Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ముంగిట్లో ముప్పు

* అణుకేంద్రాలతో తస్మాత్‌ జాగ్రత్త
అణు విద్యుత్‌ చుట్టూ వివాదాలు అంతు లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అణు విద్యుత్‌ కేంద్రాలను నెలకొల్పి 700 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవంక రష్యా సాంకేతిక విజ్ఞానంతో రూపొందిన రెండు అణు విద్యుత్‌ కేంద్రాలను కుడంకుళంలో అదనంగా ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పర్యావరణవాదులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫ్రాన్స్‌తో ఒప్పందంలో స్వల్ప మార్పులు చేసుకొని 1,650 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు ఫ్రెంచ్‌ నిర్మిత అణు కేంద్రాలు నెలకొల్పాలని నిర్ణయించడం దెబ్బమీద దెబ్బ! దశాబ్దాలుగా దేశంలో అణువిద్యుత్‌ ఉపయోగానికి సంబంధించి అభ్యంతరాలు వినిపిస్తూనే ఉన్నాయి.

అయిదో దశకంలో- బాంబేకి దగ్గర్లోని తారాపూర్‌లో అణు ఇంధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టింది మొదలు, దేశంలో అణు కేంద్రాల అవసరంపై విమర్శలు ఉవ్వెత్తున ఎగసిపడుతూనే ఉన్నాయి. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో అణు కేంద్రాల వల్ల కలిగే ప్రమాదాలను ఏకరువు పెడుతూ విఖ్యాత శాస్త్రవేత్త, సామాజిక పరిశోధకులు డీడీ కొశాంబి నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు లేఖ రాశారు. తరగని సూర్యశక్తిని సమర్థంగా వినియోగించుకోవడంపై దృష్టిపెట్టకుండా- అణు కేంద్రాల వెంటబడటంలోని ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. సూర్యరశ్మితోపాటు, అపారమైన పవన శక్తి, జీవ ఇంధనాలు భారత్‌లో లభ్యమవుతున్నాయి. అప్పట్లో డీడీ కొశాంబి వ్యక్తం చేసిన భయానుమానాలన్నీ కాలక్రమేణా నిజాలుగా రుజువవుతున్నాయి. అమెరికాలోని త్రీ మైల్‌ ద్వీపంలో, రష్యాలోని చెర్నోబిల్‌లో, జపాన్‌లోని ఫుకుషిమాలో చోటుచేసుకున్న ప్రమాదాలు అణు వినియోగం గతి తప్పితే తలెత్తే సమస్యలను కళ్లకు కట్టాయి. భారీయెత్తున పర్యావరణ, మానవ నష్టాలను చవిచూసిన తరవాత ఒక్కో దేశం క్రమంగా అణు కేంద్రాలను మూసి వేస్తూ వచ్చింది. మనదేశంలోనూ సౌరశక్తి కేంద్రాలు మునుపెన్నడూ లేని స్థాయిలో నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే సౌర విద్యుత్‌ అందుబాటులోకి వస్తోంది. ఒక యూనిట్‌ సౌర విద్యుత్‌ ఖరీదు 2.62 రూపాయలు. ఈ ధర అయిదునుంచి ఏడేళ్ల కాలంలో మరింత తగ్గి ఒకటిన్నర రూపాయికి చేరుతుందని అంటున్నారు. మరోవంక కుడంకుళంలోని రష్యన్‌ అణు కేంద్రాల ద్వారా సరఫరా అయ్యే విద్యుత్‌ ధర రూ.6.30. జపాన్‌ వెస్టింగ్‌హౌస్‌ అణు కేంద్రాలనుంచి వచ్చే విద్యుత్తు తొమ్మిది రూపాయలుగా ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన అరెవా అణు కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్తు పన్నెండు రూపాయలు పలుకుతోంది. అణు కేంద్రాల ఏర్పాటుకయ్యే ఖర్చు కూడా అనూహ్యంగా ఉంటోంది. మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని జైతాపూర్‌లో 1650 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఒక్కో రియాక్టర్‌కు 2015 సెప్టెంబరునాటి అంచనాల ప్రకారం రూ.74 వేలకోట్లు ఖర్చవుతుంది. అంటే, మొత్తం ఆరు అణు కేంద్రాలకు కలిపి రూ.4.44 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారన్నమాట! ఈ అణు కేంద్రాల జీవన కాలం 60 ఏళ్లే కావడం గమనార్హం.

