Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పథకాలు చాలు ప్రక్షాళనే మేలు

* సామాజిక భద్రత-సర్కారు బాధ్యత

మనుషులందరికీ జీవించే హక్కు ఉంటుందన్న సిద్ధాంతాన్ని కనుక ఆమోదిస్తే, వారికి సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటై తీరుతుంది. అనారోగ్యం, ప్రమాదాలు, నిరుద్యోగిత, అంగవైకల్యం, మాతృత్వం, వృద్ధాప్యం- తదితర సందర్భాల్లో వ్యక్తులు నిస్సహాయులుగా మిగిలిపోతారు. అలాంటప్పుడు వారికి సామాజిక భద్రత అవసరమవుతుంది. ఎక్కడి నుంచీ వారికి ఎలాంటి సహాయం అందకపోతే బతుకే దుర్భరమైపోతుంది. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ జీవించే హక్కు కల్పించింది. ప్రపంచ మానవ హక్కుల ప్రకటన, అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒడంబడిక వంటి అంతర్జాతీయ ఒప్పందాలూ బతికే హక్కుకు భరోసా ఇస్తున్నాయి. అయినప్పటికీ, ఆపత్సమయంలో ప్రభుత్వ చేయూత అందక వ్యక్తులు నిస్సహాయంగా ఉండిపోవలసివస్తే, అలాంటి ఒడంబడికలన్నీ కాగితాలకే పరిమితమైపోతాయి.

