Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పౌర చైతన్యమే రక్షా కవచం

* జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు

‘రోడ్డుభద్రత అంశం ఇప్పటికీ చర్చల దశలోనే ఉంది. ఇకనైనా చర్యల స్థాయికి చేరాలి. ఎప్పుడైనా, ఎక్కడైనా రాదారి భద్రత ఓ సామాజిక బాధ్యత. వాహనదారులు, పాదచారులు ఉమ్మడిగా పెంపొందించుకోవాల్సిన సంస్కృతి అది. దేశంలో ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంటుంది. దాని పరిధిలోకి రోడ్డుభద్రత హక్కూ వస్తుంది. పరిరక్షించాల్సిన విధి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలదే’ అని ఇరవై నెలల క్రితమే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఆ వ్యాఖ్యలు చేయడంతోపాటు, పాతిక సూత్రాలతో మార్గదర్శక పత్రాన్ని వెలువరించింది. అన్ని ప్రభుత్వాలూ వాటిని విధిగా అమలుచేయాలంటూ, విధివిధానాల రూపకల్పనకు గడువు విధించింది. ఆ మేరకు రాష్ట్రాలు ఈ నెలాఖరులోగా సర్వసమగ్ర రీతిలో రోడ్డుభద్రత ప్రణాళికల్ని రూపొందించుకోవాలి. సంబంధిత మండళ్లను రాష్ట్రాలవారీగా ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్రమండలికి సచివాలయం తరహాలో పనిచేసే ‘లీడ్‌ ఏజెన్సీ’ నిర్మాణానికీ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు అప్పట్లోనే సూచించింది. రహదారి భద్రతపై పౌరుల అవగాహన పెరిగేలా వివిధ స్థాయుల్లో ప్రచార కార్యక్రమాలు సాగించాలనీ మార్గదర్శనం చేసింది. అన్ని పనుల నిర్వహణకూ మూడు వారాల వ్యవధి మిగిలి ఉంది. గత కాల అనుభవాలు, వర్తమాన స్థితిగతులు, భవిష్యత్‌ అవసరాల రీత్యా వీటికి ఇప్పుడు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.

పెచ్చరిల్లుతున్న ప్రమాదాలు
ఇతర దేశాలతో పోలిస్తే, రెండో అతి పెద్ద రహదారి వ్యవస్థ ఇండియాలోనే ఉంది. భారత్‌లో 47.2లక్షల కిలోమీటర్లకు పైగా రోడ్లు విస్తరించి ఉన్నాయి. వాటిలో జాతీయ రహదారుల వాటా 2.1 శాతం. వీటిపై దాపురిస్తున్న ప్రమాదాలు మాత్రం 28 శాతానికి పైమాటే! ఏటా ప్రపంచవ్యాప్తంగా రోడ్డుప్రమాదాల్లో చనిపోతున్నవారు 12.6 లక్షల పైచిలుకు ఉన్నారు. భారత్‌లో దుర్మరణం పాలవుతున్నవారు లక్షా యాభై వేలకు మించి ఉంటారు. క్షతగాత్రులు అంతకు నాలుగింతలు ఉండవచ్చని అంచనా. నిత్యం సగటున నాలుగొందల మంది ప్రాణాల్ని రోడ్డుప్రమాదాలు కర్కశంగా కబళిస్తున్నాయి. వీరిలో సగానికి పైగా యువతే. ఉత్పాదక శక్తి, క్రియాశీలత వెల్లివిరిసే వారి ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసిపోవడం వల్ల- ఆర్థికంగా దేశానికి వాటిల్లే వార్షిక నష్టం సుమారు రూ.61 వేల కోట్లు. అమూల్యమైన మానవ వనరుల్ని ఇలా కోల్పోయేకన్నా, రోడ్డుభద్రతపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు తెలుసుకొని మసలాలన్నదే ప్రపంచబ్యాంకు తాజా నివేదిక సారాంశం. మరో రెండేళ్లలో ప్రమాదాలను సగానికి సగం తగ్గించాలని భారత్‌ నిర్ణయించింది. అందుకోసం వచ్చే అక్టోబరు నుంచి అన్ని కార్లలో ప్రమాద సమయాల్లో తెరచుకునే గాలి సంచుల(ఎయిర్‌ బ్యాగులు) ఏర్పాటును తప్పనిసరి చేయబోతున్నారు. వాహనాల చోదక సామర్థ్య ధ్రువీకరణ పత్రాలు జారీచేసే ప్రక్రియను అత్యాధునిక సాంకేతికత ద్వారా నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రమాదాల కారణంగానే దేశం ఏటా స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 3.5 శాతాన్ని నష్టపోతోంది. రహదారి వ్యవస్థను ఆమూలాగ్రం సంస్కరించకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించకుండా, ఏవో కొన్ని సాధారణ చర్యలతో రోడ్డుభద్రత సాధించాలనుకోవడం- నేల విడిచి సాము చేయడమే అవుతుంది. క్షేత్రస్థాయి వాస్తవాలు గ్రహించకుండా, ప్రజలకు తగినంత అవగాహన కల్పించకుండా ఏ ప్రభుత్వమూ రహదారి భద్రతా లక్ష్యాన్ని సాధించలేదు.

