Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ఆరని ఆకలిమంటలు

* ఆహార భద్రత సూచీలో దేశం వెనకబాటు

‘భారతీయులెవరూ ఖాళీ కడుపులతో నిద్రపోకుండా చూడటమే దేశానికి స్వాతంత్య్రం రాగానే మనం చేయాల్సిన మొట్టమొదటి, ముఖ్యమైన పని’ అని 1946లో చెప్పారు మహాత్మాగాంధీ. ఆయన ఆకాంక్ష ఇప్పటికీ నెరవేరలేదు. ప్రపంచ ఆహార సంస్థ ఇటీవల వెలువరించిన ‘ఆహారభద్రత, పోషణ పరిస్థితి- 2018’ నివేదిక ప్రకారం రోజూ 19.59 కోట్ల మంది భారతీయులు పస్తులతో పడుకుంటున్నారు. ఈ ఏడాది ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ) మేరకు 119 దేశాల్లో మన స్థానం 103. ప్రజల్లో పోషకాహార లోపం, పిల్లల్లో దుర్బలత్వం, ఎదుగుదల లోపాలు, శిశుమరణాల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయిస్తారు. తీవ్రమైన ఆకలిస్థాయులు నెలకొన్న 45 దేశాల్లో ఇండియా ఒకటని ‘జీహెచ్‌ఐ’ హెచ్చరించింది. ఇక ఆహారధాన్యాల అందుబాటు, వాటి నాణ్యత, వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలకున్న ఆర్థిక స్థోమతల ఆధారంగా గణించే ‘ప్రపంచ ఆహార భద్రత సూచీ’ (జీఎఫ్‌ఎస్‌ఐ) ప్రకారం ఈ సంవత్సరంలో 113 దేశాలకుగాను భారత్‌ 76వ స్థానం దక్కించుకుంది. 85.9 మార్కులతో ఈ సూచీలో సింగపూర్‌ మొదటిస్థానంలో ఉంటే, 50.1 మార్కులతో మన దేశం శ్రీలంక, ఘనా, బొలీవియాల కన్నా అడుగున నిలిచింది. ఇదంతా గత ప్రభుత్వాల పుణ్యమేనని అనుకోవడానికి లేదు. జీఎఫ్‌ఎస్‌ఐ- 2012లో భారతదేశం 51.6 మార్కులు సాధించింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని 23 దేశాల్లో భారత్‌, ఫిలిప్పీన్స్‌ మాత్రమే ఇలా తిరోగమన బాటలో నడుస్తున్నాయి. మొత్తమ్మీద ఈ దుస్థితి, నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఆకలిచావులకు దారితీస్తోంది.

గుండెలు పిండే నిజాలు
ఆహారధాన్యాలు అధికంగా పండించే దేశంలో ప్రజల ఆహారభద్రతకు పాలకులు పూచీకత్తు ఇస్తున్న ఈ రోజుల్లో ఎవరైనా సరే, తిండిలేక చనిపోవడాన్ని ఊహించలేం! కానీ, 2015-18 మధ్య దేశవ్యాప్తంగా 56 మంది ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు విడిచారు. ఈ అభాగ్యుల్లో 42మంది 2017-18ల్లో చనిపోయినవారే! పదహారేసి మరణాలతో ఉత్తర్‌ ప్రదేశ్‌, ఝార్ఖండులు ఈ విషయంలో మొదటిస్థానంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల పరిధిలోకి వచ్చే బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని స్వరాజ్‌ అభియాన్‌ సంస్థ 2015 చివర్లో ఓ సర్వే చేసింది. ఇక్కడి పదమూడు జిల్లాల్లోని 38 శాతం గ్రామాల్లో ఎనిమిది నెలల వ్యవధిలో కనీసం పల్లెకొకరు చొప్పున పస్తులతో మరణించారన్న గుండెలు పిండేసే వాస్తవాన్ని బయటపెట్టింది. అన్నం ముద్దకు నోచుకోక చనిపోతున్నవారిలో ఎక్కువమంది ఆదివాసీలు, దళితులే! ‘ప్రజల్లో ఏ ఒక్కరూ పస్తులు ఉండకుండా చూడటం ప్రభుత్వ విధి’ అని సుప్రీంకోర్టు కూడా 2001లోనే విస్పష్టంగా చెప్పింది. కాబట్టి, దేశంలో ఏ ఒక్కరు ఆకలితో మరణించినా అది పాలకుల నేరమే అవుతుంది. అలాంటిది ఇంత అధికంగా ఆకలిచావులు సంభవిస్తుండటం ప్రజారోగ్యపరంగా ఆత్యయిక స్థితే! జాతీయ ఆహారభద్రత చట్టం అమలులోకి వచ్చి అర్ధదశాబ్దం గడుస్తున్నా ఈ ఆకలి చావులకు అడ్డుకట్ట వేయలేకపోయిన ప్రభుత్వాల వైఫల్యం- ఈ విశాలదేశంలో ఓ విషాద వాస్తవం!