సుదూర స్వప్నం
ఆర్థిక, సామాజిక న్యాయం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని రాజ్యాంగ పీఠికలో స్పష్టం చేశారు. ఆ స్ఫూర్తికి అనుగుణంగానే రాజ్యాంగంలో పలు నిబంధనలను పొందుపరచారు. ప్రజలకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యంగా ప్రభుత్వ విధానానికి సంబంధించిన ఆదేశిక సూత్రాల్లోని నిబంధనలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం లభించి 70 ఏళ్లు గడచిన తరవాతా అత్యధిక ప్రజానీకానికి తగిన సామాజిక భద్రత చేకూరకపోవడం దురదృష్టకరం. ఇది, ఆదేశిక సూత్రాలను పరిహసించడమే. సంక్షేమ రాజ్యభావనపై పెట్టుకొన్న ఆశలను వమ్ము చేయడమే. ప్రజల్లో పేదరికం పెరిగింది. ఆదాయాల్లో అసమానతలు పెచ్చరిల్లాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఇలాంటప్పుడు వృద్ధులకు, అంగవికలురకు భద్రత మరింత అవసరం. వారికే కాదు- వ్యాధిగ్రస్తులు, నిరుద్యోగులకు సైతం నేడు సామాజిక భద్రత చేకూరడం లేదు. ముందుగా వృద్ధుల విషయానికి వద్దాం. దేశంలో 60 ఏళ్లు పైబడినవారి సంఖ్య 2011 లెక్కల ప్రకారం 10.4 కోట్లు. (వారిలో మహిళలు 5.3 కోట్లు, పురుషులు 5.1 కోట్లు.) దేశం మొత్తం జనాభాలో వారు 8.6 శాతంగా ఉన్నారు. (1961లో వారు 5.6 శాతమే). గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖకు చెందిన కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌ఓ) 2016లో భారతదేశంలో వృద్ధులపై క్రోడీకరించిన వివరాలివి. వారిలో 41.6 శాతం వృద్ధులు పనిచేసుకొని బతకాల్సి వస్తోంది. ఆ వృద్ధుల్లో 56.5 శాతం నిరక్షరాస్యులు. పెద్దగా నైపుణ్యాలు లేనివారు. వయోభారం కుంగదీస్తున్నా ఏదో ఒక పనిచేస్తే తప్ప వారి బతుకుబండి ముందుకు నడవదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధుల సంఖ్య 82.8 లక్షలు. రాష్ట్ర మొత్తం జనాభాలో అది 9.8 శాతం. జాతీయ సగటుకన్నా 1.2 శాతం ఎక్కువ. మరో పది రాష్ట్రాలూ జాతీయ సగటుకన్నా ఎక్కువ సంఖ్యలో వృద్ధులను కలిగి ఉన్నాయి. అవి: హరియాణా, ఉత్తరాఖండ్‌, ఒడిశా, పుదుచ్చేరి, హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, గోవా, కేరళ. 12.6 శాతంతో జాబితాలో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 60వ దఫా గణాంక వివరాల (2004) ప్రకారం- గ్రామీణ ప్రాంతాల్లోని 61.5 శాతం వయోవృద్ధుల నెలవారీ వినియోగ వ్యయం రూ.525 కన్నా తక్కువ. పట్టణ ప్రాంతాల్లో 64 శాతం వృద్ధులు నెలకు రూ.1,120 కన్నా తక్కువ వ్యయం చేస్తున్నారు. దిగువ స్థానంలోని 5.5 శాతం వృద్ధుల నెలవారీ వ్యయం రూ.350కన్నా తక్కువగా ఉంది. దేశంలో ఇతరుల మీద ఆధారపడే వయోవృద్ధుల సంఖ్య 1961లో 10.9 శాతం నుంచి 2011లో 14.2 శాతానికి పెరిగింది. వారిలో మహిళలు 14.9 శాతం, పురుషులు 13.6 శాతం. 60-64 ఏళ్ల వయోవర్గంలోని మహిళల్లో 22 శాతం వితంతువులు. పెళ్లి చేసుకోనివారు లేదా విడాకులు తీసుకున్నవారు రెండు శాతం. వారిపట్ల మరింత శ్రద్ధ అవసరమవుతుంది. వయోవృద్ధుల్లో తమ భార్య లేదా భర్త మీద ఆధారపడుతున్నవారు గ్రామీణ ప్రాంతాల్లో 13 శాతం, పట్టణ ప్రాంతాల్లో 15 శాతం ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 78 శాతం, పట్టణ ప్రాంతాల్లో 76 శాతం వయోవృద్ధులు కన్నబిడ్డల మీద ఆధారపడుతున్నారు. మనవలు, మనవరాళ్ల మీద ఆధారపడుతున్నవారు రెండు ప్రాంతాల్లోనూ మూడు శాతం ఉంటే, ఆరు శాతం వయోవృద్ధులు ఇతరుల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి బతుకులీడుస్తున్నారు. వృద్ధాప్యంలో అంగవైకల్యం, కీళ్ళు, కండరాల నొప్పులు, పక్షవాతం, అంధత్వంతోపాటు గుండెజబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి బాధిస్తుంటాయి. కానీ, దేశంలోని ప్రజారోగ్య వ్యవస్థ వృద్ధులు సహా ఎవరి వైద్య చికిత్స అవసరాలూ తీర్చగలిగేలా లేదు. ఫలితంగానే వృద్ధులు మరింత కునారిల్లుతుంటే- పెరుగుదల లేక పిల్లలు, రక్తహీనతతో మహిళలు కుంగి కృశించిపోతున్నారు. 71వ దఫా జాతీయ నమూనా సర్వే (2014 జనవరి-జూన్‌) వివరాల ప్రకారం, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 72 శాతం, పట్టణ ప్రాంతాల్లో 79 శాతం పౌరులు వైద్య చికిత్సలకోసం ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం, పట్టణ ప్రాంతాల్లో 68 శాతం ‘ఇన్‌పేషెంట్‌’ చికిత్సలను ప్రైవేటు ఆస్పత్రులే నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్నో ఆరోగ్య పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ- 86 శాతం గ్రామీణులకు, 82 శాతం పట్టణ వాసులకు ఏ పథకం కిందా ఎలాంటి సహాయమూ అందడంలేదు.

నిరుద్యోగం మరో పెను సమస్య. ఉద్యోగుల్లో 90 శాతం అసంఘటిత రంగంలోనే ఉన్నారు. ఈ రంగంలో పనిచేస్తున్నవారికి సామాజిక భద్రత దాదాపుగా లేదు. పని పరిస్థితులూ దారుణంగా ఉంటున్నాయి. వేతనాలు చాలా తక్కువ. ఈ రంగంలో స్వయంఉపాధి పొందుతున్నవారికీ సామాజిక భద్రత లేదు. సంఘటిత రంగంలో ఉద్యోగిత 2006లో 2.69 కోట్ల నుంచి 2012లో 2.95 కోట్లకు పెరిగింది. కానీ అధిక వేతనాలు, మంచిపని పరిస్థితులు, సామాజిక భద్రత ఉండే ప్రభుత్వరంగంలో మాత్రం అది 1.81 కోట్ల నుంచి 1.76 కోట్లకు తగ్గిపోయింది. దేశంలో అత్యధికులు అందుకుంటున్న వేతనాలు చాలా తక్కువ. 2014 నాటి భారత కార్మిక, ఉద్యోగ నివేదిక ప్రకారం వేతనాల్లో తారతమ్యాలు అధిక స్థాయిలో ఉన్నాయి. 2012 గణాంకాల ప్రకారం- ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న మహిళలు కేవలం 17.88 శాతం మాత్రమే. ప్రైవేటు రంగంలో అది 22.22 శాతం. మొత్తం సంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలు 20.45 శాతం. మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించడంతోపాటు వారికి తగిన సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు చాటి చెబుతున్నాయి.