అణు కేంద్రాలనుంచి వెలువడే రేడియో ధార్మిక తరంగాలు పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలపై, ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం కనబరుస్తున్నట్లు స్పష్టమైన వివరాలున్నాయి. అణు కేంద్రాలకు చుట్టుపక్కల ఉన్న పిల్లలు అత్యధికంగా రక్త క్యాన్సర్‌, థైరాయిడ్‌ క్యాన్సర్‌, మెదడులో కణుతుల బారినపడుతున్నారు. ఇక ఈ కేంద్రాల్లో ప్రమాదాలు జరిగితే ఆ ప్రభావాలు వూహాతీతంగా ఉంటున్నాయి. చెర్నోబిల్‌లో జరిగిన ప్రమాదం తాలూకు దుష్ప్రభావాలు బెలారస్‌ ప్రాంతంలో 60 శాతం ప్రజలపై పడ్డాయి. అయిదు లక్షలమంది పిల్లలు సహా మొత్తం పాతిక లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసిన ప్రమాదమది. 1995లో ఉక్రెయిన్‌ అణు కేంద్రం శుద్ధి కార్యక్రమంలో పాలుపంచుకొన్న 5,722మంది మరణించారు. ఓ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అంచనా ప్రకారం అణు కేంద్రాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మామూలుకన్నా ఏటా 27 వేల క్యాన్సర్‌ మరణాలు అదనంగా సంభవిస్తున్నాయి. ఉక్రెయిన్‌ అణు కేంద్రం కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్న 70శాతం ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారినపడినట్లు, రక్త సంబంధ సమస్యలను ఎదుర్కొన్నట్లు, నరాల వ్యాధుల పాలబడ్డట్లు ఉక్రెయిన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. చెర్నోబిల్‌ అణు కేంద్రంలో ప్రమాదం తరవాత ఆరేళ్ల కాలంలో బెలారస్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో 40శాతం పిల్లలు అనేక రకాల శారీరక అవకరాలతో జన్మించినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ఫుకుషిమా అణు ప్రమాదం తరవాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పిల్లల్లో థైరాయిడ్‌ క్యాన్సర్‌ పదిరెట్లు పెరిగినట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఒక్కసారిగా కేసుల సంఖ్య 9,600 నుంచి 66,000కు చేరింది. మరోవంక చెర్నోబిల్‌ ప్రమాదంవల్ల పర్యావరణంపై పడ్డ దుష్ప్రభావం అంతా ఇంతా కాదు. అక్కడి వెయ్యి మెగావాట్ల అణు విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదంవల్ల సుమారు మూడున్నర లక్షలమందిని ఖాళీ చేయించి రష్యాలోని ఇతర ప్రాంతాలకు తరలించారు. దాదాపు 40వేల చదరపు కిలోమీటర్ల వ్యవసాయ భూమి విషరేణువులతో నిండి పనికిరాకుండా పోయింది. మూడు దశాబ్దాలు గడచినా ఇప్పటికీ ఆ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వ్యాసార్ధం (2800 చదుపు కిలోమీటర్ల)లోని భూమి బీడుగానే ఉంది. 2011లో ఫుకుషిమా ప్రమాదం తరవాత సుమారు లక్షన్నరకుపైగా ప్రజలను ఆ కేంద్రానికి 30 కిలోమీటర్ల వ్యాసార్ధంలో నివసించకుండా ఇతరచోట్లకు తరలించారు. అణు ధార్మిక దుష్ప్రభావం కొనసాగుతున్నందువల్ల తరలిపోయినవారిలో సగానికిపైగా ఇప్పటికీ సొంత ప్రాంతానికి తిరిగి రాలేదు. చెర్నోబిల్‌ ప్రమాదం 1000 మెగావాట్ల అణు కేంద్రానికి సంబంధించినది. 1650 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఆరు అణు కేంద్రాలను జైతాపూర్‌లో నెలకొల్పేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. అంటే మొత్తంగా 9900 మెగావాట్ల సామర్థ్యంగల న్యూక్లియర్‌ రియాక్టర్లు అటు ఇటుగా ఒకేచోట ఏర్పాటు కాబోతున్నాయన్నమాట! అణు కేంద్రాలవల్ల మానవాళిపై పడే దుష్ప్రభావాలు కళ్లకు కడుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు పునరాలోచన చేయాల్సి ఉంది.

- పీబీ సావంత్‌
Posted on 12-12-2017