Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

వినాశకర ఉదాసీనత

భూమాతకు జ్వరం తగ్గించడమే లక్ష్యంగా నిర్వహించిన రెండువారాల పోలండ్‌ సదస్సు అంతిమ ఫలితాలపై భిన్న కథనాలు- సంపన్నరాజ్యాల నిబద్ధతపై మౌలిక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మూడేళ్ల క్రితం కుదిరిన పారిస్‌ ఒడంబడికను ఇంకో రెండేళ్లలో పట్టాలెక్కించడానికి విధివిధానాలు ఖరారయ్యాయన్న ‘సంతృప్తి’ ఒకవంక, వాస్తవికావసరాలతో పోలిస్తే ఈ చొరవ అరకొరేనన్న నిరసన ధ్వనులు మరోవైపు- మానవాళి నెత్తిన కత్తి వేలాడుతూనే ఉందని స్పష్టీకరిస్తున్నాయి. భవిష్య ప్రణాళికలో భాగంగా వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వ మండలి (ఐపీసీసీ) క్రోడీకరణలకు చోటుపెట్టాలన్న మెజారిటీ సభ్యదేశాల అభిప్రాయానికి కటొవీస్చా వేదికపై మన్నన దక్కలేదు. 2030 సంవత్సరం నాటికి భూతాపంలో వృద్ధిని ఒకటిన్నర డిగ్రీల సెల్సియస్‌కు కట్టడి చేయాలంటే ప్రస్తుత కర్బన ఉద్గారాలను దాదాపు సగానికి తెగ్గోయాలన్నది ఐపీసీసీ నిర్దేశం. అందుకు అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, కువైట్‌లు ససేమిరా అనడంతో ఆ ప్రభావం సహజంగానే పోలండ్‌ తుదితీర్మానంలో పదాల కూర్పుపై ప్రసరించింది. 2020నాటికి ఏటా పదివేలకోట్ల డాలర్ల మేర హరితనిధిని అందుబాటులో ఉంచుతామన్న మునుపటి హామీల్ని సంపన్నరాజ్యాలు ఏ మేరకు నిలబెట్టుకోనున్నాయో నేటికీ స్పష్టత కరవే. కర్బన ఉద్గారాల నియంత్రణలో సంపన్నరాజ్యాలు, వర్ధమానదేశాలు నిర్వర్తించాల్సిన బాధ్యతలపైనా భేదాభిప్రాయాలు ఇప్పటికీ సమసిపోలేదు. ఈ ప్రాథమికాంశాలపై ‘ఎక్కడిదక్కడే ఉంచి ఎల్లమ్మ ఇల్లలికిన’ సామెత చందంగా కుదుర్చుకున్నామంటున్న పోలండ్‌ అవగాహన- పారిస్‌ ఒడంబడికను ఎలా సఫలం చేయగలదో ఊహకందడంలేదు. అంతర్జాతీయంగా పర్యావరణ పరిరక్షణోద్యమానికి ఊపు తెచ్చే సత్తా పోలండ్‌ నిబంధనావళిలో ప్రస్ఫుటం కావడంలేదన్న సీఎస్‌ఈ (విజ్ఞాన పర్యావరణ కేంద్రం, దిల్లీ) సూటి విశ్లేషణ అక్షరసత్యం.