విపరీతమైన వేగం, మద్య ప్రభావం వంటి తప్పిదాల కారణంగానే రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. వాహనాల్లో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆటోమొబైల్‌ సంస్థలే చొరవ తీసుకోవాలని 2016నాటి బిల్లులో కేంద్రం స్పష్టీకరించింది. రోడ్డు నిర్మాణ పనుల నాణ్యత వల్ల ప్రమాదాల సంఖ్యను నియంత్రించవచ్చు. రాదారి ప్రమాదాలకు కారకులయ్యేవారిని అత్యంత కఠినంగా శిక్షించేలా చట్ట నిబంధనలుండాలి. అటువంటి చర్యలు కొరవడటం వల్లే, 87 శాతం రోడ్డుప్రమాదాలు చోటుచేసుకుంటున్న 13 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వరసగా ఏడు, తొమ్మిది స్థానాలకు చేరాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకన్నా వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండే ఉత్తర్‌ ప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రమాదాలు అత్యధికంగా చోటుచేసుకుంటున్నాయి. దుర్ఘటనలకు మూలమయ్యే ప్రమాదకర మలుపుల్ని ప్రభుత్వాలు సకాలంలో గుర్తించడం లేదు. ప్రమాదాల్ని అదుపులోకి తెచ్చే చర్యల్ని వేగవంతం చేయడంపైనా శ్రద్ధ కనిపించదు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జాప్యాన్ని ఎంతగా నివారిస్తే, అంతగా రోడ్డుభద్రత సాధ్యమవుతుంది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారి నుంచి జరిమానాల రూపంలో వసూలయ్యే మొత్తాల్ని రహదారి భద్రతకు వ్యయం చేయడమూ ప్రభుత్వ కర్తవ్యమే. ప్రతి ఏటా రూ.2,000 కోట్లు వెచ్చించి సురక్ష రహదారి పథకం అమలుచేస్తున్నారు.ఇవన్నీ ఒకెత్తు. బాల్యదశ నుంచే అవగాహన, సామాజిక స్పృహ పెంచడం ద్వారా రహదారి భద్రత సాధించగలగడం మరొకెత్తు. భద్రతాంశాల్ని ఒకటి నుంచి అయిదు; ఆరు మొదలు ఎనిమిది; అనంతరం తొమ్మిది, పది తరగతుల బాలబాలికలకు పాఠాలుగా ప్రవేశపెట్టేందుకు తెలంగాణ రహదారి భద్రతా మండలి ఇప్పటికే చర్యలు చేపట్టింది. ‘సుప్రీం’ మార్గదర్శక సూత్రాలు అనుసరించి, రోడ్డుభద్రతను వచ్చే ఏప్రిల్‌ నాటికి పాఠ్యాంశంగా చేర్చేలా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వీటితో పాటు- వాహనాల రాకపోకల నియమాలు, నిబంధనలు అందరికీ తెలిసేలా ప్రతి పట్టణ స్థాయిలోనూ జన అవగాహన శిబిరాలు నిర్వహించడం ప్రధానం. అందులో వివిధ ప్రభుత్వ శాఖల, స్వచ్ఛంద సేవాసంస్థల సమధిక భాగస్వామ్యమూ అనేక ప్రాణాలకు రక్షణనిస్తుంది.

