Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

గిడసబారుతున్న బాల్యం

* పోషకాహారంపై పెట్టాలి దృష్టి

దేశంలో పోషకాహార ప్రాముఖ్యంపై అవగాహన పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పిలుపిచ్చారు. ప్రపంచంలోని వివిధ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అత్యధికంగా చిన్నారులు పోషకాహార లోపంతో సతమతమవుతున్నట్లు ‘అసోచామ్‌’ వంటి సంస్థలు నిగ్గుతేల్చిన నేపథ్యంలో- ఆయన పిలుపు ప్రాధాన్యం సంతరించుకొంది. దేశవ్యాప్తంగా సామాజిక, ఆరోగ్యపరమైన అసమానతలు విస్తరించాయి. బహుముఖ వ్యూహాలతోనే ఈ అసమానతలను కట్టడి చేయగలమని వివిధ అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ దిశగా నిర్మాణాత్మక విధానాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు కదలాల్సి ఉంది. జాతీయ పోషకాహార మిషన్‌(ఎన్‌ఎన్‌ఎం)ను ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించడం ఆ దిశగా కీలక పరిణామం!

అవగాహన అత్యవసరం
దేశంలోని మూలమూలకూ విస్తరించిన పోషకాహార లేమి పరిష్కారానికి కేంద్రం కృతనిశ్చయంతోనే ఉందనడంలో సందేహం లేదు. పోషకాహార లోపాలను సరిదిద్దే క్రమంలో భాగంగా వచ్చే మూడేళ్లకుగాను రూ.9,046 కోట్లు కేటాయించినట్లు కేంద్రం ప్రకటించింది. నూతన విధానం ప్రకారం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి; వైద్య-ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో నడిచే పథకాలన్నింటినీ సమ్మిళితం చేయనున్నారు. 2005-’15 మధ్యకాలంలో దేశంలో నవజాత శిశువుల మరణాల రేటు తగ్గింది. అయిదేళ్ల లోపు పిల్లల పరిస్థితి కొంత మెరుగుపడింది. పోషకాహార లోపంతో బాధపడుతున్న బాలలకు సంబంధించిన సమస్య మాత్రం తీవ్రంగానే ఉంది. ‘అసోచామ్‌’ నివేదిక అదే విషయాన్ని తేల్చి చెప్పింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార సమస్యలతో కుమిలిపోతున్న బాలల సంఖ్య 40శాతం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల మేరకు దేశంలో అయిదేళ్లలోపు పిల్లల్లో 37శాతం మంది తక్కువ బరువుతో బాధపడుతున్నారు. దాదాపు 39శాతం బాలలు ఎటువంటి ఎదుగుదలా లేకుండా మిగిలిపోయారు. పట్టణ ప్రాంతాల్లో అలాంటివారు 29శాతం ఉన్నారు. గ్రామీణ భారతంలో వారి సంఖ్య 28శాతంగా ఉంది. మాతృగర్భంలో బిడ్డ ఎదుగుతున్న దశలోనే పోషకాహారంపై దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ ఆధ్వ ర్యంలో ఏర్పాటైన అంతర్జాతీయ సదస్సు ఈ మేరకు పలు సూచనలు చేసింది. దాదాపు 30శాతం చిన్నారులు పోషకాహార లోపంతోనే జన్మిస్తున్నారని, ఈ దురవస్థను అడ్డుకుంటేనే ఆరోగ్య భారతం సాకారమని సదస్సు స్పష్టీకరించింది. ‘బిడ్డ పుట్టక ముందు, పుట్టిన తరవాత- 1000 రోజుల్లో పోషకాహారం’ అనే అంశంపై శాస్త్రవేత్తలు ప్రసంగించారు. పోషకాహార లోపంతో సరైన బరువు లేకుండా పుట్టిన పిల్లలు- ఆ తరవాతా వయసుకు తగిన బరువు, ఎత్తు అందుకోలేకపోతున్నారు. పుట్టిన బిడ్డకు ఎలాంటి ఆహారం ఇవ్వాలన్న విషయంలో సహేతుక అవగాహన దేశంలో కేవలం 10శాతంనుంచి 15శాతం తల్లులకే ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడవుతోంది. అమ్మలందరిలోనూ పోషకాహారంపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని సూచిస్తున్న పరిణామమిది.