పింఛను అరకొర
సంఘటిత రంగంలో లక్ష రూపాయల దాకా జీతం పొందిన ఉద్యోగికి పదవీవిరమణ అనంతరం ఈపీఎఫ్‌ పింఛనుగా లభిస్తున్నది నెలకు కేవలం రూ.1,500, లేదా అంతకన్నా కొంచెం ఎక్కువ మాత్రమే. అది కంటితుడుపు పింఛను తప్ప మరొకటి కాదు. పింఛను సంస్కరణల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు సైతం సరైన పింఛను అందని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ పథకాలు ఎలాంటి సామాజిక భద్రత చేకూర్చడంలేదు. విద్య, వైద్య రంగాల్లో సేవలు పూర్తిగా వాణిజ్య ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతున్నాయి. కిందిస్థాయి వారికి పెద్దగా ప్రయోజనం కలగడం లేదు.

ప్రయోజనం నామమాత్రం
స్వాతంత్య్రం వచ్చాక దేశంలో అనేక సామాజిక భద్రత పథకాలను ప్రవేశపెట్టారు. వాటిలో కొన్ని తప్పనిసరి అయితే మరికొన్ని ఐచ్ఛికమైనవి. కొన్నింటికి ప్రభుత్వం నిధి సమకూరుస్తుంటే, మరికొన్నింటి వ్యయాన్ని యజమాని భరించాల్సి వస్తోంది. సామాజిక భద్రత ఒడంబడికలో ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) పేర్కొన్న నియమ నిబంధనలకు అనుగుణంగానే అవన్నీ ఉన్నాయి. ఉదాహరణకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి కోసం ఉద్దేశించిన ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకాలు (ఐజీఎన్‌ఓఏపీఎస్‌) ఆమ్‌ ఆద్మీ బీమా యోజన (ఏఏబీవై), ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పింఛను పథకం (ఐజీఎన్‌డీపీఎస్‌), జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్‌, రాష్ట్రీయ స్వాస్థ్యబీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) వంటివాటిని కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఎంపిక చేసిన లబ్ధిదారులకోసం వృద్ధాప్య పింఛను పథకం, వికలాంగుల పింఛను పథకం, మహాత్మాగాంధీ బున్‌కర్‌ బీమా వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు అమలు చేస్తున్నాయి. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు గ్రాట్యుటీ, మాతృత్వ ప్రయోజనాల వంటి పథకాలను యాజమాన్యాలు అమలుపరుస్తున్నాయి. సంఘటిత రంగంలోని ఉద్యోగులు, యజమానులు సమకూర్చే నిధులతో ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌), ఉద్యోగుల పింఛను పథకం, ఉద్యోగుల రాజ్యబీమా (ఈఎస్‌ఐ) వంటి పథకాలను నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)తో పాటు బీడీ కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలు స్వచ్ఛందమైనవి. ఇన్ని పథకాలు అమలులో ఉన్నప్పటికీ, అవేవీ సరైన సామాజిక భద్రత కల్పించలేకపోతున్నాయి. చాలా సందర్భాల్లో నామమాత్ర ప్రయోజనమే చేకూరుతోంది. వివిధ సామాజిక భద్రత పథకాలకు ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులూ చాలా తక్కువగా ఉన్నాయంటూ ఇటీవలే 60 మంది ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తపరచారు. 2018-19 బడ్జెట్‌లోనైనా ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చి తగినన్ని నిధులు సమకూర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా జాతీయ వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, మాతృత్వ ప్రయోజన పథకాల మొత్తాలను పెంచాలని సూచనలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రస్తుత పథకాలన్నింటినీ ప్రక్షాళించి, సర్వజనహితమే లక్ష్యంగా నిర్దిష్ట పంథాలో ముందడుగు వేయవలసిన తరుణమిది!

Posted on 07-01-2018