Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పీల్చే గాలి... కాల్చేస్తోంది

* రేపు కాలుష్య నియంత్రణ జాతీయ దినం

వాయుకాలుష్యం విషమ సమస్యగా మారింది. పర్యావరణంతో పాటు ప్రజారోగ్యాన్ని, ఆర్థిక వ్యవస్థలను అది నానాటికీ కుంగదీస్తోంది. విపరీతమైన కాలుష్యం ఫలితంగా, దేశీయ ఉత్పాదకత ఎంతో దెబ్బతింటోంది. ప్రజల్లో శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇతర రుగ్మతలూ తలెత్తుతున్నాయి. భారత్‌ను పోషకాహార లోపం తరవాత అత్యంత తీవ్రంగా వేధిస్తున్న సమస్య వాయుకాలుష్యమే! ఉత్తరాదిని, ప్రత్యేకించి దేశరాజధాని దిల్లీ నగర వీధుల్ని కాలుష్యం- పొగమంచు రూపంలో కమ్మేస్తోంది. ఈ పరిస్థితి సహజసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తోంది. రోజు రోజుకూ పెరుగుతున్న మోటారు వాహనాల నుంచి వెలువడే పొగ, వివిధ నగరాల్లోని పరిశ్రమల ద్వారా కమ్ముకొనే వాయువులు పలు కష్టనష్టాలకు దారితీస్తున్నాయి. శీతాకాలం మంచుకు కాలుష్య పొగ మేఘాలు తోడై, దిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో పగలే అంధకారం అలముకుంటోంది. ఉపరితల, గగనతల రవాణాకు అంతరాయం కలుగుతోంది. జనజీవనం స్తంభించిందా అన్నట్లు దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. దట్టంగా కమ్ముకున్న పొగమేఘాల కారణంగా, కనుచూపు మేరలో ఏముందో కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణంలోకి విడుదలవుతున్న విషవాయువుల పరిమాణం ఎప్పటికప్పుడు పెరుగుతోందన్నది కఠోర వాస్తవం. భారత్‌లో రోగాలబారిన పడుతున్న వారిలో ఆరుశాతానికి పైగా వాయుకాలుష్య బాధితులేనని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌, బిహార్‌, రాజస్థాన్‌, పశ్చిమ్‌ బంగ వంటి రాష్ట్రాల్లో వాయుకాలుష్యం తీవ్రతరమవుతోంది. దక్షిణాదిన హైదరాబాద్‌లోనూ కాలుష్యం వల్ల అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో రేపు సర్వత్రా కాలుష్య నియంత్రణ దినోత్సవం పాటిస్తున్నారు.

వాతావరణం విషతుల్యం
ప్రాణాంతక పొగమంచుతో పాటు కర్మాగారాల నుంచి వెలువడే వాయువులు, మోటారు వాహనాల పొగల నుంచి అనేకుల్ని రక్షించాల్సి ఉంది. వరిగడ్డి మంటల కట్టడి ద్వారా కాలుష్య ధూమాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే ఆదేశించింది. ఆ మేరకు కేంద్రంతో పాటు పంజాబ్‌, దిల్లీ, హరియాణా రాష్ట్రప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు, ప్రభుత్వ-ప్రభుత్వేతర కార్యాలయాలు సహా ప్రజల ందరి దైనందిన వ్యవహారాలపై పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. వాహనాలు అదుపుతప్పి సంభవించే రోడ్డుప్రమాదాలు పలువురి ప్రాణాల్ని హరిస్తున్నాయి. అందుకే ప్రభుత్వాలు సత్వరమే దిద్దుబాటు చర్యలకు దిగాలని సుప్రీంకోర్టు ఆదేశించాల్సి వచ్చింది. ఉత్తరాదిలోని గంగానది పరీవాహక ప్రాంతం సారవంతమైనది. వరి, గోధుమ, చెరకు, మొక్కజొన్న తదితర ఆహారధాన్యాల ఉత్పత్తికి అది పెట్టింది పేరు. దేశ రాజధాని ప్రాంత పరిసరాల్లో గల వ్యవసాయ క్షేత్రాల రైతులు- పంట చేతికొచ్చిన తరవాత పొలాల్లో మిగిలిపోయిన గడ్డి, పంట నూర్పిడిలో మిగిలిన వ్యర్థాల్ని దహనం చేస్తారు. అప్పుడు వెలువడే పొగ అక్కడి వాతావరణంలోకి చేరి, మందమైన పొరలా ఏర్పడుతోంది. అంతకుముందే పేరుకుపోయిన కాలుష్యంతో పాటు, ఇతర కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న కలుషిత ఇంధనాలూ జతపడి సమస్య మరింత తీవ్రతరమవుతోంది. పైగా వివిధ నగరాల వీధులు పొగమంచుతో నిండుతున్నాయి. ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్థాన్‌లోని పలు నగరాల్లోనూ రానున్న నెలల్లో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. ఆ మేరకు అమెరికాకు చెందిన వాతావరణ సంస్థ ‘నేషనల్‌ ఓషియానిక్‌, అట్మాస్ఫెరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌’ హెచ్చరించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఆయా నగరాలు అనారోగ్యకర మంచుపొరలు కమ్మిన ప్రాంతాలుగా మారిపోతాయని సంస్థ నివేదిక వెల్లడించింది. రానున్న కాలంలో చలి తీవ్రత పెరుగుతుంది. ఫలితంగా కాలుష్యం మరింత పేరుకుపోతుందని ఆ సంస్థ ముందుగానే విశ్లేషించింది. సాధారణంగా శిలాజ ఇంధనాలతో పాటు పంటల్ని, వ్యర్థాల్ని విచక్షణ రహితంగా మండించడం వల్ల భారీగా పొగమంచు ఏర్పడుతుంది. ప్రధాన నగరాల్లో రోజూ లక్షలాది వాహనాలు విడుదలచేసే వాయువులు గాలిని కాలుష్య మయంగా మారుస్తున్నాయి. కొత్తగా రోడ్లమీదకొచ్చే వాహనాలూ దీనికి జతపడటంతో, వాయుకాలుష్యం పెచ్చుమీరుతోంది. దక్షిణాదిన హైదరాబాద్‌, విశాఖ, చెన్నైలలోనూ వాయుకాలుష్యం వల్ల వాతావరణం విషతుల్యమవుతోంది.