పర్యావరణ విధ్వంసం వల్ల దాపురించే అనర్థాల తీవ్రత ఏమిటో తెలియని అజ్ఞానం కాదు, ధనిక దేశాలది. దబాయింపు ధోరణులతో, అడ్డగోలు వాదనలతో బాధ్యత దులపరించుకునే మూర్ఖ ప్రదర్శనల్లో అవి ఏళ్ల తరబడి పోటీ పడుతున్నాయి. పర్యావరణ హానికారక గ్రీన్‌హౌస్‌ వాయువులైన మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, కార్బన్‌-డై-ఆక్సైడ్‌ తదితరాల్ని విచ్చలవిడిగా భూవాతావరణంలోకి గుప్పించిన పారిశ్రామిక దేశాలు, ఉపశమన వ్యయభారాన్ని తమతోపాటు వర్ధమాన ప్రపంచమూ తలకెత్తుకోవాలనడం అడ్డగోలు వాదనే. మునుపటి వైఖరులకు భిన్నంగా ఒబామా జమానా ప్రదర్శించిన సానుకూల దృక్పథంతో ముడివడిన పారిస్‌ ఒడంబడికకు శ్వేతసౌధాధిపతిగా ట్రంప్‌ తెంపరితనం గండికొట్టడం తెలిసిందే. ఆ దుందుడుకుతనాన్ని గర్హిస్తూ పారిస్‌ ఒడంబడికకే కట్టుబడతామని నిరుడు జూన్‌లో అమెరికాలోని మేయర్లు, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, అధికార ప్రముఖులు 14 వందలమంది ప్రతిన పూనారు. దిద్దుబాటు చర్యల వేగాన్ని రెండు మూడింతలు పెంచాల్సిన బాధ్యతను అందిపుచ్చుకోవడంలో తక్కిన దేశాల నిరాసక్తత, హరిత పర్యావరణ నిధికి చెల్లింపుల్లో నిర్లక్ష్యం- పారిస్‌ ఒడంబడిక భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసేశాయి. అటువంటిదిప్పుడు, ప్రపంచ పర్యావరణ పోరు ఆరంభమైందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెహిష్‌ అధికారికంగా ధ్రువీకరిస్తున్నా- ఎన్నో శంకలు రేకెత్తుతున్నాయి. కర్బన ఉద్గారాల తగ్గుదల క్రమాన్ని ఎవరు ఎలా పర్యవేక్షిస్తారు, హామీ కట్టుబాట్లను నిగ్గుతేల్చేదెవరు, నిధుల క్రమబద్ధ ప్రవాహాన్ని సమన్వయీకరించేదెవరన్న ప్రశ్నలకు ఇదమిత్థమైన సమాధానాలు కొరవడుతున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబరులో ఐరాస నిర్వహించనున్న తదుపరి పర్యావరణ సదస్సు నాటికైనా ఈ చిక్కుముళ్లు విడివడతాయేమో చూడాలి!

పర్యావరణ విధ్వంస తీవ్రతను నియంత్రించని పక్షంలో అమెరికా లాంటిచోట్లా మంచు పర్వతాలు కరిగిపోతాయని, దేశదేశాల్లో దావానలాలు పెచ్చరిల్లుతాయని శాస్త్రవేత్తలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారు. ఎక్కడిదాకానో ఎందుకు- తెలుగు గడ్డపై పెథాయ్‌ తుపాను ఈ ఏడాది ఇప్పటికే దేశాన్ని కలవరపరచిన విపత్తుల్లో ఏడోది. సాగర్‌, మెకును, లూబాన్‌, దాయె, తిత్లీ, గజ లను వెన్నంటి పెథాయ్‌ విరుచుకుపడటానికి భూతాపం పెరుగుదలను, వాతావరణ మార్పులనే ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. భూతాపంలో వృద్ధిని రెండు సెల్సియస్‌ డిగ్రీలకు పరిమితం చేసినా ప్రపంచ భూభాగంలో నాలుగోవంతు ఎండిపోతుందని- సేద్యం, నీటినాణ్యత, జీవవైవిధ్యం దారుణంగా దెబ్బతింటాయని చైనా, యూకే పరిశోధకులు అంచనా వేస్తున్నారు. భూ ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను ఒకటిన్నర సెల్సియస్‌ డిగ్రీల దిగువకు పరిమితం చేయగల సమర్థ కార్యాచరణ ఒక్కటే విశ్వ మానవాళికి సాంత్వన ప్రసాదించగలిగేది. ధ్రువాల్లో మంచు కరిగి, సముద్ర మట్టాలు పోటెత్తరాదన్నా; వరదలు, తుపానులు, కార్చిచ్చులు దేశదేశాల్లో అసంఖ్యాక ప్రజానీకం బతుకుల్ని కడగండ్ల సుడిగుండంలోకి ఈడ్చుకుపోరాదన్నా- పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలు యథాతథంగా అమలుకు నోచుకోవాలి. అందులో ఏ మాత్రం తేడావచ్చినా పంటల దిగుబడులు క్షీణించడం మొదలు లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం వరకు రకరకాల ఉత్పాతాలు ప్రజల జీవన స్థితిగతులతో చెలగాటమాడటం తథ్యం. అంటార్కిటికా మంచు ఫలకాలకన్నా వేగంగా హరిత పర్యావరణ నిధి కల కరిగిపోవడం, సంపన్న రాజ్యాల బాధ్యతారాహిత్యాన్నే కళ్లకు కడుతోంది. కేవలం మూడుశాతం కర్బన కాలుష్యానికి కారణమైన భారత్‌ బృహత్తర లక్ష్యసాధనకు నిబద్ధత చాటడం, తక్కిన దేశాల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించాల్సి ఉంది.

పర్యావరణ ప్రణాళిక అమలులో ఉమ్మడి బాధ్యత పొంగులువారితేనే- పారిస్‌ ఒడంబడిక, మానవాళి భవిత నిప్పుల కుంపటి పాలుకాకుండా ఉంటాయి!

 

Posted on 18-12-2018