అందని ప్రాణాధారం
ప్రజాపంపిణీ వ్యవస్థను ఆధార్‌తో అనుసంధానించిన తరవాత ఆకలిచావులు పెరిగాయి. 2017-18లో సంభవించిన 42 ఆకలిచావుల్లో 25 ప్రత్యక్షంగా ఆధార్‌తో సంబంధమున్నవే. ప్రజాపంపిణీ వ్యవస్థను ఆధార్‌తో అనుసంధానించడం గొప్ప సంస్కరణగా కేంద్రం పేర్కొంది. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లయిన సందర్భంగా ‘ఆహారభద్రత, వినియోగదారుల చైతన్యం దిశగా నాలుగేళ్ల సుస్థిరాభివృద్ధి’ పేరిట కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఈ ఏడాది మేలో ఓ చిరుపుస్తకాన్ని ప్రచురించింది. అందులో ఆధార్‌తో రేషన్‌కార్డుల అనుసంధానాన్ని వేగిరం చేయడం తమ ప్రభుత్వం వేసిన ముందడుగుగా చెప్పుకొంది. ఆధార్‌ వల్ల అర్హులైన నిరుపేదలకు రేషన్‌ సరుకులు అందడం లేదన్న విమర్శలు రావడంతో మాట మార్చింది. ‘ఆధార్‌తో రేషను కార్డు అనుసంధానం కాలేదని, ఆధార్‌ కార్డు లేదని, బయోమెట్రిక్‌ గుర్తింపులో ఇబ్బంది ఎదురవుతోందని చెప్పి ప్రజాపంపిణీ వ్యవస్థ జాబితాలోని లబ్ధిదారుల్లో ఎవరినీ తొలగించవద్దని, ఎవరికీ ఆహారధాన్యాలను నిరాకరించవద్దని, ఆహారభద్రతా చట్టం కింద వర్తించే ఇతర ప్రయోజనాలను తొలగించవద్దంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలిచ్చాం’ అని నిరుడు జులై 31న లోక్‌సభలో చెప్పింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆధార్‌, బయోమెట్రిక్‌ గుర్తింపు లేకుండా రేషను సరకులు ఇవ్వట్లేదు. అలా ఆధార్‌తో అనుసంధానం కాలేదని రేషన్‌కార్డు తొలగింపునకు గురైన ఝార్ఖండ్‌లోని మహువాత్నర్‌ వాసి కాళేశ్వర్‌ సొరెన్‌ ఈ ఏడాది నవంబరు 11న ఆకలిచావుకు గురయ్యాడు. కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దళిత సోదరులు పస్తులతో చనిపోయారు. అనర్హులని 2013-2016 మధ్య దేశంలో 2.33 కోట్ల రేషనుకార్డులను తొలగించారు. క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేయకుండా చేసిన ఈ పనితో చాలామంది అర్హులు కార్డులు కోల్పోయారు.