మానవ చర్యల ఫలితంగా వాతావరణంలో ‘విలోమ పొర’ ఏర్పడుతోంది. కాలుష్య కారకాలన్నీ ఒకేచోట పేరుకుపోయే స్థాయిలో గాలి నిశ్చలంగా మారిపోతుంది. అది చల్లబడకుండా ఉండటం వల్లనే విలోమ పొర రూపొందుతుంది. భూ వాతావరణానికి పైన ఉన్న చల్లని, దట్టమైన గాలిమీద వేడి గాలి ఆవరిస్తుంది. శీతల పవనాలు ఎటూ కదలలేని స్థితిలో కాలుష్య కారకాలు పేరుకుపోతాయి. దుప్పటిలా మారిన మంచుపొర నగర వీధుల్ని కప్పేసి, అనూహ్యమైన వాతావరణ పరిస్థితుల్ని సృష్టిస్తుంది. పెచ్చుమీరుతున్న వాయుకాలుష్యం దృష్ట్యా, సర్వోన్నత న్యాయస్థానం దీపావళి పండుగకు మునుపే దిల్లీలో బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించింది. అక్కడ పండుగ మరురోజు 403గా నమోదైన గాలి నాణ్యత సూచి, మరో పక్షం రోజులకే 491కి చేరింది. కాలుష్య తీవ్రత నానాటికీ ఎలా కమ్మేస్తుందో దీన్నిబట్టి గమనించవచ్చు. దాంతో దేశరాజధానిలోని విద్యాసంస్థలకు అప్పటికప్పుడు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. కాలుష్య మహమ్మారిని అరికట్టడంలో అలసత్వం తగదంటూ కేంద్రంలోని సంబంధిత విభాగం దిల్లీ, పంజాబ్‌, హరియాణాలకు నోటీసులు జారీచేసింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ సైతం దిల్లీలో నిర్మాణ, పారిశ్రామిక రంగాల పనులపై నవంబరు 14 వరకు నిషేధం విధించింది. దిల్లీ పరిసర ప్రాంతాలైన ఘజియాబాద్‌లో గాలి నాణ్యత సూచీ 475. అది నోయిడాలో 468, ఫరీదాబాద్‌లో 409, గుర్‌గావ్‌లో 368గా నమోదైంది. గ్రీన్‌ పీస్‌ ఇండియా సంస్థ ఇటీవలి అధ్యయనం ప్రకారం- అలహాబాద్‌, కాన్పూర్‌, బరేలీ, రాంచీ, ఝరియా, పట్నా వంటి నగరాల్లోనూ వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుతోంది. దేశంలో 75 శాతానికి పైగా నగరాలు, పట్టణాల్లో గాలి నాణ్యత ప్రమాణాలు దిగజారిపోయాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, గుంటూరుల్లో వాయుకాలుష్య తీవ్రత కలవరపరుస్తోంది. దేశంలోని 90కి పైగా నగరాలకు సంబంధించి- గాలిలో విషపూరిత ధూళి కణాల సంఖ్య స్థిరంగా పెరుగుతోందని నిర్ధారించారు.

