Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ఆదివాసుల అనాది ఘోష

* హక్కులు దక్కక అశాంతి
ఆదివాసి ప్రాంతాల్లో అశాంతి రగులుతోంది. పలమావు నుంచి ఆదిలాబాద్‌ దాకా వారిలో నవచైతన్యం వెల్లివిరుస్తోంది. దాంతోపాటే వారివైపు నుంచి అనేక ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులు, అధికారాలు ఎప్పుడు దక్కుతాయని; బయటి ప్రాంతాలవారి దోపిడికి ఎన్నడు తెరపడుతుందని; తమ వెలివేత ఇంకా అంతం కాదేమిటని నిలదీస్తున్నారు. భారతదేశ జనాభాలో గిరిజనులు 8.2 శాతం దాకా ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వారు విస్తరించి ఉన్నారు. స్థూలంగా వారిని మూడు వర్గాలుగా విభజించారు. ఎప్పుడో ఆర్యుల కాలంలో వలసవచ్చి ప్రధానంగా మధ్యభారతంలో నివసిస్తున్నవారిని మొదటి విభాగంలో చేర్చారు. ఇటీవలి కాలంలో వలసవచ్చి హిమాలయాలు, ఈశాన్య భారత ప్రాంతంలో ఉంటున్న మంగోలియా జాతి గిరిజనులను మిగతా రెండు వర్గాలుగా విభజించారు. సాధారణ జనావాసాలకు ఎంత దూరంగా ఉంటున్నారు; వెనకబాటుతనం ఏ స్థాయిలో ఉంది; సంస్కృతి, భాష, మతపరమైన విశేషాలు, విశిష్టతలు ఏమిటి; జనంతో కలవడానికి ఎంతవరకు వెనకాడుతున్నారు వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకొని గిరిజనులను వర్గీకరించారు.

ప్రభుత్వం 573 సమూహాలను గిరిజనులుగా గుర్తించింది. ప్రత్యేక ప్రయోజనాలు పొందడానికి, చట్టసభలు, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లకు వారు అర్హులు. వీరిలో అతిపెద్ద గిరిజన సమూహం- గోండులు. వీరు దాదాపు కోటీ 60 లక్షల వరకు ఉంటారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలలో వీరు విస్తరించి ఉన్నారు. తరవాత సంతాల్‌లు కోటీ 40 లక్షల దాకా ఉన్నారు. దేశంలోని అతిపెద్ద ఆదివాసి తెగలన్నీ మధ్య భారతంలోనే ఉన్నాయి. మొత్తం గిరిజనుల్లో 75 శాతం దాకా ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు.

