Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ఉపాధి బాటలో చదువు

* పంథా మారితేనే ప్రయోజనం

అనేక సమస్యలకు ఏకైక సమాధానం విద్య! అందుకే సామాజిక సంస్కర్తలు దేశంలో స్వాతంత్య్ర ఉద్యమానికి దీటుగా విద్యావ్యాప్తి కోసం కృషి సాగించారు. నాడు 1931లో 7.2 శాతం ఉన్న అక్షరాస్యత, 1947నాటికి 12.2 శాతానికి పెరిగింది. దాన్ని మరింత పెంచేందుకు స్వాతంత్య్రం అనంతరం ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపట్టాయి. 2011 అంచనాల ప్రకారం, భారత్‌లో అక్షరాస్యత 74 శాతం. విద్యావ్యాప్తిలో భాగంగా వివిధ ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నారు. విద్యాహక్కు చట్టం (2009) తెచ్చారు. చదువు అనేది అందరి హక్కు. విద్యావంతులైన పౌరులు ఉన్నప్పుడే, వివేకవంతమైన సమాజం రూపొందుతుంది. ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల ప్రతి బాలుడు, బాలికకు విద్యను పొందే హక్కు ఉంది. వ్యక్తి నిర్మాణం, విలువల స్థాపన దాని లక్ష్యాలు. ప్రస్తుత విద్యారంగ స్థితిపై ప్రభుత్వం, ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేలు విద్య లక్ష్యాల్ని తిరిగి నిర్వచించాల్సిన ఆవశ్యకతను ప్రస్ఫుటం చేస్తున్నాయి.

దేశంలో సామర్థ్యాలకు భిన్నంగా కోర్సుల్ని ఎంచుకుంటున్నవారు 74.70 శాతం ఉన్నారు. చదువుతున్న పాఠ్యాంశాల పట్ల 13.54 శాతం విద్యార్థులకు మాత్రమే పూర్తి సంతృప్తి ఉంది. పాక్షికంగా సంతృప్తి కలిగినవారు 68.89 శాతం అని సర్వే ఫలితాలు విశ్లేషిస్తున్నాయి. పదో తరగతి అనంతర కోర్సులు, వాటికి అవసరమైన సామర్ధ్యాలు, ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నవి తెలియనివారి శాతమే ఎక్కువగా ఉంటోంది. విద్య ప్రధాన ప్రయోజనం పట్టభద్రుల్ని తయారుచేయడం ఒక్కటే కాదు. వ్యక్తి తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలి. కుటుంబపోషణ చేసుకునే సామర్థ్యం, కౌశలాన్ని మెరుగుపరచుకోవడం విద్య ద్వారా సులభసాధ్యం కావాలి. నైపుణ్యం గలవారి కోసం వ్యవస్థ ఎదురుచూపులు ఒక వైపు. విద్యాసంస్థల నుంచి నైపుణ్యరహితంగా బయటికొస్తున్న యువత మరొక వైపు! ఈ స్థితిగతులు చదువు మూలాధార లక్ష్యాల్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నిపుణుల్ని తయారుచేయలేకపోవడం, ఎటువంటి ఉపాధీ కల్పించలేకపోవడం- కచ్చితంగా దూరదృష్టి లోపమే! ఒక ఇంజినీరు తయారు కావడానికి రూ.6.5 లక్షలు ఖర్చవుతుంది. అది ప్రభుత్వ ఉపకార వేతనం, లేదా తల్లిదండ్రుల శ్రమ ఫలితం ఏదైనా కావచ్చు. పాఠశాలల్లో ఒకటి నుంచి పది తరగతుల పిల్లల సంఖ్య, ఉపాధ్యాయులకు వచ్చే జీతాల్ని గణిస్తే- సగటున ఒక విద్యార్థిపై ప్రభుత్వం పెడుతున్న ఖర్చు నెలకు రూ.2,700. సంవత్సరానికి ఆ మొత్తం రూ.32,400 ఉంటుంది. దీనికి నిర్వహణ వ్యయం, పుస్తకాల ఖర్చు వంటివి అదనం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వాటా కాక, కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కేటాయించింది రూ.85,010 కోట్లు. ఇది సగటు పౌరులు తమ సంపాదన నుంచి కట్టే వివిధ పన్నుల మొత్తం! విద్య ముఖ్య లక్ష్యం- సంపూర్ణ అక్షరాస్యత సాధించడం. చదువుకున్నవారికి ఉపాధి చూపించడం ఆ లక్ష్యాన్ని దృఢతరం చేస్తుంది.

