Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

మూడు ‘ముళ్లబాట’

* అడ్డూఆపూలేని బాల్య వివాహాలు

ఆధునికత కొత్తపుంతలు తొక్కుతున్నా, మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా నేటికీ కొన్ని గ్రామాల్లో బాల్య వివాహాలు ఆగడమే లేదు. చిరునవ్వులు చిందిస్తూ ఆడుతూ పాడుతూ చదువుకునే వయసులో చేస్తున్న వివాహాలు చిన్నారుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి దేశం ఎదుర్కొంటున్న సామాజిక సమస్యల్లో బాల్య వివాహం ముఖ్యమైనది.బాల్య వివాహాల్లో భారత్‌ ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉంది. ప్రపంచంలో 40 శాతం బాల్యవివాహాలు మనదేశంలోనే జరుగుతున్నాయని యునిసెఫ్‌ సైతం వాపోయింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మొత్తం మహిళల్లో (20-24 సం.ల) మూడొంతులు (ఆరు కోట్లు) 18 ఏళ్లలోపు వివాహం అయినవారే ఉన్నారు.

మూఢనమ్మకాలే శాపాలు
మన దేశంలో ఏటా 2.66 కోట్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈ సంఖ్య బంగ్లాదేశ్‌లో 39.3 లక్షలు, పాకిస్థాన్‌ 18.8 లక్షలు, బ్రెజిల్‌ 29.3 లక్షలు, మెక్సికో 12.8 లక్షలుగా ఉంది. మనదేశంలో రాజస్థాన్‌ 3.7 శాతంతో బాల్యవివాహాల్లో మొదటిస్థానాన్ని ఆక్రమించింది. మహారాష్ట్ర 2.9, ఆంధ్రప్రదేశ్‌ 1.6, మిజోరం 1.2 శాతాలతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. బాల్య వివాహాలు హిందువుల్లో 2.39 శాతం, ముస్లిములో 2.21, క్రిస్టియన్లలో 1.79, సిక్కులు 1.93, బౌద్ధ మతస్తుల్లో 2.49, ఇతరుల్లో 1.82 శాతాల మేర జరుగుతున్నాయి. 2015-16లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్వహించింది. దీని ప్రకారం, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 35శాతం, పట్టణ ప్రాంతాల్లో 15.2 శాతం అమ్మాయిలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరుగుతున్నాయి. అబ్బాయిల విషయానికొస్తే గ్రామీణ ప్రాంతాల్లో 32.3 శాతం, పట్టణాల్లో 14.5శాతం మందికి బాల్యవివాహాలు చేసుకుంటున్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్‌లో 32.7శాతం బాలికలకు, 23.5శాతం బాలురకు మైనారిటీ తీరకముందే పెళ్ళిళ్లు చేసేస్తున్నారు. బ్రిటిష్‌ హయాములో విదేశీయులు మనదేశంలోని స్త్రీలను బలవంతంగా వివాహం చేసుకునేవారు. దీనికి భయపడి ఆ రోజుల్లో పెద్దలు తమ పిల్లలకు బాల్యంలోనే వివాహం చేసేవారు. కొంతమంది వృద్ధుల ఆఖరి కోరిక పేరిట చిన్న వయసులోనే పిల్లల పెళ్ళిళ్లు పూర్తిచేసి పంపించేవారు. తరవాత కందుకూరి, గురజాడ వంటివారి కృషి ఫలితంగా బాల్యవివాహాల పెడధోరణులకు దాదాపుగా అడ్డుకట్ట పడింది. కానీ గ్రామీణ ప్రాంతాలు, కొన్ని వర్గాల్లో మాత్రం అది నేటికీ కొనసాగుతుండటమే బాధాకరం. సాంకేతికంగా సమాజం ఎంతగా మార్పు చెందినప్పటికీ వీరి పోకడల్లో మార్పు రావడం లేదు. పేదరికం, అవగాహనాలోపం, నిరక్ష్యరాస్యత, ఆడపిల్లను భారంగా భావించడం, ఆచారాలు, మూఢనమ్మకాలు ఇందుకు కారణాలు. చాలా ప్రాంతాల్లో ఆడపిల్లలకు సరైన విద్యాసదుపాయాలు అందు బాటులో లేకపోవడమూ ఈ దురాచారం కొనసాగడానికి కారణమవుతోంది.

బాల్య వివాహాల వల్ల అధిక సంఖ్యలో అమ్మాయిలకు గర్భస్రావాలవంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఆటపాటలతో ఎదగాల్సిన పిల్లలు రక్తహీనతకు గురై బలహీనమవుతారు. మాతృమరణాల సంఖ్యా పెచ్చరిల్లుతోంది. ఏటా 70 వేలమంది 15-19 సంవత్సరాల వయస్సు బాలికలు ప్రసవ సమయంలో ఇందువల్లే మరణిస్తున్నారు. 18 ఏళ్లలోపు వివాహం చేయడంవల్ల శారీరక ఎదుగుదల లేక పోషకాహార లోపాలతో పుడుతున్న పిల్లలు ఎక్కువగా అకాల మృత్యువాత పడుతున్నారు. చిన్న వయసులో పిల్లలు పుడితే పసిపిల్లలకు జన్యులోప సమస్యలూ ఉత్పన్నమవుతాయని వైద్యులూ హెచ్చరిస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో వివాహం చేయడంవల్ల అత్తమామలు, ఆడపడుచులు, పిల్లల పెంపక భారాలు మీదపడి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు నిరాశ నిస్పృహలకు గురై ఆత్మహత్యకూ ఒడిగడుతున్నారు. గృహహింసకు గురవుతున్న ఆడపిల్లల్లో 15 ఏళ్లలోపువారే అధికం. అవగాహనాలేమితో ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే భార్యభర్తల మధ్య సఖ్యత కరవై, అది విడాకులకూ దారితీస్తోంది. సంక్షోభంలో చిక్కుకున్న అమ్మాయిలు కొందరు సులభంగా అక్రమ రవాణాకు ఎర అవుతున్నారు.