ఆదివాసులు అంటే మూలవాసులని అర్థం. ఆ అర్థం ధ్వనించాలనే ఉద్దేశంతోనే 1930 నుంచి ఈ పదాన్ని వాడుతున్నారు. షెడ్యూల్డు తెగలవారిని మాత్రం ఆదివాసులు అని అనలేం. స్వాతంత్య్రం వచ్చాక కూడా ఆదివాసులు వెనకబడే ఉండిపోగా, మిగతా రెండు గిరిజన వర్గాలు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి సాధించాయి. వారిలో రాజస్థాన్‌లోని మీనాలు, గుజ్జార్లు; మహారాష్ట్ర, తెలంగాణల్లోని లంబాడాలు; ఈశాన్య భారతంలోని ఖాసీలు, మిజోలు, అంగమీలు, తంగ్‌ఖుల్‌ నాగాలు, మీఠీలు మంచి ప్రగతి సాధించారు. షెడ్యూల్డు తెగలుగా నిర్ధారణకు నిర్దేశించిన ప్రమాణాల పరిధిలోకి కూడా రానంతగా ముఖ్యంగా మీనాలు, గుజ్జార్లు అభివృద్ధి చెందారు. మరోవైపు పెద్ద సంఖ్యలో గిరిజన గ్రామాలు, ఆవాసాలు అంతులేని సమస్యలతో సతమతమవుతున్నాయి. పాఠశాలలు లేవు. వైద్య చికిత్స సదుపాయాలు లేవు. సరైన రహదారులూ కానరావు. బొగ్గును చాలావరకు గిరిజన ప్రాంతాల నుంచే వెలికితీస్తున్నారు. జలవిద్యుత్‌ ప్రాజెక్టులూ ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ గిరిజన గ్రామాల్లో అత్యధికం కారుచీకట్లలో కొట్టుమిట్టాడుతున్నాయి. అడవులు అదృశ్యమై వారు జీవనాధారాన్నీ కోల్పోతున్నారు. ఇక ఆదివాసుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎంతో ఖనిజ సంపద కలిగిఉన్న ఒడిశా సంగతే తీసుకొందాం. అక్కడి ఆదివాసుల్లో 72 శాతానికిపైగా దారిద్య్రరేఖకు దిగువనే కునారిల్లుతున్నారు. జాతీయస్థాయిలో 45.86 శాతం ఆదివాసులు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. అంటే దేశంలో దాదాపు సగం మంది మూలవాసులు నిత్యం ఆకలిదప్పులతో అలమటిస్తున్నారన్నమాట. పోషకాహారానికి దూరమవుతున్న ఆదివాసుల్లో రానురాను శారీరక ఎదుగుదల లోపించి, బలహీనపడిపోతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పరిపాలన వ్యవస్థల్లోనూ ఆదివాసులకు నిలువనీడ లేకుండా పోతోంది. దేశంలో మొత్తం 4,926 మంది (ఉండాల్సినవారు 6,396) ఐఏఎస్‌ అధికారులు ఉన్నారు. వారిలో ఎస్టీలు 240. కానీ అతిపెద్ద ఆదివాసి వర్గమైన గోండుల నుంచి ఒక్క ఐఏఎస్‌ అధికారీ లేరు. సంతాలీలు కొంతనయం. సంతాలీని అధికార భాషగా గుర్తించడంతో వారు తమ భాషలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాయగలుగుతున్నారు. అయినప్పటికీ రాజస్థాన్‌కు చెందిన మీనా తదితర గిరిజన వర్గాలు, ఈశాన్య భారతంలోని ఖాసీలు, నాగాలు, మిజోలే సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో బాగా రాణిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆదివాసి ప్రాంతాల్లో అసంతృప్తి ఆగ్రహం రాజుకొంటున్నాయి. ప్రభుత్వం అసలు సమస్య పరిష్కారానికి ప్రయత్నించే బదులు, దీన్ని శాంతిభద్రతల అంశంగా పరిగణించి జ్వాలలు ఆర్పేందుకు మొగ్గుచూపుతోంది. ఇటీవల కొంతకాలంగా అధికార యంత్రాంగం ఆదివాసుల మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువ. క్రైస్తవంలోకి పెద్దయెత్తున మతమార్పిడులూ చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బిహార్‌ను విభజించి ఝార్ఖండ్‌ను, మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, ఈ రాష్ట్రాల్లో అధికంగా ఉన్న ఆదివాసులకు రాజకీయాధికారం దక్కలేదు. రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలనైనా గట్టిగా అమలుచేసి ఉంటే, పరిస్థితి ఇప్పటిలా ఉండేది కాదు. వలసల కారణంగా ఆదివాసీల సంఖ్యాధిక్యత తగ్గిపోయింది. భారత రాజ్యాంగం పరిధిలో, సార్వత్రిక న్యాయ, సమానత సూత్రాల ప్రాతిపదికన ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే అవకాశం ఇప్పటికీ ఉంది. దేశవ్యాప్తంగా గిరిజనుల సంఖ్యాధిక్యత కలిగిన తహశీల్‌లు 332 ఉన్నాయి. వాటిలో 110 తహశీల్‌లు ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అవి గిరిజన రాష్ట్రాలే కనుక పెద్ద సమస్యలేదు. మిగిలిన 222 తహశీల్‌లలో ఆదివాసుల జనాభా రెండు కోట్లకుపైగానే ఉంది. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా ఈ తహశీల్‌లకు స్వయంపాలనాధికారం కల్పించాలి. గిరిజన సంఖ్యాధిక్యత కలిగిన ఈ ప్రాంతాలను పరిపాలనా విభాగాలుగా సంఘటితపరచాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకత్వానికి వాటి నిర్వహణ బాధ్యత అప్పగించాలి. విద్య, ఆరోగ్యం, సాగునీరు, రహదారులు, భూమి రికార్డుల వంటి అంశాలను స్థానిక ప్రభుత్వాలకు అప్పగించాలి. పోలీసులనూ స్థానిక ప్రజాప్రతినిధులకు జవాబుదారీ చేయాలి. ఇలాంటి చర్యలు చేపట్టినప్పుడే ఆదివాసులకు తగిన న్యాయం జరుగుతుంది.

- మోహన్‌ గురుస్వామి
Posted on 12-12-2017