప్రైవేటు శిక్షణ సంస్థల్లో నాణ్యత పెంపొందించడం వంటి లక్ష్యాలను నిర్దేశించారు. క్యూసీఐ ప్రతిపాదించిన అంశాలను కేంద్రం ఆమోదించి అన్ని రాష్ట్రాలకూ పంపించింది. కేంద్ర నిబంధనల ప్రకారం ప్రతి ఐటీఐకి కనీసం పది ఎకరాల భూమి ఉండాలి. అన్ని 'ట్రేడ్‌'లను నిర్వహించాలి. సొంత భవనాలు ఉండాలి. శిక్షకులు, ఇతర బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలి. ఆయా ఐటీఐలు పరిశ్రమలతో అనుసంధానం కావాలి. శిక్షణలో ఉత్తీర్ణులయ్యే ప్రతి విద్యార్థికి అప్రెంటిస్‌షిప్‌(పరిశ్రమల్లో శిక్షణ) లభించాలి. కేంద్రం ఆదేశాల ప్రకారం- వచ్చే నెల 31నాటికి అన్ని ఐటీఐల్లో మౌలిక వసతులు, ఖాళీల భర్తీ, ఇతర ఏర్పాట్లు చేపట్టాలి. లేని పక్షంలో వచ్చే ఆగస్టులో జరిగే ప్రవేశాలను అనుమతించబోమని కేంద్రం స్పష్టంచేసింది.

మేలుకోకుంటే ముప్పు

కేంద్రం నిర్దేశించిన పూర్తిస్థాయి ప్రమాణాలు తెలంగాణలోని 90శాతం ఐటీఐల్లో లేవు. దీంతో వాటికి గుర్తింపు ఓ సమస్యగా మారనుంది. ప్రధానంగా నిరుపేదలు, బలహీనవర్గాలవారికి ఈ సంస్థలు ఎంతో ఉపకరిస్తాయి. అనేకులు ఉపాధితోపాటు పలు ప్రభుత్వ ఉద్యోగాలను ఆశిస్తూ పెద్దసంఖ్యలో ఐటీఐల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. మరో ఆరు నెలల గడువు దృష్ట్యా- రాష్ట్రప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు, సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టాలి. ఐటీఐల్లో ఇచ్చే శిక్షణ ప్రాథమికమైనదే. వారికి పూర్తిస్థాయి శిక్షణ అప్రెంటిస్‌షిప్‌ ద్వారా సమకూరుతుంది. ఇది పరిశ్రమల్లో శిక్షణ ద్వారానే సాధ్యం.'మేక్‌ ఇన్‌ తెలంగాణ'యే తమ లక్ష్యమని, ఇందుకోసం పెద్దయెత్తున నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్రప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానంలో తెలియజేసింది. పారిశ్రామిక సంస్థలు ముందుకొస్తే, వాటికి అనుబంధంగా ఐటీఐల ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని అప్పట్లోనే ప్రకటించింది. గుజరాత్‌లో ప్రతి ఐటీఐకి ఒక పరిశ్రమ తోడుంది. అలాంటి విధానాన్నే ఇక్కడా అమలుచేయాలి. కేంద్రప్రభుత్వం ఐటీఐలను బాగా ప్రోత్సహిస్తోంది. గుజరాత్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కేంద్ర సాయాన్ని విరివిగా ఉపయోగించుకుంటున్నాయి. దీన్ని రాష్ట్రప్రభుత్వమూ సద్వినియోగం చేసుకుని, నిరుద్యోగ సమస్యను పారదోలేందుకు అనువైన చర్యలు చేపట్టాల్సి ఉంది.

(రచయిత - ఆకారపు మల్లేశం )
Posted on 22-02-2015