1860లో బాలిక వివాహానికి వయసు నిర్ధారించలేదు కానీ, భర్తతో కాపురం చేయడానికి పదేళ్ల వయసును అప్పటి సమాజం నిర్ణయించింది. తరవాత 1891లో బ్రిటిష్‌ ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధ చట్టాన్ని తెచ్చింది. 12 సంవత్సరాల లోపు ఆడపిల్లల వివాహాలను నిషేధించింది. 1929లో వివాహ వయస్సు 14 ఏళ్లకు పెంచుతూ శారద చట్టాన్ని తీసుకొచ్చారు. 2006లో మార్పులు చేశారు. దీని ప్రకారం 18 ఏళ్లు నిండని బాలికలకు, 21 ఏళ్లు నిండని బాలురకు వివాహాలు చేయడం నేరం! వివాహాలు జరిపించిన తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, బంధువులు శిక్షార్హులు. లైంగిక వేధింపుల నుంచి పిల్లల రక్షణ చట్టం (2012) వచ్చింది. ఇది 18 సంవత్సరాలలోపువారికి వర్తిస్తుంది. 2017లో సుప్రీంకోర్టు ఐపీసీ 375ను అమలులోకి తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు 2006లో కేసుకు సంబంధించి ప్రతివాది వాదనలకు సమాధానంగా ఐపీసీ 375(2)ను అనుసరించి తీర్పు ఇచ్చింది. 18 ఏళ్లలోపు బాలికను వస్తువుగా చూడరాదని ఆమెకూ ప్రాథమిక హక్కులున్నాయని గుర్తుచేసింది. 18 ఏళ్లు నిండని మైనర్‌ బాలికతో శృంగారం అత్యాచారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. 375 సెక్షన్‌ ప్రకారం నేరానికి పాల్పడ్డ వ్యక్తికి మినహాయింపులు లేవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ తీర్పుతో విచక్షణ, అసమానతల మధ్య నలిగిపోతున్న బాలికలకు కొండంత రక్షణ ఏర్పడింది. ఇన్ని రక్షణ చట్టాలున్నా బాల్యవివాహాలను అవేవీ అడ్డుకోలేకపోతున్నాయి. చట్టాల అమలులో లోపాలు, అవగాహనా రాహిత్యం వల్లే ఈ దురాచారం సమాజానికి నేటికీ సవాలు విసరుతోంది.

అందరి బాధ్యత
బాలల ప్రత్యేక సంరక్షణ పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందని 1924లోనే బాలలహక్కులపై జెనీవా ప్రకటన విడుదలైంది. వివాహ ధ్రువీకరణ పత్రాలు జారీచేసే వ్యవస్థలను కట్టుదిట్టం చేయాలి. 18 ఏళ్లలోపు పెళ్ళిళ్లను అక్కడే అడ్డుకోగలగాలి. గ్రామాల్లో అంగన్‌వాడీ కార్యకర్తల దగ్గర కిశోర బాలికల వివరాలు అందుబాటులో ఉంటాయి. వారిలో ఎవరికైనా చట్టవిరుద్ధంగా 18 ఏళ్లలోపు వివాహం జరుగుతుంటే ఆ కార్యకర్తలు సత్వరమే దగ్గరిలోని స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులను సంప్రతించి చర్యలు తీసుకునేలా సమాజంలో వ్యవస్థీకృత మార్పులు రావాలి. గ్రామాల్లో బాలికలకు చదువులపట్ల కొత్త ఆసక్తి రేకెత్తించడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి. ప్రతి జిల్లాకు బాల్య వివాహాల నిరోధక అధికారి ఉంటారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వారు విధిగా అమలు చేయాలి. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో చట్టాల గురించి నిరంతరం తెలియజెప్పాలి. చిన్న వయసు వివాహాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, ఇతర అనర్థాలను తల్లిదండ్రులకు బోధించాలి. గ్రామీణ ప్రాంతాల్లో హానికరమైన సాంస్కృతిక నిబంధనలు, ఆచారాలు, మూఢనమ్మకాలను తొలగించాలి. బాల్య వివాహాల కట్టడి కోసం ప్రభుత్వాలతోపాటు, పౌరసంఘాలూ పాటుపడాలి. గ్రామ కమిటీలకు బాల్య వివాహాలను అడ్డుకునే అధికారముంది. అంగన్‌వాడీ కార్యకర్తలు, యువజన సంఘాలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శి, మహిళా మండలి సభ్యులు, మండలస్థాయిలో తహశీల్దారు, జిల్లా స్థాయిలో కలెక్టరు, జాయింట్‌ కలెక్టరు భాగస్వాములుకావాలి.అప్పుడేబాల్యవివాహాల దురాచారానికి అడ్డుకట్ట పడుతుంది. బాలికల బంగరు భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుంది.

- శాంతి జలసూత్రం
Posted on 08-01-2018