మహిళల్లో 60శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు. ఆ ప్రభావం వారి సంతానంపైనా పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు దేశంలోని మరో అయిదు రాష్ట్రాల్లో జిల్లాలవారీగా పిల్లలు పుట్టినప్పటి నుంచీ వారి ఆరోగ్య సమాచారం సేకరిస్తున్నారు. ఆ మేరకు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ చురుగ్గా వ్యవహరిస్తోంది. వివిధ సేవాసంస్థల సహకారంతో 2018 జనవరి నుంచి దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో సర్వే చేసి ఆరోగ్య సమాచారం సేకరించనున్నారు. ఆరేళ్లలోపు పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతల కోసం దేశంలో వివిధ పథకాలు అమలవుతున్నాయి. పోషకాహారంతో ముడిపడిన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పథకాలన్నింటినీ ఏకీకృతం చేయాలన్న యోచనా ఉంది. వివిధ శాఖల ఆధ్వర్యంలోని పథకాలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చి, దేశవ్యాప్తంగా ఎన్‌ఎన్‌ఎమ్‌ ద్వారా ఆ కార్యక్రమం అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. పోషకాహార కార్యక్రమాల నిర్వహణకు ఆ సంస్థ దిశానిర్దేశం చేయనుంది. నిర్దేశిత లక్ష్యాలను చేరుకునే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రోత్సాహకాలు అందజేస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్రోడీకరించి అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతూ వారిని ఉత్సాహపరచాలనీ నిర్ణయించారు. ఈ కార్యక్రమాల సమర్థ అమలుకు మౌలిక సౌకర్యాలు చాలా అవసరం. వాటిని సమకూర్చడంపై ప్రభుత్వం శ్రద్ధపెట్టాలి. ఎన్‌ఎన్‌ఎమ్‌ ద్వారా ఏటా పది కోట్ల మంది లబ్ధి పొందుతారని అంచనా. 2017-18 నుంచి మూడేళ్ల కాలంలో ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాలకూ విస్తరింపజేస్తారు. తొలి ఏడాది 315 జిల్లాల్లో, రెండో సంవత్సరం 235, చివరి ఏడాది మిగతా జిల్లాల్లో అమలు జరుపుతారు. మొత్తం వ్యయంలో 50 శాతాన్ని కేంద్రప్రభుత్వం బడ్జెట్‌ ద్వారా అందించనుంది. అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంక్‌ (ఐబీఆర్‌డీ) వంటి సంస్థల ద్వారా మిగతా సగం సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఖర్చుపెట్టే మొత్తాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. ఇది ఈశాన్య, హిమాలయ రాష్ట్రాల విషయంలో 90:10, 100:0గా ఉంటుంది. ఎన్‌ఎన్‌ఎమ్‌ను మూడు దశల్లో అమలుచేయనున్నారు. ఏటా పిల్లల్లో ఎదుగుదల లేమిని రెండు శాతం, పోషకాహార లోపాన్ని రెండు శాతం, రక్తహీనతను మూడు శాతం తగ్గించాలని లక్ష్య నిర్దేశం చేసుకున్నారు. తక్కువ బరువు జననాల్ని రెండు శాతం తగ్గించాలనీ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 2022 నాటికి ఎదుగుదల లేమిని 38.4శాతంనుంచి 25 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోషకాహార పథకాల అమలులో ‘బోగస్‌’ పేర్లు చేర్చడం అతిపెద్ద సమస్యగా ఉంది. ఈ సమస్యను ‘ఆధార్‌’ అనుసంధాన ప్రక్రియ ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం సంకల్పించడం హర్షణీయం.

సమూల మార్పులతో మేలు
బాలల పోషకాహార జాబితాలో అంతర్జాతీయంగా 26వ స్థానంలోని చైనాను చేరుకోవాలంటే భారత్‌కు మరో నాలుగు దశాబ్దాల కాలం పడుతుందన్న అధ్యయనాలు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో నడుంబిగించాల్సిన అవసరాన్నే ఉద్బోధిస్తున్నాయి. ఇటువంటి స్థితిగతుల్లో పోషకాహారానికి పెద్దపీట వేస్తూ ఓ జాతీయ విధానాన్ని నీతి ఆయోగ్‌ రూపొందించడం ఆశాజనక పరిణామమే! గ్రామం, నివాస సముదాయాల స్థాయిలో మాతా శిశు ఆరోగ్యం, పోషకాహార బాధ్యతల్ని పూర్తిగా అంగన్‌వాడీ కేంద్రాలకు అప్పగించాలని నీతిఆయోగ్‌ భావిస్తోంది. బాలల వికాసానికి వెచ్చించే ప్రతి రూపాయీ సద్వినియోగం కావాలి. రాష్ట్రాలవారీ ప్రణాళికలు సిద్ధం కావాలి. అంతేకాక, నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాల పెంపుదలపై ప్రభుత్వాలు పూర్తిగా దృష్టి సారించాలి. పేదరిక నిర్మూలన కోసం రాజీ లేని పోరు సాగించాలి. పాతికేళ్లనుంచి అమలవుతున్న పోషకాహార విధానాల్లో ఇకనైనా సమూల మార్పులు తేవాలి. ప్రభుత్వ చర్యలతోపాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తేనే సత్ఫలితాలు సాధ్యపడతాయి. మహిళల, బాలల ఆరోగ్యాన్ని కాపాడినప్పుడే మెరుగైన భారతం ఆవిష్కృతమవుతుంది.

- నల్లాని రాజేశ్వరి
Posted on 08-12-2017