ఆకలిచావులు సంభవిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించడానికి ప్రభుత్వాలెప్పుడూ ఇష్టపడవు. ఆ మరణాలకు బాధితుల అనారోగ్యాలే కారణమని బుకాయిస్తాయి. నిజానికి దీర్ఘకాల పస్తులతో ఒంట్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాంతో మనుషులు తొందరగా అంటురోగాల బారినపడతారు. అతిసారం, క్షయ తదితర వ్యాధులతో మృత్యువాత పడతారు. బాధితుల అకాల మరణాలకు తక్షణ కారణాలుగా ఆయా వ్యాధులు కనిపిస్తాయి. అధికారులు, పాలకులు వాటినే వల్లెవేస్తారు. కానీ, ఆ వ్యాధులకు మూలం ఖాళీ కడుపులు! ఈ విషయం శవపరీక్ష చేస్తే తప్ప నిర్ధారణ కాదు. బాధితుడి కడుపులో కొద్దిపాటి ఆహార అవశేషాలు కనిపించినా, ఆ మరణాన్ని ‘ఆకలిచావు’గా ప్రభుత్వాలు గుర్తించవు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన రైతు సందీప్‌ దీక్షిత్‌ 2016లో ఆకలిచావుకు గురయ్యాడు. తినడానికి ఇంట్లో ఏమీ లేక పన్నెండు రోజులు పస్తులుండి మరణించాడు. చనిపోవడానికి ముందు రోజు సందీప్‌ తల్లి కాస్త గోధుమపిండి భిక్షమెత్తుకుని వచ్చి, నీళ్లతో కలిపి కొడుకు తినిపించింది. అయినా అతడి ప్రాణాలు నిలబడలేదు. శవపరీక్షలో గోధుమపిండి అవశేషం శరీరంలో లభించింది కాబట్టి, ఇది ఆకలిచావు కాదంది యూపీ యంత్రాంగం.

అన్నార్తుల హాహాకారాలు
ఆహారలేమి అంటే తినడానికి ఏమీ లేకపోవడం కాదు- బలవర్థకమైన ఆహారం అందుబాటులో ఉండకపోవడం! సమాజంలో ఆకలి స్థాయులను పోషకాహార లోపం వ్యాప్తినిబట్టి లెక్కిస్తారు. జీహెచ్‌ఐ-2018 ప్రకారం మన దేశ జనాభాలో దాదాపు 15 శాతం పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అయిదేళ్లలోపు చిన్నారుల్లో 38.4 శాతం అంటే 4.6కోట్ల మంది ఎదుగుదల లోపాలను ఎదుర్కొంటున్నారు. 21 శాతం(2.55 కోట్ల మంది) పసివారు దుర్బలురు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (2015-16) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 17.2 శాతం, తెలంగాణలో 18.1 శాతం అయిదేళ్లలోపు పిల్లలు దుర్బలంగా ఉన్నారు. ఇలాంటి చిన్నారులకు మరణ ప్రమాదం ఎక్కువ. మరోవైపు, అయిదేళ్లలోపే చనిపోయే పిల్లల సంఖ్య ప్రపంచం మొత్తమ్మీద మన దేశంలోనే ఎక్కువ. ఏడాదికి పదిహేను లక్షల మంది పిల్లలు, అంటే రోజుకు దాదాపు నాలుగు వేలమంది ఇలా మృత్యువాత పడుతున్నారు. ఈ శిశుమరణాల్లో 45 శాతానికి పోషకాహార లోపమే కారణం. ‘ఫలవంతమైన, ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి అవసరమైన సంతులన ఆహారం, రక్షిత తాగునీరు అందరికీ అందుబాటులో ఉండటమే ఆహారభద్రత’ అన్న ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పరిశోధన సంస్థ నిర్వచనాన్ని బట్టి చూస్తే పోషకాహార లోపంతో సంభవిస్తున్న మరణాలన్నీ ఆకలిచావులే అవుతాయి. ఆహారం అందుబాటులో ఉండటం అనేది వ్యక్తుల కొనుగోలు సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. లేబర్‌బ్యూరో ఎంప్లాయ్‌మెంట్‌- అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ సర్వే ప్రకారం భారతీయుల్లో దాదాపు 57 శాతం సంపాదన నెలకు అయిదు వేల రూపాయల లోపే. పోషకాహార లోపం వ్యాప్తికి ప్రధాన కారణం ఈ అరకొర ఆదాయాలే!