నివారణ మార్గాలు
తరచుగా ప్రమాదాలు సంభవించే ప్రాంతాల్లో ‘బ్లాక్‌స్పాట్‌ బోర్డుల’ ఏర్పాటు; పోలీసు, రవాణా, రోడ్లు-భవనాల విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు పౌరుల ప్రాణాలకు భరోసా కల్పిస్తాయి. జాతీయ రహదారులపై గల నిర్ణీత ‘బ్లాక్‌ జోన్‌’లలో రోజంతా ఆగి ఆగి వెలుగుతుండే (డిమ్‌ అండ్‌ డిప్‌) దీపాల అమరిక కూడా ప్రమాదాల్ని చాలావరకు అదుపుచేయగలుగుతుంది. ‘వేగాన్ని తగ్గించు- ప్రమాదాన్ని నిరోధించు’ అంటూ ప్రభుత్వాలు వాడుకలోకి తెస్తున్న నియంత్రణ పరికరాలపైనా పౌర అవగాహన పెరగాలి. రెండు టన్నులకు పైగా సామర్థ్యమున్న ప్రతి వాహనానికీ ఆ పరికరాల ఏర్పాటు తప్పనిసరి అనే చైతన్యం చోదకులతో పాటు ఇతరులకూ కలగాలి. వేగ నియంత్రణకు ఎంతమాత్రం ఉపకరించని నకిలీ పరికరాలు విపణిలో ప్రత్యక్షం కావడాన్ని ప్రశ్నించాలి. వాహనాల అతి వేగానికి అడ్డుకట్ట వేసే ‘లేజర్‌ స్పీడ్‌ గన్లు’, వాటి స్థానంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్న ‘సౌరశక్తితో నడిచే పరికరాల’పై పౌరుల అవగాహన విస్తృతం కావాలి. సమర్థ, సురక్షిత, సమీకృత, పారదర్శక భద్రతా వ్యవస్థలో వారి బాధ్యతలకు, హక్కులకు సమ ప్రాధాన్యముంది. కేంద్రం 2016లో ఆమోదించిన మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లు వాటిని ప్రస్ఫుటం చేసింది. రోడ్డుమీద ఇష్టానుసారం బండ్లు నడపటం, నిబంధనల్ని ఖాతరు చేయకుండా దూకుడుగా ప్రవర్తించడం ఎంత ప్రాణాంతకమో అందరికీ తెలుసు. శిరస్త్రాణం వాడకపోవటం, వాహనంమీద ఉన్నా చరవాణి వదలని స్వభావం, సీట్‌ బెల్టు ఊసే పట్టని తత్వం చోదకుడికే కాక ఇతరులకీ హానికరమే. తాగి బండెక్కితే, పిల్లలకు బండి చేతికిస్తే జరిగేదేమిటో తెలిసినప్పటికీ- పట్టించుకోని వైఖరి ప్రబలితే, అంతకు మించిన నేరపూరిత నిర్లక్ష్యం మరొకటి ఉండదు.ఈ ప్రాథమిక అంశాలతో పాటు చట్టసంబంధ, సాంకేతిక అంశాలపైనా వాహనదారులకు, బాటసారులకు అవగాహన కలిగించడం ప్రభుత్వ కర్తవ్యం. తెలుసుకున్నవాటిని ఆచరణకు తేవాలన్న పౌర చైతన్యమే అందరికీ క్షేమదాయకం!

- శరత్‌
Posted on 15-01-2018