భోపాల్‌ గుండెఘోష
* విషవాయు ప్రమాదం సంభవించి 33 ఏళ్లు దాటినా, ఆ మహావిషాదం తాలూకు నీలినీడలు భారత్‌ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.
* ప్రమాదం జరిగిన 45-60 నిమిషాలలోపే 30 మెట్రిక్‌ టన్నుల విషవాయువులు గాలిలో కలిసిపోయాయి. మరో రెండు గంటల్లోనే వాటి పరిమాణం 40 టన్నులకు చేరింది.
* వాతావరణంలో సాధారణంగా ఉన్న గాలి భారం కంటే, ఆ భారీ విషవాయు మిశ్రమాల బరువు అత్యధికం. దాంతో వాయు మేఘాలు పైకి ఎగబాకలేక, పరిసరాల్లోని భూమిపై క్షణాల్లో విస్తరించి అక్కడి వాతావరణమంతటినీ విషతుల్యం చేశాయి.

ఉద్యమస్ఫూర్తి వెల్లివిరియాలి
వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు సుస్థిర, దీర్ఘకాలిక, సమగ్ర ప్రణాళికలు అత్యవసరం. ఆ కార్యాచరణలో ప్రధానంగా ఎదురవుతున్న అవరోధాలు అనేకం. వాటిని అధిగమించగలగాలి. వాతావరణ సూచనల్లో శాస్త్రీయత కావాలి. ప్రజారవాణా రంగంలో తగిన మార్పులు రావాలి. వీటన్నింటినీ సమన్వయం చేయగలిగే ప్రభుత్వ నియంత్రణ విధానం అన్నింటికంటే ఆవశ్యకం. పారిస్‌లో ప్రజారవాణా పూర్తిగా ఉచితం. మనదేశంలో ఆ వ్యవస్థను బలోపేతం చేసే పనులు వేగవంతం కావడం లేదు. బస్సుల కుదింపు, ఛార్జీల బాదుడు వల్ల ప్రజల్లో రవాణా వ్యవస్థ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. ప్రజారవాణాను అందరికీ పూర్తిగా అందుబాటులోకి తెచ్చిననాడు, వాహనాల కాలుష్యాన్ని అదుపు చేయడం అసాధ్యం కాదు. వాహనాల రద్దీని నియంత్రించడానికి దిల్లీలో అనుసరించిన సరి-బేసి విధానం ఆచరణలో అనుకున్నంత ఫలితమివ్వలేదు. అందువల్ల సమగ్ర నియంత్రణ విధానాన్ని రూపొందించి ఆచరణకు తేవాలి. దేశమంతటా నియమావళికి అనుగుణమైన వాహనాల రూపకల్పన ప్రధానం. వాయుకాలుష్య నియంత్రణలో అగ్రగామిగా ఉన్న చైనా తరహాలో, మనదేశంలోనూ ప్రత్యక్ష పర్యవేక్షణ కేంద్రాల్ని ఏర్పాటుచేయాలి. వాయుకాలుష్యం బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో ఫిలిప్పీన్స్‌, వియత్నాం, పెరూ, ఉరుగ్వేలు సత్ఫలితాలు సాధించాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలి. పర్యావరణ నియమాల్ని నిక్కచ్చిగా అమలుచేయడంలో కెనడా, ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, న్యూజిలాండ్‌ దేశాలు చొరవ చూపుతున్నాయి. వాటి స్ఫూర్తిగా భారత్‌ ముందడుగు వేయాలి. మొక్కల్ని నాటించడం, వాటి సంరక్షణను ఉద్యమస్థాయిలో చేపట్టడం ప్రభుత్వాల ముఖ్య బాధ్యతలు. పర్యావరణ నిబంధనల్ని ఉల్లంఘించేవారికి కఠినశిక్షలు పడేలా చూడాలి. అప్పుడే ప్రాణవాయువును కొంతవరకైనా నిలబెట్టుకోవచ్చు. అలా కానప్పుడు, అది ప్రాణాల్ని తోడేసే వాయువుగానే మిగులుతుంది!

Posted on 08-12-2017