జాతీయ పథకాలు-అమలు వివరాలు

* జాతీయ ఆహారభద్రతా చట్టం కింద లబ్ధిదారులు: 80.72 కోట్లు
* ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా లబ్ధిదారులకు అందిస్తున్న ఆహారధాన్యాలు ఏడాదికి: 5.52 కోట్ల టన్నులు.
* వీటిపై ఇస్తున్న వార్షిక రాయితీ విలువ: రూ.1.43 లక్షల కోట్లు
* అన్నపూర్ణ, మధ్యాహ్న భోజనం, సంక్షేమ వసతిగృహాలు, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ప్రజలకు పంపిణీ కోసం 2014-18 మధ్య రాష్ట్రాలకు కేటాయించిన ఆహారధాన్యాలు: 24.61 కోట్ల టన్నులు
* 2011- 18 మధ్య ఎఫ్‌సీఐ గోదాముల్లో మురిగిపోయి పాడైపోయిన ఆహారధాన్యాలు 64,048 టన్నులు (వీటితో ఎనిమిది లక్షల మందికి ఒక సంవత్సరం మొత్తం కడుపు నింపొచ్చు)
ఆధారం: కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో వెల్లడించిన గణాంకాలు

వ్యవస్థీకృత లోపాలు
ప్రపంచ ఆర్థిక సంస్థ అంచనాల ప్రకారం మన దేశ జనాభాకు ఏడాదికి 22.5-23 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు అవసరం. 2016-17లో మన ఆహారధాన్యాల దిగుబడి 27.33 కోట్ల టన్నులు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నాటికి ఎఫ్‌సీఐ గోదాముల్లో 3.81 కోట్ల టన్నుల బియ్యం, గోధుమ నిల్వలున్నాయి. మరోవైపు, జాతీయ ఆహారభద్రతల చట్టం-2013 కింద గ్రామీణ జనాభాలో 75 శాతానికి, పట్టణ జనాభాలో 50 శాతానికి ఆహారధాన్యాలను అధిక రాయితీ ధరలతో అందిస్తున్నామని పాలకులు చెబుతున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థతో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఏడాదికి ఆరు కోట్ల టన్నులకు పైగా ఆహారధాన్యాలను పంపిణీ చేస్తున్నామంటున్నారు. ఆహారధాన్యాలు ఇంతగా అందుబాటులో ఉండి, పేదలకు చక్కగా పంపిణీ జరుగుతుంటే ఆకలిచావులు ఎందుకు సంభవిస్తున్నాయి? ప్రజాపంపిణీ వ్యవస్థ కింద కేటాయిస్తున్న ఆహారధాన్యాల్లో 58 శాతం క్షేత్రస్థాయిలో పేదలకు అందడం లేదని ప్రణాళిక సంఘం (ప్రస్తుత నీతిఆయోగ్‌) గతంలో చేసిన వ్యాఖ్య ఇక్కడ గమనార్హం! అలాగే, ఆహారభద్రత చట్టం సరిగ్గా అమలవుతోందో లేదో పరిశీలించడానికి ఏర్పాటు కావాల్సిన రాష్ట్ర ఆహార కమిషన్లూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప ఉనికిలోకి రాలేదు. ఈ కమిషన్ల ఏర్పాటులో హరియాణా, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాల ఉదాసీనతను గతేడాది సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఇలా పథకాలు అనేకం ఉన్నప్పటికీ ప్రభుత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో అన్నీ వట్టిపోతున్నాయి. మరోవైపు, వివిధ కారణాలతో దేశంలో ఏటా రూ.9,762 కోట్ల విలువైన ఆహారం వృథా అవుతున్నట్లు అంచనా. ప్రజల ఆహారభద్రత, పోషకాహార స్థాయులను గుర్తించడానికి సమగ్ర వ్యవస్థ లేదు. దేశాభివృద్ధి విధానాల రూపకల్పనలో పాలకులు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఆర్థిక అసమానతలకు ఊతమిచ్చే కార్యక్రమాలను భుజాన వేసుకుంటూ ఉండటంతో సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. ‘ఆకలితో పస్తులుండే ప్రజలకు దేవుడు రొట్టెముక్క రూపంలో తప్ప మరోలా కనిపించ’డన్న జాతిపిత మాటలను గుర్తుంచుకుని పాలకులు తమ విధానాలను సమీక్షించుకోవాలి. అంటుకుపోయిన డొక్కలు, లోతుకుపోయిన ముఖాలతో కృశించిపోతున్న నిరుపేదలకు నిజమైన ఆహారభద్రత కల్పించేందుకు కంకణబద్ధులు కావాలి!

 

- శైలేష్‌ నిమ్మగడ్డ
Posted on 17-12-2018