విశ్వవిద్యాలయాల నియమాల్ని అనుసరించి, తరగతులకు 80 శాతం హాజరు ఉన్నవారినే పరీక్షలకు అనుమతిస్తారు. అంటే, పట్టభద్రులందరూ సాంకేతికంగా ఆ మేరకు హాజరుతో విద్యను పూర్తిచేసి, పరీక్షల్లో విజేతలుగా నిలిచినవారే! అలాంటిది, పీజీ అయిన వ్యక్తి తక్కువ మొత్తాలకు ప్రైవేటు పాఠశాలలో ఉద్యోగం చేయడం, ఇంజినీరింగ్‌ పూర్తయిన వ్యక్తి మరోచోట పనిచేయడం వంటివి సమర్థనీయాలేనా? ప్రజలందరినీ అక్షరాస్యుల్ని చేయడం ప్రభుత్వాల బాధ్యత. వివిధ రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల వద్ద నమోదైన శిక్షిత ఉపాధ్యాయ అభ్యర్థుల వివరాలుండాలి. రానున్న సంవత్సరాలకు ఏర్పడే ఉపాధ్యాయ ఖాళీల సమాచారం తెలియాలి. ఎంతమందిని శిక్షితులుగా చేయాలన్న అంచనాలు ప్రభుత్వం వద్ద ఉండాలి. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేయండని చెప్పడం సరికాదు. విద్య, సమాజం పరస్పర ఆధారితాలు. చదువు సమాజ వికాసానికి ఉపయోగపడాలి. విద్య లక్ష్యాల్ని సమాజమే నిర్వచిస్తుంది. పిల్లల్ని పాఠశాలకు పంపే తల్లిదండ్రుల లక్ష్యాల్లో ‘సామాజిక స్థిరీకరణ’ అతి ముఖ్యమైనది. తమ పిల్లలకు విద్య ద్వారా ఉత్తమ ఉపాధి లభించాలని వారు కోరుకుంటారు. తమకన్నా మెరుగైన ఆర్థిక స్థితిలో తమ పిల్లలుండాలని ఆశిస్తారు. దానికి విద్యే సాధనంగా మారాలి. దాని లక్ష్యం ఉపాధి కానప్పుడు, పాఠశాలకు తమ పిల్లల్ని పంపే తల్లిదండ్రులు ఎందరుంటారు?చదువు సమున్నత విలువల పరిరక్షణతో పాటు, ఉపాధినీ చూపాల్సిన బాధ్యత వ్యవస్థకు ఉంటుంది. పురోగమిస్తున్న దేశానికి సమర్థులు, నైపుణ్యవంతులైన మానవ వనరుల్ని అందించడమే విద్య ప్రధాన లక్ష్యం కావాలి. బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలన్న లక్ష్యం ఉన్నతమైనదైనా, ఇరవై సంవత్సరాల తరవాత వారే కుటుంబ పోషణ చేయాలన్నది విస్మరించడం విద్యావ్యవస్థ వైఫల్యమే! విద్య లక్ష్యాలను పునర్‌ నిర్వచించుకోవాల్సిన సమయమిది.

విద్యాసంస్థలు తమ విద్యార్థులకు మార్గనిర్దేశక సమావేశాలు నిర్వహించాలి. పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్యను ఉపాధ్యాయుల సంఖ్యతో భాగించి, ప్రతి ఒక్కరికీ తరగతి నుంచి కేటాయించాలి. ఆ ఉపాధ్యాయుడు తనకు కేటాయించిన విద్యార్థుల వివరాల రికార్డును, వారి పాఠశాల ప్రవేశం నుంచి నిష్క్రమణ వరకు నిర్వహించాలి. ఎనిమిది, తొమ్మిది తరగతుల విద్యార్థులకు సహజ సామర్థ్య, కౌశల, అభిరుచి పరీక్షలు జరపాలి. మూల్యాంకనం చేసి, గుర్తించిన విషయాల్ని విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో చర్చించాలి. తగిన సూచనలు చేయాలి. పదో తరగతిలో ఉన్నప్పుడే, తరవాత చదవాల్సిన కోర్సుల మార్గదర్శనం ఉండాలి. ఎక్కువమంది పిల్లలు వృత్తివిద్య కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలి. పారిశ్రామిక, సమాజ అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులు ప్రవేశపెట్టాల్సిన అవసరముంది. సంప్రదాయ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అదనంగా ప్రతి విద్యా సంవత్సరంలోనూ స్వల్పకాలిక ఉపాధి కల్పన అంశాల్ని తప్పనిసరి చేయాలి. పారిశ్రామిక, సేవా రంగాల నిపుణుల సలహాలతో- రానున్న సంవత్సరాల్లో ఏర్పడే ఉపాధి అవకాశాల అంచనాల్ని తరచుగా రూపొందించాలి. విద్యార్థుల సహజ సామర్థ్యాలకు అనుగుణంగా చదువు చెబితేనే, అది సమాజానికీ ప్రయోజనకారి అవుతుంది. సెకండరీ స్థాయిలోనే వారి అభిరుచుల ప్రాతిపదికన లక్ష్యాలు నిర్ణయించాలి. అందుకు కావాల్సింది భారీ మొత్తాలు కాదు- విద్యావ్యవస్థను తిరిగి నిర్మించాలన్న కృతనిశ్చయం ఉంటే అదే పది వేలు!

- డాక్టర్‌ మండల చంద్రశేఖర్‌ గౌడ్‌
Posted on 02-03-2018